ప్రధాన మంత్రి కార్యాలయం
కొచ్చి - మంగళూరు సహజ వాయువు గొట్టపు మార్గాన్ని దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి
ఈ గొట్టపు మార్గం కేరళ, కర్నాటక ల ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది: ప్రధాన మంత్రి
నీలి ఆర్థిక వ్యవస్థ ‘ఆత్మనిర్భర్ భారత్’ కు ఒక ముఖ్య వనరు కానుంది: ప‌్రధాన మంత్రి
Posted On:
05 JAN 2021 1:11PM by PIB Hyderabad
కొచ్చి - మంగళూరు సహజ వాయువు గొట్టపు మార్గాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ కార్యక్రమం ‘ఒక దేశం, ఒక గ్యాస్ గ్రిడ్’ ఆవిష్కారం దిశ లో ఒక ముఖ్యమైన మైలురాయి ని సూచిస్తున్నది. ఈ సందర్భం లో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి తో పాటు కర్నాటక, కేరళ ల గవర్నర్ లు మరియు ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.
ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రసంగిస్తూ, ఈ రోజు కేరళ, కర్నాటక రాష్ట్రాల ప్రజలకు ఒక ముఖ్యమైన మైలు రాయి వంటిదని, ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాలు ఒక సహజ వాయువు గొట్టపు మార్గం ద్వారా జతపడుతున్నాయని ఆయన అభివర్ణించారు. ఈ గొట్టపు మార్గం ఈ రెండు రాష్ట్రాల ఆర్థిక వృద్ధి పై ఒక సకారాత్మకమైన ప్రభావాన్ని ప్రసరిస్తుందని ఆయన అన్నారు. స్వయంసమృద్ధియుత భారతదేశం లక్ష్యాన్ని సాధించాలంటే వాయువు ఆధారిత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా విస్తరించవలసిందే అని ఆయన అన్నారు. ‘ఒక దేశం ఒకే గ్యాస్ గ్రిడ్’ దిశ లో ప్రభుత్వం ముందుకు సాగడం వెనుక ఉన్న కారణం ఇది అని కూడా ఆయన పేర్కొన్నారు.
పైప్ లైను ప్రయోజనాలను గురించి ఆయన ఒక్కటొక్కటి గా వివరిస్తూ, ఇది రెండు రాష్ట్రాల లో ప్రజల ‘జీవన సౌలభ్యాన్ని’ మెరుగుపరుస్తుందని, రెండు రాష్ట్రాలలో పేదలకు, మధ్యతరగతి కి, నవ పారిశ్రామికవేత్తలకు ఖర్చులను తగ్గిస్తుందని తెలిపారు. ఈ గొట్టపు మార్గం అనేక నగరాల లో గ్యాస్ పంపిణీ వ్యవస్థ కు ఒక ఆధారం గా ఉంటుంది, అంతేకాదు ఆయా నగరాల లో సిఎన్‌జి ఆధారిత రవాణా వ్యవస్థ కు ఒక ఆధారం గా ఉంటుందన్నారు. ఈ గొట్టపుమార్గం మంగళూరు రిఫైనరీ కి శుద్ధ శక్తి ని అందిస్తుంది, ఈ రెండు రాష్ట్రాల లో కాలుష్యాన్ని తగ్గించడంలో ఒక ప్రధాన పాత్ర ను పోషిస్తుందని ఆయన అన్నారు. కాలుష్యం తగ్గడం పర్యావరణం పైన నేరు గా ప్రభావాన్ని చూపుతుందని, ఇది లక్షల కొద్దీ మొక్కలను నాటడం తో సమానం గా ఉంటుందని, దీనివల్ల ప్రజల స్వస్థత మెరుగుదల లో సాయపడడం తో పాటు, వారి ఆరోగ్య సంబంధిత ఖర్చు ను తగ్గించడానికి సైతం తోడ్పడుతుందన్నారు. కాలుష్యం స్థాయి తగ్గడం, శుద్ధమైన గాలి, మరింత మంది యాత్రికులను నగరానికి ఆకర్షించగలుగుతుందని ఆయన చెప్పారు. ఈ పైప్ లైన్ నిర్మాణం 1.2 మిలియన్ మేన్ డేస్ (ఒక రోజు లో ఒక మనిషి చేయగల పనిమొత్తాన్ని ఒక మేన్ డే గా వ్యవహరిస్తారు) ఉపాధి ని ఇచ్చిందని, అంతేకాకుండా దీని కార్యకలాపాలు ఆరంభం అయిన తరువాత ఉపాధి, స్వతంత్రోపాధిల తాలూకు ఒక కొత్త ఇకోసిస్టమ్ ఏర్పడుతుందని, అది ఎరువులు, పెట్రో రసాయనాలు, విద్యుత్తు రంగాలకు సాయపడగలదన్నారు. ఇది దేశానికి వేల కొద్దీ కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం లో సైతం భారతదేశానికి సహాయకారి కాగలుగుతుందన్నారు.
ఇరవై ఒకటో శతాబ్దం లో సంధానం పైన, శుద్ధ శక్తి పైన అత్యంత అధిక స్థాయి శ్రద్ధ ను తీసుకొనే ఏ దేశం అయినా సరే, కొత్త శిఖరాలను చేరుకొంటుంది అని ప్రపంచవ్యాప్త నిపుణులు చెబుతున్నారని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావించారు. దేశం లో సంధానం పరంగా ప్రస్తుతం జరుగుతున్న పనుల తాలూకు వేగం ఇంతకు పూర్వపు దశాబ్దాల లో ఎన్నడూ గమనింపు లోకి రాలేదని ఆయన స్పష్టం చేశారు. 2014 వ సంవత్సరం కంటే ముందు 27 ఏళ్ల లో 15,000 కిలో మీటర్ల సహజ వాయు గొట్టపు మార్గాన్ని మాత్రమే నిర్మించడం జరిగిందన్నారు. అయితే, ప్రస్తుతం దేశం అంతటా 16,000 కిలో మీటర్లకు పైబడిన సహజ వాయు గొట్టపు మార్గం తాలూకు పనులు పురోగమిస్తున్నాయని, ఈ పనులు రాబోయే అయిదారేళ్ళ లో పూర్తి అవుతాయన్నారు. సిఎస్‌జి ఇంధన కేంద్రాల సంఖ్య పెరగడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఈ ప్రభుత్వం అందించిన పిఎన్‌జి కనెక్షన్ లు, ఎల్‌పిజి కనెక్షన్ లు ఇదివరకు ఎన్నడూ చూసి ఎరుగనివి అన్నారు. పెరిగిన ఈ కనెక్షన్ లు కిరోసిన్ కొరత ను తగ్గించాయని, అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ను తాము కిరోసిన్ విముక్తం గా గా ప్రకటించుకొన్నాయని ఆయన తెలిపారు.
2014 వ సంవత్సరం నాటి నుంచి, ప్రభుత్వం చమురు, వాయువు రంగం లో వివిధ సంస్కరణల ను తీసుకు వచ్చిందని ప్రధాన మంత్రి చెప్తూ, వీటిలో అన్వేషణ, ఉత్పత్తి, సహజ వాయువు, మార్కెటింగ్, పంపిణీ వంటివి భాగం గా ఉన్నాయన్నారు. ప్రభుత్వం ‘ఒక దేశం, ఒకే గ్యాస్ గ్రిడ్’ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళిక ను వేసుకొందని, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కు మళ్ళాలని నిర్ణయించుకొందని, గ్యాస్ వల్ల పర్యావరణ పరంగా అనేక ప్రయోజనాలు ఉండడమే దీనికి కారణమన్నారు. భారతదేశ ఎనర్జి బాస్కెట్ లో సహజ వాయువు వాటా ను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడానికి ప్రభుత్వం విధానపరమైన చర్యలను చేపడుతోందని ఆయన అన్నారు. ‘‘ ‘ఒక దేశం, ఒకే గ్యాస్ గ్రిడ్’ దిశ లో పయనించే మన యాత్ర లో గెయిల్ (జిఎఐఎల్) కు చెందిన కొచ్చి - మంగళూరు సహజ వాయు గొట్టపు మార్గాన్ని దేశానికి అంకితం ఇవ్వడం అనేది ఒక భాగం గా ఉంది. ఉత్తమ భవిష్యత్తు కావాలంటే శుద్ధ శక్తి ముఖ్యం. ఈ గొట్టపు మార్గం శుద్ధ శక్తి అందుబాటు ను మెరుగుపరచడం లో సాయపడుతుంది’’ అని ప్రధాన మంత్రి వివరించారు.
దేశ భావి శక్తి అవసరాల కోసం రంగాన్ని సిద్ధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక పక్క సహజ వాయువు పై శ్రద్ధ తీసుకొంటూనే, మరోపక్క శక్తి వనరులను విస్తరించడం కూడా జరుగుతోందని ఆయన చెప్పారు. ఆయన కొన్ని ఉదాహరణలతో ఈ అంశాన్ని వివరించారు. గుజరాత్ లో ప్రపంచంలో కెల్లా అతి పెద్దదైన నవీకరణ యోగ్య శక్తి ప్లాంటు ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉందని, బయో ఫ్యూయల్స్ కు పెద్ద పీట వేయడం జరుగుతుందని తెలిపారు. బియ్యం నుంచి, చెరకు నుంచి ఇథెనాల్ ను తీసే కృషి చిత్తశుద్ధి తో జరుగుతున్నదని సభికుల దృష్టి కి ఆయన తీసుకు వచ్చారు. 10 సంవత్సరాల కాలంలో పెట్రోలు లో 20 శాతం వరకు ఇథెనాల్ ను మేళవించే లక్ష్యాన్ని పెట్టుకోవడమైందన్నారు. ప్రతి ఒక్క పౌరుని కి/ పౌరురాలి కి తక్కువ ఖర్చు లో కాలుష్యానికి చోటు ఉండనటువంటి ఇంధనాన్ని, విద్యుచ్ఛక్తి ని అందించడానికి ప్రభుత్వం కంకణం కట్టుకొందని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి కోస్తా తీర ప్రాంత రాష్ట్రాలు రెంటి ని ఉద్దేశించి ప్రసంగిస్తూనే, శీఘ్రతరమైనటువంటి, సమతుల్యమైనటువంటి కోస్తా తీర ప్రాంత అభివృద్ధి తాలూకు తన దృష్టి కోణాన్ని కూడా విడమరచి చెప్పారు. కర్నాటక, కేరళ లతో పాటు దక్షిణ భారతదేశం లోని ఇతర కోస్తా తీర ప్రాంత రాష్ట్రాలలో ‘బ్లూ ఇకానమి’ ని అభివృద్ధి చేసేందుకు ఒక విపుల ప్రణాళిక అమలులో ఉందని ఆయన అన్నారు. బ్లూ ఇకానమి ‘ఆత్మనిర్భర్ భారత్’ తాలూకు ఒక ముఖ్య వనరు కానుందని ఆయన తెలిపారు. బహుళ విధ సంధానానికి అనువైనవిగా నౌకాశ్రయాలను, కోస్తా తీర ప్రాంత రహదారులను తీర్చిదిద్దడం జరుగుతోందని ఆయన అన్నారు. మేము మన కోస్తా తీర ప్రాంతాన్ని ‘జీవించడంలో సౌలభ్యం’, ‘వ్యాపారం చేయడంలో సౌలభ్యం’ ల తాలూకు ఒక ఆదర్శ నమూనా గా తీర్చిదిద్దాలి అనే ధ్యేయం తో పని చేస్తున్నాం అని ప్రధాన మంత్రి అన్నారు.
కోస్తా తీర ప్రాంతాలలోని మత్స్యకార సముదాయాలు సాగర సంబంధిత సంపద పైన ఆధారపడి ఉండటం ఒక్కటే కాకుండా ఆ సంపద కు వారు సంరక్షకులు గా కూడా ఉన్నారు అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. దీనికి గాను, ప్రభుత్వం కోస్టల్ ఇకో సిస్టమ్ ను పరిరక్షించడానికి, సుసంపన్నం చేయడానికి అనేక చర్యలను తీసుకొంది అని ఆయన చెప్పారు. సముద్రం లో మరింత లోపలకు పోయి చేపలను పట్టుకోవడం కోసం మత్స్యకారులకు సాయపడటం, ప్రత్యేకంగా ఒక ఫిషరీస్ డిపార్టుమెంటు ను ఏర్పాటు చేయడం, చేపలు/రొయ్యల పెంపకం లో నిమగ్నమైన వారికి ‘కిసాన్ క్రెడిట్ కార్డుల’ను, చౌక రుణాలను అందించడం వంటి చర్య లు మత్స్యకారులతో పాటు నవ పారిశ్రామికులకు కూడా తోడ్పడుతూ ఉన్నాయని ఆయన వివరించారు.
ఇటీవలే ప్రారంభించిన ఇరవై వేల కోట్ల ‘మత్స్య సంపద యోజన’ కేరళ లో, కర్నాటక లో లక్షల కొద్దీ మత్స్యకారుల కు ప్రత్యక్ష ప్రయోజనాన్ని అందజేస్తుందని కూడా ప్రధాన మంత్రి తెలిపారు. మత్స్య పరిశ్రమ కు సంబంధించిన ఎగుమతుల లో భారతదేశం శరవేగం గా ముందుకుపోతోందని ఆయన అన్నారు. నాణ్యమైన శుద్ధి చేసినటువంటి సముద్ర ఆహార ఉత్పత్తుల కేంద్రం గా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి అన్ని చర్యలను తీసుకోవడం జరుగుతోందన్నారు. సీవీడ్ ఫార్మింగ్ దిశ లో రైతులను ప్రోత్సహిస్తున్న నేపథ్యం లో, అంతకంతకు పెరుగుతున్న సీవీడ్ గిరాకీ ని తీర్చడం లో భారతదేశం ఒక ప్రధాన భూమిక ను నిర్వహిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.
***
(Release ID: 1686272)
Visitor Counter : 263
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam