యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

ఆరు ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి ఎక్సలెన్స్‌ కేంద్రాలకు, నాలుగేళ్ల కాలానికి ఆర్థిక సహాయంగా 67.32 కోట్ల రూపాయల బడ్జెట్‌ను మంజూరు చేసిన - కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ

Posted On: 07 NOV 2020 4:38PM by PIB Hyderabad

క్రీడా మంత్రిత్వ శాఖ, దేశంలోని ఆరు కేంద్రాలను ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి ఎక్సలెన్స్ కేంద్రాలు (కె.ఐ.ఎస్.సి.ఈ.లు) గా ఆమోదించింది. వాటిని 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాల కాలంలో 67.32 కోట్ల రూపాయల ఏకీకృత బడ్జెట్ అంచనాతో,  క్రీడాకారులను గుర్తించి వారిని ఒలింపిక్ స్థాయి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే విధంగా, అభివృద్ధి చేయడం జరుగుతుంది.

ప్రతి రాష్ట్రంలో గుర్తించిన కేంద్రాలు మరియు వాటికి సమకూర్చిన ఆర్థిక సహాయం:

అస్సాం :  రాష్ట్ర క్రీడా అకాడమీ, సరుజజై -  7.96 కోట్ల రూపాయలు. 

మేఘాలయ : జె.ఎన్.ఎస్. కాంప్లెక్స్, షిల్లాంగ్, మేఘాలయ - 8.39 కోట్ల రూపాయలు.

డామన్-డియు : న్యూ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సిల్వాస్సా - 8.05 కోట్ల రూపాయలు. 

మధ్యప్రదేశ్ : ఎం.పి. రాష్ట్ర అకాడమీ - 19 కోట్ల రూపాయలు. 

మహారాష్ట్ర : శ్రీ శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బాలేవాడి, పూణే - 6 కోట్ల రూపాయలు. 

సిక్కిం : పాల్జోర్ స్టేడియం, గ్యాంగ్‌టాక్ - 7.91 కోట్ల రూపాయలు.

ఈ విషయమై కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు మాట్లాడుతూ, "దేశవ్యాప్తంగా క్రీడా నైపుణ్యంతో కూడిన కేంద్రాలను అభివృద్ధి చేయడం, 2028 ఒలింపిక్స్ క్రీడల్లో భారతదేశాన్ని మొదటి 10 స్థానాల్లో ఒకటిగా మార్చాలనే ఆశయానికి ఒక ముందడుగు.  ప్రపంచ స్థాయి ప్రత్యేక శిక్షణ సమకూర్చితే తప్ప, మన అథ్లెట్లు ఒలింపిక్స్‌లో రాణిస్తారని మనం ఊహించలేము.  ఈ కేంద్రాలలో ప్రతి ఒక్కటి ఒక నిర్దిష్ట క్రీడా విభాగంలో ప్రపంచ స్థాయి శిక్షణను అందిస్తుంది. ఆ క్రీడలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు ఉన్నత శిక్షణ పొందుతారు, అప్పుడు దేశంలో ఆ శిక్షణ ఒక  ప్రధాన సదుపాయంగా మారుతుంది.  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రతి రాష్ట్రం ఎంతో సానుకూలత మరియు ఉత్సాహంతో మద్దతు ఇవ్వడం నాకు సంతోషంగా ఉంది." అని పేర్కొన్నారు. 

ఈ కేంద్రాలకు సమకూర్చే మద్దతు మౌలిక సదుపాయాల పెంపు, క్రీడా విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు, నైపుణ్యం కలిగిన శిక్షకులతో పాటు, ఫిజియోథెరపిస్టులు, దేహ దారుఢ్యం, కండిషనింగ్ నిపుణులు వంటి క్రీడా విజ్ఞాన మానవ వనరుల అందుబాటు  రూపంలో ఉంటుంది. క్రీడాకారులకు అధిక నాణ్యత గల పరికరాలు కూడా అందించబడతాయి.  క్రీడా విజ్ఞానానికి సంబంధించిన పరికరాలు, పనితీరు నిర్వహణ యొక్క నాణ్యతను నిర్ధారించడానికి అకాడమీలో ఉన్నతమైన అనుభవం కలిగిన మేనేజర్ కూడా ఉంటారు.

క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో, ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో ఇప్పటికే ఉన్న క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. మొత్తం దేశవ్యాప్తంగా బలమైన క్రీడా పర్యావరణ వ్యవస్థను సృష్టించాలనే లక్ష్యంతో కె.ఐ.ఎస్.సి.ఈ. లను సృష్టిస్తోంది.  ప్రతి కే.ఐ.ఎస్.సి.ఈ. 14 ఒలింపిక్ క్రీడలలో క్రీడల-నిర్దిష్ట మద్దతుతో విస్తరించబడుతుంది, వీటిలో ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో గరిష్టంగా మూడు క్రీడలకు మద్దతు ఇవ్వబడుతుంది.

*****


(Release ID: 1671081) Visitor Counter : 206