జల శక్తి మంత్రిత్వ శాఖ

మణిపూర్ లోని మయన్మార్ సరిహద్దు గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థల ప్రారంభం

జలజీవన్ మిషన్ మిషన్ కింద పనులు పూర్తి

Posted On: 25 OCT 2020 2:58PM by PIB Hyderabad

 

 

  మణిపూర్ లో,.. భారత్, మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో జలజీవన్ మిషన్ (జె.జె.ఎం.) పథకం కింద నీటి సరఫరా మొదలైంది. సరిహద్దుకు సమీపంలోని రెండు గ్రామాల్లో  జలజీవన్ మిషన్ కింద చేపట్టిన రెండు నీటి ప్రాజెక్టులను మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ ప్రాంభించారు. ఈ రెండు గ్రామాలు జిల్లా కేంద్రానికి దూరంగా మారుమూలన ఉండటమేకాక, ఒకప్పుడు తిరుగుబాటుదార్ల ప్రాబల్యంలో ఉన్న ప్రాంతాలు. ఇపుడు ఈ రెండు గ్రామాలకు జలజీవన్ మిషన్ కింద క్రమం తప్పకుండా మంచినీరు సరఫరా అవుతోంది.

  ఆశావహ జిల్లాల్లో ఒకటైన చందేల్ జిల్లాలోని ఖెంగ్జోయ్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఖాంగ్ బరోల్ గ్రామానికి ఇపుడు జలజీవన్ మిషన్ ద్వారా మంచినీరు అందుతోంది. జిల్లా కేంద్రానికి 69కిలోమీటర్ల దూరంలో, మయన్మార్ సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఈ గ్రామం ఉంది. ఈ ఊర్లో 82 ఇళ్లు ఉన్నాయి. 2041వ సంవత్సరానికల్లా ఈ గ్రామం జనాభా దాదాపు వెయ్యికి చేరుకుంటుందన్న అంచనాతో ఈ గ్రామంలో నీటి సరఫరా వ్యవస్థను రూపొందించారు. రూ. 60లక్షల రూపాయల అంచనా వ్యయంతో 82ఇళ్లకు, దాదాపు 450మంది జనాభాకు భూమ్యాకర్షణ శక్తి (గ్రావిటీ) ఆధారంగా సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. నీటి శుద్ధీకరణ ప్లాంటుకు 6కిలోమీటర్ల దూరంలోని "ఖాంగ్బరోల్లోక్" అనే నీటి వనరునుంచి నీటిని తీసుకుంటున్నారు. నీటి శుద్ధీకరణ ప్లాంట్ కంటే నీటి వనరు బాగా ఎగువన ఉన్నందున గ్రావిటీ ఆధారంగా నీటి సరఫరా వ్యవస్థను చేపట్టారు.

  చందేల్ జిల్లా, ఖెంగ్జోయ్ సబ్ డివిజన్ పరిధిలోని ఖెంగ్జోయ్ అనే మరో మారుమూల గ్రామానికి కూడా  జలజీవన్ మిషన్ కింద నీటిసరఫరా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో, భారత్-మయన్మార్ సరిహద్దుకు 20కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఈ ఊరిలోని 73 ఇళ్లకు కుళాయి కనెక్షన్ల ద్వారా నీరందుతోంది. జలజీవన్ మిషన్ మార్గదర్శక సూత్రాల ప్రకారం గ్రామ నీటిసరఫరా, పారిశుద్ధ్య కమిటీ ఈ వ్యవస్థను నిర్వహిస్తూ వస్తోంది.

  మణిపూర్ లో పర్వతమయంగా ఉన్న ఈ ప్రాంతాలు వర్షాకాలంలో మరీ దుర్గమంగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో నీటిసరఫరా పథకాలను అమలుచేయడం చాలా సవాళ్లతో కూడుకున్నది. ఏవో కొన్ని పరిమిత వేళల్లో మాత్రమే ఏదైనా సామగ్రిని రవాణా చేయడం సాధ్యమవుతుంది. సామగ్రి అంతా ఇంఫాల్ లేదా పల్లేల్ నుంచి రవాణా చేసినప్పటికీ, ఈ ప్రాంతానికి కమ్యూనికేషన్ సదుపాయాల వ్యవస్థ సరిగా లేకపోవడం మరో సవాలు. అందువల్ల, స్థానిక మానవ వనరులనే  వినియోగించి పరిమితమైన వనరులతోనే పనులు చేయవలసి ఉంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో, కోవిడ్-19 వైరస్ మహమ్మారి సమస్య ఉన్నప్పటికీ,  మారు ప్రాంతాల్లోని గ్రామాలకు నీటి సరఫరా వ్యవస్థల ఏర్పాటుకోసం ప్రజారోగ్య ఇంజినీరింగ్ శాఖ అధికారులు కష్టపడి పనిచేశారు.

  మణిపూర్ రాష్ట్రంలో జలజీవన్ మిషన్ పనుల అమలుపై ఇటీవల మధ్య కాలిక సమీక్ష జరిగింది. పనుల పురోగతిపై నివేదికను మణిపూర్ రాష్ట్ర అధికారులు ఈ సందర్భంగా జలజీవన్ మిషన్ జాతీయ బృందానికి అందించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పనుల ప్రగతిపై అంచనాకోసం అర్థసవంత్సర సమీక్షా సమావేశం,.. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి కులాయిల ఏర్పాటు, అందుకోసం ఏర్పాటు చేసిన సంస్థాగత ఏర్పాట్లపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ సమీక్షలో స్థాయీ నివేదికలు సమర్పిస్తున్నాయి.

  మణిపూర్ రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షల ఇళ్లు ఉండగా, కేవలం 30,379 ఇళ్లకు మాత్రమే మంచి కనెక్షన్ల సదుపాయం ఉంది. 2020-21వ సంవత్సరంలో 2లక్షల ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని మణిపూర్ ప్రభుత్వం నిర్దేశించుకుంది. ప్రస్తుత సంవత్సరంలో ఒక జిల్లాకు, 15 బ్లాకులకు, 1,275 గ్రామాలకు వందశాతం ట్యాప్ కనెక్షన్లను వర్తింపజేయాలని సంకల్పించారు.  జలజీవన్ మిషన్ కింద 2023కల్లా ఇళ్లకు వందశాతం కుళాయిల కనెక్షన్లు ఏర్పాటు చేయాలని మణిపూర్ ప్రభుత్వం సంకల్పించింది.

  2020-21వ సంవత్సరంలో రూ. 131.80కోట్ల మొత్తాన్ని మణిపూర్ రాష్ట్రానికి కేటాయించగా, అందులో రూ. 32.95కోట్లు ఇప్పటికే విడుదలైంది. ఆర్థికపరంగా పనితీరు ప్రాతిపదికగా అదనంగా నిధుల కేటాయింపునకు కూడా మణిపూర్ కు అర్హత ఉంది. 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద మణిపూర్ పంచాయతీ రాజ్ సంస్థలకు రూ. 177కోట్లు కేటాయింపు లభించింది. ఈ మొత్తంలో 50శాతం నీటిసరఫరాకు, పారిశుద్ధ్య కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉన్న నేపథ్యంలో గ్రామీణ నీటిసరఫరా, మురుగునీటి నిర్వహణ వ్యవస్థల నిర్వహణకు, ముఖ్యంగా మంచినీటి సరఫరా వ్యవస్థలను దీర్ఘకాలిక ప్రాతిపదికపై నిర్వహించడానికి ఈ నిధులు కూడా వినియోగించాలని మణిపూర్ ప్రభుత్వం సంకల్పించంది. 

*****


(Release ID: 1667492) Visitor Counter : 213