పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

భారత్‌-యూకే మధ్య విమానాల రాకపోకలపై భారత్‌ తాత్కాలిక నిషేధం

కొత్త రకం కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా నిర్ణయం

ఈనెల 22 నుంచి 31వ తేదీ వరకు విమాన రాకపోకలు నిలుపుదల

ప్రస్తుత ప్రయాణీకులకు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరి

Posted On: 21 DEC 2020 6:22PM by PIB Hyderabad

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నుంచి భారత్‌కు వచ్చి, వెళ్లే విమానాలను ఈనెల 22 నుంచి 31వ తేదీ వరకు నిలిపేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ హర్దీప్‌ సింగ్‌ పూరి ప్రకటించారు. కొన్ని దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండడంతో, ముందు జాగ్రత్తగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

    యూకేలో ప్రస్తుతమున్న కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా, యూకే నుంచి భారత్‌ వచ్చే, భారత్‌ నుంచి యూకే వెళ్లే విమానాలను ఈనెల 31వ తేదీ అర్ధరాత్రి వరకు కేంద్రం రద్దు చేసింది. 22వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. అంతర్జాతీయ సరకు రవాణా విమానాలపై, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన విమానాలపై ఈ నిషేధం వర్తించదు.

    ఇతర దేశాల నుంచి యూకే మీదుగా భారత్‌ వచ్చే విమానాల్లో, యూకే నుంచి భారత్‌ రావాలనుకునే ప్రయాణీకులను ఎక్కించుకోకూడదు. భారత్‌లోని ఏ ప్రాంతానికైనా, ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ వారిని తీసుకురాకూడదు.

    ప్రస్తుతం నడుస్తున్న విమానాల్లో లేదా 22వ తేదీ అర్ధరాత్రిలోగా యూకే నుంచి భారత్‌ వచ్చే ప్రయాణీకులందరూ భారత్‌లో దిగగానే ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. పాజిటివ్‌గా తేలిన ప్రయాణీకులను కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్‌ చేస్తారు. వైద్య ఖర్చులు ప్రయాణీకులే భరించాలి.

***



(Release ID: 1682549) Visitor Counter : 150