ఆర్థిక మంత్రిత్వ శాఖ

పేదరిక నిర్మూలన కోసం ఆర్థికాభివృద్ధిపై దృష్టి పెట్టడాన్ని భారత్‌ కొనసాగించాలి: ఆర్థిక సర్వే 2020-21

భారత్‌లోని సామాజిక-ఆర్థిక సూచికలతో సమాన సంబంధాలను చూపిన ఆర్థికాభివృద్ధి, అసమానతలు

Posted On: 29 JAN 2021 3:41PM by PIB Hyderabad

"ప్రస్తుత అభివృద్ధి దశలో, స్థూల అభివృద్ధిని పెంచడం ద్వారా ప్రజలను పేదరికం నుంచి బయటపడేసేందుకు ఆర్థికాభివృద్ధి కోసం చేసే కృషిని భారతదేశం కొనసాగించాలి". దేశంలో ఆర్థికాభివృద్ధి ప్రాధాన్యతను ఈ విధంగా స్పష్టీకరిస్తూ, ఆర్థిక సర్వే 2020-21ని  కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

    అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో గమనించిన అంశాలను బట్టి చూస్తే; భారత్‌లో ఒకవైపు అసమానతలు, సామాజిక-ఆర్థిక ఫలితాల మధ్య సంబంధం, మరోవైపు ఆర్థికాభివృద్ధి, సామాజిక-ఆర్థిక ఫలితాల మధ్య సంబంధం భిన్నంగా ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల తరహాలో కాక, భారతదేశంలో సామాజిక-ఆర్థిక సూచికలపై వాటి ప్రభావాల పరంగా ఆర్థికాభివృద్ధి, అసమానతలు కలుస్తున్నాయని వెల్లడించింది.

    దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజల ఆరోగ్యం, విద్య, ఆయుర్దాయం, శిశు మరణాలు, జనన, మరణ, సంతానోత్పత్తి శాతాలు, నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, మానసిక ఆరోగ్యం వంటి సామాజిక-ఆర్థిక సూచికల ఆధారంగా అసమానతలు, తలసరి ఆదాయం మధ్య సంబంధాన్ని పరిశీలించడం ద్వారా ఆర్థిక సర్వే ఈ విషయాన్ని నిర్ధరించింది. సామాజిక-ఆర్థిక సూచికలతో ఆర్థికాభివృద్ధి, అసమానతలు సమాన సంబంధాలు కలిగి ఉన్నాయని ఈ విశ్లేషణ వెల్లడించింది. "అసమానతల కంటే పేదరిక నిర్మూలనపైనే ఆర్థికాభివృద్ధి ఎక్కువ ప్రభావం చూపుతుందని" ఈ విశ్లేషణ ఆధారంగా ఆర్థిక సర్వే గమనించింది. రాష్ట్ర స్థాయుల్లో నమోదైన తలసరి ఆదాయం ఆర్థికాభివృద్ధిని వెల్లడిస్తుంది.

    ఆర్థికాభివృద్ధి, అసమానతల మధ్య జరిగిన బలమైన సంఘర్షణను ప్రపంచ మేధావులు నొక్కివక్కాణించారని ఆర్థిక సర్వే వెల్లడించింది. కొవిడ్‌-19 నేపథ్యంలో అసమానతలపై తప్పనిసరిగా దృష్టి పెట్టడం వల్ల, ఆర్థికాభివృద్ధి-అసమానతల మధ్య ఘర్షణ మరోసారి సంబంధితంగా మారుతుందని ప్రస్తుత ఆర్థిక సర్వే గమనించింది. 

    ఏదిఏమైనా, ప్రస్తుత అభివృద్ధి దశలో ఉన్న తేడాలు, భారతదేశ అధిక ఆర్ధికాభివృద్ధికి ఉన్న అవకాశం, అధిక సంపూర్ణ పేదరికం దృష్ట్యా, అసమానతలపై దృష్టిసారించే విధాన లక్ష్యం భారత్‌ ఉన్న సందర్భానికి వర్తించదని ఆర్థిక సర్వే పేర్కొంది. అలాగే, ఈ సంఘర్షణకు భారత్‌, చైనా ఉదాహరణలు సవాళ్లుగా ఉన్నాయి. అధిక ఆర్థికాభివృద్ధి దృష్ట్యా, ఈ రెండు దేశాల ప్రగతి పథాలు పేదరికంలో గణనీయమైన తగ్గింపును చూపించాయని సర్వే వెల్లడించింది.

    వృద్ధి విధానంపై దృష్టి పెట్టడం అనే అంశం పునఃపంపిణీ లక్ష్యాలకు ప్రాధాన్యత లేదని సూచించదని, స్థూల ఆర్థికాభివృద్ధి పరిమాణం పెరిగితే, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మాత్రమే పునఃపంపిణీ సాధ్యమవుతుందని ఆర్థిక సర్వే తేల్చింది.

    అభివృద్ధి సామర్థ్యం ఎక్కువగా ఉండి, పేదరిక నిర్మూలన కూడా ముఖ్యమైన దృష్టాంతంలో, కనీసం ఊహించదగిన భవిష్యత్తు కోసమైనా స్థూల ఆర్థిక వృద్ధిని పరిమాణాన్ని వేగంగా పెంచడంపై దృష్టిని కొనసాగించాలని భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక సర్వే 2020-21 సిఫారసు చేసింది.

 

***


(Release ID: 1693422) Visitor Counter : 1131