సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఒకే అంశంపై 108 దేశాల నుంచి 2,800 సినిమాలు రావడం ప్రజల్లోని గొప్ప ప్రతిభకు నిదర్శనం: శ్రీ ప్రకాశ్‌ జావడేకర్‌

మిశ్రమ పద్ధతిలో జరగనున్న 51వ ఇప్ఫి వేడుకలు: శ్రీ జావడేకర్‌

Posted On: 14 DEC 2020 12:58PM by PIB Hyderabad

కరోనా వైరస్ ఇతివృత్తంగా నిర్మించిన లఘు చిత్రాల ప్రదర్శన కోసం 'ఫిల్మ్ ఫెస్టివల్' నిర్వహించాలన్న ఆలోచన అద్భుతంగా ఉందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్‌ జావడేకర్‌ చెప్పారు. 'అంతర్జాతీయ కరోనా వైరస్‌ లఘు చిత్ర వేడుక' సందర్భంగా మాట్లాడుతూ, ఒకే అంశంపై 108 దేశాల నుంచి 2,800 సినిమాలు రావడం ప్రజల్లోని గొప్ప ప్రతిభకు నిదర్శనంగా అభివర్ణించారు. ఉత్సవ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. 

    ప్రపంచ దేశాల్లో ఎన్నో సమస్యలకు కరోనా కారణమైందని జావడేకర్‌ అన్నారు. అయితే, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం కరోనా వైరస్‌ను సమర్ధంగా ఎదుర్కొందని, ఈ ఏడాది మొదట్లోనే వైరస్‌ ముప్పును మోదీ పసిగట్టారని, దేశాన్ని ఇబ్బందుల నుంచి రక్షించడానికి అప్పటి నుంచి అవిశ్రాంతంగా శ్రమించారని వివరించారు.

    కరోనా సంక్షోభం క్రమంగా తొలగిపోతోందని, భారత్‌లోనూ త్వరలోనే టీకాలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి చెప్పారు. శరీరంలో యాంటీబాడీల సృష్టికి ముందే రోగనిరోధక శక్తి పతనానికి తలొగ్గొద్దని ప్రజలను హెచ్చరించారు.

    గోవాలో నిర్వహించనున్న 51వ 'భారత అంతర్జాతీయ చిత్రోత్సవం' గురించి మాట్లాడుతూ, మిశ్రమ పద్ధతిలో వేడుకను నిర్వహిస్తామని శ్రీ జావడేకర్‌ చెప్పారు. ప్రారంభ, ముగింపు ఉత్సవాలను పరిమిత సంఖ్యలోని అతిథుల సమక్షంలో నిర్వహిస్తామని, వేడుకలను ప్రజలు ఆన్‌లైన్‌ ద్వారా చూస్తారని వివరించారు. 21 నాన్‌-ఫీచర్‌ చిత్రాలు ఈ వేడుకల్లో ప్రదర్శితమవుతాయని వెల్లడించారు.

    భారత్‌ వంటి పెద్ద దేశంలో కరోనా వైరస్‌ గురించి ప్రజల్లో విజయవంతంగా అవగాహన కల్పించిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వి అభినందించారు. అతి పెద్ద లఘు చిత్ర వేడుకను ఒకే ప్రాంతానికి తీసుకొచ్చిన నిర్వాహకులను కూడా ప్రశంసించారు.

***



(Release ID: 1680554) Visitor Counter : 119