ప్రధాన మంత్రి కార్యాలయం

పట్టణీకరణలో పెట్టుబడులు పెట్టడానికి భారతదేశంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని పెట్టుబడిదారులకు పిలుపునిచ్చిన - ప్రధానమంత్రి
కోవిడ్ అనంతర ప్రపంచానికి అనుగుణంగా మనస్తత్వం మరియు అభ్యాసాలను సవరించుకోవలసిన అవసరం ఉంది

30 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులను సిద్ధం చేసిన - 100 స్మార్ట్ సిటీలు

తృతీయ వార్షిక బ్లూమ్‌బెర్గ్ నూతన ఆర్ధిక వేదికనుద్దేశించి ప్రసంగించిన - ప్రధానమంత్రి

Posted On: 17 NOV 2020 8:06PM by PIB Hyderabad

భారత పట్టణీకరణ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, పెట్టుబడిదారులను ఆహ్వానించారు.  ఈ రోజు తృతీయ వార్షిక బ్లూమ్‌బెర్గ్ నూతన ఆర్ధిక వేదిక నుద్దేశించి, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ,  "మీరు పట్టణీకరణ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నట్లయితే, భారతదేశంలో మీకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మీరు రవాణా రంగంలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నట్లయితే, భారతదేశంలో మీకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి.  మీరు ఆవిష్కరణల రంగంలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నట్లయితే,  భారతదేశంలో మీకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి.  మీరు స్థిరమైన పరిష్కారాలలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నట్లయితే,  భారతదేశంలో మీకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి.  ఈ అవకాశాలన్నీ ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్యంతో పాటు వస్తాయి.  వ్యాపారానికి అనువైన స్నేహపూర్వక వాతావరణం, భారీ మార్కెట్టు కలిగి ఉన్న భారతదేశాన్ని,  అందరూ ఇష్టపడే ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చడానికి ఉపయోగపడే ఏ అవకాశాన్నీ ప్రభుత్వం విడిచిపెట్టదు.” అని పేర్కొన్నారు.

కోవిడ్-19 అనంతర ప్రపంచాన్ని తాజాగా పునః ప్రారంభించవలసిన అవసరం ఉందనీ, అయితే తగిన సవరణ లేకుండా పునః ప్రారంభం సాధ్యం కాదని,  శ్రీ మోదీ అభిప్రాయ పడ్డారు. మనస్తత్వాన్ని సవరించుకోవాలనీ, ప్రక్రియలను సవరించాలనీ, అభ్యాసాలను సవరించుకోవాలనీ, అదేవిధంగా, ప్రతి రంగంలో కొత్త ఒడంబడికలను అభివృద్ధి చేసుకోడానికి ఈ మహమ్మారి మనకు అవకాశం కల్పించిందనీ, ఆయన వివరించారు. "భవిష్యత్తు కోసం స్థితిస్థాపక వ్యవస్థలను మనం అభివృద్ధి చేయాలనుకుంటే ఈ అవకాశాన్ని ప్రపంచం ఉపయోగించుకోవాలి. కోవిడ్ అనంతర ప్రపంచం యొక్క అవసరాల గురించి మనం ఆలోచించాలి. దీనికి, మన పట్టణ కేంద్రాల పునరుజ్జీవనం ఒక శుభారంభం కావాలి.” అని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.

పట్టణ కేంద్రాల పునరుజ్జీవనం అనే అంశాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, పూర్వ వైభవాన్ని సాధించే ప్రక్రియలో ప్రజల పూర్తి భాగస్వామ్యాన్ని నొక్కి చెప్పారు.  ప్రజలను అతిపెద్ద వనరులుగా, సమాజాలను అతి పెద్ద నిర్మాణ వ్యవస్థలుగా ప్రధానమంత్రి అభివర్ణిస్తూ, "సమాజాలు మరియు మన ప్రజలు మనకు అందుబాటులో ఉన్న అతి పెద్ద వ్యాపార వనరులుగా ఉన్నాయన్న సంగతిని, ఈ మహమ్మారి పునరుద్ఘాటించింది.  ఈ కీలకమైన, ప్రాథమిక వనరులను పెంపొందించుకోవడం ద్వారా కోవిడ్ అనంతర ప్రపంచాన్ని నిర్మించాలి.” అని పేర్కొన్నారు.

మహమ్మారి కాలంలో నేర్చుకున్న పాఠాలను ముందుకు తీసుకెళ్లవలసిన అవసరాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.  లాక్లా డౌన్ కాలంలో పరిశుభ్రమైన పర్యావరణం గురించి, ఆయన ప్రస్తావిస్తూ, పరిశుభ్రమైన వాతావరణం అనేది ఒక మినహాయింపు లేని ప్రమాణంగా నిలిచినప్పుడు, మనం స్థిరమైన నగరాలను నిర్మించగలమా? అని ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.  "ఒక నగరం యొక్క సౌకర్యాలు కలిగి ఉండి, ఒక గ్రామం యొక్క చైతన్యం కలిగిన ప్రాంతాలను పట్టణ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని, భారతదేశం కృషి చేస్తోంది." అని శ్రీ మోదీ తెలియజేశారు.

27 నగరాల్లో డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, అందుబాటు ధరల్లో గృహనిర్మాణం, రియల్ ఎస్టేట్ (నియంత్రణ) చట్టం మరియు మెట్రో రైల్ వంటి భారత పట్టణీకరణను పునరుజ్జీవింపజేయడానికి ఇటీవల చేపట్టిన కార్యక్రమాల గురించి, ఆయన వివరించారు.  "2022 నాటికి దేశంలో 1,000 కిలోమీటర్ల మెట్రో రైలు వ్యవస్థను అందజేసే లక్ష్యానికి చేరువలో ఉన్నాము." అని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. 

ప్రధానమంత్రి మాట్లాడుతూ “మేము రెండు దశల ప్రక్రియ ద్వారా 100 స్మార్ట్ సిటీలను ఎంచుకున్నాము.  ఇది సహకార మరియు పోటీ సమాఖ్యవాదం యొక్క తత్వాన్ని సమర్థించే దేశవ్యాప్త పోటీ.  ఈ నగరాలు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు లేదా 30 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులను సిద్ధం చేశాయి.  దాదాపు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు లేదా 20 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులు పూర్తయ్యాయి లేదా త్వరలో పూర్తికానున్నాయి.” అని తెలియజేశారు. 

*****(Release ID: 1673618) Visitor Counter : 8