ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్ అనంతరం ఈశాన్య ప్రాంతం పర్యాటక మరియు వాణిజ్య గమ్యస్థానంగా ఉంటుంది: డాక్టర్ జితేంద్ర సింగ్

ముగిసిన నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ 69వ ప్లీనరీ

Posted On: 24 JAN 2021 4:17PM by PIB Hyderabad

జనవరి 23, 2021న కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించిన నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ 69 వ ప్లీనరీ ఈ రోజు విజయవంతంగా ముగిసింది.


రెండు రోజుల ఎన్‌ఇసి ప్లీనరీ ఈశాన్య ప్రాంతానికి సంబంధించిన  అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించింది.  ఈ ప్రాంతంలో అమలు చేయబడ్డ  వివిధ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటివరకు సాధించిన పురోగతి గురించి చర్చించింది. అలాగే పెట్టుబడుల అభివృద్ది మరియు ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరచడంపై కూడా సమావేశంలో ప్రముఖంగా చర్చజరిగింది. వివిధ సాంకేతిక సమావేశాలలో ఈశాన్యంలో జీవనోపాధి, వ్యవస్థాపకత, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ మరియు ఇతర రంగాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్రీకృతమై చర్చ సాగింది.

కేంద్ర సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్), నార్త్ ఈస్టర్న్ రీజియన్ అభివృద్ధి , ప్రధానమంత్రి కార్యాలయ మంత్రిత్వశాఖ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్షశాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..ఇతర రాష్ట్రాలకు సమానంగా ఈశాశ్య ప్రాంతం అభివృద్ధి చెందడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన అభివృద్ధి ప్రణాళికను వివరించారు.

గత ఆరు ఏడు సంవత్సరాలలో ప్రధానమంత్రి నాయకత్వంలో ఈశాన్యప్రాంతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా ఏకగ్రీవ అభిప్రాయం ఉందన్నారు. ఈ విషయంలో చాలా ఆకాంక్షలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు సాధించిన దానికంటే ఎక్కువ సాధించాలని ప్రధాని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాలు మరియు వివిధ మంత్రిత్వ శాఖల అంకితభావంతో ఈశాన్య రాష్ట్రాలు సమీప భవిష్యత్తులో అన్ని సవాళ్లను అధిగమించగలవని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. వాస్తవానికి మంత్రిత్వ శాఖ సహచరులు మరియు అందరి సహాయంతో  అంచనాలకు మించి అభివృద్ధి సాధించగలుగుతున్నందుకు గర్వపడుతున్నానని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల ఉన్నతాధికారులు చేసిన ప్రెజెంటేషన్లను డాక్టర్ జితేంద్ర సింగ్ ఆసక్తిగా విన్నారు. అనంతరం ఈశాన్య రాష్ట్రాలకు సాధ్యమైనంత సహాయం అందించాలని మంత్రిత్వ శాఖల కార్యదర్శులను కోరారు.

కరోనా సంక్షోభం అనంతరం మిగతా ప్రపంచం వాణిజ్యం ద్వారా  ఆర్థిక పునరుజ్జీవం కోసం చూస్తున్నప్పుడు, ఈశాన్య ప్రాంతం భారతదేశ అభివృద్ది కథకు నాయకత్వం వహిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. కోవిడ్ -19 తరువాత భారతదేశ వ్యాపార గమ్యస్థానాలలో ఈశాన్య ప్రాంతం ఒకటిగా ఉంటుందని, ఆర్థిక కార్యకలాపాలకు వెదురు కీలక స్తంభం కానుందని డాక్టర్ సింగ్ అన్నారు. అయినప్పటికీ కోవిడ్ అనంతర కాలంలో నార్త్ ఈస్ట్ కలిగి ఉన్న అనుకూలమైన పరిస్థితిని వాడుకోవటానికి అన్ని రాష్ట్రాలు తమను తాము సన్నద్ధం చేసుకోవాలని ఆయన కోరారు.

పథకాల ప్రయోజనాలు చివరి వ్యక్తి వరకూ చేరేలా వివిధ మంత్రిత్వ శాఖలు వాటికి కేటాయించిన నిధులను ఉపయోగించుకోవాలని అన్ని రాష్ట్రాలను మంత్రి కోరారు. ఎన్‌ఇసి కింద నిధుల వినియోగ శాతం ప్రోత్సాహకరంగా ఉందని, ఈ ప్రాంతానికి కేటాయించిన ఇతర మంత్రిత్వ శాఖల నిధులను కూడా అవసరమైనంతమేర వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి అన్నారు.

***


(Release ID: 1692020) Visitor Counter : 166