రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
అస్సాంలో 27 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు గడ్కరీ ప్రారంభోత్సవం చేసి పునాది రాయి వేశారు; అస్సాం తన హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని చెప్పారు
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని కూడా మంత్రి ఆవిష్కరించారు
Posted On:
25 DEC 2020 7:31PM by PIB Hyderabad
అస్సాంలో 27 రహదారి ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, ఎంఎస్‌ఎంఈ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ రోజు పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ అధ్యక్షత వహించారు.
ఈ ప్రాజెక్టులు దాదాపు 439 కిలోమీటర్ల రహదారి పొడవును కలిగి ఉంటాయి. వీటి నిర్మాణ విలువ రూ. 2,366 కోట్లు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య వస్తువుల రవాణాను సులభతరం చేస్తాయి. అలాగే సరిహద్దులలో కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయి. సమయం మరియు ఇంధనాన్ని ఆదా చేస్తాయి. పర్యాటకం మరియు మౌలిక వసతుల అభివృద్ధిని మెరుగుపరుస్తాయి. మరియు వ్యవసాయ ఉత్పత్తులకు పెద్ద మార్కెట్ల వరకు కనెక్టివిటీని అందిస్తాయి.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని కూడా మంత్రి ఆవిష్కరించారు. ఈ రోజు ఆ దివంగత నాయకుడి పుట్టినరోజు.
ఈ సందర్భంగా శ్రీ గడ్కరీ మాట్లాడుతూ అస్సాంలో జాతీయ రహదారుల అనుసంధాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. తన హృదయంలో అస్సాంకు ప్రత్యేక స్థానం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రానికి సిఆర్‌ఐఎఫ్ కింద 174 ప్రాజెక్టులకు రూ .2,104 కోట్లు మంజూరు చేయగా, అందులో ఇప్పటివరకు 1,177 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. సిఆర్‌ఐఎఫ్ కింద ప్రస్తుత సంవత్సరానికి రూ .221 కోట్ల మొత్తాన్ని మంత్రి ప్రకటించారు. వాస్తవానికి వార్షిక సేకరణ 139 కోట్ల రూపాయలు మాత్రమే.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అస్సాం కోసం ఎన్‌హెచ్‌ఓ మొత్తాన్ని రూ .1,213 కోట్ల నుంచి రూ .2,578 కోట్లకు పెంచినట్లు శ్రీ గడ్కరీ ప్రకటించారు. దీంతో జనం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 85,000 కోట్ల రూపాయల విలువైన రహదారి, మౌలిక సదుపాయాల పనులను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. 2021 లో 14,000 కోట్ల రూపాయల పనులను ఆమోదించగా మరో రూ .26 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు డిపిఆర్ తయారు చేస్తున్నారు. 2020 లో రాష్ట్రంలో 217 కిలోమీటర్ల పొడవైన రహదారులు 1,102 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తయ్యాయని ఆయన సమాచారం ఇచ్చారు. రూ .2,511 కోట్ల విలువైన 357 కిలోమీటర్ల రహదారి పనులు రాబోయే సంవత్సరంలో పూర్తవుతాయని చెప్పారు. 13,620 కోట్ల రూపాయల 295 కిలోమీటర్ల పొడవు గల 19 ప్రాజెక్టులకు ఈ ఏడాది ఆమోదం లభించాయి. రూ .25,700 కోట్ల విలువైన 845 కిలోమీటర్లకు సంబంధించి 20 ప్రాజెక్టులకు డిపిఆర్‌లు జరుగుతున్నాయని తెలిపారు.
సిల్చార్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ (ఎంఎంఎల్‌పి) నిర్మాణాన్ని శ్రీ గడ్కరీ ప్రకటించారు. జోగిగోపా తర్వాత అస్సాంలో ఇది రెండవ ఎంఎంఎల్‌పి అవుతుంది. బరాక్ నది వెంబడి హరినాచ్రా గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం 200 బిగాల భూమిని ఇవ్వనుంది. రహదారి మరియు జలమార్గాల అనుసంధానం ద్వారా ప్రజలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది.
రాబోయే నెలలో ధువ్రీ-ఫూల్‌బరీ వంతెన నిర్మాణం ప్రారంభమవుతుందని మంత్రి ప్రకటించారు. ఈ 19 కిలోమీటర్ల వంతెన కోసం రూ .4,497 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇది అస్సాం మరియు మేఘాలయలోని ఈ రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని 203 కిలోమీటర్లు తగ్గిస్తుంది. రాబోయే 15 రోజుల్లో దాని పునాది రాయి వేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నట్టు ఆయన తెలిపారు.
900 కోట్ల రూపాయల విలువైన 131 కిలోమీటర్ల పొడవైన మజులి ప్రాజెక్టులో భాగమైన 6.75 కిలోమీటర్ల మజులి వంతెన కోసం డిపిఆర్ సిద్ధంగా ఉందని, టెండర్ త్వరలోనే ఖరారవుతుందని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ కేంద్ర మంత్రి ఇచ్చిన సూచనలన్నింటినీ ముందుకు తీసుకువెళతానని హామీ ఇచ్చారు. తన ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి, మరియు ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు. తన ప్రభుత్వ లక్ష్యాలను సాధించడానికి కేంద్రం సహకారంతో పనిచేస్తున్నానని చెప్పారు.
***
(Release ID: 1683925)
Visitor Counter : 143