రాష్ట్రప‌తి స‌చివాల‌యం

11వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను వర్చువల్‌ విధానంలో జరుపుకున్న భారత రాష్ట్రపతి

Posted On: 25 JAN 2021 12:32PM by PIB Hyderabad

భారత ఎన్నికల కమిషన్ ఈ రోజు (జనవరి 25, 2021) నిర్వహిస్తున్న 11 వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో  భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ వర్చువల్ విధానంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి 2020-21 సంవత్సరానికి జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్ రేడియో ‘హలో ఓటర్స్‌’-ఆన్‌లైన్ డిజిటల్ రేడియో సర్వీస్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ  జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విలువైన ఓటు హక్కును మనం ఎప్పుడూ గౌరవించాలన్న విషయాన్ని  గుర్తు చేశారు. ఓటు హక్కు సాధారణ హక్కు కాదని.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీని కోసం చాలా కష్టపడ్డారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మన రాజ్యాంగం  మతం, జాతి, కులం ఆధారంగా ఎటువంటి వివక్ష లేకుండా పౌరులందరికీ సమాన ఓటు హక్కును ఇచ్చిందని..అందుకోసం మన రాజ్యాంగ రూపకర్తలకు రుణపడి ఉంటామని చెప్పారు.

భారత రాజ్యాంగం యొక్క ప్రధాన రూపకర్త బాబాసాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఓటు హక్కును అత్యంత ముఖ్యమైనదిగా భావించారు. అందువల్ల, మొదటిసారి ఓటు హక్కును పొందడం, తమ ఓటు హక్కును అత్యంత చిత్తశుద్ధితో ఉపయోగించడం మరియు ఇతరులను కూడా ప్రేరేపించడం మనందరి బాధ్యత ముఖ్యంగా మన యువతది అని రాష్ట్రపతి తెలిపారు.

గత ఏడాది కోవిడ్ -19 మహమ్మారి సందర్భంలో కూడా  బీహార్, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లలో విజయవంతంగా సురక్షితంగా ఎన్నికలు నిర్వహించినందుకు భారత ఎన్నికల సంఘాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు. ఇది మన ప్రజాస్వామ్యం యొక్క అసాధారణమైన విజయమని అన్నారు. అందరి సహకారంతో సజావుగా, సురక్షితంగా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ అనేక వినూత్న  చర్యలు తీసుకున్నట్లు రాష్ట్రపతి తెలిపారు.

భారతదేశ ఎన్నికల కమిషన్ ఏర్పడిన జనవరి 25, 1950 తేదీకి గుర్తుగా  2011 నుండి ప్రతి సంవత్సరం జనవరి 25 న దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా  కొత్త ఓటర్ల నమోదును ప్రోత్సహించడం, నమోదును సులభతరం చేయడం మరియు పెంపొందించడం జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దేశ ఓటర్లకు అంకితం చేయబడిన ఈ రోజు ఓటర్లలో అవగాహన పెంచడానికి మరియు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగించబడుతుంది.

రాష్ట్రపతి ప్రసంగాన్ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

***



(Release ID: 1692261) Visitor Counter : 406