సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
దీపావళి కోసం మన్నికైన మజ్లిన్ మాస్కులు రూపొందించిన కేవీఐసీ
Posted On:
30 OCT 2020 4:52PM by PIB Hyderabad
తెలుపు, ఎరుపు రంగుల కలయికగా, మజ్లిన్ వస్త్రంతో రూపొందించిన కొత్త ఫేస్ మాస్కులు దీపావళిని మరింత ఉత్సాహభరితం చేయనున్నాయి. 'ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్' (కేవీఐసీ), "హ్యాపీ దివాలీ" అని ముద్రించిన రెండు పొరల మజ్లిన్ మాస్కులను పరిమిత సంఖ్యలో రూపొందించింది. వీటిని అత్యంత నాణ్యతతో, బెంగాలీ సంప్రదాయ నేత కళాకారులు తయారు చేశారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం సందర్భంగానూ ఈ తరహా మాస్కులను కేవీఐసీ తీసుకురాబోతోంది.
రెండు పొరల ఖద్దరు, మూడు పొరల పట్టు మాస్కులకు ప్రజల నుంచి భారీగా స్పందన రావడంతో, మజ్లిన్‌తో కొత్త మాస్కులను కేవీఐసీ రూపొందించింది. గత ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 18 లక్షలకు పైగా ఖద్దరు, పట్టు మాస్కులను విక్రయించింది.
కొత్తగా రూపొందించిన మజ్లిన్ మాస్కు ధర 75 రూపాయలు. దిల్లీలోని ఖాదీ ఔట్‌లెట్ల కొనుగోలు చేయవచ్చు లేదా కేవీఐసీ పోర్టల్ www.khadiindia.gov.in లో ఆర్డర్ ఇవ్వవచ్చు.
ఇతర ఖద్దరు మాస్కుల్లాగే, మజ్లిన్ మాస్కులు కూడా చర్మానికి హాని కలిగించవు, ఉతికి వినియోగించుకోవచ్చు. ఇవి భూమిలో త్వరగా కలిసిపోతాయి. రెండు తెల్లటి పొరలతో, మెరిసే ఎరుపు రంగు పైపింగ్‌తో వీటిని రూపొందించారు.
మజ్లిన్ మాస్కుల ధర తక్కువైనా వాటి విలువ ఎక్కువని కేవీఐసీ ఛైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా అన్నారు. పండుగను ఉత్సాహంగా జరుపుకోవడంతోపాటు, కరోనా నుంచి ప్రజలకు రక్షణ కల్పించడానికి కేవీఐసీ చేసిన మరో ప్రయత్నంగా వెల్లడించారు. "కరోనా వ్యాప్తి నుంచి ప్రజలకు రక్షణతోపాటు, ఆధునికంగా ఉండే మాస్కులను కేవీఐసీ రూపొందిస్తోంది. మా మాస్కుల శ్రేణికి మజ్లిన్ మాస్కులు కొత్తదనాన్ని తేవడమే కాదు, చేనేత కార్మికులకు అదనపు ఉపాధినీ కల్పించాయి" అని తెలిపారు.
ఈ వస్త్రం, లోపలివైపు తేమను పట్టి ఉంచడంతోపాటు, గాలి సాఫీగా వెళ్లేలా చేస్తుంది. అందువల్లే కొత్త మాస్కుల రూపకల్పనకు దీనిని ఎంచుకున్నారు. దారాలు వడకడం నుంచి నేత వరకు పూర్తిగా చేతుల ద్వారానే పని సాగడం ఈ వస్త్రం ప్రత్యేకత. పైగా పట్టు కంటే సున్నితంగా ఉంటుంది, దీర్ఘకాలిక వినియోగానికి మన్నికగా ఉంటుంది.
***
(Release ID: 1668915)
Visitor Counter : 313
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam