ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలోని అన్ని ప్రాంతాలలో కొవిడ్ వాక్సిన్ డ్రై రన్
మాక్ డ్రిల్ ను సమీక్షించడానికి జిటిబి హాస్పిటల్, షహదారా మరియు యుపిహెచ్ సి, దర్యాగన్జ్ లనుపరిశీలించిన డాక్టర్ హర్షవర్ధన్

భద్రత, సమర్థత, రోగనిరోధక శక్తి అంశాలలో రాజీపడే ప్రసక్తి లేదు

పుకార్లు మరియు ఊహాగానాలను పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి

కార్యక్రమ నిర్వహణకు మార్గదర్శకాలను రూపొందించాం ... డాక్టర్ హర్షవర్ధన్
కో-విన్ వేదిక ద్వారా పరిశీలన

Posted On: 02 JAN 2021 3:52PM by PIB Hyderabad

కొవిడ్ -19వాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా ఈరోజు ప్రయోగాత్మకంగా నిర్వహించిన డ్రై రన్ కార్యక్రమం అమలు జరిగిన తీరును పరిశీలించడానికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాలను సందర్శించారు. తొలుత షహదారాలోని జిటిబి ఆసుపత్రిలో పర్యటించిన మంత్రి ఆ తరువాత దర్యాగంజ్ లో ఉన్న ఒక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.

వాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందు ఈ రోజు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ యంత్రాంగ సంసిద్ధతను పరిశీలించడానికి దేశంలోని 285 ప్రాంతాలలో మాక్ డ్రిల్ నిర్వహించింది. వాక్సిన్ ఇచ్చేరోజు పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశాన్ని తెలుసుకోడానికి ఈ మాక్ డ్రిల్ ను దేశంలోని అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో పట్టణ గ్రామీణ ప్రాంతాలను గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

వాక్సిన్ ఇవ్వడానికి జిటిబి ఆసుపత్రిలో కల్పించిన సౌకర్యాలపట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

'వాక్సిన్ ఇవ్వడానికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాము. సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు ఇతర అంశాలపై కూడా దృష్టి సారించాము. ప్రతి అంశానికి ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళికాబద్దంగా కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించాము' అని మంత్రి వివరించారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు. ముఖ్యమైన కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతిఒక్కరూ గత కొద్దీ నెలలుగా అంకితభావంతో పనిచేశారని అయన అన్నారు.

కార్యక్రమ నిర్వహణలో కో-విన్ వేదిక కీలకంగా ఉంటుందని డాక్టర్ హర్షవర్ధన్

 తెలిపారు. ప్రత్యేకంకా రూపొందిన కో-విన్ వాక్సిన్ నిల్వలు, వాటిని నిల్వ ఉంచిన ప్రాంతాల ఉష్ణోగ్రతల వివరాలతో పాటు వాక్సిన్ తీసుకున్నవారి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుందని అన్నారు. వాక్సిన్ పొందడానికి ముందుగా నమోదు చేయించుకున్న వారి వివరాలను పరిశీలించడం,వాక్సిన్ తీసుకున్నతరువాత డిజిటల్ సర్టిఫికేట్ ను జారీ చేయడంలాంటి కార్యక్రమాల ద్వారా కో-విన్ యంత్రాంగానికి సహకరిస్తుందని మంత్రి వివరించారు. ఇంతవరకు కో-విన్ లో 75 లక్షల మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారని అన్నారు.

దేశంలోని అన్ని ప్రాంతాలలో వాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించిన మంత్రి దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరడానికి కూడా ఏర్పాట్లను చేశామని దీనికోసం శీతలీకరణ వ్యవస్థను సిద్ధం చేశామని అన్నారు. అవసరమైన సంఖ్యలో సిరంజిలు మరియు ఇతర సౌకర్యాలను సిద్ధం చేశామని తెలిపారు.

వ్యాక్సిన్ భద్రత మరియు సమర్థతకు సంబంధించి వ్యాపిస్తున్న పుకార్లు మరియు తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని మంత్రి ప్రజలను కోరారు. టీకా దుష్ప్రభావాలకు సంబంధించి ప్రజల మనస్సులో సందేహాలనుకలిగిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. వార్తలను ప్రచురించడానికి లేదా ప్రసారం చేయడానికి ముందు జాగ్రత్త వహించాలని మరియు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరిన మంత్రి వాస్తవాలను తనిఖీ చేయాలని ఆయన మీడియాను కోరారు.

ఇంత భారీ కార్యక్రమాన్ని చేపట్టే సామర్ధ్యం దేశానికి ఉందా అంటూ వస్తున్న సందేహాలను ప్రస్తావించిన మంత్రి రోగనిరోధక కార్యక్రమాలను అమలుచేయడంలో భారతదేశానికి అపారమైన అనుభవం ఉందని వివరించారు. భారతదేశం యూనివర్సల్ ఇమ్యునైజేషన్కార్యక్రమం అమలులో ప్రపంచం ప్రశంసలు అందుకుందని ఆయన అన్నారు. పోలియో, రుబెల్లా మరియు మీజిల్స్ కు సంబంధించి భారత్ అనేక విజయవంతమైన ఇమ్యునైజేషన్ డ్రైవ్ లు నిర్వహించిందని ఆయన అన్నారు. పోలియో నిర్మూలనలో తన పాత్రను గుర్తు చేసుకున్న మంత్రి లక్షలాది మంది భారతీయులు చేసిన ప్రయత్నాలతో దేశం లో పోలియో నిర్మూలించ బడిందని అన్నారు.

"పట్టుదల, అంకితభావంతో అమలు చేసిన చర్యల ఫలితంగా, భారతదేశం 2014 లో పోలియో రహిత దేశంగా ప్రకటించబడింది. గత అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో కొవిడ్ వాక్సిన్ ను విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నాము "అని ఆయన అన్నారు.


 దర్యాగన్జ్ లోని యుపిహెచ్ సి వద్ద డాక్టర్ హర్షవర్ధన్ కొవిడ్ వాక్సిన్ భద్రత, సమర్థత మరియు రోగనిరోధక శక్తి పట్ల ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని కోరారు. ప్రజల భద్రత మరియు శ్రేయస్సును రక్షించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్రప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుందని ప్రకటించారు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ "1994 నాటి పోలియో నిర్మూలన కార్యక్రమంలో ప్రజలు వాక్సిన్ పై నమ్మకం ఉంచారు. పుకార్లు తప్పుడు ప్రచారాలను వారు నమ్మలేదు' అని మంత్రి వ్యాఖ్యానించారు.

కార్యాచరణ ప్రణాళికతో సహా ఐటి ప్లాట్ ఫాంను 2020 డిసెంబర్ 28 మరియు 29 తేదీలలో నాలుగు రాష్ట్రాల్లో పరీక్షించామని మంత్రి చెప్పారు. దీని ద్వారా అందిన సమాచారంతో లోటుపాట్లను సరిదిద్ది వ్యవస్థను పటిష్టం చేశామని తెలిపారు. వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి యంత్రాంగం సంసిద్ధతను పరీక్షించే లక్ష్యంతో ఈ డ్రై-రన్ నిర్వహించడానికి అన్ని అన్ని రాష్ట్రాలు, జిల్లాల అధికారులకు పూర్తి శిక్షణ ఇచ్చామని మంత్రి తెలిపారు. కార్యక్రమ అమలులో ఎదురైన సమస్యలు, ఇబ్బందులను చర్చించడానికి సమీక్షా సమావేశాలు జరుగుతాయని అన్నారు. వీటిని తమ మంత్రిత్వ శాఖకు తెలియచేయాలని కోరిన మంత్రి వీటి ఆధారంగా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని అన్నారు.

కొవిడ్ నివారణకు భారతదేశం అమలు చేసిన ముందస్తు చర్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించ బడ్డాయని డాక్టర్ హర్ష్ వర్ధన్ చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి నాయకత్వంలో, సమర్థవంతమైన నిఘా మరియు పరీక్షలను కలిగి ఉన్న ఒక విధానాన్ని అవలంబించడంలో భారతదేశం ఒక బలమైన రాజకీయ సంకల్పాన్ని ప్రదర్శించిందని మంత్రి అన్నారు. దీనివల్ల దేశంలో కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగాను మరణాల రేటు ప్రపంచంలోనే అతి తక్కువగాను ఉందని మంత్రి వివరించారు.

***

 (Release ID: 1685764) Visitor Counter : 23