ప్రధాన మంత్రి కార్యాలయం

వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ కు అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి

ఇన్వెస్టర్లకు భారతదేశం ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండు, వైవిధ్యం అందిస్తోంది :  ప్రధానమంత్రి 

భారీ నగరాల మీదే దృష్టి పెట్టకండి, చిన్న నగరాలు, పట్టణాలను కూడా చూడాలని ఇన్వెస్టర్లకు పిలుపు

విశ్వసనీయమైన రాబడులు, ప్రజాస్వామ్యంతో కూడిన డిమాండు, సుస్థిరతతో కూడిన స్థిరత్వం, హరిత వైఖరితో వృద్ధిని భారతదేశం హామీ ఇస్తోంది :  ప్రధానమంత్రి

ప్రపంచ వృద్ధి పునరుజ్జీవానికి భారతదేశం ఎంత వాటా అందించగలదో అంత అందించేలా ప్రభుత్వం చేస్తుంది :    ప్రధానమంత్రి

గత ఏడాదితో పోల్చితే గత 5 నెలల కాలంలో ఎప్ డిఐలు 13 శాతం పెరిగాయి :  ప్రధానమంత్రి

ఆత్మనిర్భర్ భారత్ ఒక విజన్ మాత్రమే కాదు, చక్కని ప్రణాళికతో కూడిన ఆర్థిక వ్యూహం :  ప్రధానమంత్రి

Posted On: 05 NOV 2020 8:50PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ వ‌ర్చువ‌ల్ గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ రౌండ్ టేబుల్ స‌మావేశానికి గురువారం సాయంత్రం అధ్య‌క్షత వ‌హించారు.

ఈ స‌మావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఏడాది అంత‌ర్జాతీయ మ‌హ‌మ్మారితో భార‌త‌దేశం సాహ‌సోపేతంగా పోరాడిందంటూ ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచం యావ‌త్తు భార‌త‌దేశ జాతీయ‌తా స్వ‌భావాన్ని, వాస్తవ బ‌లాల‌ను వీక్షించింద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. బాధ్య‌తాయుత వైఖ‌రి, తోటి పౌరుల ప‌ట్ల సానుభూతి, జాతీయ ఐక్యత, న‌వ‌క‌ల్పనల వెల్లువ వంటి భార‌తీయుల స‌హ‌జ‌సిద్ధ‌మైన ల‌క్ష‌ణాలు  విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శితం అయ్యాయ‌ని ఆయన చెప్పారు. 

ఒక ప‌క్క ఆర్థిక స్థిర‌త్వాన్ని కాపాడుకుంటూనే వైర‌స్ తో భార‌త్ పోరాడి త‌ట్టుకుని నిల‌బ‌డింద‌ని ప్ర‌ధాన‌మంత్రి వ్యాఖ్యానించారు. భారత వ్య‌వ‌స్థ‌ల్లోని బ‌లం, ప్రజల మ‌ద్ద‌తు, ప్ర‌భుత్వ విధానాల్లోని స్థిర‌త్వం కార‌ణంగానే వైర‌స్ దాడిని భార‌త్ ఇంత దీటుగా ఎదుర్కొని నిల‌వ‌గ‌లిగింద‌ని ఆయన చెప్పారు.

కాలం చెల్లిపోయిన విధానాల నుంచి విముక్తి సాధిస్తూ నేటి న‌వ‌భార‌తం నిర్మాణం అవుతున్న‌ద‌ని, మ‌రింత మెరుగైన భ‌విష్‌్త్తుకు స‌మాయ‌త్తం అవుతున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి  అన్నారు. భార‌త‌దేశం ఆవిష్క‌రించిన ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ భ‌విష్య‌త్ దృక్కోణం మాత్ర‌మే కాదని స్ప‌ష్టం చేస్తూ అది ప‌టిష్ఠ‌మైన ప్ర‌ణాళిక‌తో కూడిన ఆర్థిక వ్యూహ‌మ‌ని వివ‌రించారు. భారత వ్యాపార సంస్థల సామ‌ర్థ్యాలను, కార్మికుల నైపుణ్యాల‌ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవ‌డం ద్వారా అంత‌ర్జాతీయ త‌యారీ కేంద్రంగా భారత ను అభివృద్ధి చేయ‌డం ఈ వ్యూహంలో కీల‌కాంశ‌మ‌ని ఆయన నొక్కి చెప్పారు. అలాగే టెక్నాల‌జీ రంగంలో భార‌త‌దేశానికి గల బ‌లాన్నిప్ర‌పంచ ఇన్నోవేష‌న్ కేంద్రంగా అభివృద్ధి చేయ‌డానికి ఉప‌యోగించుకోవాల‌ని, త‌మ‌కు గల అపార‌మైన మానవ వ‌న‌రులు, ప్ర‌తిభ‌ను ప్ర‌పంచాభివృద్ధికి చోద‌క‌శ‌క్తిగా వినియోగించాల‌ని భావిస్తున్న‌ట్టు శ్రీ మోదీ తెలిపారు.

ప‌ర్యావరణ, సామాజిక, పాల‌నాప‌రంగా (ఇఎస్ జి) ఉన్నత స్కోరింగ్ సాధించిన కంపెనీల్లో పెట్టుబ‌డుల‌కు నేటి ఇన్వెస్ట‌ర్లు ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. అలాంటి విధానాలు ఆచ‌ర‌ణీయంగా ఉన్న దేశాల్లో భార‌త‌దేశం ఒక‌ట‌ని, దేశంలోని కంపెనీలు అత్యున్న‌త‌మైన ఇఎస్ జి స్కోరింగ్ క‌లిగి ఉన్నాయ‌ని ఆయన చెప్పారు. ఇఎస్ జికి స‌మాన‌మైన ప్రాధాన్యం ఇస్తూ వృద్ధిప‌థంలో ప‌య‌నించ‌డాన్ని భార‌త‌దేశం విశ్వ‌సిస్తున్న‌ద‌ని ఆయన తెలిపారు.

ఇన్వెస్టర్లకు భారతదేశం ప్రజాస్వామ్యం, ప్రజాబలం, డిమాండు, వైవిధ్యం అందిస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. “ఒకే మార్కెట్లో బహుళ మార్కెట్లు గల వైవిధ్యభరితమైన స్వభావం భారతదేశానిది. ఈ మార్కెట్లో భిన్న ప్రాధాన్యతలు, భిన్న కొనుగోలు సామర్థ్యాలు గల వారున్నారని, అలాగే బహుళ వాతావరణ పరిస్థితులు, బహుళ అభివృద్ధి స్థాయిలు ఈ మార్కెట్ ప్రత్యేకత” అని వివరించారు.

విభిన్న సమస్యలకు దీర్ఘకాలిక, సుస్థిరమైన సొల్యూషన్లు అందించడం, ఇన్వెస్టర్ల అవసరాలకు దీటైన పరిష్కారాలతో కూడిన విశ్వసనీయమైన నిధుల కల్పన, పెట్టుబడులపై గరిష్ఠ, సురక్షిత దీర్ఘకాలిక రాబడులు అందేలా చూడడం ప్రభుత్వ వైఖరి అని ప్రధానమంత్రి వివరించారు. వ్యాపారానుకూలతను మెరుగుపరిచేందుకు, తయారీ సామర్థ్యాలను విస్తరించడానికి ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన వివరించారు.

“మీ తయారీ సామర్థ్యాలను మరింతగా మెరుగుపరిచేందుకు మేం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఒకే జాతి, ఒకే పన్ను వ్యవస్థ సిద్ధాంతానికి కట్టుబడి జిఎస్ టి విధానం, అత్యంత కనిష్ఠ స్థాయిలో కార్పొరేట్ పన్నులు, కొత్త తయారీ యూనిట్లకు ప్రోత్సాహకాలు,  ఐటి అసెస్ మెంట్, అప్పీళ్లకు ఫేస్ లెస్ వ్యవస్థ;  కార్మిక శక్తి సంక్షేమం, యాజమాన్యాలకు వ్యాపారానుకూలత రెండూ సమానంగా అందించే సమతూకమైన కార్మిక చట్టాలు వాటిలో కొన్ని. అంతే కాదు ఎంపిక చేసిన రంగాల్లో ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాలందించే పథకం, ఇన్వెస్టర్లకు చక్కని మార్గదర్శకం అందించగల సంస్థాగత వ్యవస్థ కూడా భారతదేశంలో ఉంది” అన్నారు.

జాతీయ మౌలిక వసతుల అభివృద్ధి వ్యవస్థలో 1.5 లక్షల కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేయాలన్న బృహత్  ప్రణాళికను భారత్ నిర్దేశించుకున్నదని ప్రధానమంత్రి చెప్పారు. ఆర్థిక వృద్ధిలో వేగం పెంచడంతో పాటు పేదరిక నిర్మూలనకు దోహదపడే విధంగా చేపట్టిన వివిధ  సామాజిక, ఆర్థిక మౌలిక వసతుల ప్రాజెక్టుల గురించి వివరించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జాతీయ రహదారులు, రైల్వే, మెట్రో, జలమార్గాలు, విమానాశ్రయాల వంటి మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతోందని ఆయన చెప్పారు. అలాగే నవ మధ్యతరగతి ప్రజలకోసం లక్షల సంఖ్యలో అఫర్డబుల్ గృహాల నిర్మాణం చేపట్టామని ఆయన తెలిపారు. పెద్ద నగరాల్లోనే కాకుండా చిన్న నగరాలు, పట్టణాల్లో కూడా పెట్టుబడులపై దృష్టి సారించాలని ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు. ఇలాంటి నగరాలు, పట్టణాల అభివృద్ధికి ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన పథకాలను వివరించారు.
ఆర్థిక రంగం అభివృద్ధికి చేపట్టిన సంపూర్ణ వ్యూహాన్ని కూడా ప్రధానమంత్రి వివరించారు.  బ్యాంకింగ్ రంగంలో సమగ్ర  సంస్కరణలు, ఆర్థిక మార్కెట్ల పటిష్ఠత,  అంతర్జాతీయ ఆర్థిక సర్వీసుల కేంద్రానికి ఉమ్మడి యంత్రాంగం, అత్యంత సరళమైన ఎఫ్ డిఐ విధానం, విదేశీ పెట్టుబడులకు అనుకూలమైన పన్ను వ్యవస్థతో పాటుగా మౌలిక వసతుల పెట్టుబడి నిధి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్టులకు అనుకూలమైన విధానం, దివాలా-బ్యాంక్రప్టసీ చట్టం, ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో ఆర్థిక సాధికారత;  ఫిన్ టెక్ శక్తితో  రుపేకార్డులు, భీమ్-యుపిఐ చెల్లింపు వ్యవస్థ వంటి ఎన్నో సానుకూలతలు భారత్ లో ఉన్నట్టు ఆయన చెప్పారు.

నవ్యత, డిజిటల్ ఆధారిత వ్యవస్థలు ప్రభుత్వ విధానాలు, సంస్కరణలకు  కేంద్రంగా ఉన్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ప్రపంచంలో స్టార్టప్ లు, ప్రత్యేక స్వభావం గల యునికార్న్ లు అధిక సంఖ్యలో గల, అవి త్వరితగతిన విస్తరిస్తున్న కొన్ని దేశాల్లో భారత్ ఒకటని చెప్పారు. ప్రైవేటు రంగ సంస్థలు పని చేయడానికి ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల గురించి కూడా ప్రధానమంత్రి వివరించారు. ఈ రోజు భారతదేశంలో తయారీ, మౌలిక వసతులు, టెక్నాలజీ, వ్యవసాయం, ఫైనాన్స్ తో పాటు ఆరోగ్యం, విద్య వంటి సామాజిక వ్యవస్థలు మరింత వృద్ధిపథంలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.  

ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణలు భారత రైతులతో అంతర్జాతీయ భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు అపారమైన అవకాశాలను అందుబాటులోకి తెచ్చాయని ఆయన అన్నారు. టెక్నాలజీ, ఆధునిక ప్రాసెసింగ్ విధానాలతో భారతదేశం త్వరలో వ్యవసాయ ఎగుమతుల కేంద్రంగా మారబోతున్నదని చెప్పారు. ఇటీవల ఆవిష్కరించిన జాతీయ విద్యావిధానం దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలు క్యాంపస్ లు ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించిందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు భారతదేశం భవిష్యత్తు పట్ల ప్రదర్శిస్తున్న విశ్వాసానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడాదితో పోల్చితే గడిచిన ఐదు నెలల కాలంలో భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 13 శాతం పెరిగాయని ఆయన చెప్పారు.

పెట్టుబడులపై విశ్వసనీయమైన రాబడులు,ప్రజాస్వామ్యంతో కూడిన డిమాండు, సుస్థిరత ఆధారిత స్థిరత్వం, హరిత కేంద్రీకృత వృద్ధి గల ప్రదేశం కావాలని కోరుకుంటే భారత్ ను మించిన గమ్యం లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక  పునరుజ్జీవానికి దోహదపడగల వృద్ధి సామర్థ్యం భారతదేశానికి ఉందని ఆయన చెప్పారు. భారతదేశం విజయం ప్రపంచ అభివృద్ధి, సంక్షేమంపై  ఉంటుందని  ఆయన అన్నారు. చలనశీలత కలిగిన శక్తివంతమైన భారతదేశం అంతర్జాతీయ ఆర్థిక రంగం స్థిరత్వానికి దోహదపడుతుందని ఆయన చెప్పారు. అంతర్జాతీయ వృద్ధిని పునరుద్దీపింపచేయడానికి  భారత ప్రభుత్వం ఏం చేయగలదో అదంతా తాము చేస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.

ఈ సమావేశం ముగిసిన అనంతరం సిపిపి ఇన్వెస్ట్ మెంట్స్ ప్రెసిడెంట్, సిఇఓ మార్క్ మాచిన్ స్పందిస్తూ “విజిఐఆర్ రౌండ్ టేబుల్సమావేశం అత్యంత ఉత్పాదకంగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, అందుకు అంతర్జాతీయ సంస్థాగత పెట్టుబడులను పెంచుకోవడంపై ప్రభుత్వ ఆలోచనలు చక్కగా ఆవిష్కరించారు. మా దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహం, వృద్ధి మార్కెట్లపై మా ఫోకస్, మౌలిక వసతులు, పారిశ్రామిక, వినియోగ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్న మా ఆకాంక్ష నెరవేరడానికి భారతదేశం అత్యంత కీలకం” అన్నారు.  

“సిపిడిక్యుకి భారత మార్కెట్ అత్యంత కీలకం. పునరుత్పాదక ఇంధనాలు, లాజిస్టిక్స్, ఆర్థిక సర్వీసులు, టెక్నాలజీ ఆధారిత సర్వీసుల రంగాల్లో మేం కోట్లాది డాలర్లు ఇన్వెస్ట్ చేశాం. రాబోయే సంవత్సరాల్లో కూడా మా అస్తిత్వాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాం. భారత ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు గల అవకాశాలపై చర్చించేందుకు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తల సమావేశం ఏర్పాటు చేసినందుకు ప్రధానమంత్రి శ్రీ మోదీకి, ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను” అని కాసీ డి డిపో ఎల్ ప్లేస్ మెంట్ డ్యు క్యుబెక్ (సిపిడిక్యు) ప్రెసిడెంట్, సిఇఓ చార్లెస్ ఎడ్మండ్ అన్నారు.
టెక్సాస్ టీచర్ రిటైర్మెంట్ వ్యవస్థ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ జేస్ ఆబీ భారతదేశం పైన, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తన భాగస్వామ్యంపై అభిప్రాయం ప్రకటిస్తూ “2020 వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అభివృద్ధి పథంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు, మార్కెట్ల నుంచి అధిక ప్రయోజనం ఆశిస్తూ పెన్షన్ ఫండ్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడతారు. భారతదేశం చేపట్టిన వ్యవస్థాత్మక సంస్కరణలు భవిష్యత్తులో అధిక వృద్ధికి పునాదిగా నిలుస్తాయి” అన్నారు. 

 


(Release ID: 1670556) Visitor Counter : 247