ప్రధాన మంత్రి కార్యాలయం
భవిష్యత్తు అవసరాలను తీర్చగలిగే రెండు ఆయుర్వేద సంస్థలను ఆయుర్వేద దినం సందర్భం లో దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి
సాంప్రదాయక చికిత్సకు ప్రపంచ కేంద్రంగా భారతదేశాన్ని ఎంపిక చేసినందుకు డబ్ల్యుహెచ్ఒ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు
అంతర్జాతీయ ప్రమాణాలకు తులతూగే విధంగా ఆయుర్వేద పాఠ్య క్రమాన్ని సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు
ఆయుర్వేద ఒక ప్రత్యామ్నాయం మాత్రమే కాదని, దేశ ప్రజల ఆరోగ్యానికి ఒక కీలక ఆధారమని పేర్కొన్న ప్రధాన మంత్రి
కరోనా కాలం ఆయుర్వేద ఉత్పత్తుల వినియోగాన్ని, ఆ రంగంలో పరిశోధనల ను పెంచిందని స్పష్టీకరణ
Posted On:
13 NOV 2020 12:19PM by PIB Hyderabad
భవిష్యత్తు కాలం అవసరాలను తీర్చేందుకు సిద్ధమైన రెండు ఆయుర్వేద సంస్థల ను ఈ రోజున అయిదో ఆయుర్వేద దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశ ప్రజలకు అంకితం చేశారు. వాటిలో ఒకటి జామ్ నగర్ లో ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రిసర్చ్ ఇన్ ఆయుర్వేద (ఐటిఆర్ఎ), రెండోది జయ్ పుర్ లోని నేశనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎన్ఐఎ) ఈ రెండు సంస్థలు దేశంలో ప్రధాన ఆయుర్వేద సంస్థలు. ఒకటో సంస్థ అయిన ఐటిఆర్ఎ కు పార్లమెంటు లో చట్టం చేయడం ద్వారా జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థ ఐఎన్ఐ హోదాను కట్టబెట్టడం జరిగింది. ఇక రెండో సంస్థ అయిన ఎన్ఐఎ యూనివర్సిటీ గ్రాంట్ల సంఘం ద్వారా డీమ్‌డ్ టు బి యూనివర్సిటీ అనే స్థాయి దక్కింది. ధన్వంతరి జయంతి, ధన్ తేరస్ సందర్భంలో ‘ఆయుర్వేద దినోత్సవాన్ని’ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2016 నుంచి ఏటా జరుపుతూ వస్తోంది.
ఈ కార్యక్రమానికి కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ శ్రీపద్ యశో నాయిక్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లోత్, రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్ రాజ్ మిశ్రా, గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవ్ వ్రత్ లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ఒక వీడియో సందేశాన్ని పంపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయెసస్ ఆయుష్మాన్ భారత్ ద్వారా అందరికీ రక్షణ కల్పించడానికి ప్రధాన మంత్రి చాటిన నిబద్ధతను ప్రశంసించారు. అలాగే ఆరోగ్య సంబంధిత లక్ష్యాల సాధనకు గాను నిదర్శనాలపై ఆధారపడిన సాంప్రదాయక చికిత్సలను ప్రోత్సహించడానికి ప్రధాన మంత్రి చాటుతున్న నిబద్ధతను కూడా ఆయన ప్రశంసించారు. సాంప్రదాయక చికిత్సకు ప్రపంచ కేంద్రంగా భారతదేశాన్ని ఎంపిక చేసినందుకు డబ్ల్యుహెచ్ ఒ కు, ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ కు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఆయుర్వేద అనేది భారతదేశ వారసత్వాలలో ఒకటని, మరి భారతదేశ సాంప్రదాయక జ్ఞానం ఇతర దేశాలను కూడా సుసంపన్నం చేయడం సంతోషదాయకమైన విషయమని ఆయన అన్నారు.
ఆయుర్వేద జ్ఞానాన్ని పుస్తకాలు, ధర్మ గ్రంథాలు, గృహ చికిత్సల పరిధి నుంచి వెలికితీసుకువచ్చి ఈ పురాతన జ్ఞానాన్ని ఆధునిక కాలం అవసరాలకు తగ్గట్లు అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. 21వ శతాబ్దం తాలూకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం నుంచి అందుకొన్న సమాచారాన్ని మన ప్రాచీన వైద్య చికిత్సకు సంబంధించిన జ్ఞానం తో మిళితం చేయడం ద్వారా నూతన పరిశోధన సాగుతోందని ఆయన తెలిపారు. ఆయుర్వేదం ప్రస్తుతం కేవలం ఒక ప్రత్యామ్నాయం కాదని, అది దేశ ఆరోగ్య విధానం లో ఒక కీలక ఆధారంగా కూడా ఉందని ప్రధాన మంత్రి అన్నారు.
నేశనల్ సోవా-రిగ్పా ఇన్‌స్టిట్యూట్ ను లేహ్ లో ఏర్పాటు చేసేందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని శ్రీ మోదీ వెల్లడించారు. ప్రస్తుతం గుజరాత్ లో, రాజస్థాన్ లో ఉన్నతీకరించిన రెండు సంస్థలు కూడా ఈ అభివృద్ధి తాలూకు విస్తరణలో భాగంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
ఈ రెండు సంస్థలను ఉన్నతీకరించినందుకు ప్రధాన మంత్రి అభినందనలు తెలియజేస్తూ, ఇక వాటికి మరింత బాధ్యత తోడయిందని చెప్పారు. ఆ సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకొనే ఆయుర్వేద పాఠ్య క్రమాన్ని సిద్ధం చేస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆయుర్వేద ఫిజిక్స్, ఆయుర్వేద కెమిస్ట్రీ ల వంటి విభాగాల లో కొత్త అవకాశాలను కనుగొనవలసిందిగా విద్యా శాఖకు, యుజిసి కి కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ రంగంలో పాలుపంచుకోవడానికి ప్రైవేటు రంగం, స్టార్టప్ లు.. ఈ రంగంలో చోటు చేసుకొంటున్న ప్రపంచవ్యాప్త ధోరణులను, డిమాండ్లను అధ్యయనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంటు ఇటీవలే నేశనల్ కమిషన్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ను, నేశనల్ కమిషన్ ఆఫ్ హోమియోపతి ని స్థాపించిందని, జాతీయ విద్యా విధానం కూడా ఒక ఏకీకృత దృక్పథాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన చెప్పారు. ఆయుర్వేద విద్యలో అల్లోపతిక్ ప్రక్రియలు తప్పనిసరిగా ఒక భాగం కావాలన్నదే ఈ విధానం మౌలిక సంకల్పమని తెలిపారు.
కరోనా కాలంలో ఆయుర్వేద ఉత్పత్తులకు డిమాండు ప్రపంచం అంతటా శరవేగంగా పెరిగిందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో క్రితం సంవత్సరం కంటే ఆయుర్వేద ఉత్పత్తుల ఎగుమతులు దాదాపుగా 45 శాతం పెరిగాయని ఆయన తెలిపారు. పసుపు, అల్లం వంటి దినుసులు వ్యాధి నిరోధక శక్తిని పెంచేవిగా భావించినందువల్ల వాటి ఎగుమతిలో చెప్పుకోదగిన పెరుగుదల నమోదు కావడం ప్రపంచంలో భారతీయ మసాలా దినుసులు, ఆయుర్వేద చికిత్స మార్గాల పట్ల విశ్వాసాన్ని ఆమాంతం పెంచి వేశాయని ఈ పరిణామం చాటిచెప్తోందని కూడా ఆయన అన్నారు. ప్రస్తుతం అనేక దేశాలలో పసుపుకు సంబంధించిన ప్రత్యేక పానీయాలు ఎక్కువగా కోరుకొంటున్నారని, ప్రపంచంలోని ప్రతిష్టాత్మక చికిత్స పత్రికలు కూడా ఆయుర్వేదంలో ఒక కొత్త ఆశను రేకెత్తిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కరోనా కాలంలో శ్రద్ధ అంతా ఆయుర్వేద వినియోగానికే పరిమితం కాకుండా, దేశంలో, ప్రపంచంలో ఆయుష్ కు సంబంధించిన అధునాత పరిశోధన పై కేంద్రీకృతమైందని ఆయన అన్నారు.
ప్రస్తుతం భారతదేశం ఒకవైపు టీకా మందుల పై పరీక్షలు జరుపుతూనే, మరొకవైపున కొవిడ్ తో పోరాడటానికి సంబంధించిన ఆయుర్వేద పరిశోధనల లో అంతర్జాతీయ సహకారాన్ని కూడా పెంచుకొంటోందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం 100కు పైగా చోట్ల పరిశోధన కొనసాగుతోందని ఆయన చెప్పారు. అలాగే, ఢిల్లీ లోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ ఢిల్లీ పోలీసు సిబ్బంది 80 వేల మందికి వ్యాధి నిరోధకత కు సంబంధించిన పరిశోధనను నిర్వహించిందని ఆయన చెప్పారు. ఇది బహుశా ప్రపంచంలోకెల్లా సామూహిక అధ్యయనం అని, ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని తెలిపారు. రాబోయే కాలంలో మరిన్ని అంతర్జాతీయ పరీక్షలు మొదలవనున్నాయని కూడా ఆయన అన్నారు.
ప్రస్తుతం వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంలో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలకు తోడు, ఆయుర్వేద ఔషధాలు, మూలికలకు ప్రత్యేక ప్రాధాన్యాన్ని ఇస్తున్నట్లు ప్రధాన మంత్రి పేర్కొన్నారు. గంగానది తీర ప్రాంతాలలో, అలాగే హిమాలయ ప్రాంతాలలో ముతక ధాన్యాల ఉత్పత్తితో పాటు, సేంద్రీయ ఉత్పత్తులను కూడా పెంచేటట్లుగా రైతులను ప్రోత్సహించడం జరుగుతోందని ఆయన చెప్పారు. ప్రపంచ దేశాల లో వెల్‌నెస్ కోసం భారతదేశం మరింత ఎక్కువగా తోడ్పాటును అందించేలా ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని ఆయన చెప్పారు. మన ఎగుమతులు కూడా పెరగాలని, మన రైతుల ఆదాయం సైతం వృద్ధి చెందాలని ఆయన అన్నారు. కొవిడ్ మహమ్మారి మొదలైన తరువాతి కాలంలో అశ్వగంధ, తులసి తదితర ఆయుర్వేద మొక్కల ధరలు ఎంతో పెరిగాయని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. అశ్వగంధ ధర క్రిందటి ఏడాదితో పోల్చినప్పుడు రెండింతలకు పైగా పెరిగిందని, దీని తాలూకు ప్రత్యక్ష ప్రయోజనాన్ని ఓషధి మొక్కలను సాగు చేసే మన రైతులకు అందుతోందన్నారు.
భారతదేశంలో లభిస్తున్న అనేక ఓషధి మొక్కల ఉపయోగం తాలూకు చైతన్యాన్ని పెంచే దిశలో వ్యవసాయ శాఖ, ఆయుష్ శాఖ, ఇతర విభాగాలు కలసి పని చేయాలని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆయుర్వేదానికి సంబంధించిన యావత్తు వ్యవస్థ అభివృద్ధి చెందితే, దేశంలో ఆరోగ్యానికి సంబంధించిన పర్యటనకు ప్రోత్సాహం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. జామ్ నగర్ లోను, జయ్ పుర్ లోను ఈ రోజున ప్రారంభోత్సవం జరుపుకున్న రెండు సంస్థలు ఈ దిశలో కూడా లాభకారిగా నిరూపించుకొంటాయన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.
జామ్ నగర్ లోని ఐటిఆర్ఎ ను గురించి: పార్లమెంటు లో చట్టం చేయడం ద్వారా ఇటీవల స్థాపించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ ఎండ్ రిసర్చ్ ఇన్ ఆయుర్వేద (ఐటిఆర్ఎ) ఒక ప్రపంచశ్రేణి ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎదగడానికి సిద్ధంగా ఉంది. ఐటిఆర్ఎ లో 12 విభాగాలు, మూడు క్లినికల్ లేబరేటరీలు, మూడు పరిశోధన ప్రధాన ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి. ఈ సంస్థ సాంప్రదాయక చికిత్స రంగంలో సాగుతున్న పరిశోధన కృషి లో ఒక ప్రముఖ పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ 33 పరిశోధన పథకాలను నిర్వహిస్తోంది. జామ్ నగర్ లోని గుజరాత్ ఆయుర్వేద విశ్వవిద్యాలయ ఆవరణలో నాలుగు ఆయుర్వేద సంస్థలను కలిపివేసి ఐటిఆర్ఎ ను నెలకొల్పడమైంది. జాతీయ ప్రాధాన్యం కలిగిన సంస్థ (ఐఎన్ఐ) హోదాను పొందిన తొలి ఆయుష్ రంగ సంస్థ ఇదే. హోదాను ఉన్నతీకరించిన నేపథ్యంలో ఆయుర్వేద విద్య ప్రమాణాలను ఉన్నతీకరించడానికి ఐటిఆర్ఎ కు స్వతంత్ర ప్రతిపత్తి దక్కనుంది. ఈ సంస్థ ఆధునిక, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన పాఠ్య క్రమాలను అందించనుంది. పైపెచ్చు ఇది ఆయుర్వేద కు సమకాలీన ఉత్తేజాన్ని ఇచ్చేందుకు ఇంటర్‌డిసిప్లినరీ సహకారాలను ఏర్పరచుకోనుంది.
జయ్ పుర్ లోని ఎన్ఐఎ గురించి: దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన ఆయుర్వేద సంస్థ అయిన ఎన్ఐఎ డీమ్‌డ్ టు బి యూనివర్సిటీ (డి నోవో కేటగిరీ) హోదాను పొందడంతో ఎనలేని లబ్ధిని చేజిక్కించుకొంది. 175 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎన్ఐఎ గత కొన్ని దశాబ్దాల లో విశ్వసనీయ ఆయుర్వేద ను పరిరక్షించడంలో, ప్రచారం చేయడంలో, దీనిని ముందుకు తీసుకుపోవడంలో చెప్పుకోదగిన తోడ్పాటును అందించింది. ప్రస్తుతం ఎన్ఐఎ లో 14 వేరు వేరు విభాగాలు ఉన్నాయి. 2019-20 లో 75 ఫేకల్టీలు, 955 మంది విద్యార్థుల తో ఈ సంస్థ చాలా చక్కని విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిని నమోదు చేసింది. సర్టిఫికెట్ స్థాయి మొదలుకొని, వైద్యుని స్థాయి వరకు ఆయుర్వేద లో ఈ సంస్థ అనేక పాఠ్య క్రమాలను నిర్వహిస్తోంది. అత్యధునాతన ప్రయోగశాల సదుపాయాలు కలిగిన ఎన్ఐఎ పరిశోధన కార్యకలాపాలలో కూడా మార్గదర్శిగా ఉంది. డీమ్ డ్ టు ది యూనివర్సిటీ (డి నోవో కేటగిరీ) హోదా తో ఎన్ఐఎ తృతీయ ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిశోధన విభాగాల లో అత్యున్నత ప్రమాణాలను సాగించడం ద్వారా క్రొత్త శిఖరాలను అందుకోవడానికి సంసిద్ధంగా ఉంది.
***
(Release ID: 1672610)
Visitor Counter : 368
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam