ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర భారత్ -3వ దశలో పలు చర్యలను ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి
కొత్త పథకం “ఆత్మనిర్భర భారత్ రోజ్ గార్ యోజన” ప్రారంభం
ఎం.ఎస్.ఎం.ఇ.లకు, వ్యాపారాలకు, ముద్రా రుణ గ్రహీతలకు, వ్యక్తులకు వర్తించే ఇ.జి.ఎల్.ఎస్. గడువు మార్చి 31వరకూ పొడిగింపు... 20శాతం వరకూ అదనపు రుణం.
పది ప్రముఖ రంగాలకు రూ. 1.46లక్షల కోట్లమేరకు,. ఉత్పాదకతతో ముడివడిన ప్రోత్సాహకాలు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్)పథకానికి అదనంగా రూ. 18,000కోట్లు
ప్రభుత్వ టెండర్లపై అర్నెస్ట్ డిపాజిట్ మనీ, ఫర్మార్మెన్స్ సెక్యూరిటీ సడలింపు
సర్కిల్ రేటుకు, ఒప్పందం విలువకు మధ్య వ్యత్యాసాన్ని 20శాతానికి పెంచుతూ,.. స్థలాల డెవలపర్లకు, ఇంటి కొనుగోలుదార్లకు ఆదాయంపన్నులో వెసులుబాటు
జాతీయ పెట్టుబడి, మౌలిక సదుపాయాల నిధి (ఎన్.ఐ.ఐ.ఎఫ్.)కి చెందిన రుణ వేదికలో రూ. 6,000 కోట్లమేర ఈక్విటీ పెట్టుబడి
వ్యవసాయ రంగానికి అండగా రూ. 65,000కోట్ల విలువైన సబ్సిడీ ఎరువులు
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకానికి రూ. 10,000కోట్ల అదనపు పెట్టుబడి
ఎగుమతుల ప్రోత్సాహక పథకానికి రూ. 3,000కోట్లు. వర్ధమాన దేశాలకు సహాయం అందించడంద్వారా పథకం అమలు
పెట్టుబడికి, పారిశ్రామిక వ్యయంకోసం రూ. 10,200 కోట్లమేర బడ్జెట్ కు అదనంగా
Posted On:
12 NOV 2020 6:05PM by PIB Hyderabad
కోవిడ్ కారణంగా కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేసేందుకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 12 కీలకమైన చర్యలను, పథకాలను ప్రకటించారు. ప్రభుత్వ చేపట్టే చర్యల్లో భాగంగా ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ-3వ దశ కింద నిర్మలా సీతారామన్ రూ. 2.65లక్షల కోట్ల ఉద్దీపన చర్యలను ఆమె 2020 నవంబరు 12న ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, కోవిడ్-19 దాడితో దెబ్బతిన్న దేశ ఆర్థిక రంగం కోలుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు ప్రకటించిన ఉద్దీపన పథకాల మొత్తం విలువ ఇప్పటికి రూ. 29.87లక్షల కోట్లకు చేరిందని, స్థూల స్వదేశీ ఉత్పత్తి (జి.డి.పి.)లో15శాతానికి ఇది సమానమని చెప్పారు. జి.డి.పి.లో 9శాతం వరకూ సమామనమైన ఉద్దీపన పథకాలను స్వయంగా ప్రభుత్వం అందించిందన్నారు.
ఆత్మనిర్భర భారత్-3వ దశ కింద ప్రకటించిన 12రకాల చర్యలు ఈ కింది విధంగా ఉన్నాయి.
1) ఆత్మనిర్భర భారత్ రోజ్ గార్ యోజన
కోవిడ్-19 తాకిడినుంచి దేశం కోలుకుంటున్న దశలో ఇది ఉద్యోగాల కల్పనకు ప్రకటించిన కొత్త పథకం. ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఇ.పి.ఎఫ్.ఒ.) ద్వారా నమోదైన ఏదైనా సంస్థ కొత్తగా ఎవరినైనా ఇ.పి.ఎఫ్.ఒ. రిజిస్ట్రేషన్ లేకుండానే ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు, లేదా ఎవరైనా అంతకు ముందే ఉద్యోగం కొల్పోయినపుడు, అలాంటి వారికి ఈ పథకం వర్తిస్తుంది.
పథకం కింద ప్రయోజనం పొందే లబ్ధిదారులు/కొత్త ఉద్యోగులు:
- ఎవరైనా కొత్త ఉద్యోగి ఇ.పి.ఎఫ్.ఒ. పరిధిలో నమోదైన సంస్థల్లో రూ. 15,00వేతనం కంటే తక్కువ జీతానికి చేరినపుడు..అలాంటి ఉద్యోగులు..
- నెలకు రూ. 15,000 కంటే తక్కువ వేతనం తీసుకుంటూ, కోవిడ్ మహమ్మారి సంక్షోభం కారణంగా సదరు ఉద్యోగం కోల్పోయిన వారికి వర్తిస్తుంది. అయితే, వారు 2020 మార్చి 1నుంచి, 2020 సెప్టెంబరు 30 వతేదీ మధ్యకాలంలో ఉద్యోగం కోల్పోయినవారే ఉండాలి. అలాగే, 2020 అక్టోబరు 1న గానీ, ఆ తేదీ తర్వాత గానీ ఉద్యోగం పొంది ఉండాలి.
కొత్తగా ఉద్యోగంలో చేరిన అర్హులైన ఉద్యోగులు 2020 అక్టోబరు 1నగానీ, ఆ తర్వాత గానీ విధుల్లోకి చేరిన పక్షంలో వారికి రెండేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీ కూడా ఈ దిగువన సూచించిన వేతన స్కేలు ప్రకారం ఇస్తారు.:
- వెయ్యిమంది వరకూ ఉద్యోగులను నియమించుకునే సంస్థలు: ఉద్యోగుల వాటా (వేతనంలో 12శాతం), యాజమాన్యం వాటా (వేతనంలో 12శాతం). మొత్తంగా వేతనంలో 24 శాతం.
- వెయ్యి కంటే ఎక్కువమందిని నియమించుకునే సంస్థలు: కేవలం ఉద్యోగుల ఇ.పి.ఎఫ్. వాటా (ఇ.పి.ఎఫ్. వేతనంలో 12శాతం).
ఈ పథకం 2020 అక్టోబరు 1నుంచి అమలులోకి వచ్చినట్టుగా పరిగణిస్తారు. 2021 జూన్ 30వరకూ అమలులో ఉంటుంది. అయితే, ఇందుకు కొన్ని అర్హతా నియమాలను పాటించవలసి ఉంటుంది. అర్హులైన కొత్త ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల పాటు సబ్సిడీ అందిస్తుంది.
2) అత్యవసర గరిష్ట రుణ హామీ పథకం (ఇ.ఎల్.జి.ఎస్.)-సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎం.ఎస్.ఎం.ఇ.లకు), వ్యాపారాలకు, ముద్రా పథకం రుణ దరఖాస్తుదారులకు, వ్యక్తులకు (వ్యాపారాల నిమిత్తం రుణాలు), వీటిన్నింటి గడువును వచ్చే ఏడాది మార్చి 31వరకూ పొడిగించారు.
అత్యవసర గరిష్ట రుణ హామీ పథకం (ఇ.ఎల్.జి.ఎస్.) పథకాన్ని 2020 ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభించారు. ఆరోగ్య రక్షణ రంగంకోసం, కోవిడ్ కారణంగా రూ. 50కోట్లకు పైనా, రూ. 500కోట్లకు లోపుగా రుణాలు బకాయిపడి సంక్షోభంలో చిక్కుకున్న రంగాలకు సహాయం అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. కరోనాతో దెబ్బతిన్న సంస్థలకు ఈ పథకం కింద, అవి బకాయి పడిన రుణంలో 20శాతాన్ని అదనపు రుణంగా ఐదేళ్ల కాల వ్యవధితో అందిస్తారు. అసలు చెల్లింపునకు ఏడాది కాల మారటోరియం కూడా అమలు చేస్తారు. ఈ పథకం 2021 మార్చి 31వరకూ అందుబాటులో ఉంటుంది.
3) 10 ప్రమఖ రంగాలకు రూ. 1.46లక్షలకోట్ల మేర ఉత్పాదకతతో ముడివడిన ప్రోత్సాహకం
స్వదేశీ తయారీ రంగంలో పోటీ తత్వాన్ని అలవర్చి, ప్రోత్సాహం అందించేందుకు మరో 10 ప్రముఖ రంగాలకు ఉత్పాదకతతో ముడివడిన ప్రోత్సాహకాలు అందించే పథకాన్ని అమలు చేస్తారు. దీనితో ఆర్థిక వ్యవస్థకు, పెట్టుబడులకు, ఎగుమతులకు, ఉద్యోగాల కల్పనకు ఇతోదిక ప్రోత్సాహం లభిస్తుంది. ఆయా రంగాలకు రాబోయే ఐదేళ్ల కాలానికి దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ పథకం వర్తించే పది ప్రముఖ రంగాల్లో...అడ్వాన్స్ సెల్ కెమిస్ట్రీ బ్యాటరీ, ఎలక్ట్రానిక్/టెక్నాలజీ ఉత్పత్తులు, ఆటోమొబైల్స్-వాహనాల విడిభాగాలు, ఔషధ రంగం ఉత్పత్తులు, టెలికం-నెట్వర్కింగ్ ఉత్పత్తులు, జవుళి రంగ ఉత్పత్తులు, ఆహార ఉత్పాదనలు, సోలార్ పి.వి. మాడ్యూల్స్, ఎయిర్ కండిషనర్లు-ఎల్.ఇ.డి. లైట్లు, ప్రత్యేకమైన ఉక్కు ఉత్పత్తులు ఉన్నాయి.
4) పట్టణ ప్రాంతపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పి.ఎం.ఎ.వై-అర్బన్) పథకానికి రూ. 18,000కోట్ల అదనపు పెట్టుబడి.
పి.ఎం.ఎ.వై. అర్బన్ పథకానికి రూ. 18వేల కోట్ల మొత్తాన్ని పెట్టుబడిగా అందిస్తున్నారు. ఇందులో రూ. 8వేలికోట్లకు పైగా ఈ ఏడాదే కేటాయించారు. ఈ పథకం కింద 12లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు, 18లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు, అదనగా 78లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు, ఉక్కు, సిమెంటు ఉత్పత్తిని పెంపొందించేందుకు వీలు కలుగుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకోసం బహుముఖ ప్రభావాన్ని చూపుతుంది.
5) నిర్మాణ రంగానికి, మౌలిక సదుపాయాలకు మద్దతు–ప్రభుత్వ టెండర్లపై అర్నెస్ట్ డిపాజిట్ మనీ, ఫర్మార్మెన్స్ సెక్యూరిటీ నిబంధనల సడలింపు.
సులభతర వాణిజ్య నిర్వహణ ప్రక్రియకు దోహదపడేందుకు, ఇతర ప్రాజెక్టుల్లో తమ పెట్టుబడి చిక్కుకుపోయిన స్థితిలో ఉన్న కంట్రాక్టర్లకు వెసులుబాటు కల్పించేందుకు కాంట్రాక్టులపై ఫర్మార్మెన్స్ సెక్యూరిటీని 5-10శాతం నుంచి 3శాతానికి తగ్గించారు. ప్రస్తుతం అమలు జరిగే కాంట్రాక్టులకు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ వెసులుబాటును వర్తింపజేస్తారు. అర్నెస్ట్ డిపాజిట్ మనీ టెండర్ల స్థానంలో బిడ్ సెక్యూరిటీ డిక్లరేషన్ ప్రక్రియను అమలు చేస్తారు. ఇక సాధారణ ఆర్థిక పరిపాలనా నిబంధనల సడలింపు వెసులుబాటు వచ్చే ఏడాది డిసెంబరు నెలాఖరువరకూ అమలులో ఉంటుంది.
6) డెవలపర్లు, ఇళ్ల కొనుగోలు దార్లకు పన్ను వెసులుబాటు
రియల్ ఎస్టేట్ రంగంలో ఆదాయంపన్నుకు సంబంధించి సర్కిల్ రేటుకు, ఒప్పందం విలువకు మధ్య వ్యత్యాసాన్ని ఆదాయంపన్ను చట్టంలోని సెక్షన్ 43సి.ఎ. ప్రకారం 10శాతంనుంచి 20శాతానికి పెంచారు. రూ. 2కోట్ల వరకూ విలువైన నివాస యూనిట్ల (ఇళ్ల) ప్రాథమిక విక్రయం వరకూ ఈ వెసులుబాటు వర్తిస్తుంది. పథకం ప్రకటించిన తేదీనుంచి 2021 జూన్ 30వరకూ ఈ పథకం అమలులో ఉంటుంది. చివరి దశలో అందే 20శాతం వరకూ సహాయాన్ని కూడా ఈ ఇళ్ల కొనుగోలుదార్లకు అందుబాటులోకి తెస్తారు. ఆదాయంపన్ను చట్టంలోని 56(2)(x)వ సెక్షన్ కింద ఈ సదుపాయాన్ని వర్తింపజేస్తారు. మధ్యతరగతి ప్రజలు ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఈ ఆదాయం పన్ను వెసులుపాటు దోహదపడుతుంది.
7) మౌలిక సదుపాయాల పథకాలకు రుణసదుపాయం కోసం వేదిక
జాతీయ పెట్టుబడి, మౌలిక సదుపాయాల నిధి (ఎన్.ఐ.ఐ.ఎఫ్.)కి సంబంధించిన రుణ వేదికలో ప్రభుత్వం రూ. 6,000కోట్లమేర ఈక్విటీల రూపంలో పెట్టుబడి పెడుతుంది. 2025కల్లా మౌలిక సదుపాయాల పథకాలకు కోటీ 10లక్షల రూపాయల రుణాన్ని ఎన్.ఐ.ఐ.ఎఫ్. అందించేందుకు ఈ చర్య వీలు కల్పిస్తుంది.
8) సబ్సిడీ సదుపాయం ఉన్న రైతులకు వ్యవసాయానికి అండగా రూ. 65,00కోట్లు
దేశ వ్యవసాయ రంగంలో ఎరువుల వినియోగ గణనీయంగా పెరుగుతున్నందున, రానున్న పంట సీజన్లో రైతులకు సకాలానికి ఎరువులు దొరికేలా చూసేందుకు ఎరువుల సరఫరా మెరుగుదలకు రూ. 65,000కోట్లు అందిస్తున్నారు.
9) గ్రామీణ ఉపాధి కల్పనకు ప్రోత్సాహం:
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకోసం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజన కింద రూ. 10వేల కోట్ల అదనపు పెట్టుబడిని అందిస్తున్నారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థ వేగం పుంజుకోవడానికి ఈ చర్య దోహదపడుతుంది.
10) ఎగుమతుల పథకానికి ఊతం
భారతీయ అభివృద్ధి, ఆర్థిక సహాయ పథకం (ఐ.డి.ఇ.ఎ.ఎస్. పథకం )కింద ఎగుమతుల పథకం ప్రోత్సాహానికి ఎగుమతి, దిగుమతి బ్యాంకు (ఎగ్జిమ్ బ్యాంకు)కు రూ. 3వేల కోట్ల మేర అందిస్తున్నారు. ఎగ్జిమ్ బ్యాంకు గరిష్ట రుణ సహాయం అందించేందుకు, మన దేశంనుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఈ చర్య దోహదపడుతుంది.
11) పెట్టుబడికి, పారిశ్రామిక రంగానికి ఉద్దీపన
దేశీయంగా రక్షణ పరికరాల తయారీ, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పర్యావరణ హితమైన ఇంధనం వంటి అంశాల్లో పెట్టుబడి, పారిశ్రామిక వ్యయంకోసం రూ. 10,200కోట్లమేర అదనపు ఉద్దీపన చర్యలను బడ్జెట్ లో అదనంగా చేపడుతున్నారు.
12) కోవిడ్ టీకాకోసం పరిశోధనా, అభివృద్ధి గ్రాంటు
కోవిడ్ నిరోధానికి భారతీయ వ్యాక్సీన్ రూపకల్పనలో భాగంగా పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకోసం జీవరసాయన శాస్త్ర విభాగానికి రూ. 900కోట్లు అందిస్తున్నారు.
**********
(Release ID: 1672515)
Visitor Counter : 395
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada