ప్రధాన మంత్రి కార్యాలయం

భూటాన్ లో రెండోవిడత రూపే కార్డును అంతర్జాలం ద్వారా ఆవిష్కరించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన

Posted On: 20 NOV 2020 3:51PM by PIB Hyderabad

గౌరవనీయులైన ల్యోన్ ఛేన్ డాక్టర్ లోటే షేరింగ్,  

భారత్, భూటాన్ దేశాలకు సంబంధించిన విశిష్ట అతిథులందరికీ
నమస్కారం,
భారతీయులందరిపై ఉన్నట్లుగానే.. నాకు భూటాన్ అంటే కూడా విశేషమైన ప్రేమ, స్నేహ భావనలున్నాయి. అందుకే మీతో ఎప్పుడు మాట్లాడినా.. ఏదో ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది.
భారత్-భూటాన్ విశిష్టమైన సంబంధం, మన ప్రత్యేకమైన స్నేహం.. కేవలం ఇరు దేశాలకు విలువైనది మాత్రమే కాదు.. యావత్ ప్రపంచానికే ఓ చక్కటి ఉదాహరణగా మిగిలిపోయింది.
గతేడాది నా భూటాన్ పర్యటన స్మృతులు ఇంకా మదిలో మెదులుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే.. ప్రతి నిమిషం ఒక్కో ప్రత్యేకమే ఘట్టంగా, కొత్త ఉత్సాహాన్ని కలిగించేదిగా మొత్తం యాత్ర ఓ మధురానుభూతిగా మిగిలిపోయింది. డిజిటల్ అంతరిక్షం, ఆధునిక సాంకేతికత తదితర సరికొత్త రంగాల్లో మన బంధాన్ని బలోపేతం చేసుకున్నమహత్వపూర్ణమైన ఘట్టమది.
21వ శతాబ్దంలో రెండు దేశాల  మధ్య మరీ ముఖ్యంగా మన యువతరం కోసం ఈ అనుసంధానత సరికొత్త సూత్రంగా మారనుంది. నా భూటాన్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య రూపేకార్డు ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించాను. దీని ద్వారా భారతీయులకు భారతీయ బ్యాంకుల ద్వారా జారీ చేసిన కార్డులను భూటాన్‌లోనూ వినియోగించుకనే అవకాశం లభించింది. భూటాన్ లో ఇంతవరకు 11వేల రూపే కార్డుల లావాదేవీలు జరిగాయని తెలిసి చాలా సంతోషంగా ఉంది. కరోనా మహమ్మారి లేకపోతే.. ఈ సంఖ్య మరింత గణనీయంగా ఉండేదని నేను విశ్వసిస్తున్నాను.
ఇవాళ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రెండో విడతను కూడా ప్రారంభించుకుంటున్నాం. దీని ద్వారా రూపే నెట్ వర్క్ లో భూటాన్ ను ఓ పూర్తిస్థాయి భాగస్వామి హోదాలో స్వాగతిస్తున్నాం. ఈ సేవలకోసం శ్రమించిన భారతీయ, భూటాన్ అధికారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.
ఇవాళ్టినుంచి భూటాన్ నేషనల్ బ్యాంకు ద్వారా జారీ చేసే రూపే కార్డుల ద్వారా భారత్‌లోని లక్షకంటే ఎక్కువ ఏటీఎంలలో, 20 లక్షలకంటే ఎక్కువ పాయింట్ ఆఫ్ సేల్స్ టర్మినల్స్ వద్ద వీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. దీని ద్వారా భూటాన్ యాత్రికులకు భారత్‌లో విద్య, వైద్యం, పర్యాటకం, తీర్థయాత్రల సమయంలో ఇబ్బందులుండవని నేను విశ్వసిస్తున్నాను.
దీని ద్వారా భూటాన్ లో డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు కూడా వీలవుతుంది. కొన్నేళ్లుగా భారతదేశంలో డిజిటల్ లావాదేవీల్లో పెరుగుదల కారణంగా కోట్ల మంది జీవితాల్లో మార్పు వచ్చింది.
గౌరవనీయులైన పెద్దలు, మిత్రులారా,
మన మద్య అనుసంధానతను మరింత బలోపేతం చేసుకునే మరో రంగం అంతరిక్ష రంగం. భారతదేశం అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి కోసమే నిరంతరం వినియోగించింది. భారత్, భూటాన్ ఈ దిశగా మరింత భాగస్వామ్యంతో ముందుకెళ్తాయి.
గతేడాది నేను భూటాన్ లో దక్షిణ ఆసియా వినియోగం కోసం గ్రౌండ్ అర్త్ స్టేషన్ ను ప్రారంభించాను. ఈ స్టేషన్ ద్వార భూటాన్ ప్రసారమాధ్యమాలకోసం, ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం దక్షిణాసియా శాటిలైట్ ను మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకుంటోందని తెలిసి సంతోషిస్తున్నాను.
నిన్న మనం అంతరిక్ష క్షేత్ర శాంతిపూర్వక వినియోగంలో మన భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో ఓ ఫ్రేమ్ వర్క్ దస్తావేజుపై సంతకాలు చేసుకున్నాం. దీని ద్వారా ఇరుదేశాల విభిన్న సంస్థల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది. భారతదేశం ఇటీవలి కాలంలో అంతరిక్ష రంగంలో ప్రైవేటు వ్యాపారానికి దార్లు తెరిచింది. ఇది ఓ భారీ సంస్కరణ. దీని ద్వారా సామర్థ్యం, సృజనాత్మకత, నైపుణ్యత మరింత పెరుగుతుంది. వచ్చే ఏడాది ఇస్రో ద్వారా భూటాన్ కోసం శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపే కార్యక్రమంలో వేగవంతమైన పురోగతి ఉందని తెలిసి హర్షం వ్యక్తం చేస్తున్నాను.
ఇందుకోసం భూటాన్ నుంచి నలుగురు నిపుణులైన యువ అంతరిక్ష ఇంజనీర్లు డిసెంబర్లో ఇస్రోకు వెళ్తారు. ఆ నలుగురు యువకులకు అనేకానేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన, భూటాన్ రాజు గారికి భూటాన్ అభివృద్ధిలో అంతరిక్ష సాంకేతికత ఉపయోగాన్ని పెంచాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నారు, ఇందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తున్నారనే విషయం నాకు తెలుసు.
దీర్ఘదృష్టితో ఆయన చేస్తున్న ఆలోచనను సాకారం చేసేందుకు భారతదేశం తన అనుభవాన్ని, తనవద్దనున్న సౌకర్యాలను అందించేందుకు సర్వదా సిద్ధమేనని తెలియజేస్తున్నాను. దీంతోపాటుగా భూటాన్ లో ఐసీటీ ఆధారిత జ్ఞాన ఆధారిత సొసైటీని నిర్మించాలన్న వారి సంకల్పానికి కూడా మా మద్దతు ఉంటుంది. భూటాన్ కోసం థర్డ్ ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ గేట్ వే ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బీఎస్ఎన్ఎల్ తో జరిగిన ఒప్పందాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను.
గౌరవనీయులైన పెద్దలు, మిత్రులారా,
ఇంతటి సంతోషకర సమయంలో మనమంతా వ్యక్తిగతంగా కలిసి ఓ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసుకునేందుకు వీలుంటే బాగుంటేది. కానీ కరోనా కారణంగా ఇది సాధ్యపడలేదు.
కానీ.. సాంకేతిక పరమైన అంశాలకు సంబంధించిన కార్యక్రమాలను, సాంకేతిక వేదికలద్వారా జరుపుకోవడం కూడా ఓ రకంగా సరైనదేనని భావించాలి.
భూటాన్ ప్రజలు, ప్రభుత్వం.. కరోనా విపత్కర సమయంలో చూపించిన ధైర్యం, క్రమశిక్షణను నేను మన:పూర్వకంగా అభినందిస్తున్నాను. మీ అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని నా తరపున, 130కోట్ల మంది భారతీయుల తరపున హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.
ఇలాంటి విపత్కర సమయంలోనూ మేం భూటాన్ తో కలిసే ఉన్నామని, మీ ఆవశ్యకత మాకు ఎల్లపుడూ ప్రాథమిక అంశంగా ఉంటుందని మీకు విశ్వాసాన్ని కల్పిస్తున్నాను.
మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదములు, రాజకుటుంబ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ..
తాశీ దేలక్ (ధన్యవాదములు)

 

***



(Release ID: 1674821) Visitor Counter : 130