ప్రధాన మంత్రి కార్యాలయం

డిసెంబర్ 28వ తేదీన 100వ కిసాన్ రైలును జండా ఊపి ప్రారంభించనున్న - ప్రధానమంత్రి


Posted On: 26 DEC 2020 7:36PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, 2020 డిసెంబర్, 28వ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటలకు, మహారాష్ట్రలోని సంగోలా నుండి పశ్చిమ బెంగాల్‌ లోని షాలిమార్ వరకు నడిచే, 100వ కిసాన్ రైలును, జండా ఊపి, వీడియో కాన్ఫరెన్సు ద్వారా, ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి, కేంద్ర మంత్రులు శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, శ్రీ పియూష్ గోయల్ కూడా హాజరుకానున్నారు.

రైలు ద్వారా కాలీఫ్లవర్, క్యాప్సికమ్, క్యాబేజీ, ములగ, మిరపకాయలు, ఉల్లిపాయల వంటి కూరగాయలతో పాటు, ద్రాక్ష, నారింజ, దానిమ్మ, అరటి, సీతాఫలం వంటి ఫలాలను కూడా రవాణా చేస్తున్నారు.  త్వరగా పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తులను ఈ రైలులోకి ఎక్కించడానికి, దింపుకోడానికీ మార్గ మధ్యలో ఉన్న అన్ని స్టేషన్ల వద్ద ఆపుతారు.  సరుకుల పరిమాణంపై పరిమితులు లేకుండా ఉత్పత్తుల రవాణాకు అనుమతిస్తారు.  పండ్లు, కూరగాయల రవాణాపై భారత ప్రభుత్వం 50 శాతం రాయితీని అందిస్తోంది.

 

కిసాన్ రైలు గురించి :

 

మొట్టమొదటి కిసాన్ రైలును దేవ్ లాలి నుండి దానాపూర్ వరకు 2020 ఆగష్టు 7వ తేదీన ప్రారంభమయ్యింది.  ఆ తర్వాత ఈ రైలును ముజఫర్ పూర్ వరకు పొడిగించారు.  రైతుల నుండి లభించిన మంచి స్పందన ఫలితంగా, వారానికి ఒక రోజు నడిచే ఈ రైళ్ళ రాకపోకలను, వారానికి మూడు రోజులు నడిచే విధంగా పెంచారు.

దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులను వేగంగా రవాణా చేయడంలో కిసాన్ రైలు ప్రధాన పాత్ర పోషించింది.  త్వరగా పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తులను ఎటువంటి ఆటంకాలు లేకుండా సరఫరా చేయడానికి కిసాన్ రైలు వీలుకలిగించింది.

*****



(Release ID: 1683939) Visitor Counter : 181