ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ తూనికలు కొలతల సదస్సు లో ప్రారంభోపన్యాసం చేసిన ప్రధాన మంత్రి
జాతీయ పరమాణు కాల సూచి ని, భారతీయ నిర్దేశక్ ద్రవ్య ను జాతి కి అంకితం చేసిన ప్రధాన మంత్రి
జాతీయ పర్యావరణ ప్రమాణాల ప్రయోగశాల కు శంకుస్థాపన
విద్యార్ధులు భవిష్యత్ శాస్త్రవేత్తలు గా రూపొందేందుకు ప్రేరణనివ్వడానికి వారితో మాట్లాడవలసిందిగా సిఎస్ఐఆర్ కు ను కోరిన ప్రధాన మంత్రి
భారతీయ ఉత్పత్తుల నాణ్యత ను మెరుగుపరచేందుకు భారతీయ నిర్దేశక్ ద్రవ్య తాలూకు ‘సర్టిఫైడ్ రెఫరెన్స్ మెటీరియల్ వ్యవస్థ’ ఉపయోగపడుతుందన్న ప్రధాన మంత్రి
సైన్సు, టెక్నాలజీ కి సంబంధించి విలువ జోడింపు చక్రాన్ని ప్రోత్సహించేందుకు , బలమైన రీతి లో పారిశ్రామిక పరిశోధనలను ప్రోత్సహించవలసింది గా శాస్త్రవేత్తల కు పిలుపు
పరిశ్రమ కు సంబంధించి బలమైన పరిశోధనలు బలమైన బ్రాండ్ ఇండియా కు దారి చూపనున్నాయి : ప్రధాన మంత్రి
Posted On:
04 JAN 2021 1:49PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతీయ మెట్రాలజీ సదస్సు 2021 ను ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భం గా ఆయన జాతీయ పరమాణు కాలసూచి ని, భారతీయ నిర్దేశక్ ద్రవ్య ప్రణాళిని జాతి కి అంకితం చేశారు. అలాగే జాతీయ పర్యావరణ ప్రమాణాల లేబరెటరీ కి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సదస్సు ను న్యూ ఢిల్లీ లో ఉన్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసెర్చ్- నేషనల్ ఫిజికల్ లేబరెటరీ (సిఎస్ఐఆర్- ఎన్‌పిఎల్) తన 75 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భం గా ఏర్పాటు చేసింది. దేశ సమ్మిళిత అభివృద్ధి కి మెట్రాలజీ అంశాన్ని ఈ సదస్సు కు ఇతివృత్తం గా నిర్ణయించారు. కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ డాక్టర్ విజయ్ రాఘవన్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భం గా ప్రధాన మంత్రి మాట్లాడుతూ , కొత్త సంవత్సరం లో భారతీయ శాస్ర్తవేత్తలు విజయవంతంగా రెండు కోవిడ్ వాక్సిన్‌లను అభివృద్ధి చేయడం పట్ల భారతీయ శాస్త్రవేత్తల కృషి ని అభినందించారు. భారతదేశ కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం ప్రంపంచంలోనే అతి పెద్ద కార్యక్రమమని, ఇది త్వరలో ప్రారంభం కానున్నదని ఆయన తెలిపారు. దేశం ఎదుర్కొన్న వివిధ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనేందుకు సిఎస్ఐఆర్ తో సహా వివిధ శాస్త్ర విజ్ఞాన సంస్థలు కలసికట్టుగా ముందుకు రావడాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు.
సిఎస్ఐఆర్ సాగిస్తున్న కృషి పై పాఠశాల విద్యార్ధులలో అవగాహన ను పెంచేందుకు వారితో మాట్లాడవలసిందిగా సిఎస్ఐఆర్ కు ప్రధాన మంత్రి సూచించారు. ఇది వారిని భవిష్యత్తు లో శాస్త్రవేత్తలు గా చేసేందుకు ప్రేరణనిస్తుందని ఆయన చెప్పారు. దేశ అభివృద్ధి లో సిఎస్ఐఆర్- ఎన్‌పిఎల్ లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన ప్రశంసించారు. గతంలో సాధించిన విజయాలను చర్చించడానికి , భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. నూతన ప్రమాణాలకు అనుగుణంగా సంస్థ కీలక పాత్ర పోషించాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. స్వావలంబనయుత భారతదేశం దిశగా సాగిపోవడానికి ముందుకు రావలసిందిగా ఆయన కోరారు.
భారతదేశ టైమ్‌కీపర్ గా సిఎస్ఐఆర్-ఎన్‌పిఎల్ కి భారతదేశ భవిష్యత్తు ను మార్చే బాధ్యత ఉందని ప్రధాన మంత్రి తెలియజేశారు. భారతదేశం నాణ్యత, కొలత ల విషయంలో విదేశీ ప్రమాణాల పై దశాబ్దాలుగా ఆధారపడుతూ వచ్చిందని చెప్పారు. అయితే ప్రస్తుతం భారతదేశం ప్రగతి వేగం, ఎదుగుదల, ప్రతిష్ఠ , భారతదేశం బలం అన్నీ మన ప్రమాణాల ఆధారంగానే నిర్ణయింపబడతాయని అన్నారు. మెట్రాలజీ అనేది ఏదైనా శాస్త్రీయమైన దాని సాధన కు ఒక కొలమానానికి పునాది గా నిలుస్తుందన్నారు. కొలమానం లేకుండా పరిశోధన ముందుకు సాగజాలదని ప్రధాన మంత్రి అన్నారు. మెట్రాలజీ అనేది కొలమానానికి సంబంధించిన శాస్త్రమని, ఇది ఏదైనా శాస్త్రీయ లక్ష్యసాధన కు పునాది ని ఏర్పరుస్తుందని ఆయన అన్నారు. ఏ పరిశోధన కూడా కొలమానం లేకుండా సాగదని అన్నారు. మనం సాధించే విజయం సైతం ఏదో ఒక కొలమానం కింద కొలవాల్సిందే అన్నారు. దేశ విశ్వసనీయత ఆ దేశ మెట్రాలజీ తాలూకు విశ్వసనీయత పైన ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. మెట్రాలజీ అనేది ఒక అద్దం వంటిదని, మన స్థాయి ఏమిటో అది ప్రపంచానికి చూపుతుందన్నారు. స్వావలంబనయుత భారతదేశం సాధన లో పరిమాణం, నాణ్యత రెండూ అవసరమన్నారు. ప్రపంచ విపణి లో భారతీయ ఉత్పత్తులను కేవలం వెల్లువెత్తించడమే కాకుండా భారతీయ ఉత్పత్తులను కొనుగోలు చేసే ప్రతి ఒక్క వినియోగదారు హృదయాన్ని గెలుచుకోవలసిందిగా ఆయన కోరారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకోవడంతో పాటు అంతర్జాతీయ ఆమోదాన్ని పొందాలన్నారు.
ఈ రోజు జాతి కి అంకితం చేసిన భారతీయ నిర్దేశక్ ద్రవ్య, భార లోహాలు, పురుగుమందులు, ఫార్మా, టెక్స్‌టైల్స్ వంటి రంగాల విషయం లో నాణ్యమైన ఉత్పత్తుల కు దోహద కారి అవుతుందని, ఇందుకు సర్టిఫైట్ రెఫరెన్స్ మెటీరియల్ సిస్టమ్ కు రూపకల్పన చేయడం జరిగిందని ప్రధాన మంత్రి అన్నారు. పరిశ్రమ ప్రస్తుతం నియంత్రణ ల కేంద్రిత వ్యవస్థ కు బదులు వినియోగదారు కేంద్రిత విధానం వైపు వెళ్తోందన్నారు. ఈ నూతన ప్రమాణాలతో, దేశవ్యాప్తంగా జిల్లాలలో స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపునిచ్చే ప్రచారం జరుగుతుందని, ఇది ప్రత్యేకించి మన ఎంఎస్‌ఎంఇ రంగానికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడం అనే దానివల్ల పెద్ద ఎత్తున విదేశీ తయారీ కంపెనీ లు భారతదేశానికి స్థానిక సరఫరా చెయిన్ కోసం వస్తాయని ప్రధాన మంత్రి అన్నారు. నూతన నాణ్యత ప్రమాణాలతో ఎగుమతులకు, దిగుమతులకు పూచీ ఉంటుందన్నారు. ఇది ఇది సాధారణ వినియోగదారు కు నాణ్యమైన ఉత్పత్తులను అందించడానికి, అలాగే ఎగుమతిదారు ఎదుర్కొనే సమస్యలను తగ్గించడానికి ఉపకరిస్తుందన్నారు.
ఏ దేశం ప్రగతి అయినా ఆ దేశం శాస్త్ర విజ్ఞాన ప్రగతి కి చేసే కృషి తో నేరు గా ముడిపడి ఉంటుందని ప్రధాన మంత్రి అన్నారు. ఇది శాస్త్రవిజ్ఞానం, సాంకేతికత, పరిశ్రమ కు సంబంధించి విలువ జోడింపు సైకిల్ లాంటిదన్నారు. దీనిని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, శాస్త్ర విజ్ఞానం సాంకేతికత కు దారితీస్తుందని, సాంకేతికత పరిశ్రమ ల అభివృద్ధి కి దోహదపడుతుందన్నారు. ఇందుకు బదులుగా పరిశ్రమ నూతన పరిశోధన కు సంబంధించి మరింతగా పెట్టుబడి పెడుతుందన్నారు. ఈ వలయం మనల్ని నూతన అవకాశాల వైపు తీసుకుపోతుందని చెప్పారు. సిఎస్ఐఆర్-ఎన్‌పిఎల్ లు వాల్యూ సైకిల్ ను ముందుకు తీసుకుపోవడం లో ప్రధాన పాత్ర ను పోషించాయని ప్రధాన మంత్రి అన్నారు.
సైన్సు కు సంబంధించి పెద్ద ఎత్తున ఉత్పత్తికి విలువ సృష్టింపు అనేది ఇవాళ్టి ప్రపంచం లో ఎంతో ముఖ్యమైందని, ప్రత్యేకించి దేశం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశ గా ముందుకు సాగుతున్న దశలో ఇది ముఖ్యమని అన్నారు. సిఎస్ఐఆర్ ఈ విషయం లో కీలక భూమిక ను పోషించాలని ప్రధాన మంత్రి తెలిపారు.
సిఎస్ఐఆర్ - ఎన్‌పిఎల్ నేషనల్ అటామిక్ టైమ్ స్కేలు విషయం లో ప్రధాన మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. దీనిని ప్రధాన మంత్రి ఈ రోజు న జాతి కి అంకితం చేశారు. నానో సెకండ్ వరకు కొలవడం లో దేశం స్వావలంబన ను సాధించిందని ప్రధాన మంత్రి తెలిపారు. 2.8 నానో సెకండ్ ఖచ్చితత్వం స్థాయి వరకు సాధించడం అనేది దానికదే ఒక పెద్ద సమర్ధత అని ప్రధాన మంత్రి తెలిపారు. ప్రస్తుతం భారత స్టాండర్డ్ టైమ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైమ్ తో 3 నానో సెకండ్ల కంటే తక్కువ ఖచ్చితత్వంతో సరిపోలుతోందన్నారు. ఇది ఇస్రో వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే సంస్థలకు ఎంతో ఉపయోగకారి అని ప్రధాన మంత్రి అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సంబంధమైన బ్యాంకింగ్, రైల్వేలు, రక్షణ, ఆరోగ్యం, టెలికం, వాతావరణ సూచనలు, విపత్తు నిర్వహణ, ఇలాగే చాలా రంగాలు ఈ విజయం ద్వారా ఎంతో లబ్ధి పొందనున్నాయని చెప్పారు.
ఇండస్ట్రీ 4.0 ను బలోపేతం చేయడంలో టైమ్‌స్కేల్ పాత్ర గురించి ప్రధాన మంత్రి సవివరంగా ప్రస్తావించారు. పర్యావరణ రంగం లో భారతదేశం కీలక స్థానానికి వెళుతున్నది. ఇప్పటి వరకు వాయు నాణ్యత, ఉద్గారాలను కొలిచేందుకు అవసరమైన సాంకేతికత, ఉపకరణాలకు భారతదేశం ఇతరులపై ఆధారపడుతూ వచ్చిందన్నారు. కానీ ప్రస్తుత విజయం తో ఈ రంగం లో స్వావలంబన సాధన కు వీలు కలుగుతుందని, ఇది మరింత సమర్ధమైన, తక్కువ ఖర్చు తో కూడిన ఉపకరణాలు కాలుష్య నియంత్రణ కు తయారు చేయడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఇది అంతర్జాతీయ మార్కెటు లో వాయు నాణ్యత, ఉద్గారాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం విషయం లో మన మార్కెట్ వాటా ను పెంచడానికి దోహదపడుతుందని అన్నారు. మన శాస్త్రవేత్తల నిర్విరామ కృషి వల్ల మనం దీనిని సాధించగలిగినట్టు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
ప్రధాన మంత్రి వివిధ విజ్ఞాన రంగాలలో పరిశోధన పాత్ర గురించి సవివరంగా ప్రస్తావించారు. ఏ పురోగామి సమాజంలో అయినా పరిశోధన అనేది సహజ స్వభావం మాత్రమే కాక సహజ ప్రక్రియ అని అన్నారు. పరిశోధన ప్రభావం వాణిజ్య పరంగా లేదా సామాజికంగా కూడా ఉండవచ్చని, పరిశోధన మన విజ్ఞానాన్ని విస్తృతం చేసేందుకు , అవగాహన ను పెంచేందుకు సహాయపడుతుందని అన్నారు. పరిశోధన నిర్దేశిత లక్ష్యం కాక, దాని భవిష్యత్ దిశ, పరిశోధన ఉపయోగాలను అన్ని వేళలా ఊహించడం సాధ్యం కాకపోవచ్చన్నారు. అయితే ఖచ్చితంగా చెప్పగలిగినదేమంటే, పరిశోధన వినూత్న విజ్ఞానానికి దారితీస్తుందని, ఇది ఎన్నటికీ వృథా కాదని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించి పలు ఉదాహరణలను ప్రధాన మంత్రి ప్రస్తావించారు. జెనిటిక్స్ పితామహుని గా చెప్పుకొనే శ్రీ మెందెల్ , నికొలాస్ టెస్ లా లు సాగించిన కృషి కి ఎంతో కాలం అనంతరం గుర్తింపు లభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చాలా సందర్బాలలో పరిశోధన తక్షణ లక్ష్యాలను నెరవేర్చలేకపోవచ్చని , అయితే అదే పరిశోధన మరో ఇతర రంగానికి సంబంధించి మున్నెన్నడూ లేని కొత్త విషయాన్ని కనుగొనేందుకు దారితీయవచ్చని అన్నారు. ఇందుకు సంబంధించి శ్రీ జగదీశ్ చంద్రబోస్ ఉదాహరణ ను ప్రధాన మంత్రి ప్రస్తావించారు. శ్రీ జగదీశ్ చంద్ర బోస్ మైక్రోవేవ్ సిద్దాంతాన్ని వాణిజ్యపరంగా ముందుకు తీసుకుపోలేక పోయినా, ఇవాళ యావత్తు రేడియో కమ్యూనికేశన్ వ్యవస్థ అంతా దాని మీదే ఆధారపడి ఉందని చెప్పారు. ప్రపంచ యుద్దాల సమయంలో జరిగిన పరిశోధనలను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ, ఆ పరిశోధనలు ఆ తరువాతి కాలం లో వివిధ రంగాల లో విప్లవాత్మక మార్పులను తెచ్చాయన్నారు. ఉదాహరణకు యుద్ధాల కోసం రూపొందించిన డ్రోన్ల ను ఫోటో షూట్‌లకు , సరకు సరఫరా కు వాడుతున్నారన్నారు. అందువల్ల మన యువ శాస్త్రవేత్తలు వివిధ రంగాలకు ఉపయోగపడే విధంగా పరిశోధనలను చేయాలని, తమ రంగానికి మాత్రమే కాక ఇతర రంగాలకు కూడా తమ పరిశోధన ఉపయోగపడుతుందన్న దృష్టి ని పెంపొందించుకోవాలన్నారు.
ఎంత చిన్న పరిశోధన అయినా ప్రపంచ స్వరూపాన్ని ఎలా మార్చగలదో కూడా ప్రధానమంత్రి వివరించారు. ఇందుకు సంబంధించి ఆయన పలు ఉదాహరణలు ఇచ్చారు. విద్యుత్తు ఇవాళ ప్రతి రంగాన్ని నడిపిస్తోందన్నారు. అది రవాణా, కమ్యూనికేశన్, పరిశ్రమ లేదా నిత్య జీవితం...ఇలా సకల రంగాలను నడిపిస్తోందన్నారు. అలాగే సెమికండక్టర్ ఆవిష్కరణ మన జీవితాలను డిజిటల్ విప్లవం దిశ గా తీసుకుపోయిందన్నారు. ఇలాంటి ఎన్నో అవకాశాలు మన యువ పరిశోధకుల ముందు ఉన్నాయని ఆయన అన్నారు. వారు మొత్తంగా భిన్నమైన భవిష్యత్తును తమ పరిశోధనల ద్వారా ఆవిష్కరించగలరని ప్రధాన మంత్రి అన్నారు.
భవిష్యత్తు కు సన్నద్థత కలిగిన వాతావరణ వ్యవస్థలను రూపొందించేందుకు మన కృషి కి సంబంధించిన వివరాలను ప్రధాన మంత్రి ప్రస్తావించారు. గ్లోబల్ ఇన్నొవేషన్ ర్యాంకింగ్‌లలో అత్యున్నత 5 ర్యాంకుల లోకి భారతదేశం ఎగబాకిందని అంటూ, పీర్ రివ్యూ సైన్స్ ఇంజనీరింగ్ పబ్లికేషన్ల లో భారతదేశం మూడో స్థానం లో ఉందన్నారు. ఇది మౌలిక పరిశోధన పై ప్రత్యేక దృష్టి ని తెలియజేస్తోందని చెప్పారు. పరిశ్రమ, సంస్థ ల మధ్య పరస్పర సమన్వయాన్ని బలోపేతం చేయడం జరుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచం లోని అన్ని పెద్ద కంపెనీలు తమ పరిశోధన శాలలను ఇండియా లో ఏర్పాటు చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి సంస్థలు చెప్పుకోదగిన రీతిలో పెరిగాయని చెప్పారు.
పరిశోధన , ఆవిష్కరణల రంగం లో భారతీయ యువత కు అవకాశాలు అనంతంగా ఉన్నాయని ప్రధాన మంత్రి చెప్పారు. అందువల్ల ఆవిష్కరణలను సంస్థాగతం చేయడం ఆవిష్కరణలంత కీలకమం అని ఆయన అన్నారు. మేధోపరమైన సంపత్తి ని రక్షించుకోవడాన్ని మన యువత అర్థం చేసుకోవాలని ప్రధాన మంత్రి అన్నారు. మన పేటెంట్ లు ఎంత ఎక్కువగా ఉంటే, వాటి ఉపయోగం కూడా అంత ఎక్కువగా ఉంటుందన్న సంగతి ని మనం గుర్తు పెట్టుకోవాలన్నారు. మన పరిశోధన బలం గా ఉన్న రంగాలలో మన గుర్తింపు బలం గా ఉంటుందని, మనం నాయకత్వం వహిస్తామని ఆయన అన్నారు. ఇది బలమైన ‘బ్రాండ్ ఇండియా’ కు దారి తీస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు.
శాస్త్రవేత్తలు కర్మయోగులని ప్రధాన మంత్రి అంటూ, పరిశోధన శాలల్లో వారు రుషుల లాగా కృషి చేస్తున్నారని, 130 కోట్ల మంది ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు వారు వాహకంగా ఉన్నారంటూ ప్రధాన మంత్రి కొనియాడారు.
***
(Release ID: 1686133)
Visitor Counter : 285
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam