ప్రధాన మంత్రి కార్యాలయం
దేశ వ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
కరోనాకు భారత్ స్పందన ఆత్మవిశ్వాసం,స్వావలంబనతో కూడుకున్నది : ప‌్రధానమంత్రి
ఇంత భారీ స్థాయి వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రపంచం మున్నెన్నడూ చూడలేదు: ప‌్రధానమంత్రి
కరోనాకు భారత స్పందనను అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది: ప‌్రధానమంత్రి
కరోనాపై ముందువరుసలో నిలబడి పోరాడిన వారందరికీ అభినందనలు : ప‌్రధానమంత్రి
Posted On:
16 JAN 2021 12:19PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫెరిన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ప్రపంచంలోకెల్లా ఇది అత్యంత పెద్ద కార్యక్రమం. దేశ వ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 3006 సెషన్ కేంద్రాలను ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా వర్చువల్‌గా అనుసంధానం చేశారు.
వాక్సిన్ అభివృద్ధిలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేస్తూ ప్రధానమంత్రి కోవిడ్ -19 వాక్సినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. సాధారణంగా వాక్సిన్ తయారీకి సంవత్సరాలు పడుతుందని, కానీ స్వల్ప వ్యవధిలో ఒకటి కాదు రెండు భారత్‌లో తయారైన వ్యాక్సిన్‌లు ప్రారంభించడం జరుగుతోందని ఆయన అన్నారు. ప్రజలు రెండు డోసుల వాక్సిన్ తీసుకోవడం మరచిపోవద్దని ప్రధానమంత్రి సూచించారు. రెండు డోసుల మధ్య ఒక నెల వ్యవధి ఉంటుందని ఆయన చెప్పారు. వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటూ, రెండో డోస్ తీసుకున్న రెండు వారాల అనంతరం మాత్రమే మానవ శరీరం కరోనాకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని సంతరించుకో గలుగుతుందని ఆయన అన్నారు.
వాక్సినేషన్ ప్రక్రియ మున్నెన్నడూ లేనంతటి స్థాయిలో జరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, తొలి దశలోనే మూడు కోట్ల మంది ప్రజలకు వాక్సిన్ వేస్తున్నట్టు చెప్పారు.ఇది ప్రపంచంలోని సుమారు 100 దేశాల జనాభా కంటే ఎక్కువ అని ఆయన అన్నారు. రెండో దశలో దీనిని 30 కోట్లకు తీసుకువెళతామని, ఇందులో తీవ్ర ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వయోధికులకు వాక్సిన్ వేస్తామన్నారు. 30 కోట్ల కంటే అధిక జనాభా క లిగిన దేశాలు ఇండియా, అమెరికా, చైనా లు మాత్రమే నని ఆయన అన్నారు.
ప్రజలు వాక్సిన్ కు సంబంధించి న పుకార్లను,కుట్ర సిద్ధాంతాలను ఏమాత్రం నమ్మవద్దని ప్రధానమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. భారతదేశ శాస్త్రవేత్తలు, వైద్యవిధానాలు, భారతీయ ప్రక్రియలు, వ్యవస్థాగత యంత్రాంగం వంటివి అంతర్జాతీయంగా విశ్వసనీయత కలిగినవని , ఈ విశ్వసనీయత మన స్థిరమైన ట్రాక్‌రికార్డ్‌తో సంపాదించుకున్నది.
కరోనాపై పోరాటంలో దేశ ప్రజలు అసమానధైర్యసాహసాలతో పోరాటం సాగించారని ప్రధానమంత్రి కొనియాడారు. కరోనాపై పోరాటంలో భారత స్పందన ఆత్మవిశ్వాసానికి, స్వావలంబనకు సంబంధించనదని ప్రధానమంత్రి అన్నారు. ప్రతి భారతీయుడిలో గల ఆత్మ విశ్వాసం పట్టుసడలకుండా చూడాలన్నది సంకల్పమని అన్నారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, అంబులెన్సు డ్రైవర్లు, ఆషా వర్కర్లు, శానిటేషన్ వర్కర్లు, పోలీసు, ఇతర ఫ్రంట్‌లైన్ సిబ్బంది ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టారని ఆయన అన్నారు. వీరిలో కోందరు కరోనాపై పోరాటంలో తమ ఇంటికి కూడా తిరిగి వెళ్లలేదని, వారు ప్రాణాలు కోల్పోయారని ప్రధానమంత్రి అన్నారు. కరోనాపై పోరాటంలో ముందువరుసలో నిలిచిన యోధులు ఇవాళ నిరాశ, భయపూరిత వాతావరణాన్ని దూరం చేశారని ప్రధానమంత్రి కొనియాడారు. ఇలాంటి వీరికి ముందుఆ వాక్సిన్ వేయించడం ద్వారా దేశం వారి సేవలను కృతజ్ఞతాపూర్వకంగా గుర్తించినట్టు అని ప్రధానమంత్రి అన్నారు.
కరోనా మహమ్మారి సంక్షోభానికి సంబంధించిన తొలి రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ ప్రధానమంత్రి, భారతదేశం సంకాలంలో అప్రమత్తమై స్పందించిందని,సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నదని అన్నారు. ఇండియాలో తొలికేసు గుర్తించిన 30 జనవరి 2020 కి రెండు వారాల ముందే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి ఏడాది ముందే ఇండియా నిఘా ప్రారంభించింది. 2020 జనవరి 17న ఇండియా తొలి అడ్వయిజరీని జారీచేసింది. అలాగే విమానాశ్రయాలలో ప్రయాణికులను తనిఖీ చేసిన తొలిదేశాలలో ఇండియా ఉందని ప్రధానమంత్రి అన్నారు.
జనతాకర్ఫ్యూ సమయంలో ప్రజలు క్రమశిక్షణ, సహనానికి సంబంధించిన సవాలును పాస్ అయ్యారని ప్రజలను ప్రధాని అభినందించారు. ఇది ప్రజలను మానసికంగా లాక్‌డౌన్‌కు సిద్ధం చేసిందని ప్రధానమంత్రి అన్నారు.దీపాలు వెలిగించడం, ఫ్రంట్‌లైన వర్కర్లకు మద్దతుగా చప్పట్లు కొట్టడం వంటివి దేశ ప్రజల మనోధైర్యాన్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్లాయని ఆయన అన్నారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో విదేశాలలో చిక్కుకున్న వారిని తరలించడం గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. ప్రపంచంలోని చాలాదేశాలు చైనాలో చిక్కుకున్న తమ ప్రజలను అక్కడే వదిలివేస్తే భారతదేశం భారతీయ పౌరులను మాత్రమే కాక , ఇతర దేశాల ప్రజలను కూడా అక్కడి నుంచి సురక్షితంగా తీసుకువచ్చిందని ఆయన అన్నారు. తమ దేశం నుంచి తరలించే భారతీయులకు పరీక్షలు నిర్వహించడం కష్టంగా ఉందని భావించిన దేశానికి మన దేశం ఒక ప్రయోగశాలనే తరలించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు.
కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశ ప్రతిస్పందనను ప్రపంచం గుర్తించిందని ప్రధానమంత్రి అన్నారు. ఇది కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక సంస్థలు అన్నీ ఒక్కతాటిపై కలిసిపనిచేయడానికి చక్కటి ఉదాహరణగా నిలుస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
ప్రధానమంత్రి తన ప్రసంగం అనంతరం ఒక ట్వీట్ చేస్తూ,భారతదేశం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది, ఇది గర్వకారణమైన రోజు.ఇది మన శాస్త్రవేత్తల , కష్టపడి పనిచేసే మన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పోలీసుల, పారిశుధ్యకార్మికుల శక్తిసామర్ధ్యాలను కొనియాడుతూ ఉత్సవం జరుపుకోవడం . అందరూ ఆరోగ్యంగా, అనారోగ్యానికి దూరంగా ఉండుదురు గాక అంటూ ఈ సందర్భంగా ఆయన సార్వజనీన ఆరోగ్యం, సంతోషానికి ,దుః ఖం నుంచి విముక్తికి సంబంధించిన వేదసూక్తిని ప్రస్తావించారు..
सर्वेभवन्तुसुखिनःसर्वेसन्तुनिरामया।
सर्वेभद्राणिपश्यन्तुमाकश्चित्दुःखभाग्भवेत्।।
***
(Release ID: 1689045)
Visitor Counter : 380
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam