ప్రధాన మంత్రి కార్యాలయం
అంతరిక్ష రంగానికి చెందిన పరిశ్రమలు, అంకుర సంస్థలు, విద్యావేత్తలతో మాట్లాడిన ప్రధాన మంత్రి
అంతరిక్ష రంగంలో సంస్కరణలు వ్యాపారం చేయడంలో సౌలభ్యానికి పూచీ పడటానికే పరిమితం కాదు; ప్రతి ఒక్క దశలో సాయాన్ని అందించడం జరుగుతోంది: ప్రధాన మంత్రి
దేశం త్వరలోనే అంతరిక్ష ఆస్తుల తయారీ కేంద్రంగా మారుతుందన్న ఆశను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
అంతరిక్ష కార్యక్రమం తాలూకు ప్రయోజనాలు నిరుపేదలకు కూడా అందేటట్లు పూచీ పడటం అనేది కూడా మా ప్రయత్నంగా ఉంది: ప్రధాన మంత్రి
ఐటి రంగంలో భారతీయ ప్రతిభావంతులు ప్రపంచవ్యాప్త ఖ్యాతిని ఆర్జించినట్లే, అంతరిక్ష రంగంలోనూ భారతీయ ప్రతిభ ఖ్యాతిని ఆర్జించగలుగుతుంది: ప‌్రధాన మంత్రి
Posted On:
14 DEC 2020 5:42PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంతరిక్ష రంగానికి సంబంధించిన కీలక పరిశ్రమలు, అంకుర సంస్థలు, విద్యావేత్తలతో ఈ రోజున వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించారు. రోదసి కార్యక్రమాలలో వాటి ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించడం కోసం ఆయన ఈ చొరవ ను తీసుకొన్నారు.
అంతరిక్ష రంగ ప్రవేశానికి తలుపులను తెరవాలని, అంతరిక్ష కార్యక్రమాలన్నిటిలోను భారతదేశ ప్రైవేటు రంగం పాలుపంచుకొనేందుకు వీలు కల్పించాలని ప్రధాన మంత్రి నాయకత్వం లోని కేంద్ర మంత్రివర్గం ఈ ఏడాది జూన్ లో చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకొంది. నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఎండ్ ఆథరైజేషన్ సెంటర్ (‘ ఇన్ స్పేస్ ’.. IN-SPACe)ను ఏర్పాటు చేస్తే, తత్సంబంధిత సంస్కరణలు ప్రైవేటు కంపెనీలకు, అంకుర సంస్థలకు సమాన అవకాశాలు లభించే కార్యక్షేత్రాన్ని అందుబాటులోకి తీసుకురాగలుగుతాయి. ఆ తరువాత అంతరిక్ష విభాగం (డిఒఎస్) ఆధీనంలోని ఇన్-స్పేస్ కు అనేక సంస్థలు ప్రతిపాదనలను సమర్పించాయి. ఈ ప్రతిపాదనలు చిన్న ఉపగ్రహ రాశి, ఉపగ్రహ వాహక నౌకలు, భూతల కేంద్రం, జియో స్పేషల్ సర్వీసులు, ప్రొపల్షన్ సిస్టమ్స్, అప్లికేషన్ ప్రోడక్టులు సహా విస్తృత శ్రేణి కార్యకలాపాలకు సంబంధించినవి.
అంతరిక్ష రంగంలో భారతదేశానికి ఉన్న అవకాశాలను వినియోగించుకొనేందుకు ప్రయత్నించడం
ఇంతవరకు వారి వారి అనుభవాలను, ఆలోచనలను అందజేసినందుకు సంభాషణలో పాల్గొన్న వారికి ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అంతరిక్ష రంగంలో భారతదేశానికి గల అవకాశాలను వినియోగించుకోవాలన్న నిర్ణయం ఈ రంగంలో ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం తాలూకు ఒక నూతన శకానికి దారి తీసిందని ఆయన అన్నారు. ఈ ప్రయత్నంలో ప్రభుత్వం పక్షం నుంచి పూర్తి మద్ధతు, మనఃపూర్వక సమర్ధన లభిస్తాయంటూ సంభాషణ లో పాలుపంచుకొన్న వర్గాలకు ఆయన హామీని ఇచ్చారు. విధానాలలో వృత్తి నైపుణ్యం, పారదర్శకత్వం లతో పాటు, ప్రభుత్వ నిర్ణయ రూపకల్పన ప్రక్రియ అంతరిక్ష రంగంలో కృషి చేసేందుకు కలసి వచ్చే కంపెనీలకు లాభదాయకం కాగలదని ఆయన అన్నారు.
రాకెట్లను, ఉపగ్రహాలను తయారు చేయడానికి ప్రణాళికలతో కంపెనీలు ముందుకు రావడాన్ని ప్రధాన మంత్రి లెక్కలోకి తీసుకొని, ఇది ఒక పెద్ద మార్పునకు సంకేతమని, ఈ పరిణామం అంతరిక్ష రంగంలో భారతదేశ ప్రవేశాన్ని మరింత బలోపేతం చేయగలదని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడి ఉన్నత సాంకేతికతతో కూడిన ఉద్యోగాల కల్పనకు దారితీస్తుందని, దీనితో ఐఐటిలు/ఎన్ఐటి లు, ఇతర సాంకేతిక సంస్థలలోని ప్రతిభావంతులకు అనేక అవకాశాలు అందివస్తాయని ఆయన అన్నారు. ఐటి రంగంలో భారతదేశానికి చెందిన ప్రతిభావంతులు ప్రపంచవ్యాప్త ఖ్యాతిని ఆర్జించగలిగిన విధంగానే, అంతరిక్ష రంగంలో కూడా అదే జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.
వ్యాపారం చేయడంలో సరళత్వానికి మించి ముందుకు పోవడం
అంతరిక్ష రంగంలో సంస్కరణలు అనేవి వ్యాపారం చేయడంలో సరళత్వానికి పూచీ పడటానికే పరిమితమైనవి కాదని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. దీనిలో పాలుపంచుకొనే వారికి ప్రతి దశ లో.. పరీక్ష సదుపాయాలను, ప్రయోగ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడం సహా.. సాయపడటానికి గాను అవసరమైన యంత్రాంగాలన్నిటినీ సిద్ధం చేయడం జరిగిందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ సంస్కరణల ద్వారా జరుగుతున్న ప్రయత్నం భారతదేశం ఒక స్పర్ధాత్మక అంతరిక్ష విపణిగా ఎదిగేటట్లు చూడటం ఒక్కటే కాకుండా, అంతరిక్ష కార్యక్రమం తాలూకు ప్రయోజనాలు పేదలలోకెల్లా అత్యంత పేదలకు కూడా అందేటట్టు పూచీపడటం కూడా అవుతుంది అని ఆయన వివరించారు. ఈ సంభాషణలో పాలుపంచుకొన్న వారు ధైర్యంతో, సాహసంతో ఆలోచించాలని, సమాజానికి, దేశానికి లబ్ధి చేకూర్చడానికి కృషి చేయాలని ఆయన కోరారు.
కమ్యూనికేషన్, నేవిగేషన్ విధులలో అంతరిక్షరంగానికి ఉన్న ప్రాముఖ్యతను ప్రధాన మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ముఖాముఖి సంభాషణలో పాలుపంచుకొన్న వారు అంతరిక్ష పరిశోధన యుగంలో ఇస్రో (ISRO) కు తోటి ప్రయాణికులుగా ఉంటారని ఆయన హామీని ఇచ్చారు. అంతేకాకుండా, దేశం త్వరలోనే అంతరిక్ష ఆస్తుల తయారీ కేంద్రంగా మారగలదన్న ఆశను కూడా ఆయన వ్యక్తం చేశారు.
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో చురుకుగా పాల్గొన్నవారు ఎవరంటే..
ఇన్-స్పేస్ (IN-SPACe) నుంచి అనుమతి తీసుకోవడానికి పరిశ్రమ నుంచి అందిన వివిధ ప్రతిపాదనలను గురించి, అలాగే అంతరిక్ష విభాగం వైపు నుంచి అందే సమర్ధనను గురించి అంతరిక్ష విభాగం (డిఒఎస్) కార్యదర్శి, ‘ఇస్రో’ చైర్‌మన్, డాక్టర్ కె. శివన్ ప్రధాన మంత్రి కి క్లుప్తంగా తెలియజేశారు. అంతరిక్ష కార్యకలాపాలను చేపట్టడానికి 25కు పైగా పరిశ్రమలు ఇప్పటికే డిఒఎస్ ను సంప్రదించాయని ఆయన వెల్లడించారు.
ఈ ముఖాముఖి సంభాషణ సాగిన క్రమంలో, దీనిలో పాలుపంచుకున్న వారు సంస్కరణలపై వారి వారి అభిప్రాయాలను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో భారతి ఎంటర్‌ప్రైజెస్ పక్షాన శ్రీ సునీల్ భారతీ మిత్తల్, లార్సెన్ & టుబ్రో లిమిటెడ్ పక్షాన శ్రీ జయంత్ పాటిల్, అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ పక్షాన శ్రీ శ్రీనాథ్ రవిచంద్రన్, స్కైరూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ కు చెందిన శ్రీ పవన్ కుమార్ చందన, ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన కల్నల్ శ్రీ హెచ్.ఎస్. శంకర్, మేప్‌మైఇండియా కు చెందిన శ్రీ రాకేష్ వర్మ, పిక్సెల్ ఇండియా కు చెందిన శ్రీ అవాయిస్ అహమద్ లతో పాటు స్పేస్ కిడ్జ్ ఇండియా తరపున శ్రీమతి శ్రీమతి కేశన్ లు ఉన్నారు. వారు ఈ రంగాన్ని ప్రైవేటు భాగస్వామ్యం కోసం తెరచే ప్రయత్నం చేసినందుకుగాను ప్రధాన మంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. ఇది భారతదేశం అంతరిక్ష, సాంకేతిక విజ్ఞానం లో ఒక మహాశక్తిగా ఎదిగే దిశలో సాయపడుతుందని కూడా వారు అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో క్రియాశీలంగా పాలుపంచుకోవడానికి కృషి చేస్తామన్న సంకల్పాన్ని వారు వ్యక్తం చేశారు. తమ ప్రాజెక్టులకు ఇస్రో అందిస్తున్న సహాయాన్ని, మార్గదర్శకత్వాన్ని వారు అభినందించారు. ఇస్రో తో ప్రైవేటు ఏజెన్సీల సహకారం ప్రతి ఒక్క సంవత్సరంలో మరిన్ని రాకెట్ ప్రయోగాలకు మార్గాన్ని సుగమం చేయడం ఒక్కటే కాకుండా, రాకెట్ ఇంజిన్‌లను అభివృద్ధి పరచడంలో కొత్త సాంకేతిక విజ్ఞాన సంబంధిత పురోగమనానికి ఆకృతి ని కూడా ఇవ్వగలుగుతుందని వారు అన్నారు. బాలలను ఈ రంగంలోకి మరింతగా ఆకర్షించేందుకు వారిని ఇస్రో సదుపాయాలలోకి ఆహ్వానించాలని కూడా వారు సూచన చేశారు.
***
(Release ID: 1680589)
Visitor Counter : 280
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam