ప్రధాన మంత్రి కార్యాలయం

పంచాయ‌తీ రాజ్ దినోత్స‌‌వం నాడు దేశం లోని వివిధ ప్రాంతాల‌కు చెందిన స‌ర్పంచ్ ల‌తో ప్ర‌ధాన‌ మంత్రి సంభాష‌ణ

Posted On: 24 APR 2020 6:00PM by PIB Hyderabad

న‌మ‌స్కారం.

పంచాయ‌తీ రాజ్ దినోత్స‌వం సంద‌ర్భం లో మీ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు. క‌రోనా వైర‌స్ మ‌నంద‌రి ప‌ని విధానాన్ని పూర్తిగా మార్చేసింది. గ‌తంలో మ‌నం ఏదైనా కార్య‌క్ర‌మంలో ముఖాముఖి క‌లుసుకునే వాళ్లం, అయితే ఇప్పుడు అదే కార్యక్రమం వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్యమం ద్వారా జ‌రుగుతోంది.

ఈ రోజున దేశం లోని ల‌క్ష‌లాది మంది స‌ర్పంచ్ లు, పంచాయ‌తీ స‌భ్యులు సాంకేతిక విజ్ఞ‌ాన మాధ్యమం ద్వారా సంధాన‌మై ఉన్నారు. మీ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు. ఈ రోజున అనేక పంచాయ‌తీలు తాము చేసిన ప్ర‌శంస‌నీయ‌మైన కృషికి పురస్కారాలను కూడా అందుకుంటున్నాయి. పురస్కారాలను గెల్చుకొన్న పంచాయ‌తీలన్నింటికి, ప్రజల ప్ర‌తినిధులంద‌రికీ హృద‌యపూర్వక శుభాకాంక్ష‌లు.

మిత్రులారా, గ్రామాల్లో స‌త్ప‌రిపాల‌న‌కు మ‌న సంక‌ల్పాన్ని పునః ప్ర‌క‌టించుకునేందుకు పంచాయ‌తీ రాజ్ దినోత్స‌వం ఓ చ‌క్క‌ని అవ‌కాశం. ఇప్పుడు క‌రోనా వైర‌స్ సంక్షోభం లో ఆ సంక‌ల్పానికి ప్రాధాన్యం మ‌రింత ఎక్కువ‌గా ఉంది. క‌రోనా మ‌హ‌మ్మారి మ‌నంద‌రికీ ఎన్నో స‌మ‌స్య‌లను సృష్టించింద‌న్న‌ది వాస్త‌వం.

క‌రోనా సంక్షోభం మ‌న‌కు ఎన్నో కొత్త పాఠాలను నేర్పి, కొత్త సందేశాన్ని ఇచ్చింది. ఈ రోజున దేశ పౌరులంద‌రికీ గ్రామాల్లో నివ‌సిస్తున్న‌ వారైనా, ప‌ట్ట‌ణాల్లో నివ‌సిస్తున్న వారైనా ప్ర‌తి ఒక్క‌రికీ ఈ కార్య‌క్ర‌మం ద్వారా ఒక సందేశం పంపాల‌నుకుంటున్నాను.

మిత్రులారా, మ‌నంద‌రం స్వ‌యంస‌మృద్ధం కావాల‌న్న‌దే క‌రోనా సంక్షోభం మ‌నంద‌రికీ బోధించిన అతి పెద్ద పాఠం. గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు త‌మ ప‌రిధిలో ప్ర‌జ‌ల మౌలిక అవ‌స‌రాలు తీర్చ‌గ‌లిగేలా  స్వ‌యంసమృద్ధిని సాధించాలి. అలాగే యావ‌త్ దేశం కూడా స్వ‌యంస‌మృద్ధం కావాలి. అలా అయిన‌ప్పుడు మ‌న అవ‌స‌రాల కోసం వేరే వారి స‌హాయానికి ఎదురు చూడాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. భార‌త‌దేశంలో శ‌తాబ్దాల నుంచి ఉన్న ఆలోచ‌నే అయిన‌ప్ప‌టికీ మారిన వాతావ‌ర‌ణంలో ఈ స్వ‌యంస‌మృద్ధి అవ‌స‌రాన్ని మ‌రోసారి గుర్తు చేసుకునే ప‌రిస్థితి క‌ల్పించింది.  స్వ‌యంస‌మృద్ధి సాధ‌న‌ లో గ్రామ‌ పంచాయ‌తీలు కీల‌క పాత్ర పోషిస్తాయి. గ్రామాల స్వ‌యంస‌మృద్ధికి శ‌క్తివంత‌మైన పంచాయ‌తీలు కూడా అవ‌స‌రం. అలాగే పంచాయ‌తీలు శ‌క్తివంతంగా ఉంటే ప్ర‌జాస్వామ్యం శ‌క్తివంతం అవుతుంది. స‌మాజంలో దిగువ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అభివృద్ధి ప్ర‌యోజ‌నాలు మ‌రింత‌గా అందుతాయి.

మిత్రులారా, ఇదే ఆలోచ‌న‌తో ప్ర‌భుత్వం పంచాయ‌తీ రాజ్ కు చెందిన మౌలిక సదుపాయాలను, సంస్థ‌ల్లోని విభాగాలను ఆధునికీక‌రించేందుకు అదే పని గా కృషి చేసింది. అలా చేయకపోయివుంటే, దేశం లో వంద క‌న్నా త‌క్కువ సంఖ్య‌లో పంచాయ‌తీలు మాత్రమే బ్రాడ్ బాండ్ తో సంధానమైన పరిస్థితంటూ ఓ ఐదారేళ్ల క్రితం ఉండింది. మరి అదే ఈ రోజున బ్రాండ్ బాండ్ 1.25 ల‌క్ష‌లకు పైగా చేరింది. పైపెచ్చు, గ్రామాల్లో కామ‌న్ స‌ర్వీసు కేంద్రాల సంఖ్య కూడా మూడు ల‌క్ష‌ల‌ను మించిపోనుంది.

మొబైల్ ఫోన్ లు దేశంలోనే ఉత్ప‌త్తి చేయాల‌న్న ప్ర‌భుత్వ పిలుపు వ‌ల్ల ఈ రోజున త‌క్కువ ధ‌ర‌లో స్మార్ట్ ఫోన్లు ప్ర‌తి గ్రామానికి అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ అంశాల‌న్నీ ఈ రోజు ఇంత పెద్ద స్థాయి లో ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ జరుగుతుండడానికి ఒక పెద్ద పాత్ర ను పోషించాయి.

మిత్రులారా, గ్రామీణ మౌలిక వ‌స‌తులు ప‌టిష్ఠం చేసి ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌తో గ్రామాల‌కు దూరాన్ని త‌గ్గించేందుకు మ‌రో రెండు ప్రాజెక్టులు కూడా ప్రారంభం అయ్యాయి. ఇ-గ్రామ్ స్వ‌రాజ్ పోర్ట‌ల్‌, యాప్ న‌కు సంబంధించిన వీడియో ఫిలిం ను మీరంతా చూశారు. అలాగే స్వ‌ామిత్వ స్కీమ్ వీటిలో రెండోది.

స్వ‌రాజ్ పంచాయ‌తీ రాజ్ కు చెందిన ప‌నులు స‌ర‌ళం చేసే అకౌంటింగ్ అప్లికేష‌నే ‘ఇ-గ్రామ్’. గ్రామ పంచాయ‌తీల సంపూర్ణ డిజిటలీకరణ లో ఒక పెద్ద అడుగు.  రాబోయే కాలంలో పంచాయ‌తీలు నిర్వ‌హించే ప్ర‌తి ఒక్క ప‌నికి సంబంధించిన రికార్డులను భ‌ద్రంగా ఉంచే ఏకైక వ్య‌వస్థ‌ గా కూడా అది రూపాంత‌రం చెందుతుంది. ఈ రోజున మీలో ఎవ‌రూ విభిన్న అప్లికేష‌న్ల‌తో కుస్తీ ప‌ట్టాల్సిన ప‌ని లేదు. పంచాయ‌తీల్లో అభివృద్ధి ప‌నుల నుంచి నిధుల కేటాయింపు, నిధుల వ్య‌యానికి సంబంధించిన అన్ని వివ‌రాలు పోర్ట‌ల్‌ లో, యాప్ లో అందుబాటులో ఉంటాయి. దీని స‌హాయం తో ఈ రోజు ఎవ‌రైనా గ్రామ పంచాయ‌తీల్లో ఏమి జ‌రుగుతోందో గమనించవ‌చ్చు.

ఇది గ్రామ పంచాయ‌తీ వ్య‌వ‌స్థ‌ లో పార‌ద‌ర్శ‌క‌త‌ ను పెంచ‌డ‌మే కాకుండా, రికార్డులు మ‌రింత తేలిగ్గా భ‌ద్ర‌ప‌ర‌చ‌డం లో కూడా సాయపడుతుంది. ప్ర‌ణాళిక‌ల ప్ర‌క్రియ‌, ప్రాజెక్టులను పూర్తి చేయ‌డం కూడా వేగ‌వంతం అవుతుంది. ఇ-గ్రామ్ స్వ‌రాజ్ మీ అంద‌రినీ ఏ విధంగా సాధికారం చేస్తోంది మీరే ఊహించండి.

మిత్రులారా, గ్రామాల్లో ఆస్తుల‌కు సంబంధించిన అంశం మీ అంద‌రికీ తెలిసిందే. దాన్ని స‌రిదిద్ద‌డ‌మే స్వామిత్వ స్కీమ్ ల‌క్ష్యం. ఈ స్కీమ్ లో దేశంలోని అన్ని గ్రామాల్లోని ఇళ్ల‌ను మ్యాపింగ్ చేయ‌డానికి డ్రోన్ లను వినియోగిస్తారు. ఆ త‌ర్వాత గ్రామీణ ప్ర‌జ‌ల‌కు ఆయా ప్రాప‌ర్టీల “యాజ‌మాన్య హ‌క్కు ప‌త్రం” (టైటిల్ డీడ్) ను అంద‌చేస్తారు.

స్వామిత్వ స్కీమ్ ద్వారా గ్రామీణ ప్ర‌జ‌లు ఎన్నో ప్ర‌యోజ‌నాలు పొందుతారు. గ్రామాల్లో ప్రాప‌ర్టీ చుట్టూ ఆవ‌రించిన సందిగ్ధం తొల‌గిపోవ‌డం ఒక‌టైతే, గ్రామాల్లో అభివృద్ధి ప‌థ‌కాలు మ‌రింత మెరుగ్గా ప్లాన్ చేయ‌డానికి అది దోహ‌ద‌కారి కావ‌డం రెండోది. అంతే కాదు దీని వ‌ల్ల న‌గ‌రాల్లో లాగానే గ్రామీణులు కూడా బ్యాంకుల నుంచి రుణాలను పొందే ప్ర‌క్రియ సులభం అవుతుంది. ఇది అతి పెద్ద ప్ర‌యోజ‌నం.

మిత్రులారా, ప్ర‌స్తుతం ఈ పథకం ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర, క‌ర్నాట‌క‌, హ‌రియాణా, మ‌ధ్య‌ ప్రదేశ్‌, ఉత్త‌రాఖండ్- ఈ 6 రాష్ట్రాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌ల‌వుతోంది. దీని వ‌ల్ల మ‌న‌కు అనుభ‌వం వ‌చ్చి, స‌మ‌స్య ఎక్క‌డ ఉందో గుర్తించి దానికి అనుగుణంగా మార్పులను చేసుకోవ‌డం సాధ్య‌పడుతుంది. అన్ని ర‌కాల మార్ప‌ులు చేసిన త‌ర్వాత దాన్ని దేశ‌వ్యాప్తంగా అమ‌లుప‌రుస్తాం.

మిత్రులారా, సంక్షోభ స‌మ‌యంలో జీవితంలో అస‌లైన పాఠాలు నేర్చుకోవ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని నేను అప్పుడ‌ప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. పూర్తిగా సంర‌క్షిత వాతావ‌ర‌ణంలో ఎవ‌రి జ్ఞానం, సామ‌ర్థ్యాలు బ‌య‌ట‌ప‌డ‌వు. ఈ  క‌రోనా సంక్షోభ స‌మ‌యంలోనే అంత‌గా విద్యాగంధం లేక‌పోయినా, ఏ ప్ర‌ముఖ విశ్వ‌విద్యాల‌యంలో చదువుకోక‌పోయినా గ్రామీణులు సాంప్ర‌దాయక జ్ఞానాన్ని, విలువ‌లను ప్ర‌ద‌ర్శించ‌గ‌లుగుతున్నారు. గ్రామాల నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు అందుతున్న స‌మాచారం ఎంతో మంది పండితుల‌కు ప్రేరణదాయ‌కం. గ్రామాల్లో నివ‌సిస్తున్న సోద‌ర‌సోద‌రీమ‌ణులు, గిరిజ‌న సోద‌ర సోద‌రీమ‌ణులు, రైతాంగం, కార్మికులు చేస్తున్న‌ ప‌ని యావ‌త్ దేశానికి స్ఫూర్తినిచ్చేదే.

మీ అంద‌రికీ ‘దో గ‌జ్ కీ దూరీ’ (రెండు అడుగుల దూరాన్ని పాటించండి) అనే మంత్రాన్ని బోధించ‌డం జ‌రిగింది.  గ్రామాల్లో ఈ మంత్రాన్ని ఎలా ఆచ‌రిస్తున్నార‌నే అంశం పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించ‌డం జ‌రిగింది. ‘దో గ‌జ్ కీ దూరీ’ అంటే సురక్షిత దూరాన్ని పాటించ‌డం వ‌ల్ల మీ అంద‌రికీ క‌రోనా వైర‌స్ బారి నుంచి ర‌క్ష‌ణ లభిస్తుంది. మీ అంద‌రి కృషి వ‌ల్ల‌ ఈ రోజు క‌రోనా పై భార‌త్ ఏ విధంగా పోరాడుతోందన్న అంశాన్ని ప్ర‌పంచ‌ం అంతటా చ‌ర్చిస్తున్నారు.

మిత్రులారా,  ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా అత్యంత దారుణ‌మైన సంక్షోభం ఏర్ప‌డిన‌ప్ప‌టికీ భారీ స్థాయి లో ఎదుర‌వుతున్న స‌వాళ్ల‌కు లొంగిపోకుండా ప‌రిమిత వ‌న‌రుల‌తోనే భార‌త్ దానిపై పోరాడ‌గ‌లుగుతోంది. ఎన్నో అవ‌రోధాలు, స‌వాళ్లు, క‌ష్టాలు ఉన్న మాట నిజం, అయితే కొత్త మార్గాల‌ను అన్వేషించ‌డం ద్వారా కొత్త శ‌క్తి ని పుంజుకుని నిరంత‌రాయంగా దేశాన్ని పురోగ‌మ‌న ప‌థంలో న‌డిపించ‌గ‌లుగుతున్నాం.

మిత్రులారా, ప్ర‌స్తుత వాతావ‌ర‌ణంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏయే కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్నాయ‌న్న అంశంపై భిన్న వ‌ర్గాల నుంచి స‌మాచారాన్ని నేను తీసుకుంటున్నాను. ఈ రోజున నేను కొంద‌రు మిత్రుల ద్వారా క‌రోనా కాలంలో వారి అనుభ‌వాలను, స‌ల‌హాలను కూడా తెలుసుకోవాల‌నుకుంటున్నాను. రండి.. అంద‌రం చ‌ర్చిద్దాం. మొదట జ‌మ్ము క‌శ్మీర్  కు చెందిన ఒక మిత్రుడు మాట్లాడ‌బోతున్నాడు.

క‌శ్మీర్ లోని బారాముల్లా నుంచి మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్ మ‌న‌తో చేర‌బోతున్నాడు. ఆయ‌న న‌ర్వ‌వ్ పంచాయ‌తీ బ్లాకు కు చైర్ మన్‌ గా ఉన్నారు. ఇక్బాల్ గారు, నమ‌స్కార్‌.

ప్రధాన మంత్రి:  ఇక్బాల్ గారు, మీ బ్లాకు లో క‌రోనాపై పోరాటం ఏ విధంగా సాగుతోంది. సురక్షిత దూరాన్ని, స్వ‌చ్ఛ‌త ను పాటించ‌డానికి మీరు ఇంకా ఏం చేస్తున్నారు?

ఇక్బాల్:  న‌మ‌స్కారం సర్‌. జ‌మ్ము క‌శ్మీర్ లోని బారాముల్లా ప్రాంతానికి చెందిన న‌ర్వావో బ్లాక్ తరఫున మీకు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. పంచాయ‌తీ రాజ్ దినోత్స‌వం సంద‌ర్భంగా మీకు అభినంద‌న‌లు తెలియ‌చేస్తున్నాను. స‌ర్‌, ప్ర‌స్తుతం న‌ర్వావో క‌రోనా పై పోరాటాన్ని చేస్తోంది. లాక్ డౌన్ కు సంబంధించి మీ ఆదేశాలు, మార్గ‌ద‌ర్శ‌కాలు నూటి కి నూరు శాతం క్షేత్ర స్థాయి లో అమ‌ల‌వుతున్నాయి. మేం బ్లాక్ స్థాయి లో స‌మావేశాన్ని నిర్వ‌హించి బిడిసి కార్యాల‌యం నుంచి ఉత్త‌ర్వులు జారీ చేశాం. ఆ స‌మావేశం లో మేం ఆశా, ఐసిడిఎస్‌, పంచాయ‌తీరాజ్ పిఆర్ ఐ ఈ మూడు ప్ర‌ధాన‌మైన శాఖ‌ల సిబ్బందికి శిక్ష‌ణనిచ్చాం. క‌రోనా వైర‌స్ వ్యాపించ‌కుండా నిరోధించేందుకు తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌లను గురించి తెలియ‌చేశాం. ఆ త‌ర్వాత వారిని బ్లాకు లోని ప్ర‌తి ఒక్క ఇంటికీ పంపించాం.

వాస్త‌వానికి మా బ్లాకు లోని ఏ ఒక్క ఇంటినీ వ‌ద‌ల‌లేదు. మా బృందం, మా పిఆర్ఐ సిబ్బంది, వైద్య సిబ్బంది, ఐసిడిఎస్ వ‌ర్క‌ర్లు ప్ర‌తి ఒక్క ఇంటినీ సంద‌ర్శించి క‌రోనా వైర‌స్ పైన‌, దాన్ని నిలువ‌రించ‌గ‌ల చ‌ర్య‌ల పైన అందరినీ చైత‌న్య‌వంతం చేశారు. మా బ్లాకు లో ఇంతవ‌ర‌కు ఒకే ఒక పాజిటివ్ కేసు న‌మోద‌యింది. ఆ ఒక్క కేసు అయినా రావ‌డానికి అక్కడ పంచాయ‌తీ లేక‌పోవ‌డ‌మే  కార‌ణం. మాకు పంచాయ‌తీ స‌భ్యులు లేని కార‌ణం గా ఆ కేసు ను గుర్తించలేక‌పోయాం.

కానీ అన్ని ఇత‌ర‌ గ్రామాలు, బ్లాకు ల‌లో  ప్ర‌తి ఒక్క ఇంటిని మేం గుర్తించి, ఆ ఇళ్ల‌లో ప్ర‌తి ఒక్క వ్య‌క్తి ప్ర‌యాణ చ‌రిత్ర‌ ను న‌మోదు చేశాం. ప్ర‌యాణాలు చేసిన వారిని గుర్తించి జిల్లా యంత్రాంగం, ఆరోగ్య శాఖ‌ ల స‌హాయంతో వారిని క్వారన్టీన్ కు పంపించాం. అక్క‌డ పిఆర్ఐల‌ ను విధుల్లో నియ‌మించాం. క్వారన్టీన్ విజ‌య‌వంతం కావ‌డానికి వీలుగా వారం రోజులూ, రోజులో 24 గంట‌లు వారు విధులు నిర్వ‌ర్తిస్తూనే ఉన్నారు. అంతేకాదు, లాక్ డౌన్ విజ‌య‌వంతం అయ్యేలా మార్గ‌ద‌ర్శ‌కాలు తు.చ. త‌ప్ప‌కుండా పాటించాల‌ని జిల్లా యంత్రాంగం మ‌మ్మ‌ల్ని ఆదేశించింది. అలాగే పిఆర్ఐ లు లాక్ డౌన్ ను విజ‌య‌వంతం చేయాల‌ని జిల్లా యంత్రాంగం మా పంచాయ‌తీ యువ‌జ‌న సంఘం స‌భ్యుల‌ను ఆదేశించింది. అలాగే లాక్ డౌన్ ను విజ‌య‌వంతం చేసేందుకు వాలంటీర్ల పేర్ల‌తో పోస్ట‌ర్లను కూడా ప్ర‌చురించారు. వారు రెండు నినాదాల‌తో ముందుకు వ‌చ్చారు. ‘అంద‌రినీ గౌర‌వించండి, అంద‌రినీ అనుమానించండి’ అనేది ఒక నినాదం కాగా ఇంట్లోనే ఉండండి, సుర‌క్షితంగా ఉండండి అనేది రెండో నినాదం. ఈ రోజు మా బ్లాకు లో ప‌రిస్థితి 99 శాతం   అదుపులో ఉంది.

ఇక్బాల్:  ధ‌న్య‌వాదాలు స‌ర్.

ప్ర‌ధాన‌ మంత్రి:  మీరు చాలా విష‌యాలు తెలియ‌చేశారు. మీరు పూర్తి స‌మ‌యం క్షేత్ర‌స్థాయికే వెచ్చించార‌ని అర్ధం అవుతోంది. మీరు ప్ర‌తి ఒక్క గ్రామాన్ని సంద‌ర్శించారు. ఫ‌లితంగా మీరు అంత తేలిగ్గా అన్నీ అర్ధం చేసుకోగ‌లిగారు. మీరు మాన‌వ వ‌న‌రులను అభివృద్ధి చేశారు, నిబంధ‌న‌లు పాటించారు, అన్నీ చాలా బాగా చేశారు. ఈ సురక్షిత దూరం మంత్రాన్ని జ‌మ్ము క‌శ్మీర్ లోని  ప్ర‌తి ఒక్క గ్రామం, ప్ర‌తి ఒక్క ఇల్లు నేర్చుకోవాలి. నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు అద్భుత‌మైన ప‌ని ని చేశారు. మీ బ్లాకు లోని ప్ర‌జ‌లంద‌రికీ కూడా అభినంద‌న‌లు. ఇది రంజాన్ మాసం. మీరంతా చేసిన క‌ఠోర శ్ర‌మ కార‌ణంగా రంజాన్ పండుగను ఎంతో చ‌క్క‌గా జ‌రుపుకోగ‌లుగుతారు. మీరు నిజంగానే ఎంతో గొప్ప సేవను అందించారు.

జ‌మ్ము- క‌శ్మీర్ త‌ర్వాత ఇప్పుడు మ‌నం ద‌క్షిణాదికి వెళ్దాం. క‌ర్నాట‌క లోని చిక్క‌బ‌ళ్లాపుర్ కు చెందిన  న‌వీన్ కుమార్ తో మ‌నం మాట్లాడ‌దాం.

న‌వీన్ కుమార్:  దేశ ప్రధాన సేవకునికి గ్రామ‌ పంచాయ‌తీ పక్షాన శుభాకాంక్ష‌లు.

ప్ర‌ధాన‌ మంత్రి:  ఈ కాలం లో నాకు రాష్ట్రాల అధిప‌తుల‌తోనే కాకుండా గ్రామ పెద్ద‌ల‌తో కూడా మాట్లాడే అవ‌కాశం చిక్కుతోంది.

న‌వీన్ కుమార్:  ధ‌న్య‌వాదాలు స‌ర్, మా గ్రామ పంచాయ‌తీ లో ఒక్క క‌రోనా రోగి అయినా లేరు.14 మంది హోం క్వారన్టీన్ లో ఉన్నారు. పంచాయ‌తీ ద్వారా వారికి నీరు, పాలు, కూర‌గాయ‌లు, రేష‌న్‌ ను స‌ర‌ఫ‌రా చేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఆశా కార్య‌క‌ర్త‌లు, ఆరోగ్య శాఖ అధికారులు, గ్రామ‌ పంచాయ‌తీ సిబ్బంది తో ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశాం. క‌రోనా వైర‌స్ ను ఎలా నిలువ‌రించాలి, అందుకోసం ఏమి చేయాలి ? అనేది చ‌ర్చించేందుకు వారానికి రెండు నుంచి నాలుగు సర్ లు స‌మావేశం అవుతున్నాం. ఐఇసి (ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఎండ్ కమ్యూనికేషన్), సురక్షిత దూరం, పారిశుధ్య ప‌నులు చ‌క్క‌గా సాగుతున్నాయి.

‘ప్ర‌ధాన‌ మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న‌’, ‘ప్ర‌ధాన‌ మంత్రి కిసాన్ స‌మ్మాన్ యోజ‌న‌’, ‘ఉజ్వ‌ల యోజ‌న‌’, పింఛ‌న్ పథకాల ద్వారా 5 వేల మందికి పైగా లాభం పొందారు.

యువ‌కుల‌ను స‌మీక‌రించి గ్రామీణ పోలీసు వ్య‌వ‌స్థ‌ ను ఏర్పాటు చేశాతం. పంచాయ‌తీ స‌రిహ‌ద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా ఈ పంచాయ‌తీ పోలీసులంద‌రూ ప‌ని చేస్తున్నారు. దీని వ‌ల్ల ప్ర‌జ‌లు ఒక‌రితో ఒక‌రు అన‌వ‌స‌రంగా క‌లిసి తిర‌గ‌డాన్ని నివారించ‌గ‌లిగాం. ఫ‌లితంగా ఒక రాష్ట్రం నుంచి మ‌రో ప్రాంతానికి క‌రోనా వైర‌స్ వ్యాపించ‌డాన్ని నిలువ‌రించాం. అతే కాదు పారిశుధ్యం తో పాటుగా వ్య‌క్తిగ‌త‌, సామాజిక శుభ్ర‌త‌ కు ఐఇసి ని కూడా నిర్వ‌హిస్తున్నాం.

లాక్ డౌన్ కార‌ణంగా మ‌హారాష్ట్ర నుంచి 170 మందికి పైగా కార్మికులు వ‌చ్చారు. వారంద‌రికీ స్థానిక‌ పాఠ‌శాల‌ లో ఆశ్ర‌యం క‌ల్పించాం. వారికి ఆహారం, నీరు, ఔష‌ధాలు అందిస్తున్నాం. వారిని కొన్ని ప‌నుల్లో కూడా వినియోగించుకుంటున్నాం. రైతుల‌కు ఆర్థిక న‌ష్టం నివారించేందుకు ప‌ళ్లు, కూర‌గాయ‌ల మార్కెట్ ఒక‌టి నిర్వ‌హిస్తున్నాం. దీని వ‌ల్ల ఆర్థిక స్థితి, నైతిక స్థైర్యం కూడా మెరుగుప‌డ్డాయి. డాక్ట‌ర్ల నుంచి అవ‌స‌ర‌మైన ఔష‌ధాలను తీసుకుని ఇళ్ళ‌ కు స‌ర‌ఫ‌రా చేస్తున్నాం.

పంచాయ‌తీ కార్మికులు, వ్య‌క్తిగ‌త కార్మికులు, రైతులకు మ‌హాత్మా గాంధీ రాష్ట్రీయ ఉద్యోగ్ యోజ‌న లో భాగం గా నీటి వ‌న‌రుల సంర‌క్ష‌ణ ప‌నుల్లో చేరే అవ‌కాశం క‌ల్పించాం. ఇది గ్రామ‌ పంచాయ‌తీ ప్ర‌జ‌ల్లో నైతిక స్థైర్యం ఇనుమ‌డించ‌డానికి దోహ‌ద‌ప‌డింది.

ప్ర‌ధాన‌ మంత్రి:  న‌వీన్ గారు, మీ గ్రామం జ‌నాభా ఎంత‌?

న‌వీన్ కుమార్:  8,500 మంది సర్‌.

ప్ర‌ధాన‌ మంత్రి:  అంటే పెద్ద గ్రామ‌మే. మీరు ఎంత కాలం నుంచి  గ్రామాధికారిగా ఉన్నారు?

న‌వీన్ కుమార్:  ఇదే తొలి సారి స‌ర్‌.

ప్ర‌ధాన‌ మంత్రి:  మీరు తొలి సారే గ్రామ పెద్ద అయ్యారా?  అయినా చాలా ప‌నే చేస్తున్నారు. అది కూడా ఎంతో క్ర‌మ‌బ‌ద్ధ‌మైన ప్ర‌ణాళిక‌ తో నిర్వ‌హిస్తున్నారు.  గ్రామ‌స్థులు మీ మాట వింటున్నారా?

న‌వీన్ కుమార్:  య‌స్ స‌ర్‌, వింటున్నారు.

ప్ర‌ధాన‌ మంత్రి:  అద్భుతం. ఇంత అద్భుత‌మైన కృషి చేస్తున్నందుకు మీకు, మీ  గ్రామానికి నా శుభాకాంక్ష‌లు. అన్ని ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల‌కు చేరేలా, అంద‌రూ ఆర్థిక పురోగ‌తి సాధించేలా చ‌క్క‌ని దార్శనికత తో  కూడిన  మీ నాయ‌క‌త్వాన్ని నేను ప్ర‌శంసిస్తున్నాను. మీ గ్రామం శ‌క్తి ఏమిటో వివరించినందుకు మిమ్మ‌ల్ని నేను అభినందిస్తున్నాను.

ఇప్పుడు మ‌నం బిహార్ కు వెళ్దాం.

బిహార్ లోని జెహానాబాద్ జిల్లా ఘ‌రానియా గ్రామ పంచాయ‌తీ ప్రముఖుడు అజ‌య్ సింగ్ యాద‌వ్ తో మాట్లాడ‌దాం. అజ‌య్ జీ, న‌మ‌స్కారం.

అజ‌య్:  న‌మ‌స్కారం, సర్‌.  నేను గ్రామ పంచాయ‌తీ ప్రముఖుడు అజ‌య్ సింగ్ యాద‌వ్ ను, బిహార్ లోని ఘ‌రానియా గ్రామ పంచాయ‌తీ త‌ర‌ఫున మీకు హృదయ‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.

ప్ర‌ధాన‌ మంత్రి:  న‌మ‌స్కారం.

అజ‌య్:  22వ తేదీ న లాక్ డౌన్ విధించారు. ఆ త‌ర్వాత నేను గ్రామ‌ పంచాయ‌తీ ప్రాతంలో వ‌రుస‌గా నాలుగు రోజుల పాటు వ్య‌క్తిగ‌తంగా ప్ర‌చారం నిర్వ‌హించాను. లాక్ డౌన్ అవ‌స‌రం ఏమిటి, సురక్షిత దూరం ప్రాధాన్య‌ం ఏమిటి అన్న‌వి ప్ర‌జ‌ల‌కు వివరించాను.

ప్ర‌ధాన‌ మంత్రి:  అజ‌య్ గారు, రెండ‌డుగుల దూరాన్ని గురించి వివరించండి.

అజ‌య్:  స‌ర్, రెండ‌డుగుల దూరం గురించా?

ప్రధాన మంత్రి : అవును

అజ‌య్ :  సర్, గ్రామం లో బ్లీచింగ్ పౌడ‌ర్ చ‌ల్లాం. ఆశా కార్య‌క‌ర్త‌లు, వార్డు స‌భ్యులు, స‌ర్పంచ్ సాహిబ్‌...అంద‌రూ క‌లిసి గ్రామంలోని ప్ర‌తి ఇంటిని సంద‌ర్శించి స‌బ్బుతో చేతుల‌ను ఎలా శుభ్రం చేసుకోవాలో నేర్పించారు. సర్, మేం 18 మందిని హోం క్వారన్టీన్ లో వుంచాం. పంచాయతీ కూడా వారికి సౌక‌ర్యాల‌ను స‌మ‌కూర్చింది. సర్,  మేం 30 ప‌డ‌క‌ల హోం క్వారన్టీన్ కేంద్రాన్ని త‌యారు చేసుకున్నాం. ఆహార ప‌దార్థాల స‌దుపాయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎఎన్ ఎం, సెక్యూరిటీ గార్డులు విధుల్లోకి వ‌చ్చారు. 45 మంది గ్రామ ప్ర‌జ‌ల‌తో క‌లిపి గ్రామ ర‌క్ష‌క దళాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సర్,  మా గ్రామ ప్ర‌జ‌లు బైట‌కు వెళ్ల‌కుండా ఊరి చుట్టూ వెదురుతో కంచె ను ఏర్పాటు చేసుకున్నాం. ఎవ‌రికైనా అత్య‌వ‌స‌ర‌మైన ప‌ని ఉంటే, మందులు తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డితే వారికి మాత్రం బైట‌కు పోవ‌డానికి అనుమ‌తిచ్చాం. సర్, ఆరోగ్య‌ శాఖ‌ కు చెందిన సిబ్బంది వారం లో రెండు రోజులు మా ఊరికి వ‌స్తున్నారు. పంచాయతీ శాఖ‌కు చెందిన‌ ప్ర‌తినిధుల‌ తో ప్ర‌తి మూడు రోజుల‌కు ఒక‌సారి స‌మావేశం ఉంటుంది. ఇందులో ఐదు నుంచి 10 మంది పెద్ద‌లు, స‌ర్పంచులు, గ్రామ పంచాయతీ, పంచాయతీ వ‌ర్క‌ర్లు పాల్గొంటున్నారు.

ప్ర‌ధాన మంత్రి :   చాలా మంచిది అజ‌య్, మీ పంచాయతీ నుంచి న‌గ‌రాల‌కు వ‌ల‌స పోయిన‌వారు తిరిగి వ‌చ్చే వుంటారు. ఇంకా తిరిగి రాని వారు కూడా రావాల‌నే కోరుకుంటున్నారనుకుంటాను.

అజ‌య్ : అవును సర్ ‌. వారు తిరిగి రావాల‌ని అనుకుంటున్నారు. కానీ మేం వారిని ఆపాం. వారు ఎక్క‌డ ఉన్నారో అక్క‌డే వుండి పొమ్మ‌ని చెప్పాం. లాక్ డౌన్ అయిపోయిన త‌ర్వాత వారు తిరిగి రావచ్చు. బయటి నుంచి వ‌చ్చే వారిని 14 రోజుల‌ పాటు పాఠ‌శాల భ‌వ‌నంలో ఉంచడం వ‌ల్ల ..లాక్ డౌన్ అయిపోయిన త‌ర్వాత వ‌స్తామ‌ని వారు చెబుతున్నారు. వారికి 14 రోజుల‌ పాటు పాఠ‌శాల భ‌వ‌నంలో ఉండాల‌ని లేదు.

ప్రధాన మంత్రి :  అంటే..ప్ర‌తి ఒక్క‌రూ మీ మాటలను వింటున్నారన్నమాట?

అజ‌య్ : అవును సర్ ‌.

ప్ర‌ధాన మంత్రి :  మీరంద‌రూ సుర‌క్షితంగా ఉండాల‌ని , న‌గ‌రాల్లో ఉన్న‌వారు కూడా భ‌ద్రంగా  ఉండాల‌ని కోరుకుంటున్నాను. వారు ప్ర‌శాంతంగానే ఉన్నార‌ని తలుస్తాను. మీరు వారితో త‌ప్ప‌కుండా ఫోన్లో మాట్లాడుతూ ఉండండి. న‌గ‌రాల్లో నివ‌సించ‌డం వారికి స‌మ‌స్యాత్మ‌కంగా ఉంద‌నే విష‌యం నాకు తెలుసు. వారు ఇంటికి రావాల‌ని, త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఉండాల‌ని ఆతుర‌త క‌న‌బ‌ర‌చ‌డం స‌హజం. కాబ‌ట్టి ఇలాంటి స‌మ‌యంలో గ్రామ ప్ర‌జ‌లు వారితో మాట్లాడుతూ ఉంటే వారికి కొంత భారం త‌గ్గిన‌ట్టుగా వుంటుంది. మీరు ఈ రోజున చేస్తున్న ప‌నికిగాను మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను.
 
ఇప్పుడు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని బ‌స్తీకి వెళ‌దాం. బ‌స్తీ గ్రామ పంచాయతీ న‌ఖ్తీదేహి ప్ర‌ధాన్ అయిన సోద‌రి వ‌ర్షా సింగ్ ఇప్పుడు మ‌న‌తో మాట్లాడ‌బోతున్నారు. నమస్కారం వ‌ర్షా గారు.

వ‌ర్ష:  న‌మ‌స్కారం సర్‌.  మా గ్రామ పంచాయతీ త‌ర‌ఫున మీకు స్వాగ‌తం ప‌లుకుతున్నాను. పంచాయతీ రాజ్ దినోత్స‌వం సంద‌ర్భం గా నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు.

ప్రధాన మంత్రి :  మీ ఊరి లో లాక్ డౌన్ స‌క్ర‌మంగానే అమ‌ల‌వుతోందా ?

వ‌ర్ష :  సర్, మా ఊళ్లో పూర్తి స్థాయి లో లాక్‌ డౌన్ అమ‌ల‌వుతోంది. ఆశా కార్య‌క‌ర్త‌లు, ఆంగ‌న్ వాడీ సోద‌రీమ‌ణులు, ఎ ఎన్ ఎం ల ‌ద్వారా గ్రామం లో ప్ర‌తి ఇంట్లో త‌గిన చైత‌న్యాన్ని క‌లిగించ‌డం జ‌రిగింది. లాక్ డౌన్ నియ‌మాలను పాటించాల‌ని చెప్పాం. భౌతిక దూరం, ఇంట్లోనే భద్రంగా ఉండ‌డంపై ఇంటింటికీ వెళ్లి చెప్ప‌డం జ‌రిగింది.

ప్రధాన మంత్రి :  మీరు ఎంత‌ కాలం గా ప్ర‌ధాన్ గా ఉన్నారు ?

వ‌ర్ష :  సర్ ‌, నేను ప్ర‌ధాన్ గా ప‌ని చేయ‌డం ఇదే మొద‌టి సారి కాదు. ఇంతకుముందు కూడా ప్ర‌ధాన్ గా ప‌ని చేశాను.

ప్ర‌ధాన మంత్రి :   కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ..అంటే ... ప్రధాన మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ యోజ‌న‌, ప్రధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కాలు మీ గ్రామం లో ఎలా అమ‌లువుతున్నాయి ?

వ‌ర్ష :  సర్ ‌, ఉజ్వ‌ల యోజ‌న లో 25 మంది, కిసాన్ స‌మ్మాన్ నిధి లో 155 మంది ల‌బ్ధి దారులు ఉన్నారు.  ప‌ది మంది రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ న‌డుస్తోంది. జ‌న్ ధ‌న్ యోజ‌న‌ కు సంబంధించి 50 మంది ల‌బ్ధి పొందారు.

ప్రధాన మంత్రి :  అక్క‌డి ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు ?  వారంద‌రూ సంతృప్తిగానే ఉన్నారా ?

వ‌ర్ష :  సర్ ‌, మా గ్రామ ప్ర‌జ‌లు సంతోషం గా ఉన్నారు. మీరు తెలియ‌జేసిన లాక్ డౌన్ నియ‌మాల‌ను మా వాళ్లు స‌క్ర‌మం గా పాటిస్తున్నారు. ప్ర‌జ‌లు సుర‌క్షితం గా ఉన్నామ‌ని అనుకుంటున్నారు. క‌రోనా వైర‌స్ కు సంబంధించి ఖ‌చ్చిత‌మైన వైద్యం ఇంకా రాలేదు కాబట్టి ఇంట్లో ఉంటేనే క్షేమ‌మ‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవాలంటే ఇంట్లో ఉండ‌డం ఒక్కటే మార్గం. భౌతిక దూరాన్ని పాటించాలి. ఒక మనిషికి, మరో మనిషికి నడుమ రెండు గ‌జాల దూరం ఉండాలి. ప్ర‌జ‌లు ఇంట్లో కూడా భౌతిక దూరాన్ని పాటించాలి.

ప్రధాన మంత్రి :  చూడండి. క‌రోనా వైర‌స్ చాలా విచిత్ర‌మైన వైర‌స్‌. అయితే దానికి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. అదేమిటంటే, అది దానంత‌ట అది ఇత‌రుల ఇంటికి వెళ్ల‌దు. ఎక్క‌డికైనా స‌రే అది దాని స్వంతంగా ప్ర‌యాణం చేయ‌లేదు. మీరు వెళ్లి ఆహ్వానిస్తే త‌ప్ప అది మీ ఇంటికి రాదు. కాబ‌ట్టి భౌతిక దూరం ఉండేలా చూసుకోవ‌డం చాలా ముఖ్యమైన నియ‌మం. రెండు గ‌జాల దూరంలో ఉండి మాట్లాడుకోవాలి. ఒక‌రికి మరొక‌రు రెండు గ‌జాల దూరం లో నిల‌బ‌డాలి. ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి త‌న‌ను ర‌క్షించుకునే ప‌రిక‌రాలను ధ‌రిస్తే అత‌ని ముందు ఉన్న వ్య‌క్తి కూడా త‌న‌ను తాను క‌వ‌ర్ చేసుకుంటే అప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య‌ ఆటోమేటిగ్గా రెండు గ‌జాల దూరం ఉండాల‌నే స్పృహ కూడా కలుగుతుంది.
 
ప్ర‌భుత్వం అందిస్తున్న నిధులు అందడం పై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు ?  గ‌తం లో కేంద్ర ప్ర‌భుత్వం ఒక రూపాయి ప్ర‌జ‌ల‌కు ఇస్తే, అందులో 15 పైస‌లు మాత్ర‌మే ప్ర‌జ‌ల‌కు చేరేద‌ని అనే వారు. ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు వారికి చెందాల్సిన డబ్బు మొత్తం వారి ఖాతాల్లో జ‌మ‌ అవుతుండ‌డంపై వారు ఏమ‌నుకుంటున్నారు ?

వ‌ర్ష :  మా గ్రామ ప్ర‌జ‌లు చాలా సంతోషంగా ఉన్నారు సర్‌.

ప్రధాన మంత్రి  :  వారు ఏమంటున్నారు ?

వ‌ర్ష :  ఈ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌భుత్వం అందించే అన్ని ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తున్నాయ‌ని అనుకుంటున్నారు సర్ ‌.

ప్రధాన మంత్రి :  మంచిది వ‌ర్ష గారు.. మీరు చాలా గొప్ప‌గా ప‌ని చేస్తున్నారు. మీరు ఏదో చెప్ప‌బోతున్నారు.
 
వ‌ర్ష :   సర్ ‌,  క‌రోనా మ‌హ‌మ్మారి వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంక్షోభం నెల‌కొన్న ఈ స‌మ‌యంలో మీలాంటి ప్రధాన మంత్రి లేక‌పోయి ఉంటే ఏమి జ‌రిగి ఉండేది అనే దానిపైన గ్రామంలో మాట్లాడుకుంటున్నారు. ఈ విష‌యం పై మాలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

ప్రధాన మంత్రి :  వ‌ర్ష గారు, రెండు గ‌జాల దూరం సంగతిని మ‌రచిపోవ‌ద్దు. రెండు గ‌జాల దూరం పాటించాల‌నే మంత్రం మ‌న‌ల్ని కాపాడుతుంది. గ్రామ‌స్తులు సంతోషంగా ఉన్నార‌నే విష‌యం నాకు ఆనందాన్ని క‌లిగిస్తోంది. ఎందుకంటే ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య‌ న‌మ్మ‌కం ఉంటేనే మ‌నం పెద్ద పెద్ద సంక్షోభాలు ఎన్ని వ‌చ్చినా స‌రే, అధిగ‌మించ‌గ‌లం. ఆ న‌మ్మకం ఉంది కాబ‌ట్టే ఈ సారి మ‌నం ఈ యుద్ధంలో గెల‌వ‌బోతున్నాం. మ‌నకు ఉన్న అతి పెద్ద బ‌లం ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య‌ ఉన్న న‌మ్మ‌కం. మ‌నం మన‌ల్ని న‌మ్ముతున్నాం. మ‌నం వ్య‌వ‌స్థ‌ల‌ను న‌మ్ముతున్నాం. మ‌నం త‌ప్ప‌నిస‌రిగా ఈ సంక్షోభాన్నుంచి బయట‌ప‌డాలి.

ఇప్పుడు పంజాబ్ కు వెళ‌దాం.

ప‌ఠాన్ కోట్ గ్రామ పంచాయతీ కి చెందిన హ‌డా స‌ర్పంచ్ సోద‌రీమ‌ణి ప‌ల్ల‌వి ఠాకూర్ తో మాట్లాడ‌దాం. ప‌ల్ల‌వి గారు, న‌మ‌స్కారం.
 
ప‌ల్ల‌వి  :  న‌మ‌స్కారం సర్ ‌. నా త‌ర‌ఫున‌, నా పంచాయతీ త‌ర‌ఫున మీకు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలియ‌జేసుకుంటున్నాను. నేను హ‌డా గ్రామ పంచాయతీ స‌ర్పంచ్ గా ప‌ని చేస్తున్నాను. ఇది వెన‌క‌బ‌డిన ప్రాంతం. అంతే కాదు స‌రిహ‌ద్దు ప్రాంతం కూడా. సర్,  కొరోనా వైర‌స్ సంక్షోభం త‌లెత్తిన త‌ర్వాత మా గ్రామ‌స్తులు, గ్రామంలోని యువ‌త మాకు బాగా స‌హ‌క‌రిస్తున్నారు. మీరు ఇచ్చిన సందేశాన్ని మేం అమ‌లు చేస్తున్నాం. ఇళ్లలోనే ఉంటున్నాం. మా గ్రామంలోనే అన్ని ర‌కాల ఏర్పాట్లు చేసుకున్నాం. గ్రామానికి గల రెండు ప్ర‌వేశ ద్వారాలను మూసేశాం. నేను గ్రామంలోని ఇత‌ర ముఖ్య‌మైన‌ వారు, గ్రామ యువ‌త అంద‌ర‌మూ క‌లిసి ఈ ప్ర‌వేశ ద్వారాల‌ను నిత్యం ప‌హారా కాస్తున్నాం. స‌రైన కార‌ణం లేకుండా ఎవ‌రినీ బయట‌కు పోనీవ‌డం లేదు. లోనికి రానీయ‌డం లేదు. మేం గ్రామంలోని ప్ర‌తి ఇంటికి వెళ్లి ప్ర‌జ‌ల్లో చైతన్యం క‌లిగించాం. సర్, 22 న లాక్ డౌన్ ను ప్ర‌క‌టించారు. ఇది 31వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని అదే రోజు న పంజాబ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆ రోజు నుంచి ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమిత‌ం అయ్యారు. ఇంట్లో కూడా భౌతిక దూరాన్ని పాటించ‌డం, క్ర‌మం తప్ప‌కుండా చేతులు శుభ్రం చేసుకోవ‌డం, ప‌దే ప‌దే చేతుల‌తో మొహం, క‌ళ్లు తుడుచుకోకుండా వుండ‌డం మొద‌లైన విష‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశాం.

సర్,  పంజాబ్ లో కూడా పంట నూర్పిడి స‌మ‌యం కాబ‌ట్టి పంజాబ్ ప్ర‌భుత్వం కొన్ని నియ‌మాల‌ను విడుద‌ల చేసింది. వాటిని త‌ప్ప‌కుండా అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. పంట కోత‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌లు రెండు గ‌జాల దూరంలో ఉండాల‌ని చెప్పారు. రైతులు పంట కోత‌ కోస్తుంటే ఆ స‌మ‌యంలో కూడా త‌ప్పకుండా వారు వారి చేతులను త‌ర‌చుగా శుభ్రం చేసుకోవాల‌ని చెప్పారు. సర్,  ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఏర్పాట్లను కూడా చేసింది. చేతికి పంట‌లు రాగానే వాటిని మార్కెట్ కు ఎలా తీసుకుపోవాలో చెప్పారు. ఉదాహ‌ర‌ణ‌కు తీసుకుంటే, నాలుగు ఐదు గ్రామాలను క‌లిపి ఒక మార్కెట్ కు అనుసంధానం చేశారు. రైతుల‌కు ఒక హోలోగ్రామ్ స్లిప్ ఇచ్చారు. దాన్ని తీసుకొన్న త‌ర్వాత‌నే వారు మార్కెట్ కు వెళ్లాలి. రైతులు త‌మ ట్రాక్ట‌ర్ల ద్వారా ఒక‌సారి 50 క్వింటాళ్ల పంట‌ల్ని మాత్ర‌మే తీసుకొని వ‌స్తార‌ని మేం వారికి చెప్పాం. ట్రాక్ట‌రు తో పాటు డ్రైవ‌ర్‌, డ్రైవ‌ర్ స‌హాయ‌కుడు వుంటారు. వారు త‌మ మ‌ధ్య‌ భౌతిక‌ దూరాన్ని పాటిస్తారు.

ప్రధాన మంత్రి :  ప‌ల్ల‌వి గారు, మీరు అన్ని విష‌యాలను చాలా వివ‌రంగా చెప్పారు. ఈ సంక్షోభ స‌మ‌యం లో మీ గ్రామం లో ప‌రిస్థితిని చాలా స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నందుకు మీకు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. మీ గ్రామ ప్ర‌జ‌లు కూడా మీ మాట బాగా వింటున్నారు. మీరు చెప్పింది స‌రైన‌దే. రైతులు ఆరోగ్యంగా, భ‌ద్రంగా ఉండ‌డం చాలా ముఖ్యం. ఎందుకంటే వారు ఈ దేశానికి కావ‌ల‌సిన ఆహారాన్ని అందిస్తున్నారు. నిస్వార్థంగా ప‌ని చేస్తూ, ప్ర‌జ‌ల క‌డుపులు నింపుతున్నారు. దేశ‌వ్యాప్తంగా పూర్తిస్థాయి లో లాక్ డౌన్ ను విధించిన‌ప్ప‌టికీ దేశంలోని రైతులు, ప‌శు పోష‌కులు కష్టించి ప‌ని చేయ‌డంవ‌ల్ల మ‌న‌కు ఆహార‌ధాన్యాలు, పాలు, పండ్లు లాంటి వాటి కొర‌త రాలేదు. వారి ధైర్యం ఎంతో ప్ర‌శంస‌నీయం. ప్ర‌శంస‌ల‌తో పాటు మీకు నేను ఒక విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. ప‌ల్ల‌వి గారు, నేను గురుదాస్ పుర్ లో ప‌ని చేస్తున్న‌ప్పుడు అనేక గ్రామాల‌కు చెందిన మాతృమూర్తులతో, సోద‌రీమ‌ణుల‌తో మాట్లాడే వాడిని. వారు ప్ర‌తి సారీ ఒక మాట చెప్పే వారు..త‌మ యువ‌త‌ ను మ‌త్తుమందుల అల‌వాటు నుంచి బయట‌ప‌డేయ‌మ‌ని న‌న్ను అడిగే వారు. ఆ విష‌యం లో వారు చాలా ఆవేద‌న‌ గా ఉండే వారు. అదే విధంగా నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. మ‌న నేల‌త‌ల్లి ని ర‌క్షించుకోవాలంటే మ‌న రైతుల‌కు మంచి భ‌విష్య‌త్తు ను క‌ల్పించాలంటే ప్ర‌జ‌ల‌కు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మ‌న ముందు త‌రాల భ‌విష్య‌త్తు స‌రిగా ఉండాలంటే మ‌న రైతుల‌ను ఒప్పించి వారి చేత యూరియా వినియోగాన్ని త‌గ్గించేలా చేయాలి. యూరియా కార‌ణం గా చాలా స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అది మ‌న భూమిపై, మ‌న నీటిపై తీవ్ర‌మైన దుష్ప్ర‌భావాన్ని చూపుతోంది.

ప‌ల్ల‌వి గారు, గ్రామ పెద్ద‌లైన మీరు మీ ఊరి వారికి వివ‌రించి వారిని ఈ విష‌యం లో ఒప్పించండి. మీ గ్రామానికి ఇంత‌వ‌ర‌కూ 10 సంచుల యూరియా వ‌స్తుంటే దాన్ని 5 సంచుల‌కు ప‌రిమితం చేయండి. వంద బ్యాగుల యూరియా వ‌స్తుంటే దాన్ని 50 బ్యాగుల‌కు ప‌రిమితం చేయండి. అంటే స‌గానికి స‌గం త‌గ్గించేయాలి. దాని వ‌ల్ల డ‌బ్బు ఆదా అవుతుంది. మ‌న నేల‌త‌ల్లి ని కూడా అనారోగ్యం బారిన ప‌డ‌కుండా కాపాడుకోగ‌లుగుతాం.

పంజాబ్ రైతుల‌తో, ప‌ల్ల‌వి గారు వంటి ప్ర‌ధాన్ తో మాట్లాడిన త‌ర్వాత నాకు న‌మ్మ‌కం వ‌చ్చింది.. ఈ విష‌యంలో మీరు స్పందిస్తార‌ని భావిస్తున్నాను. మీకు నా శుభాకాంక్ష‌లు.
ఇప్పుడు మ‌హారాష్ట్ర‌ కు వెళ‌దాం. మేడాన్ క‌ర్వాడీ గ్రామ పంచాయతీ ప్ర‌ధాన్ అయిన సోద‌రి ప్రియాంక గారి తో మాట్లాడ‌దాం. న‌మ‌స్కారం ప్రియాంక గారు..

ప్రియాంక :  న‌మ‌స్కారం సర్.
 ‌
ప్రధాన మంత్రి :  నాతో చెప్పండి, ప్రియాంక గారు ..

ప్రియాంక :  సర్ .. లాక్ డౌన్ ను విధించిన‌ప్ప‌టి నుంచి 26వ తేదీ ఆ త‌ర్వాత నుంచి మా గ్రామం మొత్తాన్ని సోడియం హైపో క్లోరైట్ తో శానిటైజ్ చేయ‌డం జ‌రిగింది. ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉన్న రెండు చోట్ల శానిటైజ‌ర్ టన్నల్ ను పెట్టాం. గ్రామంలో ప్ర‌తి ఇంటికి స‌బ్బుల‌ను స‌ర‌ఫ‌రా చేశాం. ఆ త‌ర్వాత ‘స్కిల్ ఇండియా’ ప‌థ‌కం లో భాగం గా కుట్టుప‌ని లో శిక్ష‌ణ పొందిన మ‌హిళ‌ల‌కు మాస్కుల త‌యారీ ప‌నిని అప్ప‌గించాం. స్వ‌యం సహాయ‌ సమూహాల‌కు మాస్కుల తయారీ ప‌నిని కేటాయించాం. ఒకే ర‌క‌మైన మాస్కుల‌ను వారు 5000 త‌యారు చేయ‌గ‌ల‌రు. వాటిని మేం మొత్తం గ్రామ‌మంతా పంపిణీ చేశాం. మాకు స‌మీపంలో పాక్షిక ప‌ట్ట‌ణ ప్రాంతం ఉంది. అక్క‌డ అనేక ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయి. న‌డ‌క కోసం ప్ర‌జ‌లు బయట‌కు వ‌స్తుంటారు. దీనికోసం మేం స‌మ‌యం కేటాయించాం. త‌ర్వాత వీధిదీపాల‌ను ఆర్పేయ‌డం జ‌రుగుతుంది. దీనివ‌ల్ల భౌతిక దూరాన్ని పాటించ‌డం సు‌లువైంది. ఆ ప‌ని ని స‌మ‌ర్థ‌వంతంగా చేస్తున్నాం.

దుకాణాల ముందు వృత్తాల‌ను గీసి, వాటిలో మాత్ర‌మే నిల‌బ‌డుతూ భౌతిక దూరాన్ని పాటించేలా చేస్తున్నాం. అంతే కాదు కిరాణా దుకాణాలు, కూర‌గాయ‌ల దుకాణాలు తెర‌వ‌డానికి నిబంధ‌న ఉంది. మూడు రోజుల పాటు కిరాణా దుకాణాల తెరిస్తే...త‌ర్వాత‌ మూడు రోజుల‌పాటు కూర‌గాయ‌ల దుకాణాలు  తెరచివుంటాయి. దానివ‌ల్ల ప్ర‌జలు ఎక్కువ‌గా గుమికూడ‌కుండా చూడ‌గ‌లుగుతున్నాం.

అంతే కాకుండా హౌసింగ్ సొసైటీల‌కు, రైతుల‌కు మ‌ధ్య‌ స‌మ‌న్వ‌యం ఉండేలా చూశాం. ఈ స‌మ‌న్వ‌యం వ‌ల్ల‌ స్వ‌చ్ఛంద సేవకు‌ల సాయంతో ఆయా హౌసింగ్ సొసైటీల‌కు కూర‌గాయ‌లను, ఆహార ధాన్యాల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రిగింది. ఇది రైతుల‌కు చాలా మేలు చేసింది. మా గ్రామ ఆశా కార్య‌క‌ర్త‌ల‌ద్వారా 7 వేల శానిట‌రీ నాప్ కిన్ లను కూడా పంపిణీ చేసి మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు, ఆరోగ్యానికి ప్రాధాన్య‌మిచ్చాం. గ్రామం లో ప్ర‌తి మ‌హిళ‌ కు నాప్ కిన్ ను ఇచ్చాం. క‌రోనా అనుమానితులు ఉండ‌డానికి హోం క్వారన్టీన్ స‌దుపాయాన్ని ప్రారంభించాం. దాని ద్వారా మాకు చాలానే మేలు జ‌రిగింది.

లాక్ డౌన్ పొడిగించిన త‌ర్వాత మ‌రోసారి మా గ్రామంలో శానిటైజ్ చేశాం. పారిశుద్ధ్య ప‌నులు నిర్వ‌హించాం. ఈ ప‌నుల‌న్నీ చేయ‌డంద్వారా, భౌతిక దూరం పాటించ‌డంవ‌ల్ల మాకు ఎంతో ప్రయోజనం అందింది.

ప్రధాన మంత్రి : ప్రియాంక గారు...ఇప్పుడు గ్రామ‌స్తులు ఆందోళ‌న‌గా ఉంటారు. చాలా రోజులుగా అన్నిటినీ మూసేయ‌డంవ‌ల్ల ప్ర‌జ‌లకు మోదీ పైన కోపం ఉండి ఉంటుంది క‌దా!

ప్రియాంక‌ - సర్, ఇళ్ల‌కే ప‌రిమిత‌మై ఉండ‌డ‌మ‌నేది గ్రామ‌స్తుల‌కు అల‌వాటు లేదు. దాంతో వారిలో ఆందోళ‌న ఉంది. కానీ మీరు ఈ దేశానికి చేస్తున్న సేవ గురించి వారికి తెలుసు. మ‌న ఆరోగ్యం కోసం, మ‌న భ‌ద్ర‌త‌ కోస‌మే ప్రధాన మంత్రి ఈ ప‌ని చేస్తున్నార‌ని వారికి తెలుసు. దేశం కోస‌మే ప్రధాన మంత్రి లాక్ డౌన్ ను విధించార‌నే విష‌యం ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది.

ప్రధాన మంత్రి : ప్రియాంక గారు, మీ గ్రామ జ‌నాభా ఎంత ?

ప్రియాంక :  50,000 మంది.

ప్రధాన మంత్రి :   ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప‌నుల కార‌ణంగా వ్య‌వ‌సాయరంగం బలోపేత‌మైంది. గ్రామ రైతులు మ‌రింత సాధికార‌త‌ ను పొందారు. అదే విధంగా ఇ-నామ్. ఇ- నామ్ సాంకేతిక‌త ద్వారా దేశం లోని ఏ మార్కెట్ లో అయినా మ‌న రైతులు త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకోవ‌చ్చు. ఇప్పుడు రైతుల్లో ఆత్మ‌విశ్వాసం పెరుగుతోంది. మీలాంటి చ‌దువుకున్న‌ వారు గ్రామ స‌ర్పంచులుగా వుంటే గ్రామానికి అవ‌స‌ర‌మైన ఆధునిక వ్య‌వ‌స్థ‌ల‌ను తీసుకు రాగ‌ల‌రని నాకు పూర్తి న‌మ్మ‌కం ఉంది.

అదే ప‌ద్ధ‌తి లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ఎల‌క్ట్రానిక్ మార్కెట్ వ్య‌వ‌స్థ‌. దీన్ని జిఇఎమ్ అంటారు. మీ గ్రామంలోని స్వ‌యం స‌హాయ‌క సమూహాలకు చెందిన చిరు వ్యాపారులు త‌మ ఉత్ప‌త్తుల‌ను నేరుగా ప్ర‌భుత్వానికి అమ్మ‌వ‌చ్చు. ఇందుకోసం జిఇఎమ్ పోర్ట‌ల్ ప‌ని చేస్తోంది. టెండ‌ర్ల అవ‌స‌రం లేదు. క‌మిష‌న్ల వ్య‌వ‌హారం లేదు. నేరుగా జిఇఎమ్ పోర్ట‌ల్ లో త‌మ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకోవ‌చ్చు. చ‌దువుకున్న మీలాంటి స‌ర్పంచులు ఒక బృందంగా ఏర్ప‌డి సాంకేతిక‌త సాయంతో మీ గ్రామంలోని ఉత్పత్తుల‌ను ఎల‌క్ట్రానిక్ మార్కెట్ లో అమ్ముకోవ‌చ్చు. అన్ని ర‌కాల స‌దుపాయాల‌ను ఏర్పాటు చేశాం.
 
ప్రియాంక‌ గారు:  ఏదో చెప్పాల‌ని అనుకుంటున్నారు..

ప్రియాంక‌:  సర్,  ఇ నామ్ అనేది జాతీయ స్థాయి మార్కెట్‌.  దానిని ఉప‌యోగించుకోవ‌డానికి మేం చ‌ర్య‌లు తీసుకున్నాం.  పంచాయతీ ఆప‌రేట‌ర్ల‌ ద్వారా రైతుల‌కు సాయం చేయ‌డానికి స‌మ‌న్వ‌యం చేస్తున్నాం.
 
ప్రధాన మంత్రి:  మంచిది..మీకు శుభాకాంక్ష‌లు.

ప్రియాంక‌ గారు:  సర్  మీతో ఒక విష‌యం చెప్పాల‌ని అనుకుంటున్నాను.

ప్రధాన మంత్రి:  త‌ప్ప‌కుండా చెప్పండి.

ప్రియాంక:  క‌రోనా వైర‌స్ ను ఎదుర్కొనే క్ర‌మంలో దేశానికి, ప్ర‌పంచానికి మీరు మార్గ‌ద‌ర్శ‌కంగా ప‌ని చేస్తున్నారు. దీనికి సంబంధించి నేను కొన్ని విష‌యాలు చెప్పాల‌ని అనుకుంటున్నాను.
 
ప్రధాన మంత్రి:   త‌ప్ప‌కుండా చెప్పండి.

కోశిశ్ జారీ హై అవుర్ హిమ్మత్ బర్ కరార్ హై
సిర్ హై ఇస్ దునియా పర్ ఛానే కా ఫితూర్
ముఝే కిసీ పర్ భరోసా నహీ, ముఝే మెహనత్ పర్ భరోసా హై
ఏక్ న ఏక్ దిన్ యే హాలాత్ బద్ లేంగే జరూర్.

ప్రధాన మంత్రి:  ఎంత గొప్ప మాట.   మీ మాటలపై కూడా నాకెంతో నమ్మకం ఉంది.  ఒక రకంగా చెప్పాలంటే భారతీయ స్ఫూర్తికి ఇది ప్రతిబింబం.  మీ అందరికీ నా శుభాకాంక్షలు.  

మనం తూర్పు వైపు వెళ్దాం. అసమ్ కు చేరుకుందాం. అసమ్ లోని ఛోటా-దూద్ పాటిల్ గ్రామ పంచాయతీ ప్రధాన్  శ్రీ రంజిత్ సర్కార్ మనతో ఉన్నారు.   నమస్కారం, రంజిత్ గారు.

రంజిత్:  నమస్కారం సర్.  లాక్ డౌన్ నిర్ణయంపై మీకు అసమ్ తరపున మద్దతు తెలుపుతున్నాను.  మేము లాక్ డౌన్ ను ప్రకటిస్తూ మీరు తీసుకున్న నిర్ణయానికి మద్దతిస్తున్నాం.  

ప్రధాన మంత్రి:  అసమ్ ప్రజలు ఎంతో కోపంగా ఉన్నట్టున్నారు.   ఎందుకంటే వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే బిహూ పర్వదినం వేళలోనే మోదీ లాక్ డౌన్ ను విధించాడు.  ఈ సారి కరోనా మహమ్మారి కారణంగా బిహూ ఉత్సవాన్ని పరిమిత స్థాయిలో జరుపుకోవాల్సి వచ్చింది.   ఈ సమయంలో అసమ్ ప్రజలు కనబర్చిన సంయమనం,  క్రమశిక్షణ లు కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో ఎంతగానో తోడ్పడ్డాయి.   అందుకు రాష్ట్ర ప్రజలను ప్రశంసిస్తున్నాను.  అసమ్ లో మన గ్రామ సోదరీమణులు ముఖానికి వేసుకునే మాస్కులను తయారు చేయడంలో తలమునకలయ్యారు.   ఆరోగ్య పరీక్షల కోసం వచ్చే ఆరోగ్య కార్యకర్తలకు సహకరించేందుకు మీ పంచాయతీ ఏమి చేస్తోంది ? వారికి ఏ విధంగా సహకరిస్తోంది?  

రంజిత్ సర్కార్:  మీరు తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం వాస్తవికంగా ఎంతో మంచిది సర్.  దేశ ప్రజలను రక్షించేందుకు మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ ప్రభావం నుంచి మా గ్రామాన్ని రక్షించుకునేందుకు మా పంచాయతీ అన్ని చర్యలు తీసుకుంటోంది.  ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని పూర్తిగా పరీక్షిస్తున్నాం. ఇక్కడ, ఆశా వర్కర్లు ,  ఇతర హెల్త్ కేర్ కార్యకర్తలు సర్వే కు వస్తున్నారు.  ఈ బృందాలకు మా పంచాయతీ పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తోంది.   ఇది వారు ఇంటింటికి వెళ్లి  అవసరమైన సమాచారాన్ని సేకరించుకోవడానికి తోడ్పడుతుంది. మొత్తం పంచాయతీ తరపున నేను ఈ ఈ కొత్త చట్టానికి పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు పలుకుతున్నాను.  వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల రక్షణ కోసం మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ప్రశంసనీయం.  ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రకమైన చట్టం ఎంతో అవసరం కూడా.   ఈ కష్టకాలంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న వారికి మా పంచాయతీ సహకరిస్తోంది.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో అందించే సహాయ సహకారాలను వెంటనే ప్రజలకు చేరవేస్తున్నాం.  

ప్రధాన మంత్రి:  రంజిత్ గారు,  మీరు బాగా చెప్పారు.  మీతో పాటు మీ పంచాయతీ వాసులందరికీ అభినందనలు. మీకు అనేకానేక ధన్యవాదాలు.  

ఇది చాలా మంచి పని.  రంజిత్ గారు, మీరు, మీ బృందం ఇంకా ఎంతో కృషి చేయాలి.   ఆరోగ్య కార్యకర్తల రక్షణ కోసం తీసుకు వచ్చిన కొత్త చట్టంపై మీరు మాట్లాడారు.   అయితే ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.   కరోనాపై యుద్ధంలో  ఆరోగ్య సిబ్బంది తమ విధులను ఇబ్బంది లేకుండా నిర్వహించేలా రోగులు వారికి తోడ్పడాలి.  అలాగే వారిని గౌరవించాలి. వారు చేస్తున్న కృషి వారి కోసం కాదు, మన కోసమే అనే వాస్తవాన్ని మరచిపోకూడదు.  

మిత్రులారా, నేనే కాదు యావత్తు దేశ ప్రజలంతా ఈ రోజు మీ మాటలను వింటున్నారు.   మీ అందరితో నేను జరిపిన అర్ధవంతమైన సంభాషణలు ప్రతి ఒక్కరికీ సంతృప్తి కలిగించి ఉంటాయి.   దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న కృషి, చేస్తున్న ప్రయత్నాల గురించి  తెలుసుకున్న ప్రజలకు సరికొత్త ధీమా కలిగి ఉంటుంది.  దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు చేస్తున్న కృషి ప్రజలకు సంతృప్తినిచ్చి ఉంటుంది.  నాకు అన్ని విధాలుగా సమయం కలసి వచ్చి ఉంటే మీలో ప్రతి ఒక్కరి మాటలను వినే వాడిని.   అలా జరిగి ఉంటే నాకు మరింత ఆనందం కలిగి ఉండేది.  అంతేకాదు.  ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుని ఉండే వాళ్ళం.   ఈ సాంకేతిక విజ్ఞానం  ద్వారా అనుసంధానమైన లక్షల కొద్దీ పంచ్ లు, సర్పంచుల ముందు నేను ఉన్నాను.  నేను మీ అందరి మాటలను వినలేకపోయినప్పటికీ ఇప్పటికే మాట్లాడి తమ అనుభవాలను వ్యక్తం చేసిన ప్రధాన్ ల ద్వారా మీ మనోభావాలను నేను గ్రహించగలిగాను.  మీరు కూడా మీ గ్రామాన్ని రక్షించుకునేందుకు ఎన్నో ప్రత్యేక ప్రయత్నాలు, అలాగే ప్రయోగాలు చేసి ఉంటారని నాకు తెలుసు.  వాటిని వివరిస్తూ నాకు రాసి పంపితే  ఎంతో సంతోషిస్తాను.  

జీవితాన్ని సురక్షితంగా మార్చేందుకు మీరంతా నాయకత్వంతో పాటు జవాబుదారీతనాన్ని కూడా కనబరుస్తున్నారు.   ఈ సంక్లిష్ట సమయంలోనూ ప్రజల జీవితాన్ని సురక్షితంగా,  సులభతరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.   మనమంతా చిన్నప్పటి నుంచి  మహాత్మ గాంధీ చెప్పిన మాటలను పదే పదే వింటూనే ఉన్నాం.   ‘‘నా కలల స్వరాజ్యం గ్రామ స్వరాజ్’’ అని మహాత్మ గాంధీ అంటూ ఉండేవారు.  

దీనిని బట్టి చూస్తే గ్రామ పంచాయతీలే మన ప్రజాస్వామ్య సమైక్య శక్తికి కేంద్ర బిందువులు.   మన ప్రజాస్వామ్య సంఘీభావానికి అత్యంత శక్తివంతమైన కేంద్రాల్లో గ్రామ పంచాయతీలు ఒక కేంద్రం.  మన పురాణాల్లో ‘‘సంఘమూలం మహాబలం’’ అన్న సూక్తి ఉంది.  ఈ మాటలకు మన సమైక్యత లేదా సంఘటితత్వంలో అమేయమైన శక్తి ఉందని భావం.    

ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి, అదేవిధంగా దాన్ని స్వయంసమృద్ధం చేయడానికి గ్రామాల మధ్య సమష్టి శక్తి ఎంతో అవసరం.  మీ సంఘటిత శక్తితోనే ఈ లక్ష్యం సాధ్యమౌతుంది.

అయితే ఈ ప్రయత్నాల క్రమంలో, మనం గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే ఒక వ్యక్తి నిర్లక్ష్యం మొత్తం గ్రామాన్ని ప్రమాదంలో పడవేయగలదన్న సంగతిని. ఈ కారణంగా, ఉదాసీనత కు ఎలాంటి అవకాశం లేదు.  

గ్రామంలో శానిటైజేషన్ ప్రక్రియ ప్రచారం విస్తృతం కావాలి. స్వల్పకాలంలోనే ఇతర నగరాల నుంచి  వచ్చే ప్రజలకు క్వారన్టీన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.  అలాగే ప్రతి ఒక్కరి ఆహార అవసరాల గురించి, ఇతర అవసరాల గురించి కూడా ఆలోచించాలి.   ప్రతి ఒక్కరు కూడా వాస్తవిక స్పృహతో  మెసలేలా చేయాలి.   ఈ ప్రయత్నాలన్నీ ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా నిరంతరం సాగాలి.  

జమ్ము & కశ్మీర్ కు చెందిన ఇక్బాల్జీ  కాసేపటి క్రితం ‘‘గౌరవించు మరియు అనుమానించు’’ అంటూ చెప్పిన మాటలను విన్నాను.  గ్రామాల్లో ఉండే వయోవృద్ధులు,  దివ్యాంగులు,  వ్యాధిగ్రస్తులకు మొదటి ప్రాధాన్యాన్నివ్వాలి. వారికి ఏ మాత్రం ఇబ్బంది ఎదురైనా వారు ముందుగా మీ వద్దకే వస్తారు. అంటే ఈ సమస్యకు పరిష్కారం గ్రామాల పంచ్ లు, ప్రధాన్ ల వద్దే ఉండాలి.    

"దో గజ్ దూరీ"  లేదా సురక్షిత దూరాన్ని పాటించాలన్న మంత్రాన్ని మనసు లో పెట్టుకోవాలి.  గ్రామాల్లో,   వీధుల్లో,  ఇళ్లలో ఉండే వారు ఈ సురక్షిత దూరాన్ని పాటించి తీరాలి.   ముఖానికి వేసుకునే మాస్కు ఖరీదైంది కావలసిన అవసరం లేదు.   అయితే చేతులను తరచుగా కడుక్కుంటూ ఉండాలి.   ఈ ప్రయత్నాలు నిరంతర ప్రక్రియగా సాగాలి.   రానున్న రోజుల్లో ఈ మహమ్మారిని నిరోధించాలంటే అదే అత్యుత్తమమైన మార్గం.   ఇదే ఏకైక పరిష్కారం కూడా.  

రక్షణ పై,  పరిశుభ్రత పై ప్రతి ఒక్కరు దృష్టి సారించవలసిన అవసరం ఉంది.   ఎందుకంటే వర్షాకాలంలో,  శీతాకాలంలో పలు రకాల వ్యాధులు విస్తరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.   త్వరలోనే వర్షాకాలం రాబోతోంది.   దీని దృష్టిలో పెట్టుకొంటే ఈ కరోనా వైరస్ మనకు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎంతో జాగ్రత్తగా ఉంటూ, మన గ్రామాన్ని మనం రక్షించుకోవాలి.  

మిత్రులారా, వ్యాధులకు సంబంధించి  అలాగే వాటి చికిత్స విషయంలో తప్పుడు ప్రచారం చాలా వ్యాపిస్తోందన్నది గతంలో మనకు కలిగిన అనుభవం. ఈ వ్యాధులను నివారించడంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సివచ్చింది. ఎంతో సమయం వృథా అయింది.  అయితే, ఈ సారి  అలాంటి పరిస్థితికి ఆస్కారం ఉండకూడదు.  ఏ రకమైన తప్పుడు ప్రచారానికి లోను కాకుండా ప్రజలను చైతన్యపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది.  

వ్యాధి నివారణ కు లేదా చికిత్సకు సంబంధించి ప్రతి కుటుంబానికి సరైన సమాచారం అందుబాటులో ఉండాలి.   తమ తమ గ్రామాల్లో చిన్న చిన్న బృందాలను ఏర్పాటు చేసి వాటికీ వివిధ లక్ష్యాలను అప్పగించి ప్రజలను చైతన్యపరిచే ప్రచారాన్ని వేగవంతం చేశామని అనేక మంది సర్పంచులు చెప్పారు.   ఆశా కార్యకర్తలు,  ఎఎన్ ఎం లు,  స్వయం సహాయక సమూహాలు, ఆంగన్ వాడీ కార్యకర్తలు, వారి సోదరీమణులు, యువ బృందాలు, మాజీ సైనికోద్యోగులు,  మత, సామాజిక,  సాంస్కృతిక సంస్థలకు చెందిన ప్రజలతో కలసి ఈ ప్రచారాన్ని నిర్వహించారు.  ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి సహాయాన్ని మనం తీసుకోవాలి.  ప్రతి ఒక్కరు వారి వంతు తోడ్పాటును అందించాలి.      
స్నేహితులారా, వివిధ రకాల ఆహార పదార్ధాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నేను చూస్తున్నాను.  ఈ రకమైన వదంతుల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.   మనం ఏమి తిన్నప్పటికీ, ముందుగా చేతులను శుభ్రం చేసుకోవాలి. పూర్తిగా ఉడికించిన ఆహారాన్ని తినాలి.  ఈ విషయాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరికి తెలియజేసి తీరాలి.   గ్రామాల్లో మంచి సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి.  వాటిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.    

ఆయుర్వేద కషాయాన్ని తీసుకునే సంప్రదాయం మనకు ఉంది.  మనం అనేక రకాల సుగంధ ద్రవ్యాలను  ఉపయోగిస్తాం.  వీటితో పాటు క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం చేస్తే మరింతగా ప్రయోజనం పొందగల్గుతాం.  ఇవన్నీ కూడా వ్యాధులను నివారించే చికిత్స  మార్గాలు కాకపోయినా, వ్యాధులు రాకుండా మన శరీరానికి అంతర్గత శక్తినిచ్చే యుక్తి వీటికి ఉంటుంది.  ఇందుకు సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.  ఆయుష్ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ను గ్రామ ప్రధాన్ లు చూడాలని నేను భావిస్తున్నాను.  ఇందులో  సమస్త సమాచారం ఉంది.   ఈ సమాచారంలోని అంశాలను మీ మీ గ్రామాల ప్రజలకు వర్తింపజేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది.  

ఆరోగ్య సేతు మొబైల్ యాప్ పై కూడా మీరంతా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.  ఓ టెలివిజన్ కార్యక్రమంలో ఓ కళాకారుడు ఆరోగ్య సేతు యాప్ ను అంగరక్షకుడిగా చెప్పడాన్ని నేను చూశాను. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఈ మొబైల్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.    

ఈ యాప్ ను మీ మొబైల్ లో చేర్చుకుంటే మీ ఇంటికిగాని,   మీ గ్రామానికి గాని కరోనా వ్యాధి సోకిన వ్యక్తి వచ్చాడా?  లేదా?  అన్న విషయం తెలిసిపోతుంది.   మీ సొంత భద్రత కోసం,  మీ గ్రామ భద్రత కోసం, అలాగే మీ చుట్టూ ఉండేవారి భద్రత కోసం  ఆరోగ్య సేతు మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి.  ఇది దీర్ఘకాలం పాటు మీకు రక్షణ కవచంగా పనిచేస్తుంది.    

మీ మీ గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ లోనూ ఆరోగ్య సేతు మొబైల్ యాప్ డౌన్ లోడ్ అయ్యేలా చూడాలని , దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీ ప్రతినిధులను నేను అభ్యర్ధిస్తున్నాను.   ఒక రకంగా చెప్పాలంటే మన భద్రతకు ఇది సేతువు లాంటిది.  

మిత్రులారా, దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న సోదరులు, సోదరీమణుల ఆరోగ్య సంరక్షణకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యాన్నిస్తోంది.  మీ ప్రతి అవసరాన్ని తీర్చేందుకు నిరంతర ప్రాతిపదికన పనిచేస్తోంది.  

టీకాలకు సంబంధించి  గతంలో అనేక రకాల సమస్యలు తలెత్తాయి.   మా ప్రభుత్వం వ్యాక్సిన్ ల సంఖ్యను పెంచడమే కాకుండా ఈ టీకాల కార్యక్రమాన్ని దేశంలోని మారుమూల ప్రాంతాలకు తీసుకు వెళ్ళింది. గతంలో గర్భిణీలు,  నవజాత శిశువులు  పౌష్టికాహార లోపానికి లోనయ్యేవారు.   అయితే ప్రధాన మంత్రి మాతృవందన యోజన ద్వారా పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు నగదు ను ఆయా మహిళల బ్యాంకు ఖాతాల్లోకి  నేరుగా బదలాయిస్తున్నాం.  

గతంలో దేశంలో మరుగుదొడ్ల స్థితి ఎలా ఉండేదో మీకు కూడా తెలుసు.   అలాగే టాయిలెట్ లు లేకపోవడంవల్ల అనేక రకాల వ్యాధులు వ్యాపించిన విషయం మీకు తెలిసిందే.  గ్రామాల్లో పేదలు అత్యుత్తమమైన ఆరోగ్య సంరక్షణను పొందేలా మేము గట్టి చర్యలు తీసుకుంటున్నాం.   ఇందుకోసం అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.  ఆయుష్మాన్ భారత్ యోజన గ్రామాల్లోని పేదలకు ఎంతో ఉపశమనం కలిగించింది.  ఈ పథకం లో దాదాపు కోటి మంది పేద రోగులు ఆసుపత్రుల్లో చికిత్సను ఉచితంగానే పొందారు.  

ఆసుపత్రుల కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రుల నిర్మాణానికి ఈ పథకం ఎంతగానో తోడ్పడింది.   దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో 1.5 లక్షల హెల్థ్ అండ్ వెల్ నెస్  కేంద్రాలను నిర్మించే ప్రయత్నాలను ప్రభుత్వం చేపట్టింది.  ఈ కేంద్రాల్లో అనేక రకాల తీవ్ర వ్యాధులకు పరీక్షలు నిర్వహించడానికి, చికిత్స చేయడానికి సదుపాయాలను అందించడం జరుగుతోంది.  

ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో గ్రామాలను సర్వ సన్నద్ధం చేశాయి.   మీ ఉమ్మడి ప్రయత్నాలతో, మీ సంఘీభావంతో,  మీ పట్టుదలతో మీరంతా కలసి కరోనాను తప్పక ఓడించగలరన్న నేను భావిస్తున్నాను.  

ఈ నమ్మకంతోనే, ఈ ముఖ్యమైన పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్బం లో నా స్నేహితులందరికీ నేను మరో సారి శుభాకాంక్షలు చెప్తున్నాను.  మీకు, మీ కుటుంబానికి,  మీ గ్రామ ప్రజలకు పూర్తి ఆయురారోగ్యాలు దక్కాలని నేను ఆకాంక్షిస్తున్నాను.  ఎంతో సమయాన్ని వెచ్చించి, నాకు అనేక విషయాలను తెలియజేసినందుకు మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  ఈ సమావేశం ద్వారా నాకు కొత్త సమాచారం చాలా తెలిసింది.  అలాగే మీ నమ్మకం గురించి కూడా నాకు తెలిసింది.  

మీ అందరికీ మరోసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను.  

నమస్కారం.  


 

***


(Release ID: 1694724) Visitor Counter : 520