సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

విజిలెన్స్ అవగాహన వారోత్సవం – 2020

Posted On: 25 OCT 2020 12:40PM by PIB Hyderabad

కేంద్ర విజిలెన్స్ కమిషన్ 2020 అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవం పాటిస్తోంది. ఏటా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల జన్మదినం ఉన్నవారాన్ని ఇలా పాటించటం ఆనవాయితీ. అక్టోబర్ 31న పటేల్ జన్మదినం కనుక  ఈ వారం రోజులపాటు విజిలెన్స్ వారోత్సవాలలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో ప్రజాజీవితంలో సమగ్రతను, నిజాయితీని ప్రోత్సహించేందుకు వీలుగా అవగాహన కార్యక్రమాలు, ప్రచారోద్యమం నిర్వహిస్తారు.

ఈ ఏడాది విజిలెన్స్ అవగాహనకు ఎంచుకున్న అంశం సతర్క్ భారత్, సమృద్ధ్ భారత్ (అప్రమత్త భారత్, సుసంపన్న భారత్). ప్రధాన్ విజిలెన్స్ అధికారులు సూచించిన మేరకు కొన్ని సూచనాత్మకమైన అంశాలను వెబ్ సైట్ లో ఉంచి, అభిప్రాయాలు స్వీకరించిన మీదట దీన్ని ఖరారు చేశారు.  

నిఘా, అవినీతి నిరోధకత మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ నెల 27-29 మధ్య ఒక జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. 27న సాయంత్రం 5 గంటలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ వారోత్సవాలమీద ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాన్ని వెబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అన్ని ప్రభుత్వ సంస్థలు, విభాగాలు ఈ ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

స్థానికంగా ఈవారోత్సవాలలో నిర్వహించే  కార్యక్రమాల సందర్భంగా అన్ని సంస్థలూ కోవిడ్ నియమావళిని కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. మాస్కులు ధరించటం, రెండు గజాల కనీస దూరం పాటించటం, చేతులు శుభ్రపరచుకోవటం తప్పనిసరి అని మరోమారు గుర్తు చేశారు. అదే విధంగా అన్ని సంస్థలూ ఆర్థికమంత్రిత్వశాఖ కు చెందిన వ్యయ విభాగం వారి OM No. 7(2)E. Coord/2020 తేదీ 4.9.2020 కి అనుగుణంగా పొదుపు చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు.

దేశ అభివృద్ధికి అవినీతి అతిపెద్ద అవరోధమని కమిషన్ భావిస్తోంది. మన జాతీయ జీవనంలో అన్ని విధాలుగా సమగ్రతకు పెద్ద పీటవేసేలా సమాజంలోని అన్ని వర్గాలూ అప్రమత్తంగా ఉండాలి. అన్ని సంస్థలూ తమ ఆంతర్గత కార్యకలాపాల మీద దృష్టిపెట్టేలా ఈ విజిలెన్స్ వారోత్సవాలను ప్రచారోద్యమస్థాయిలో చేపట్టాలని కమిషన్ భావిస్తోంది. ఇందులో భాగంగా అంతర్గత ప్రక్రియల మెరుగుదల, నిర్దిష్ట కాలపరిమితిలోగా పనులు పూర్తి చేయటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ వ్యవస్థను మెరుగుపరచటం, తాత్కాలిక సిబ్బందికి చెల్లింపులు, ఇళ్ళ కేటాయింపు, భూమి రికార్డులు సహా ఆస్తుల డిజిటైజేషన్, పాత ఫర్నిచర్ రద్దు చేయటం, నిబంధనలకు అనుగుణంగా పాత రికార్డులను ఏరిపారేయటం లాంటి చర్యలన్నీ పారదర్శకంగా జరగటం మీద ప్రధానంగా దృష్టి సారించాలని కమిషన్ చెబుతోంది.

సంస్థలు తమ తమ సంస్థలలోనే వ్యవస్థాగతంగా మెరుగుదల సాధించటానికి అవసరమైన అంశాలను గుర్తించాల్సిందిగా సూచించారు. అలాంటి వాటిని తమ వెబ్ సైట్ లో ప్రస్తావించటం ద్వారా ప్రజలందరికీ తెలిసే అవకాశం ఉంటుంది.అదే తరహా అంశాలు మిగిలినవారికి కూడా తెలిసే విధంగా వాటిని చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కు పంపటం ద్వారా మరింత వ్యాప్తికి అవకాశం ఏర్పడుతుంది.

బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్లు, సైంటిస్టులు తదితర వర్గాలకు శిక్షణాకార్యక్రమాలలోనే నివారించే క్రమంలో చేపట్టాల్సిన ముందస్తు నిఘా  గురించి చేర్చారు. భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన మధ్య స్థాయి అధికారులకు సర్వీసు మధ్యలో కూడా ఇలాంటి శిక్షణాకార్యక్రమాల ద్వారా ముందస్తు నిఘా మీద అవగాహన పెంచాల్సి ఉంది. ఈ శిక్షణలో భాగంగా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ లు సందర్శించటం, ప్రభుత్వాధికారుల వైఖరిలో మార్పు తీసుకువచ్చి సమగ్రతకు ప్రాధాన్యం ఇచ్చేలా చూడటం, అన్నింటా పారదర్శకతకు పెద్దపీట వేయటం లాంటివి అందులో చేర్చారు.

ఉద్యోగులందరూ కమిషన్ అందజేసిన సమగ్రతా ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరింది. సంస్థతో సంబంధాలుండే అమ్మకం దారులు, సరఫరాదారులు, కాంట్రాక్టర్లు కూడా ఈ ప్రతిజ్ఞ తీసుకోవాలని సూచించింది.  

ఈ ఏడాది వారోత్సవాలకు పాటిస్తున్న అంశానికి అనుగుణంగా అన్ని కేంద్ర మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ సంస్థలు తమ తమ విభాగాలకు తగిన కార్యక్రమాల ద్వారా ప్రజలలో అవగాహన పెంచేలా రూపొందించి ప్రాచుర్యం కల్పించాలని కమిషన్ సూచించింది.  

ఎ) సంస్థాగత్ వెబ్ సైట్ వాడుకుంటూ ఉద్యోగి/వినియోగదారు సంబంధమైన సమాచారాన్ని పంపిణీ చేయటం, సమస్యల పరిష్కారానికి తగిన మార్గం అందుబాటులో ఉంచటం

బి) అవినీతి వ్యతిరేక సందేశాలు ప్రజలకు చేరేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించటం, అప్రమత్తంగా ఉండటం ద్వారా సుసంపన్న భారత్ సాధించవచ్చునన్న సందేశాన్నివ్వటం అవసరం. ఆన్ లైన్ పద్ధతులను విస్తృతంగా వాడుకోవాలి.  

సి) సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వాడుకోవాలి. అవగాహన పెంచటానికి బల్క్ ఎస్ ఎం ఎస్ లు, వాట్సాప్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మాధ్యమాలను వినియోగించుకోవాలి.

 

<><><>



(Release ID: 1667478) Visitor Counter : 584