ఆర్థిక సంఘం

2021-22 నుండి 2025-26 నివేదికను రాష్ట్రపతికి సమర్పించిన 15వ ఆర్థిక సంఘం

Posted On: 09 NOV 2020 1:00PM by PIB Hyderabad

ఛైర్మన్ శ్రీ ఎన్ కె సింగ్ నేతృత్వంలోని పదిహేనవ ఆర్థిక సంఘం (ఎక్స్‌విఎఫ్‌సి) ఈ రోజు 2021-22 నుండి 2025-26 కాలానికి సంబంధించిన తమ నివేదికను గౌరవ రాష్ట్రపతికి సమర్పించింది. కమిషన్ సభ్యులు శ్రీ అజయ్ నారాయణ్ ఝా, ప్రొఫెసర్ అనూప్ సింగ్, డాక్టర్ అశోక్ లాహిరి, డాక్టర్ రమేష్ చంద్‌తో పాటు కమిషన్ కార్యదర్శి శ్రీ అరవింద్ మెహతా కూడా రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. 

ఉల్లేఖన నిబంధనల (టీఓఆర్) ప్రకారం, 2020 అక్టోబర్ 30 నాటికి 2021-22 నుండి 2025-26 వరకు ఐదేళ్లపాటు కమిషన్ తన సిఫారసులను సమర్పించడం తప్పనిసరి. గత సంవత్సరం, కమిషన్ 2020-21 సంవత్సరానికి సిఫారసులతో కూడిన నివేదికను సమర్పించింది, దానిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది, 30 జనవరి 2020 న పార్లమెంటులో ప్రవేశపెట్టింది.

అనేక ప్రత్యేకమైన, విస్తృతమైన సమస్యలపై సిఫారసులను ఇవ్వమని కమిషన్ ను కేంద్రం కోరింది. పై నుండి కింది వరకు మరియు సమాంతర పన్ను పంపిణీ, స్థానిక ప్రభుత్వ నిధులు, విపత్తు నిర్వహణ గ్రాంట్ తో పాటు విద్యుత్ రంగం, డిబిటి స్వీకరణ, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ వంటి అనేక రంగాలలో రాష్ట్రాలకు పనితీరు ప్రోత్సాహకాలను పరిశీలించి సిఫారసు చేయాలని కమిషన్ ను కోరింది. రక్షణ మరియు అంతర్గత భద్రతకు నిధులు సమకూర్చడానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలా అని పరిశీలించమని అడిగారు. ఈ నివేదికలోని అన్ని టీఓఆర్ లకు తగు విధంగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వం కమిషన్ ను కోరింది.

ఈ నివేదిక నాలుగు సంపుటలలో రూపొందించారు. వాల్యూమ్ I మరియు II, గతంలో మాదిరిగా, ప్రధాన నివేదిక, దానితో కూడిన అనుబంధాలను కలిగి ఉన్నాయి. వాల్యూమ్ III కేంద్ర ప్రభుత్వానికే పూర్తిగా కేటాయించారు, మధ్యంతర సవాళ్లతో పాటు, కీలక విభాగాల లోతైన పరిశీలన, రోడ్ మ్యాప్ గురించి వివరించారు. వాల్యూమ్ IV పూర్తిగా రాష్ట్రాలకు కేటాయించారు. కమిషన్ ప్రతి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చాలా లోతుగా విశ్లేషించింది,  ఒక్కొక్క రాష్ట్రం ఎదుర్కొంటున్న ముఖ్య సవాళ్లను పరిష్కరించడానికి రాష్ట్ర-నిర్దిష్ట పరిశీలనలను కమిషన్ తన నివేదికలో పొందుపరిచింది. 

రిపోర్టులో ఉన్న సిఫారసులపై వివరణాత్మక మెమోరాండం / చేపట్టిన చర్యలను నివేదికతో పాటు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఈ నివేదిక ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ నివేదిక ముఖచిత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. “కోవిడ్ టైమ్స్‌లోని ఫైనాన్స్ కమిషన్” అన్న ప్రధాన శీర్షిక ఉంటుంది. అలాగే రాష్ట్రాలు మరియు కేంద్రం మధ్య సమతుల్యతను సూచించే త్రాసును ముద్రించారు. 




*****



(Release ID: 1671425) Visitor Counter : 603