జల శక్తి మంత్రిత్వ శాఖ
జల్ జీవన్ మిషన్ పురోగతిని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులతో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సమీక్షించారు; కోవిడ్-19 మహమ్మారి ఉన్నప్పటికీ గ్రామీణ గృహాలకు ట్యాప్ కనెక్షన్లు అందించడానికి చేపట్టిన ఆదర్శప్రాయమైన కృషిని ప్రశంసించారు.
జల్ జీవన్ మిషన్ జీవన సౌలభ్యాన్నీ, జీవిత నాణ్యతనూ మెరుగుపరుస్తుంది; గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది: శ్రీ షెఖావత్
Posted On:
03 NOV 2020 5:09PM by PIB Hyderabad
అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రులతో ఈ రోజు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సుకు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి, శ్రీ గజేంద్ర సింగ్ షేఖావత్, అధ్యక్షత వహించి, 2024 నాటికి ప్రతి గ్రామీణ గృహాల్లో కుళాయి ద్వారా నీటి కనెక్షన్‌ను అందించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమం, "జల్ జీవన్ మిషన్" అమలు పురోగతిని సమీక్షించారు. ఈ ఆన్ లైన్ సమావేశంలో, కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి, శ్రీ రతన్ లాల్ ఖతారియా, హర్యానా, త్రిపుర ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. గ్రామాల్లో మిగిలిన గృహాలకు త్వరగా పంపు నీటి కనెక్షన్లు ఇవ్వడానికి వీలుగా, ఈ పధకం కింద ఇప్పటివరకు చేసిన ప్రణాళిక, అమలు విధానం, పురోగతి, భవిష్యత్ ప్రణాళిక వంటి వివిధ అంశాలు, సమస్యలపై చర్చించడం కోసం ఈ సదస్సును ఏర్పాటుచేయడం జరిగింది.
ఈ సదస్సుకు హాజరైన వారిని ఉద్దేశించి, కేంద్ర జల శక్తి శాఖ మంత్రి ఆన్ లైన్ ద్వారా మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ కాలంలో గ్రామీణ గృహాలకు ట్యాప్ కనెక్షన్లు అందించడానికి, ఆదర్శప్రాయమైన కృషి చేసిన రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలను అభినందించారు. ప్రతి ఇంటికీ నీటిసరఫరా (హర్ ఘర్ జల్) కోసం, అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని ప్రయత్నాలు చేస్తాయని శ్రీ షెఖావత్ ఆశాభావం వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ పధకాన్ని, వేగంగా, పూర్తి స్థాయిలో, నైపుణ్యంతో అమలు చేయడానికి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించాల్సిన ప్రణాళిక, పురోగతి మరియు అమలు విధానం గురించి కేంద్ర జల శాఖ మంత్రి ఈ సందర్భంగా చర్చించారు. ఈ పధకం అమలును వేగవంతం చేయాలని కూడా ఆయన రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు.
అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో పురోగతిని జాతీయ జల్ జీవన్ మిషన్ వివరించింది. సమయానుసారంగా లక్ష్యాలను సాధించడానికి వీలుగా, పధకం అమలును వేగవంతం చేయాలని కోరడం జరిగింది. తద్వారా ప్రతి గ్రామీణ గృహానికీ, పంపు నీటి కనెక్షన్ లభిస్తుంది. రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ అధికారులకు శిక్షణ ఇవ్వడానికి వీలుగా, ప్రముఖ సంస్థలను నిమగ్నం చేయడంలో సహాయపడ్డం కోసం, జ్ఞాన వనరుల కేంద్రం పై రూపొందించిన, మార్గదర్శకాలను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా విడుదల చేశారు.
వీడియో కాన్ఫరెన్సు అనంతరం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి, మీడియాతో మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవితాల్లో 'సౌలభ్యం' ఉండేలా చూడటం మరియు వారి జీవన ప్రమాణాలు ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుండి నీటిని తెచ్చుకుంటున్న మహిళల జీవితాలను మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, ఈ పధకాన్ని ప్రారంభించినట్లు వివరించారు. గృహస్థులకు మంచి నాణ్యమైన నీటిని అందించడం ఆరోగ్య సూచికలలో మెరుగుదలకు దారితీస్తుంది. ఈ పధకం, అందరికీ సురక్షితమైన నీటిని అందించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. ప్రతి గ్రామంలో నైపుణ్యం కలిగిన వ్యక్తులు, అంటే ప్లంబింగ్, తాపీపని, ఎలక్ట్రికల్, పంప్ ఆపరేటర్ మొదలైన పనులు చేసే వారి అవసరం ఉంటుంది, ఇందుకోసం గ్రామీణ యువతకు శిక్షణ ఇస్తున్నారు.
మెరుగైన ఆరోగ్యం మరియు సమగ్ర అభివృద్ధి కోసం పిల్లలకు సురక్షితమైన నీటిని అందించేలా, అంగన్ వాడీ కేంద్రాలు మరియు ఆశ్రమశాల (గిరిజన ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాల) ల్లో, పైపుల ద్వారా నీటి సరఫరా ఏర్పాట్లు చేయడం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయం మరియు మార్గదర్శకత్వంలో, 2020 అక్టోబర్, 2వ తేదీన ‘100 రోజుల’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. లాక్ డౌన్ తర్వాత పాఠశాలలను తిరిగి తెరిచే పరిస్థితుల్లో విద్యార్థులను స్వాగతించే ప్రక్రియలో భాగంగా రాష్ట్రాలు త్రాగునీటి సరఫరాకు భరోసా ఇవ్వడం చాలా ముఖ్యమని, శ్రీ షేఖావత్ పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి నుండి చాలా ముఖ్యమైన రక్షణగా చేతులు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడంతో పాటు, త్రాగడానికి, మధ్యాహ్నం భోజనం వండటం, చేతులు కడుక్కోవడం మరియు మరుగుదొడ్లలో వాడటం కోసం, పాఠశాలలు, అంగన్వాడీ మరియు ఆశ్రమ పాఠశాలల ప్రాంగణాల్లో, ప్రాణ రక్షణ చర్యగా, నీటి సరఫరా సౌకర్యాన్ని కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
అమలును వేగవంతం చేయడానికి మరియు మెరుగైన పనితీరు గల రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల నుండి మంచి పద్ధతులను తెలుసుకోవడానికి ముఖ్యమైన సమస్యలను చర్చించడానికి ఈ సమావేశం ఒక వేదికగా ఉపయోగపడింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రజల జీవితాలను మెరుగుపర్చాలన్నదే, ప్రభుత్వ ప్రయత్నం. ప్రతి ఇంటికీ నీటిసరఫరా (హర్ ఘర్ జల్) కోసం జల్ జీవన్ మిషన్ అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.
ఎఫ్.హెచ్.టి.సి. లతో 100 శాతం కవరేజ్ కోసం రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల కాలానుక్రమణ లక్ష్యాలు:
2020 లో 100 శాతం ఎఫ్.హెచ్.టి.సి. లు: గోవా (సాధించింది)
2021 లో 100 శాతం ఎఫ్.హెచ్.టి.సి. లు: అండమాన్-నికోబార్ దీవులు, బీహార్, పుదుచ్చేరి, తెలంగాణ
2022 లో 100 శాతం ఎఫ్.హెచ్.టి.సి. లు: హర్యానా, జమ్మూ-కశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మేఘాలయ, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్
2023 లో 100 శాతం ఎఫ్.హెచ్.టి.సి. లు: అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్ గడ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, తమిళనాడు, త్రిపుర
2024 లో 100 శాతం ఎఫ్.హెచ్.టి.సి. లు: అస్సాం, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్
వివరణాత్మక నేపథ్య సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
*****
(Release ID: 1669914)
Visitor Counter : 177