ప్రధాన మంత్రి కార్యాలయం

కేవాడియా వద్ద ఏక్తా దివస్‌ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ


ఏక్తా ప్రతిజ్ఞ చేయించి, భద్రత బలగాల కవాతును వీక్షించిన మోదీ

సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడుకునేందుకు భారత్‌ సర్వసన్నద్ధంగా ఉంది: ప్రధాని

బలమైన ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం 130 కోట్ల మంది భారతీయులు శ్రమిస్తున్నారు: ప్రధాని

దేశ రక్షణను, భద్రత బలగాల స్థైరాన్ని దెబ్బతీసేలా, తీవ్రవాదానికి మద్దతు ఇవ్వొద్దని రాజకీయ పార్టీలకు ప్రధాని హితవు

విస్తరిస్తున్న తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఒక్కతాటిపైకి రావాలని ప్రపంచ దేశాలకు పిలుపు

Posted On: 31 OCT 2020 11:32AM by PIB Hyderabad

ఉక్కు మనిషి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా, గుజరాత్‌లోని కేవాడియాలో నిర్వహించిన ఏక్తా దివస్‌ వేడుకల్లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఐక్యత శిల్పానికి పుష్పాంజలి ఘటించారు. ఏక్తా ప్రతిజ్ఞ చేయించి, ఏక్తా దివస్‌ పరేడ్‌ను వీక్షించారు.

 

కేవాడియా సమగ్ర అభివృద్ధి కోసం ప్రారంభించిన వివిధ ప్రాజెక్టులు, ఆ ప్రాంత పర్యాటక వృద్ధికి తోడ్పడతాయని ప్రధాని అన్నారు. ఐక్యత విగ్రహం సందర్శనకు సీ-ప్లేన్‌ సేవ కూడా పర్యాటకులకు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు.

మహర్షి వాల్మీకి ఆకాంక్షించిన సాంస్కృతిక ఏకత్వం

ఇవాళ మనం చూస్తున్న భారత్‌ కంటే వైభవోపేతమైన, శక్తిమంతమైన, సాంస్కృతిక ఐక్యత భారత్ నిర్మాణం కోసం కొన్ని వందల ఏళ్ల క్రితం ఆదికవి మహర్షి వాల్మీకి ప్రయత్నించారని మోదీ అన్నారు. ఏక్తా దివస్‌, వాల్మీకి జయంతి ఒక్క రోజేకావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కరోనా సమయంలోనూ దేశం చూపిన సామూహిక నిబ్బరం అపూర్వమని ప్రశంసించారు.

ఐక్యత కొత్త కోణాలు

అడ్డంకులను వెనక్కునెట్టి కశ్మీర్‌ అభివృద్ధి మార్గంలో వెళుతోందని ప్రధాని అన్నారు. ఐక్యతలో కొత్త కోణాలను దేశం ప్రదర్శిస్తోందని చెప్పారు. ఈశాన్య ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ, అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ప్రధాని వివరించారు.

సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అయోధ్యలో రామాలయ నిర్మాణం చేపట్టడం, సర్దార్‌ పటేల్‌ ఆశించిన భారత సాంస్కృతిక వైభవ పునరుద్ధరణ ప్రయత్నంగా మోదీ అభివర్ణించారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌

130 కోట్ల మంది భారతీయులు కలిసి; సమానత్వం, అవకాశాలతో కూడిన బలమైన, సమర్థవంతమైన భారత్‌ను నిర్మిస్తున్నారని ప్రధాని చెప్పారు. స్వయంసమృద్ధి గల దేశం మాత్రమే తన అభివృద్ధి, భద్రతపై నమ్మకాన్ని ప్రదర్శించగలదని, అందుకే రక్షణతోపాటు వివిధ రంగాల్లో స్వయంసమృద్ధి దిశగా మన దేశం అడుగులు వేస్తోందన్నారు.

సరిహద్దుల అభివృద్ధి & భారత సార్వభౌమాధికారం, సమగ్రత పరిరక్షణ

సరిహద్దుల విషయంలో భారత్‌ దృక్పథం మారిందని ప్రధాని స్పష్టం చేశారు. మన భూభాగంపై కన్నేసిన పొరుగు దేశాలకు తగిన రీతిలో సమాధానం వెళుతోందన్నారు. సరిహద్దుల్లో వందల కి.మీ. రహదారులు, డజన్లకొద్దీ వంతెనలు, సొరంగాల నిర్మాణం జరుగుతోందన్నారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడుకునేందుకు భారత్‌ సర్వసన్నద్ధంగా ఉందని ప్రధాని ఉద్ఘాటించారు.

తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యత

నేడు భారత్‌తోపాటు ప్రపంచం మొత్తం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్న ప్రధాని, కొందరు వ్యక్తులు తీవ్రవాదానికి మద్దతునివ్వడం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోందన్నారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కతాటిపైకి రావలసిన అవసరం ఉందని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. శాంతి, సోదరతత్వం, పరస్పర గౌరవం నిజమైన మానవత్వపు గుర్తులుగా మోదీ అభివర్ణించారు. తీవ్రవాద హింస ద్వారా ఎవ్వరూ, ఎప్పటికీ ప్రయోజనం పొందలేరన్నారు. మన భిన్నత్వమే మన ఉనికి అని, మనది అసాధారణ దేశంగా చెప్పారు. మన దేశ ఐక్యత, ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న బలమని అన్నారు. ఈ భిన్నత్వం మన బలహీనతగా మారాలని వారు కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అలాంటి శక్తులను గుర్తించి, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రధాని సూచించారు.

పుల్వామా దాడి

పారా మిలిటరీ దళాల కవాతు చూస్తుంటే, పుల్వామా దాడి గుర్తుకు వచ్చిందని మోదీ చెప్పారు. ఆ ఘటనను దేశం ఎప్పటికీ మర్చిపోదని, వీర సైనికుల మరణం పట్ల యావద్దేశం కలత చెందిందని అన్నారు. ఆ సంఘటనపై కొందరు చేసిన ప్రకటనల గురించి కూడా దేశం మర్చిపోదన్నారు. పొరుగు దేశ పార్లమెంటులో ఇటీవల చేసిన ప్రకటనలు నిజాన్ని వెల్లడించాయని మోదీ అన్నారు.

దేశంలో నీచమైన, స్వార్థపూరిత, అహంకారభరిత రాజకీయాలు సాగుతున్నాయని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. స్వార్థం కోసం ఆ వ్యక్తులు ఎంతకైనా దిగజారతారన్నదానికి పుల్వామా ఘటన తర్వాత జరిగిన రాజకీయాలే గొప్ప ఉదారహణగా చెప్పారు. దేశ రక్షణ, భద్రత బలగాల స్థైరాన్ని పెంచేలా పని చేయాలని సదరు రాజకీయ పార్టీలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.

స్వార్థం కోసం; తెలిసో, తెలియకో విద్రోహ శక్తులకు లొంగిపోయినవారు, వారి పార్టీ లేదా దేశ ప్రయోజనం కోసం పని చేయలేరని మోదీ చెప్పారు. దేశ ప్రయోజనమే మనందరి స్వార్థం కావాలని స్పష్టం చేశారు. తోటి వారి గురించి ఆలోచించినప్పుడే మనం వృద్ధి చెందగలమని మోదీ హితవు పలికారు.

అంతకుముందు, భద్రత బలగాల కవాతును ప్రధాని మోదీ వీక్షించారు. కవాతులో భాగంగా, సీఆర్‌పీఎఫ్‌ మహిళ విభాగం రైఫిల్‌ విన్యాసాలను ప్రదర్శించింది. భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్‌ బృంద సభ్యులు ఆకాశ విన్యాసాలతో అలరించారు. భారత గిరిజన వారసత్వాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనను కూడా ప్రధాని వీక్షించారు.

***


(Release ID: 1669044) Visitor Counter : 226