ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 వ్యాప్తి నిరోధం దిశగా మార్కెట్లలో నివారణ చర్యలపై ప్రామాణిక నిర్వహణ విధానాలు జారీచేసిన ఆరోగ్య మంత్రిత్వశాఖ

Posted On: 02 DEC 2020 2:03PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణ దిశగా చేపట్టాల్సిన నిరోధక/నివారణ చర్యలపై కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రామాణిక నిర్వహణ విధానాలను (SOP) జారీ చేసింది. ఇవి కిందివిధంగా ఉన్నాయి:

  1. నేపథ్యం

ప్రజలు తమ దైనందిన అవసరాలు, కొనుగోళ్లు వినోద కార్యక్రమాలు, ఆహారం తదితరాల కోసం పెద్ద సంఖ్యలో మార్కెట్‌ ప్రదేశాలకు వెళ్తుంటారు. కాబట్టి కోవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణ దిశగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒక నిబంధనల పత్రాన్ని రూపొందించింది. కోవిడ్‌ మహమ్మారి పరిస్థితుల నడుమ దేశంలో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. దీనివల్ల  మార్కెట్‌ ప్రదేశాలకు జనసంచారం భారీగా పెరిగిన నేపథ్యంలో కోవిడ్‌-19 అనుగుణ ప్రవర్తనను అనుసరించకపోతే కరోనావైరస్ వ్యాధి వ్యాప్తికి ఇది దారితీసే ప్రమాదం ఉంది.

  1. లక్ష్యం

కోవిడ్‌-19 వ్యాప్తి నివారణకు మార్కెట్ ప్రదేశాలలో తప్పక చేపట్టాల్సిన ప్రత్యేక చర్యలకు అదనంగా తీసుకోవాల్సిన వివిధ సర్వసాధారణ ముందుజాగ్రత్తల గురించి ఈ పత్రం వివరిస్తుంది. ఈ మార్గదర్శకాలు చిల్లర, టోకు మార్కెట్లన్నిటికీ వర్తిస్తాయి. వీటిలో కొన్ని పెద్ద మార్కెట్లలో భాగమైన మాల్స్/హైపర్/సూపర్ మార్కెట్లు కూడా ఉంటాయి. అటువంటి సంస్థలకు ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఇదివరకే జారీచేసిన మార్గదర్శకాలు (https://www.mohfw.gov.in/pdf/4SoPstobefollowedinShoppingMalls.pdf) వెబ్‌సైట్‌లో లభిస్తాయి. అలాగే మార్కెట్‌ ప్రదేశాల్లోని రెస్టారెంట్లకు సంబంధించిన మార్గదర్శకాలు (https://www.mohfw.gov.in/pdf/3SoPstobefollowedinRestaurants.pdf) వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయి. వీటితోపాటు సంబంధి మార్కెట్‌ ప్రాంగణాల పరిధిలోకి వచ్చే కార్యాలయాలు, మత-ధార్మిక ప్రదేశాలు/ప్రార్థన స్థలాలు, శిక్షణ సంస్థలు, యోగా శిక్షణ/వ్యాయామశాలలు, సినిమా హాళ్లు/థియేటర్లు ఇతరత్రా నిర్దిష్ట కార్యకలాపాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మంత్రిత్వశాఖ జారీచేసే మార్గదర్శకాలు వర్తిస్తాయి. ఇక నియంత్రణ మండళ్ల పరిధిలోని మార్కెట్‌ ప్రదేశాలు మూసివేయబడతాయి. ఈ మండళ్ల పరిధికి వెలుపల ఉన్నవి తెరవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది.

  1. దుర్బల జనాభాకు రక్షణ

దేశంలోని 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, బహుళవ్యాధి పీడితులు, గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు తప్పనిసరి, ఆరోగ్య అవసరాల కోసం మినహా ఇల్లువదిలి వెళ్లరాదని మంత్రిత్వశాఖ సూచించింది. ఈ మేరకు మార్కెట్ ప్రదేశాల యాజమాన్య సంఘాలను ఆదేశించాలని పేర్కొంది. అలాగే అధికముప్పుగల ఉద్యోగులు… ఉదా॥ వృద్ధ సిబ్బంది, గర్భిణులు, అనారోగ్య పీడితులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి వ్యక్తులను ప్రజానీకంతో ప్రత్యక్ష సంబంధంగల ప్రధాన విధుల్లో నియమించకుండా కూడా ఆదేశాలివ్వాల్సి ఉంది.

  1. కోవిడ్‌ అనుగుణ ప్రవర్తన అనుసరణకు ప్రోత్సాహం

కోవిడ్‌-19 ముప్పును తగ్గించడం కోసం సులభ ప్రజారోగ్య రక్షణ చర్యలు అనుసరిస్తే సరిపోతుంది. దుకాణాలు/వ్యాపార సంస్థల యజమానులు, సిబ్బందిసహా సందర్శకులంతా అన్నివేళలా ఈ జాగ్రత్తలను పాటించాలి.

అవేమిటంటే:

  1. సాధ్యమైన అన్ని ప్రదేశాల్లో కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించడం.
  2. ముఖానికి రక్షణ కవచాలు/మాస్కులు ధరించడం తప్పనిసరి.
  3. చేతులు మురికిగా లేనప్పటికీ తరచూ సబ్బుతో (కనీసం 40-60 సెకన్లపాటు) శుభ్రపరచుకోవడం. దుకాణాలుసహా వీలైన అన్ని ప్రదేశాల్లో చేతులు (కనీసం 20 సెకన్లపాటు) శుభ్రం చేసుకునేందుకు ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్ల వినియోగం.
  4. శ్వాస పద్ధతులు కచ్చితంగా పాటించడం. ఇందులో భాగంగా దగ్గు/తుమ్ము వచ్చినపుడు ముఖాన్ని మడచిన మోచేతి మధ్య ఉంచుకోవడం లేదా టిష్యూ పేపరు/చేతి రుమాలుతో నోరు, ముక్కు మూసి ఉంచడం, ఆ తర్వాత టిష్యూ పేపరును జాగ్రత్తగా పారవేయడం.
  5.  ఆరోగ్యంపై స్వీయ పర్యవేక్షణ, ఏదైనా అనారోగ్యం పాలైతే వెంటనే రాష్ట్ర, జిల్లా సహాయ కేంద్రానికి నివేదించడం.
  6. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడంపై కఠిన నిషేధం.
  7. మొబైల్‌ ఫోన్లలో అందరూ ‘ఆరోగ్యసేతు’ యాప్‌ వినియోగించేలా ప్రోత్సహించడం.
  1. మార్కెట్‌ ప్రదేశాల్లో ఆరోగ్య వాతావరణం నిర్వహణ

సాధారణ పరిస్థితుల్లో మార్కెట్‌ ప్రదేశాలు ఎప్పుడూ జనంతో రద్దీగా ఉంటాయి. అంతేగాక పారిశుధ్య సదుపాయాల లోపంతోపాటు పరిసర పరిశుభ్రత కూడా కనిపించదు. ఇలాంటి పరిస్థితుల నడుమ కోవిడ్‌ వ్యాప్తి ముప్పును నిరోధించాలంటే మార్కెట్‌ ప్రదేశాల్లో ఆరోగ్యకర వాతావరణాన్ని నిర్వహణ తప్పనిసరి.

ఈ మేరకు చేయాల్సిందేమిటంటే:

  1. దైనందిన కార్యకలాపాలు ప్రారంభించే ముందే దుకాణాల యజమానులు వాటి లోపలి పని ప్రదేశాలన్నిటినీ (1 శాతం హైపోక్లోరైట్‌ ద్రావణంతో) శుభ్రం చేయాలి.
  2. తరచూ తాకే ఉపరితలాలు (డోర్ నాబ్స్/హ్యాండిల్స్, ఎలివేటర్ బటన్లు, హ్యాండ్ రైల్స్, కుర్చీలు, టేబుల్ టాప్స్, కౌంటర్లు వగైరా)సహా నేల, గోడలు తదితరాలను రోగకారక రహితంగా శుభ్రం చేయాలి. ఇదంతా దుకాణాలు తెరవడానికి ముందు, తిరిగి మూసివేసే సమయంలోనే కాకుండా అవసరమైనప్పుడల్లా క్రమం తప్పకుండా సూక్ష్మక్రిమి నిర్మూలనం చేయాలి.
  3. దుకాణాల ప్రవేశంవద్ద చేతి పరిశుభ్రతకు (శానిటైజర్‌ డిస్పెన్సర్‌) ఏర్పాటు ఉండాలి.
  4. పార్కింగ్‌ ప్రదేశాల్లో కార్లను ఉద్యోగులు క్రమబద్ధంగా ఉంచుతుంటారు కాబట్టి స్టీరింగ్‌, డోర్‌ హ్యాండిళ్లు, తాళాలు వగైరాలను వాహనాల యజమానులు సూక్ష్మిక్రిమి నిర్మూలన చేసుకుని వాటిని వినియోగించుకోవాలి.
  5. అందరూ వాడే స్థలాలు, ఇతర బహిరంగ ప్రదేశాలను 1 శాతం హైపోక్లోరేట్‌ ద్రావణంతో పరిశుభ్రం చేయాలి. ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా సాగాలి.
  6. చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశాలు, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లను రోజుకు కనీసం 3-4 సార్లు క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.
  7. అందరూ వాడే స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఆరోగ్యకర వాతావరణం ఉండేవిధంగా మార్కెట్‌ ప్రదేశాల యాజమాన్య సంఘాలు సొంత ఖర్చుతోనూ, స్థానిక పౌరపాలన యంత్రాంగాల తోడ్పాటుతో జాగ్రత్త వహించాలి.

దీనికి సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలు కింది చిరునామాలో లభిస్తాయి:

https://www.mohfw.gov.in/pdf/Guidelinesondisinfectionofcommonpublicplacesincludingoffices.pdf

  1. మార్కెట్‌ ప్రదేశాలలో కోవిడ్‌ అనుగుణ ప్రవర్తన దిశగా ప్రణాళిక
    1. మార్కెట్‌ ప్రదేశాల్లో స్వీయ నియంత్రిత కోవిడ్‌ అనుగుణ ప్రవర్తన

మార్కెట్ ప్రదేశాలలో యాజమాన్య సంఘాలు కింది తరహాలో స్వీయ-నియంత్రణ చర్యలు చేపట్టడం ద్వారా కోవిడ్‌ అనుగుణ ప్రవర్తనను నియంత్రించవచ్చు:

  1. మార్కెట్‌ ప్రదేశాలలో (దుకాణాలు/సంస్థల్లోనేగాక వెలుపల) కోవిడ్‌ అనుగుణ ప్రవర్తన అమలు-పర్యవేక్షణ కోసం ఒక ఉప-సంఘాన్ని ఏర్పాటు చేయవచ్చు.
  2. ప్రవేశద్వారాలు, పార్కింగ్‌ ప్రదేశాల్లో ప్రభుత్వ ఆమోదిత ధరతో మాస్కులు విక్రయించే కియోస్కులను ఏర్పాటు చేయవచ్చు.
  3. ఆర్థిక స్థోమత లేనివారికి మాస్కులు ఉచితంగా పంపిణీ చేసే ఏర్పాటు చేయవచ్చు.
  4.  అందరూ వాడే స్థలాల్లో చేతులు శుభ్రం చేసుకునే ఏర్పాట్లతోపాటు సబ్బు/నీటి సదుపాయం కల్పించవచ్చు. కాలితో నియంత్రించే కొళాయిలు, తాకే అవసరం లేని సోప్‌ డిస్పెన్సర్లు వాడితే మంచిది.
  5. ప్రవేశద్వారం/మార్కట్‌లోని ఇతర జనసంచార ప్రదేశాల్లో సామూహిక థర్మల్‌ స్క్రీనింగ్‌ సౌకర్యం కల్పించే యోచన చేయవచ్చు.
  6. అందరూ వాడే స్థలాల్లో పరిశుభ్రత కోసం థర్మల్‌ గన్లు, శానిటైజర్లు, సూక్ష్మక్రిమి నాశకాలు వంటివి సిద్ధంగా ఉంచవచ్చు.
  7. అందరికీ ప్రముఖంగా కనిపించే మార్కెట్‌ ప్రదేశాల్లో ఐఈసీ సరంజామా, ప్రదర్శన బోర్డుల ద్వారా కోవిడ్‌ అనుగుణ ప్రవర్తనను ప్రత్యక్షంగా ప్రదర్శించవచ్చు.
    1. అమలు చేసే సంస్థలద్వారా కోవిడ్‌ అనుగుణ ప్రవర్తనను పాటించేలా చూడటం

స్వీయ నియంత్రణ పద్ధతి విఫలమైతే లేదా దాని ప్రభావం కనిపించకపోతే అవసరమైన చోట అమలు దిశగా చర్యలు చేపట్టవచ్చు... అవేమిటంటే:

  1. మాస్కు/ముఖ కవచం ధరించకపోయినా లేక భౌతికదూరం పాటించకున్నా అటువంటివారికి అపరాధ రుసుము/జరిమానా విధించడం.
  2. మార్కెట్లు/దుకాణాలు ప్రత్యామ్నాయ దినాల్లో తెరిచే అవకాశాన్ని పరిశీలించడం.
  3. అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యే మార్కెట్లకు అంటువ్యాధి సంబంధాలున్నట్లు అధికారులు కనుగొన్న పక్షంలో వాటిని మూసివేయడం.
    1. కోవిడ్‌ అనుగుణ ప్రవర్తనకు భరోసా ఇస్తూ మార్కెట్‌లోని దుకాణాల యజమానులు/ సదుపాయాల నిర్వాహకుల ప్రణాళిక

యజమానులు కింది అంశాలను అనుసరించాలి:

  1. దుకాణాలు/సదుపాయాల లోపల/వెలుపల కనీసం 6 అడుగుల భౌతిక దూరాన్ని నిర్దేశించే విధంగా గుర్తులు గీయవచ్చు.
  2. వెలుపల/లోపల ప్రజానీకాన్ని వరుసలో పంపే ఏర్పాటు చేయవచ్చు.
  3. భౌతిక దూరానికి అనుగుణంగా వరుస నియంత్రణకు తగిన సంఖ్యలో సిబ్బందిని నియమించాలి.
  4. మాస్కులు లేకుండా దుకాణాలు/సదుపాయాల్లో ప్రవేశించే వినియోగదారులకు మూడు పొరల మాస్కులు/ముఖ కవచాలు అందుబాటులో ఉంచవచ్చు.
  5. ప్రవేశద్వారాల వద్ద చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్లతోపాటు థర్మల్‌ స్క్రీనింగ్‌ సదుపాయాన్ని అవకాశం ఉన్నంత మేర ఏర్పాటు చేయాలి. దీనివల్ల సిబ్బందితోపాటు వినియోగదారుల శరీర ఉష్ణోగ్రతను పర్యవేక్షించే వీలుంటుంది.
  6. వీలైన ప్రతిచోటా స్పర్శరహిత  చెల్లింపులకు తగిన ఏర్పాటు చేయవచ్చు.

6.4. తగినంత గాలి ప్రవహించేలా చూసుకోవాలి

  1. వీలైనంతవరకూ సహజ వాయు ప్రవాహం ఉండేలా చూసుకోవాలి. ఇరుకైన, మూసి ఉండే ప్రదేశాల వినియోగాన్ని ప్రోత్సహించరాదు.
  2. వెలుపలినుంచి గాలి ప్రసరణ సాధ్యమైనంత ఎక్కువగా ఉండేవిధంగా కిటికీలు, తలుపులు పూర్తి తెరచి ఉంచి, ఫ్యాన్లు ఇతరత్రా పద్ధతుల్లో వాయు ప్రవాహం పెంచాలి.
  3. మూసి ఉంచే ప్రదేశాల్లో ఎయిర్‌ కండిషనింగ్‌/వెంటిలేషన్‌పై సీపీడబ్ల్యూడీ జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించాలి. తదనుగుణంగా అన్ని ఎయిర్‌ కండిషనింగ్‌ పరికరాల్లో ఉష్ణోగ్రతను ‘24-300 సి’ శ్రేణిలో, సాపేక్ష తేమ శ్రేణి 40-70 శాతం ఉండేవిధంగా, తాజాగాలిక ప్రసరణకు వీలుండేలా చూడాలి.  వీలైనంత వరకూ ఎదురుబొదురు మార్గాల్లో తాజాగాలి ప్రసరించేలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ యూనిట్లను స్విచాన్‌ చేసేముందు బాగా శుభ్రం చేయాలి.

6.5 రద్దీ నిర్వహణ

అన్నివేళల్లోనూ జన సాంద్రత ఒకే విధంగా ఉండదు. సాధారణంగా వారాంతపు రోజుల్లో సాయంత్రం సమయంలో గరిష్ఠంగా ఉంటుంది. వారాంతాల్లో, సెలవు దినాల్లో పగటిపూట నుంచీ సాయంత్రం పొద్దుపోయేదాకా మార్కెట్ ప్రదేశాలు చాలావరకు రద్దీగా ఉంటాయి. ఇలాంటి రద్దీ రోజులు/సమయాలనుబట్టి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆ మేరకు రద్దీని నిర్వహించడం కోసం మార్కెట్ సంఘాల సహకారంతో చట్ట అమలు సంస్థలద్వారా అనేక వ్యూహాలను రూపొందించవచ్చు.

ఇందులో భాగంగా:

  1. రద్దీ నియంత్రణ కోసం పౌర రక్షణ స్వచ్ఛంద కార్యకర్తలు/హోంగార్డులు/కార్యకర్తలను నియమించడం.
  2. వాహనాల ప్రవేశాన్ని పరిమితం చేయడం కోసం పార్కింగ్‌ ప్రదేశాల వద్ద నియంత్రణ.
  3. ప్రవేశ, నిష్క్రమణలకు వేర్వేరు ద్వారాలు.. వీలైతే సందర్శకులు ఒకేవైపు వెళ్లేవిధంగా ఏర్పాటు.
  4. మార్కెట్‌ ప్రదేశాల్లో రోడ్లను వాహన రహితం (బైక్‌లు/ఎలక్ట్రిక్‌ రిక్షాలుసహా) చేసి, వీలైనంత వరకూ పాదచారులను/సైకిళ్లను మాత్రమే అనుమతించడం.
  5. మార్కెట్‌ రోడ్లలో అక్రమ పార్కింగ్‌కు చట్టం అమలు సంస్థలద్వారా కఠినమైన చర్య తీసుకునేలా ఉండాలి.
  6. వాహనాలను పార్కింగ్‌ ప్రదేశాల్లో మాత్రమే నిలిపేలా అనుమతించాలి. అలాగే అక్కడే కాకుండా ప్రాంగణం వెలుపల కూడా భౌతిక దూరానికి ప్రాధాన్యంతో రద్దీ నియంత్రణ.
  • vii. రద్దీ అదుపు తప్పకుండా సీసీటీవీ పర్యవేక్షణ ఏర్పాటును పరిగణనలోకి తీసుకోవాలి.
  1. దుకాణాలు/సదుపాయాలు వేర్వేరు వేళల్లో తెరిచేలా తదుపరి ఎక్కువసేపు తెరచి ఉంచే అవకాశాలను పరిశీలించడం.
  2. మార్కెట్లలోకి నేరుగా జనం ప్రవేశానికి వీలున్న స్థానిక మెట్రోరైలు స్టేషన్ల నుంచి రద్దీని సమర్థంగా నిర్వహించడం.
  3. కిరాణా సరకులు/వస్తువులు ఆన్‌లైన్‌లో ఆర్డరు చేయడం, ఇంటికే తెప్పించుకోవడాన్ని తప్పక ప్రోత్సహించాలి. ఇంటికి సరకులు చేర్చే సిబ్బందికి విక్రేతలు ముందుగానే థర్మల్‌ పరీక్షలు చేయించాలి.
  4. రద్దీలేని సమయాల్లో దుకాణాలకు వచ్చేవారికి ప్రోత్సాహకాలు/రాయితీలు ఇవ్వడాన్ని పరిగణనలోకి తీసుకోవడం.

6.6 అవగాహన కల్పన

  1. కోవిడ్‌-19 నివారణ చర్యలపై మార్కెట్‌ ప్రదేశంలో పోస్టర్లు/స్టాండీస్‌/దృశ్య-శ్రవణ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించవచ్చు. అంతేకాకుండా చక్కగా కనిపించే ప్రదేశాల్లో చేయదగిన/చేయగూడని అంశాలను కూడా ప్రదర్శించవచ్చు.
  2. కోవిడ్‌ అనుగుణ ప్రవర్తన సంబంధిత ముందుజాగ్రత్త చర్యలపై రికార్డ్‌ చేసిన సందేశాలను దృశ్య-శ్రవణ వ్యవస్థలద్వారా మార్కెట్‌ ప్రాంగణాల్లో ప్రదర్శించవచ్చు.
  3. వీలుంటే దుకాణాల వెబ్‌సైట్లు లేదా మొబైల్‌ యాప్‌ల ఆరంభ పేజీల్లో కోవిడ్‌ నివారణ చర్యలను ప్రదర్శించవచ్చు. కోవిడ్‌-19 లక్షణాలతో బాధపడుతుంటే దుకాణానికి రావద్దని హెచ్చరించడంతోపాటు స్వీయ ఆరోగ్య పర్యవేక్షణ గురించి తెలియజేయవచ్చు.
  4. ప్రముఖంగా కనిపించే ప్రదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ/స్థానిక అధికారిక సహాయ కేంద్రాల ఫోన్‌ నంబర్లను ప్రదర్శించవచ్చు.

6.7  కోవిడ్‌ సంబంధిత సరఫరాల అందుబాటు

  1. ముఖ కవచాలు/మాస్కుల వంటి వ్యక్తిగత రక్షణ ఉపకరణాలతోపాటు శానిటైజర్లు, సబ్బు, సోడియం (1శాతం) హైపోక్లోరైట్‌ ద్రావణం తదితరాలను తమ సిబ్బంది కోసం దుకాణ యజమానులు అవసరాల మేరకు ఏర్పాటు చేయాలి. అందరూ వాడే స్థలాల్లో వినియోగం కోసం మార్కెట్‌ సంఘాలు వీటిని సిద్ధంగా ఉంచాలి.
  2. థర్మల్‌ గన్‌లను ఎల్లప్పుడూ వినియోగానికి సిద్ధంగా ఉంచాలి.
  3. సీపీసీబీ మార్గదర్శకాల (https://cpcb.nic.in/uploads/Projects/BioMedical-Waste/BMWGUIDELINES- COVID_1.pdf) మేరకు వ్యర్థాల నిర్వహణ దిశగా మూతగల చెత్తబుట్టలు, క్యాన్లను తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలి.
  1. మార్కెట్‌ ప్రదేశాల్లో ఆరోగ్యకర కార్యకలాపాల నిర్వహణ
  1. నియంత్రణ మండళ్ల పరిధిలో నివసించే దుకాణాల యజమానులు, ఉద్యోగులు, సందర్శకులను మార్కెట్‌ ప్రదేశాలకు అనుమతించకుండా చూడాలి.
  2. దుకాణాల ప్రవేశద్వారాల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌సహా ఉద్యోగులు/సందర్శకులు తప్పనిసరిగా చేతులు పరిశుభ్రం చేసుకునేలా (శానిటైజర్‌ డిస్పెన్సర్‌) ఉంచాలి. లక్షణాలు లేని ఉద్యోగులను/సందర్శకులను మాత్రమే దుకాణాల్లోకి అనుమతించాలి.
  3. అలాగే మాస్కులు/ముఖ కవచాలు ధరించిన ఉద్యోగులు/సందర్శకులను మాత్రమే అనుమతించాలి. వీటిని దుకాణం లోపల/వెలుపల ఎల్లప్పుడూ ధరించి ఉండేలా చూడాలి.
  4. ప్రవేశించే సమయంలో వరుసలో నిలిపేటపుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం నిర్వహణ కోసం సందర్శకులను వేర్వేరు సమయాల్లో అనుమతించాలి.
  5. దుకాణంలో భౌతిక దూరం నిబంధన పాటించేలా వినియోగదారులు కనీస సంఖ్యలో ఉండేలా చూడాలి.
  6. దుకాణాల్లో కుర్చీలు, బెంచీలు ఏవైనా ఉంటే వీలైనంత వరకూ వాటిమధ్య 6 అడుగుల దూరం ఉండేవిధంగా ఏర్పాటు చేయాలి.
  7. ఎలివేటర్లలో భౌతిక దూరం పాటించేలా వాటిలో వచ్చేవారి సంఖ్యను పరిమితం చేయాలి.
  8. ఎస్కలేటర్లపై మెట్టువిడిచి మెట్టుమీద ఒక్కరు మాత్రమే నిలబడేలా ప్రోత్సహించాలి.
  9. దుకాణదారు/సిబ్బంది తరచూ చేతులు కడుక్కునేలా/శానిటైజర్‌ వాడేలా చూడాలి.

  

***


(Release ID: 1677840) Visitor Counter : 211