ప్రధాన మంత్రి కార్యాలయం

ఆర్.ఈ-ఇన్వెస్ట్ 2020 సదస్సును ప్రారంభించిన - ప్రధానమంత్రి

మెగావాట్ల నుండి గిగావాట్ల ప్రణాళికలు వాస్తవరూపం దాలుస్తున్నాయి : ప్రధానమంత్రి


భారతదేశ ప్రతిష్టాపిత పునరుత్పాదక శక్తి సామర్థ్యం గత ఆరేళ్ళలో రెండున్నర రెట్లు పెరిగింది: ప్రధానమంత్రి


దృఢమైన పర్యావరణ విధానాలు కూడా దృఢమైన ఆర్ధిక వ్యవస్థలు కావచ్చని భారతదేశం నిరూపించింది : ప్రధానమంత్రి

Posted On: 26 NOV 2020 6:38PM by PIB Hyderabad

3వ అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన పెట్టుబడి సమావేశం మరియు ప్రదర్శన (ఆర్.ఈ-ఇన్వెస్ట్ 2020) ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, వీడియో కాన్ఫరెన్సు ద్వారా  ప్రారంభించారు.  ఈ సదస్సును నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.  "స్థిరమైన విద్యుత్తు పరివర్తన కోసం ఆవిష్కరణలుఅనే ఇతివృత్తంతోఆర్‌.-ఇన్వెస్ట్ 2020 సదస్సును నిర్వహించారు.   

ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మాట్లాడుతూ, పునరుత్పాదక ఇంధన రంగంలో, తక్కువ వ్యవధిలో ఉత్పత్తి సామర్థ్యంలో మెగావాట్ల నుండి గిగావాట్ల వరకు పురోగతి సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.  “ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్” అనేది వాస్తవరూపం దాలుస్తోందనీ, ఈ విషయాలన్నింటినీ గత సమావేశాల్లో చర్చించడం జరిగిందనీ, ఆయన తెలియజేశారు. గత 6 సంవత్సరాలలో భారతదేశం అసమానమైన మార్గంలో ప్రయాణిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.   భారతదేశంలోని ప్రతి పౌరుడు తన పూర్తి సామర్థ్యాన్నివినియోగించుకోడానికి వీలుగా విద్యుత్తును పొందేలా భారత ఉత్పాదక సామర్థ్యం మరియు నెట్‌వర్కు విస్తరిస్తోందని ఆయన పేర్కొన్నారు.  ఈ రోజు, భారతదేశం యొక్క పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం ప్రపంచంలో 4వ అతిపెద్దదిగా ఉన్నదనీ, అన్ని ప్రధాన దేశాలకంటే వేగంగా అభివృద్ధి చెందుతోందనీ, ఆయన పేర్కొన్నారు.  భారతదేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ప్రస్తుతం 136 గిగా వాట్సు కాగా, ఇది మన మొత్తం సామర్థ్యంలో 36 శాతంగా ఉంది.

భారతదేశం యొక్క వార్షిక పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2017 నుండి బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్తు కంటే ఎక్కువగా ఉందని ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.  గత 6 సంవత్సరాల్లో, భారతదేశం తన ప్రతిష్టాపిత సామర్థ్యాన్ని రెండున్నర రెట్లు పెంచిందన్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రధానంగా పేర్కొన్నారు.  భారతదేశానికి తగిన స్థోమత లేని సమయంలో కూడా, పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడి పెట్టడం వల్ల , అది ఇప్పుడు ఉత్పత్తి పెరగడానికీ, ఖర్చులు తగ్గడానికీ సహాయపడుతోందని ఆయన వివరించారు.  దృఢమైన పర్యావరణ విధానాలు కూడా దృఢమైన ఆర్ధిక వ్యవస్థలు కావచ్చని మనం ప్రపంచానికి చూపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.  ఇంధన సామర్థ్యం అనేది, ఒక మంత్రిత్వ శాఖకు లేదా విభాగానికి మాత్రమే పరిమితం కాదని మేము నిర్ధారించామని, బదులుగా ఇది మొత్తం ప్రభుత్వానికి లక్ష్యంగా ఉందని ఆయన అన్నారు.  మా అన్ని విధానాలకు శక్తి సామర్థ్యాన్ని సాధించాలనే పరిశీలన ఉంది.

ఎలక్ట్రానిక్సు తయారీలో పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు (పి.ఎల్.‌ఐ) పధకం విజయవంతం అయిన తరువాత, అధిక సామర్థ్యం గల సోలార్ మాడ్యూళ్ళకు కూడా ఇలాంటి ప్రోత్సాహకాలను అందించాలని తాము నిర్ణయించుకున్నామని ప్రధానమంత్రి తెలియజేశారు.  "సులభతర వ్యాపారం" అని భరోసా ఇవ్వడం మాకు అత్యంత ప్రాధాన్యత గల అంశమనీ, పెట్టుబడిదారులకు తగిన సౌకర్యాలు కల్పించటానికి అంకితమైన ప్రాజెక్టు అభివృద్ధి కేంద్రాలను స్థాపించడం జరిగిందనీ,  ఆయన స్పష్టం చేశారు.   వచ్చే దశాబ్దంలో భారీ పునరుత్పాదక ఇంధన విస్తరణ ప్రణాళికలు ఉన్నాయనీ, తద్వారా, సంవత్సరానికి 20 బిలియన్ డాలర్ల మేర వ్యాపార అవకాశాలను సృష్టించే అవకాశం ఉందనీ ప్రధానమంత్రి ప్రకటించారు. భారతదేశ పునరుత్పాదక ఇంధన ప్రయాణంలో భాగస్వాములు కావలసిందిగా, పెట్టుబడిదారులు, డెవలపర్లు, వ్యాపారాలను ఆయన ఆహ్వానించారు.

*****


(Release ID: 1676276) Visitor Counter : 278