ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
సార్స్-కోవ్-2 తాలూకు కొత్త రకం వైరస్ జన్యు క్రమ విశ్లేషణ ప్రాథమిక ఫలితాలను విడుదల చేసిన భారతీయ సార్స్- కోవ్-2 జినోమిక్స్ కన్సార్షియమ్ (ఐఎన్ఎస్ఎసిఒజి) ల్యాబ్స్
Posted On:
29 DEC 2020 9:33AM by PIB Hyderabad
యునైటెడ్ కింగ్ డమ్ (యుకె) లో సార్స్-కోవ్-2 తాలూకు కొత్త రకం వైరస్ వెలుగు లోకి వచ్చిందన్న కథనాలను భారత ప్‌ోభుత్వం పరిశీలనలోకి తీసుకొంది. ఆ వైరస్ జాడ ను కనిపెట్టడానికి, దానిని అరికట్టడానికి ఒక సక్రియాత్మకమైన, ముందస్తు నివారక వ్యూహాన్ని రూపొందించింది.
ఈ వ్యూహం లో ఈ కింద పేర్కొన్న చర్యలు ఒక భాగంగా ఉన్నాయి, అయితే, ఈ చర్యలకే ఈ వ్యూహం పరిమితం కాబోదు:-
1) బ్రిటన్ నుంచి వచ్చే అన్ని విమాన సర్వీసులను ఈ నెల 23వ తేదీ అర్థరాత్రి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు వర్తించే విధంగా తాత్కాలికంగా నిలిపివేయడం.
2) బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిన విమాన ప్రయాణీకులందరినీ ఆర్‌టి-పిసిఆర్ టెస్టు ద్వారా తప్పనిసరిగా పరీక్షించడం. ఆర్‌టి-పిసిఆర్ టెస్టు లో పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారి నమూనాల జన్యుక్రమం విశ్లేషణని 10 ప్రభుత్వ ప్రయోగశాలల (ఇండియన్ సార్స్-కోవ్-2 జినోమిక్స్ కన్సార్షియమ్..ఐఎన్ఎస్ఎసిఒజి) ద్వారా ఆవిష్కరించడం.
3) పరీక్షలు, చికిత్స, నిఘా, నిరోధం సంబంధిత వ్యూహాన్ని సమీక్షించి, తగు సిఫారసులు చేయడం కోసం జాతీయ కార్యాచరణ దళం (నేషనల్ టాస్క్ ఫోర్స్ .. ఎన్‌టిఎఫ్) ను ఈ నెల 26 న సమావేశపరచడం జరిగింది.
4) సార్స్-కోవ్-2 తాలూకు కొత్త రకం వైరస్ ను ఎదుర్కోవడానికి ఈ నెల 22 న రాష్ట్రాలకు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ ను జారీ చేయడమైంది.
ఈ అంశాన్ని ఎన్‌టిఎఫ్ ఈ నెల 26 న సమగ్రంగా పరీక్షించింది. ఇప్పటికే అమలులో ఉన్న నేషనల్ ట్రీట్‌మెంట్ ప్రోటోకాల్ ను గానీ లేదా టెస్టింగ్ ప్రోటోకాల్స్ ను గానీ ఈ కొత్త రకం వైరస్ ను దృష్టిలో పెట్టుకొని మార్పు చేయవలసిన అవసరం ఏదీ లేదని ఎన్‌టిఎఫ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆచరణలో ఉన్న నిఘా వ్యూహానికి తోడు, జన్యుపరమైన నిఘా ను ఇప్పటి కన్నా ఎక్కువగా అమలు చేయడం ప్రధానమని కూడా ఎన్‌టిఎఫ్ సిఫారసు చేసింది.
కిందటి నెల 25వ తేదీ మొదలుకొని ఈ నెల 23వ తేదీ అర్థ రాత్రి మధ్య వరకు బ్రిటన్ నుంచి భారతదేశం లోని వివిధ విమానాశ్రయాలకు సుమారు 33,000 మంది ప్రయాణికులు చేరుకొన్నారు. వారందరినీ గుర్తించి ఆయా రాష్ట్రాలలో/కేంద్రపాలిత ప్రాంతాలలో ఆర్‌టి-పిసిఆర్ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇంతవరకు 114 పరీక్షలలో మాత్రమే పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఈ పాజిటివ్ నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం 10 ఐఎన్ఎస్ఎసిఒజి ల్యాబ్స్ కు పంపించడం జరిగింది. ఈ 10 ప్రయోగశాలల్లో కోల్‌కతా లోని ఎన్ఐబిఎమ్‌జి, భువనేశ్వర్ లోని ఐఎల్ఎస్, పుణే లోని ఎన్ఐవి, సిసిఎస్ లు, హైదరాబాద్ లోని సిసిఎంబి, సిడిఎఫ్‌డి లు, బెంగళూరులోని ఐఎన్ ఎస్‌టిఇఎమ్, ఎన్ఐఎమ్‌హెచ్ఎఎన్ఎస్ లతో పాటు దిల్లీ లోని ఐజిఐబి, ఎన్‌సిడిసి లు ఉన్నాయి.
బ్రిటన్ నుంచి తిరిగివచ్చిన ఆరుగురిలో నమూనాలు కొత్త యుకె రకం జినోమ్ తో కూడిన పాజిటివ్ రిపోర్టును బయటపెట్టాయి. వీటిలో మూడు కేసులు బెంగళూరు లోని ఎన్ఐఎమ్‌హెచ్ఎఎన్ఎస్ లో, రెండు హైదరాబాద్ లోని సిసిఎంబి లో, ఒకటి నమూనా పుణే లోని ఎన్ఐవి లో పాజిటివ్ గా తేలాయి.
ఈ వ్యక్తులందరినీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలలో భాగంగా గల ప్రత్యేక గదులలో ఐసొలేషన్ లో ఉంచడం జరిగింది. వారితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులను కూడా క్వారంటైన్ లోకి వెళ్లవలసిందిగా సూచించడం జరిగింది. ఆ వ్యక్తులతో కలసి ప్రయాణించిన వారిని, ఆ వ్యక్తుల కుటుంబసభ్యుల తో భేటీ అయిన వారిని (కాంటాక్టులను), ఇతరులను కూడా క్షుణ్ణంగా గుర్తించే పని మొదలైంది. ఇతర నమూనాల విషయంలో సైతం జన్యుక్రమం విశ్లేషణ ని ఆవిష్కరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
పరిస్థితిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తూ, మరింత నిఘా, కట్టడి, పరీక్షలు, నమూనాలను ఐఎన్ఎస్ఎసిఒజి ప్రయోగశాలలకు పంపించడం వంటి అంశాలపై రాష్ట్రాలకు క్రమం తప్పక సలహాలను అందించడం జరుగుతోంది.
కొత్త రకం యుకె వైరస్ ఉనికి ఇప్పటికే డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్ లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్ లతో పాటు, సింగపూర్ లో కూడా వెల్లడి కావడం ప్రధానం గా గమనించదగ్గది.
***
(Release ID: 1684312)
Visitor Counter : 306
Read this release in:
English
,
Assamese
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam