యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఖేలో ఇండియా క్రీడా పాఠశాలగా షిల్లాంగ్.లోని అస్సాం రైఫిల్స్ పబ్లిక్ స్కూల్
ఈశాన్య భారతావనిలో ఎంపికైన తొలి క్రీడాపాఠశాల
Posted On:
04 JAN 2021 5:32PM by PIB Hyderabad
షిల్లాంగ్.లోని అస్సాం రైఫిల్స్ పబ్లిక్ స్కూల్ (ఎ.ఆర్.పి.ఎస్.)ను, ఖేలో ఇండియా క్రీడా పాఠశాలగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి కిరెణ్ రిజిజు సోమవారం ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9 క్రీడా పాఠశాలలకు ఆమోదం లభించింది. వాటిలో ఐదింటిని రక్షణ, పారామిలిటరీ బలగాలు నిర్వహిస్తున్నాయి. కాగా, ఈశాన్య ప్రాంతంలో ఖేలో ఇండియా పథకం కింద ఎంపికైన తొలి క్రీడా పాఠశాలగా ఎ.ఆర్.పి.ఎస్.కు గుర్తింపు లభించింది.
ఈ గుర్తింపుతో, స్కూల్లోని ప్రతిభావంతులైన క్రీడా విద్యార్థుల అన్నిరకాల వ్యయాన్ని ఇకపై ప్రభుత్వమే భరిస్తుంది. వారి భోజనం, వసతి, విద్యాబ్యాసం ఖర్చును, క్రీడా పోటీల ఖర్చును, బీమా సౌకర్యం, వైద్య, క్రీడా శిక్షణా వ్యయం, శిక్షణ ఇచ్చే కోచ్.లకు వేతనం, క్రీడా ఉపకరణాల ఖర్చు తదితర అంశాలన్నింటినీ ప్రభుత్వమే చూసుకుంటుంది. విద్యను, క్రీడా శిక్షణతో ఏకీకృతం చేసి, దేశంలో క్రీడాభివృద్ధికి కృషిచేస్తూ, అథ్లెట్ల క్రీడా జీవితాలను మెరుగుపరచమే లక్ష్యంగా ఖేలో ఇండియా పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. ఎ.ఆర్.పి.ఎస్.ను ఖేలో ఇండియా పాఠశాలగా ఎంపిక చేయడంతో ఈశాన్య, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని బాలల క్రీడా ప్రతిభాపాటవాలను గుర్తించి, వారి అభ్యున్నతికి తోడ్పడేందుకు వీలు కలుగుతుంది.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు మాట్లాడుతూ, “అస్సాం రైఫిల్స్ పబ్లిక్ స్కూల్ పయనంలో ఇదో చారిత్రాత్మక ప్రారంభం. ఖేలో ఇండియా క్రీడా కేంద్రంగా మారిన ఈ స్కూలు ఇకపై బాలబాలికలను క్రీడాకారులుగా తీర్చిదిద్దుతుంది. దీర్ఖకాలంలో ఒలిపింక్ క్రీడల్లో కూడా పతకాలు గెలిచే విజేతలుగా వారిని తయారు చేస్తుంది,” అని అన్నారు.
గత కొన్నేళ్లుగా ఈ స్కూల్లో ఎన్నో గుణాత్మక మార్పులు తీసుకురావడంలో అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్,.. లెఫ్టినెంట్ జనరల్ సుఖ్.దీప్ సంగ్వాన్ చేసిన కృషి ప్రశంసనీయమని రిజిజు అన్నారు. “ఈ పాఠశాలలో క్రీడలు ఎప్పుడూ ఒక అంతర్భాగంగా ఉంటూ వస్తున్నాయి. భవిష్యత్తులో ఈ స్కూలు చాంపియన్లను సృష్టించే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా లెఫ్టినెంట్ జనరల్ సుఖ్.దీప్ సంగ్వాన్ ఎంతో చొరవతో పాఠశాలలో ఎన్నో అద్భుతమైన మార్పులు చేశారని ఒప్పుకోవలసిందే. స్పోర్ట్స్ స్కూలుగా ఎంపిక కావడం ఈ పాఠశాలకు ఒక అదనపు ప్రత్యేకత అవుతుంది. భారతదేశాన్ని క్రీడాశక్తిగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్రమోదీ దార్శనికతను సాకారం చేసేందుకు ఇది దోహదపడుతుంది.” అని ఆయన అన్నారు.
విద్య, క్రీడాపరంగా చక్కని రికార్డు, భోజన, వసతి గృహ సౌకర్యం, క్రీడా సదుపాయాల అభివృద్ధికి గల అవకాశాలు ప్రాతిపదికగా అస్సాం రైఫిల్స్ పబ్లిక్ స్కూలుకు ఖేలో ఇండియా క్రీడా పాఠశాలగా గుర్తింపు లభించింది. ఒలింపిక్ క్రీడాంశాల్లో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యం వహించడం కూడా ఇందుకు దోహదపడింది. ఈ స్కూలులో శిక్షణకోసం విలువిద్య, అధ్లెటిక్స్, ఫెన్సింగ్ క్రీడాంశాలను ఎంపిక చేశారు. తొలి సంవత్సరంలో ఇక్కడ మొత్తం వందమంది వసతికి ఏర్పాట్లు చేశారు. బాలబాలికలకు సమాన నిష్పత్తిలో అవకాశం ఇస్తారు.
*****
(Release ID: 1686138)
Visitor Counter : 168