ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వాక్సిన్ పంపిణీ

8న జరగాల్సిన నమూనా వాక్సిన్ పంపిణీపై రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యమంత్రి సమీక్ష

33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 736 జిల్లాల్లో రెండోవిడత నమూనా టీకాలు

టీకాలమీద పుకార్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ హర్ష వర్ధన్ పిలుపు

పోలియో రహిత భారత్ స్థితి కొనసాగింపుకు17న జాతీయ టీకాల దినోత్సవం

Posted On: 07 JAN 2021 5:10PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈరోజు రాష్ట్రాల ఆరోగ్య శాఖామంత్రులు, ప్రిన్సిపల్ కార్యదర్శులు/అదనపు కార్యదర్శులతో సంభాషించి ఈ నెల 8న ( శుక్రవారం) జరగాల్సిన రెండోవిడత జాతీయ స్థాయి నమూనా కోవిడ్ టీకాల కార్యక్రమానికి సంసిద్ధతను సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ నమూనా కార్యక్రమాన్ని అందరూ వ్యక్తిగతంగా దగ్గర ఉండి పర్యవేక్షించాలని కోరారు.  మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్కొక్క జిల్లాలో మూడేసి చోట్ల జరిగేలా 736 జిల్లాలను ఇందుకోసం ఎంపిక చేశారు.

వాస్తవంగా పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో టీకాలిచ్చే సమయంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించటం, అందుకు తగినట్టుగా కార్యాచరణలో మార్పులు చేసుకోవటం ఈ నమూనా టీకాల కార్యక్రమం లక్ష్యం. లబ్ధిదారు రిజిస్ట్రేషన్ మొదలుకొని టీకా ఇచ్చేచోట అందుబాటులో ఉండాల్సిన సౌకర్యాలు లాంటివి కలెక్టర్, తదితర అధికారుల పర్యవేక్షణలో పరిశీలిస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఏయే అధికారులకు ఎలాంటి పాత్ర అప్పగించాలో కూడా ఒక అవగాహనకు రావటానికి వీలవుతుంది. ప్రణాళికకు, అమలుకు మధ్య అంతరాన్ని పూర్తిగా తగ్గించటానికి అధికారులకు వెసులుబాటు కలుగుతుంది. ఇంకేవైనా సవాళ్ళు మిగిలిపోయి ఉంటే వాటికి తగిన పరిష్కారమార్గాలు రూపొందించుకోవచ్చు. ఆ విధంగా మొత్తం కోవిడ్ టీకాల  కార్యక్రమం సాఫీగా సాగటానికి వీలవుతుంది.

త్రిపుర ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖామంత్రి అయిన శ్రీ విప్లవ్ కుమార్ దేవ్, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖామంత్రి, ఉపముఖ్యమంత్రి శ్రీ ఆళ్ల కాళీ కృష్ణప్రసాద్, గుజరాత్ ఉపముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి అయిన శ్రీ నితిన్ భాయ్ పటేల్, బీహార్ ఆరోగ్య మంత్రి శ్రీ మంగళ్ పాండే, సిక్కిం ఆరోగ్య మంత్రి డాక్టర్ ఎంకె సర్మ, తమిళనాడు ఆరోగ్య మమ్త్రి డాక్టర్ సి. విజయ్ భాస్కర్, తెలంగాణ ఆరోగ్యశాఖామంత్రి శ్రీ ఈటెల రాజేందర్, మహారాష్ట ఆరోగ్యమంత్రి శ్రీ రాజేశ్ తోపే, మణిపూర్ ఆరోగ్యమంత్రి శ్రీ ఎల్. జయంతకుమార్ సింగ్,కేరళ ఆరోగ్య మంత్రి శ్రీమతి కెకె శైలజ,  గోవా ఆరోగ్య మంత్రి శ్రీ విశ్వజిత్ రాణే, కర్నాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కేశవరెడ్డి సుధాకర్, చత్తీస్ గఢ్ ఆరోగ్య మంత్రి డాక్టర్ టి ఎస్ సింగ్ దేవ్, ఢిల్లీ ఆరోగ్యమంత్రి శ్రీ సత్యేంద్ర కుమార్ జైన్, మధ్యప్రదేశ్ ప్రజారోగ్య శాఖామంత్రి డాక్టర్ ప్రభురామ్ చౌధురి, రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ రఘుశర్మ, ఒడిశా పంచాయితీరాజ్ శాఖామంత్రి శ్రీ ప్రతాప్ జెనా, అస్సాం ఆరోగ్యశాఖ సహాయమంత్రి శ్రీ పీజూష్ హజారికా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

డాక్టర్ హర్ష వర్ధన్ తన ప్రసంగం ప్రారంభిస్తూ, దేశం కోవిడ్ మీద విజయవంతమైన పోరాటానికి ఏడాది పూర్తి చేసుకున్నదని, గత జనవరి 8 నాడే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఉమ్మడి పర్యవేక్షక బృందం సమావేశమైందని గుర్తు చేశారు.  క్షేత్ర స్థాయిలో పనిచేసిన కోవిడ్ యోధుల సేవలను ఆయన మరొకసారి గుర్తుచేసుకొని అభినందనలు తెలియజేశారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ అత్యుత్తమ స్థాయిలో కోవిడ్ నుంచి కోలుకోవటంతో బాటు ఇతర దేశాలకు సైతం మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ఎన్ 95 మాస్కులు, పిపిఇ కిట్స్ కోసం భారత్ పై ఆధారపడిన దేశాలకు అండగా నిలిచిందన్నారు. ప్రధాని సారధ్యంలో దేశం ఆత్మ నిర్భర్ వైపుగా పయనించటాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు.

కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, వైద్య సిబ్బంది అవిశ్రాంతంగా సానుకూల దృక్పథంతో  నెలల తరబడి సాగించిన కృషిని డాక్టర్ హర్ష వర్ధన్  ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎప్పటికప్పుడు జారీచేస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవటం రాబోయే టీకాల కార్యక్రమంలో కూడా ప్రదర్శించాలని కోరారు. అవిశ్రాంతంగా కృషి చేసి దేశం తరఫున రెండు కోవిడ్ టీకాలు రూపొమ్దించిన శాస్త్రవేత్తలను కూడా మంత్రి అభినందించారు.  

కోవిడ్ టీకామందు నిల్వ, వాటి నిల్వ ఉష్ణోగ్రత, లబ్ధిదారుల వ్యక్తిగత సమాచారంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా రూపొందించిన కో-విన్ డిజిటల్ వేదిక ప్రాధాన్యాన్ని మంత్రి ఈ సందర్భంగా వివరించారు.  అన్ని స్థాయిలలోనూ సంబంధిత అధికారులకు ఈ సమాచారం అందుబాటులో ఉంచటం దీని లక్ష్యమని చెప్పారు. ముందుగా నమోదు చేసుకున్న లబ్ధిదారుల సమాచారం తెలుసుకోవటానికి, సరిచూడటానికి, టీకా ఇచ్చాక డిజిటల్ ధ్రువపత్రం జారీచేయటానికి పనికొస్తుందన్నారు. ఈ వేదిక మీద ఇప్పటికే 78 లక్షలమందికి పైగా లబ్ధిదారులు నమోదు చేసుకోవటాన్ని ప్రస్తావించారు.

చిట్టచివరి గ్రామం దాకా టీకామందు అందేలా దేశావ్యాప్తంగా ఉన్న శీతల గిడ్డంగి సౌకర్యాలను, స్థాయిని పెంచామని రాష్ట్రాల మంత్రులకు తెలియజేశారు. తగినన్ని సిరంజిలు అందుబాటులో ఉంచటంతోబాటు రవాణాకు కూడా ఏర్పాట్లు చేసామన్నారు. టీకాల కార్యక్రమం విజయవంతంగా నిర్వహించటంలో భారత్ కు అసాధారణమైన అనుభవమున్నదని ఇంతకు ముందు పోలియో టీకాల సమయంలో అది రుజువైందని అన్నారు. 1990 లనాటినుంచి తాను వ్యక్తిగతంగా చూసిన అంశాలను కూడా డాక్టర్ హర్ష వర్ధన్ ప్రస్తావించారు. అందరినీ చైతన్యవంతులను చేసి పోలియోను పూర్తిగా నిర్మూలించగలిగామన్నారు. ఇప్పుడు ఆ అనుభవాలే ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ జనవరి 17న జరిగే జాతీయ టీకాల దినోత్సవానికి కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాల ఆరోగ్యశాఖామంత్రులకు ఆయన సూచించారు. అదే సమయంలో కోవిడ్ సంబంధమైన సేవలకు ఏ విధమైన ఆటంకమూ కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలమీద  ఉందని గుర్తు చేశారు.  రాష్ట్రాలూ, కేంద్రమూ ఉమ్మడిగా కృషి చేస్తేనే విజయం సాధించగలమన్నారు. ఆగ్నేయాసియాలోని 11 దేశాలతో కలిసి భారత్ చేసిన ఉమ్మడి కృషి ఫలితంగానే వీటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ పొలియో రహిత దేశాలుగా గుర్తించిందని చెప్పారు. కొన్ని పొరుగుదేశాలు ఇంకా పోలియోతోబాధపడుతుండటాన్ని ఆయన్బ ప్రస్తావించారు.

కోవిడ్ టీకాల కార్యక్రమంలొ మనకున్న మానవవనరులను సమర్థంగా వాడుకోవాలని సూచించారు. శిక్షణకు అవసరమైన పాఠ్యాంశాలు కూడా రూపొందించి పంపిణీ చేయటాన్ని ఆయన ప్రస్తావించారు. అందులో టీకాలిచ్చేవారికి, పర్యవేక్షించేవారికి, వైద్యాధికారులకు విడివిడిగా తగిన సూచనలు పొందుపరచామన్నారు, వివిధ స్థాయిలలో ఆశా కోఆర్డినేటర్ల సేవలు విస్తృతంగా ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  ఐటి వేదికను క్షేత్ర స్థాయిలో పరీక్షించి సత్ఫలితాలు చూశామని చెబుతూ మొదటి నమూనా పరీక్షలో ఎదురైన అనుభవాలతో మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దినట్టు వెల్లడించారు.

వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని చెబుతూ, కొంతమంది టీకాల మీద దుష్ప్రచారం చేస్తున్నారని. అటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉందాలని హితవు చెప్పారు. అలాంటి పుకార్లను ప్రజలు నమ్మితే మనం ఎన్నో ఏళ్ళు వెనక్కు వెళతామన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. టీకాలు సురక్షితమన్న విషయం అందరిలో నమ్మకం కలిగించేట్టు చూడాలని చెప్పారు. సోషల్ మీడియా పుకార్లకు అడ్దుకట్టవేసి నిజాలకు ప్రాచుర్యం కల్పించాలన్నారు. శ్రమనంత వృధా చేసేందుకు చేసే  చిల్లర ప్రయత్నాలను అడ్డుకొవాలని కోరారు.

రాష్ట్రాల మంత్రులు తమ అబిప్రాయాలు, అనుభవాలు ఈ సందర్భంగా పంచుకున్నారు. ఇటీవలి నమూనా టీకాల కార్యక్రమంలో ఎదురైన సమస్యలను, పరిష్కరించుకున్న తీరును వివరించారు. రేపటి నమూణా టీకాల కార్యక్రమానికి సన్నద్ధంగా ఉన్నట్టు చెప్పారు. టీకాలు ఇవ్వటంలో ఇచ్చిన శిక్షణ గురించి, శీతల గిడ్దంగుల నిర్వహణ గురించి, లబ్ధిదారుల సమాచారాన్ని అప్ డేట్ చేయటం గురించి చెప్పారు. ఎప్పటికప్పుడు జిల్లాల స్థాయిలో సమీక్షలు జరుపుకోవాలని కూడా డాక్టర్ హర్ష వర్ధన్ ఈ సందర్భంగా రాష్ట్రాల మంత్రులకు సూచించారు. .

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ్, నేశనల్ హెల్త్ మిషన్ ఎండీ కుమారి వందనా గుర్నాని, ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి శ్రీ మనోహర్ అజ్ఞాని, సంయుక్త కార్యదర్శి శ్రీ లవ్ అగర్వాల్, పలువురు ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

****(Release ID: 1686934) Visitor Counter : 197