వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పంటల బీమా పథకం పి.ఎం.ఎఫ్.బి.వై.కి ఐదేళ్లు 2021 జనవరి 13తో ఐదేళ్లు పూర్తి
విభిన్న కారణాలతో సంభవించే పంటనష్టాలపై
రైతులకు బీమా ప్రయోజనం పథకం ప్రత్యేకత
Posted On:
12 JAN 2021 3:26PM by PIB Hyderabad
దేశంలోని రైతుల పంటల బీమా రిస్క్ కవరేజీని బలోపేతం చేసేందుకు ఐదేళ్ల కిందట భారత ప్రభుత్వం ఒక చారిత్రాత్మక చర్యను చేపట్టింది. పంటల బీమా రూపంలో పరిహారం చెల్లించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పి.ఎం.ఎఫ్.బి.వై.) పేరిట ఒక ప్రధాన పథకాన్ని 2016 జనవరి 13న భారత ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దేశవ్యాప్తంగా రైతులనుంచి ఒకే రకమైన అతి తక్కువ ప్రీమియంతో నష్ట పరిహారానికి ఒక సమగ్ర పరిష్కారం అందించే ప్రధాన సాధనంగా దీన్ని తీర్చిదిద్దారు. రైతుల ప్రయోజనాలకు పరిరక్షణకు భారత ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉంది. ఈ పథకం కింద, ప్రీమియంలో రైతు వాటా కంటే ఎక్కువ మొత్తాన్ని రాష్ట్రాలు, భారత ప్రభుత్వం కలసి సమానంగా సబ్సిడీల రూపంలో చెల్లిస్తాయి. ఈశాన్య ప్రాంతాల్లోని రాష్ట్రాల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రీమియం 90శాతాన్ని భరిస్తోంది. పథకానికి ప్రోత్సాహం అందించేందుకు భారత ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
పి.ఎం.ఎఫ్.బి.వై.కి ముందు హెక్టారుకు చెల్లించే సగటు బీమా మొత్తాన్ని రూ. 15,100 నుంచి రూ. 40,700కు పెంచారు. పంట సీజన్ మొత్తానికి పూర్తిస్థాయిలో వర్తించేలా ఈ పథకాన్ని రూపొందించారు. పంటనాట్లు పడటానికి మందు దశనుంచి పంటల నూర్పిళ్లు జరిగే కోతదశ వరకూ బీమా రూపంలో నష్టపరిహారం ప్రయోజనం రైతులకు లభించేలా చర్యలు తీసుకున్నారు. వైపరీత్యాలవల్ల నాట్లకు జరిగే నష్టంతోపాటుగా పంటకాలం మధ్యలో వచ్చే ప్రతికూలతల్లో నష్టం జరిగినా రైతులకు బీమా ప్రయోజనం అందేలా చర్యలు తీసుకున్నారు. సహజంగా జరిగే అగ్నిప్రమాదాలు, వరదనీటి ముంపు, మేఘాల విస్ఫోటనం, పిడుగుపాటు తదితర ప్రమాదాలకు కూడా ఈ బీమా వర్తిస్తుంది.
2019 ఖరీఫ్ సీజన్లో దుర్భిక్షం కారణంగా పంటనాట్లు పడని కారణంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో రూ. 500కోట్ల రూపాయలమేర బీమా క్లెయిమును రైతులు పొందగలగడం ఈ పథకం ప్రత్యేకతగా చెప్పవచ్చు. అలాగే 2018 ఖరీఫ్ సీజన్లో హర్యానాలో వడగండ్ల వాన, పంట సీజన్ మధ్యలో ప్రతికూలతల కారణంగా వందకోట్ల రూపాయలమేర నష్టపరిహారాన్ని బీమా రూపంలో చెల్లించారు. 2019-20 రబీ సీజన్లో మిడుతల దండు దాడితో జరిగిన నష్టానికి రాజస్థాన్ రాష్ట్రంలో దాదాపు రూ. 30కోట్లమేర పరిహారం చెల్లించారు. అలాగే,..2019 ఖరీఫ్ సీజన్లో అకాల వర్షాలు తెచ్చిన పంట నష్టానికి మహారాష్ట్రలో ఏకంగా రూ. 5,000 కోట్లవరకూ క్లెయిములు చెల్లించారు.
పి.ఎం.ఎఫ్.బి.వై.కి చెందిన వెబ్ పోర్టల్ తో,.. భూమి రికార్డులను సమీకృతం చేయడం, రైతులను సులభంగా నమోదు చేసుకునేందుకు పంటల బీమా మొబైల్ యాప్,.. పంట నష్టాల అంచనాకు ఉపగ్రహ ఛాయా చిత్రాలు, రిమోట్ సెన్సింగ్, డ్రోన్లు, కృత్రిమ మేధో పరిజ్ఞానం, యంత్రపరికరాల సహాయం.. తదితర అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వంటివి ఈ పథకంలో కీలకమైన ప్రత్యేకతలు. తమకు జరిగిన పంట నష్టం గురించి రైతులు 72గంటల్లోగా తెలియజెప్పేందుకు పంటల బీమా యాప్ ద్వారా ఈ పథకం అవకాశం కల్పిస్తోంది. అలాగే, కామన్ సర్వీస్ సెంటర్ల (సి.ఎస్.సి.ల) ద్వారా, లేదా సమీపంలోని వ్యవసాయ అధికారి ద్వారా పంటనష్టంపై 72గంటల్లోగా తెలియజెప్పవచ్చు.
ఎప్పటికప్పుడు పథకాన్ని మెరుగుపరిచేందుకు, ఈ పథకాన్ని అన్ని రకాల రైతులకూ స్వచ్ఛందంగా వర్తింపజేశారు. 2020 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని సమూలంగా ప్రక్షాళన చేశారు. బీమా మొత్తాన్ని హేతుబద్ధంగా రూపొందించేందుకు రాష్ట్రాలకు కూడా వెసులుబాటు కల్పించారు. తద్వారా ఈ పథకంనుంచి తగిన ప్రయోజనాన్ని రైతులు పొందేందుకు వీలు కల్పించారు.
సంవత్సరానికి 5.5కోట్ల మంది రైతుల దరఖాస్తులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఇప్పటికే రూ. 90,000కోట్ల మేర క్లెయిముల చెల్లింపు జరిగింది. క్లెయిము మొత్తాలను నేరుగా రైతుల ఖాతాలకు జమచేసేందుకు ఆధార్ నంబర్ సీడింగ్ వీలు కల్పించింది. కోవిడ్ లాక్ డౌన్ సంక్షోభ సమయంలో కూడా 70లక్షల మంది రైతులు బీమా ప్రయోజనం పొందారు. రూ. 8,741.30 కోట్ల మేర క్లెయిము మొత్తం రైతుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ జరిగింది.
రైతులు తమ కష్టకాలంలో, సంక్షోభ సమయంలో స్వయంసమృద్ధిగా ఎదిగి నిలిచేందుకు ఈ పథకం ప్రయోజనాలను సానుకూలంగా వినియోగించుకోవాలని, ఆత్మనిర్భర కిసాన్ అన్న లక్ష్య సాధనకు దోహదపడాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది.
*****
(Release ID: 1688081)
Visitor Counter : 522