ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్‌లో మూడు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన - ప్రధానమంత్రి

గుజరాత్ రైతుల కోసం 'కిసాన్ సూర్యోదయ యోజన' ను ప్రారంభించారు

యు.ఎన్. మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ మరియు పరిశోధనా కేంద్రానికి అనుబంధంగా ఉన్న పీడియాట్రిక్ హార్ట్ ఆసుపత్రిని ప్రారంభించారు.

గిర్నార్ వద్ద రోప్‌వే ను ప్రారంభించారు

Posted On: 24 OCT 2020 2:01PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లో మూడు కీలక ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు.

రైతులకు 16 గంటల విద్యుత్ సరఫరా కోసం కిసాన్ సూర్యోదయ యోజనను శ్రీ మోదీ ప్రారంభించారు.  యు.ఎన్. మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ మరియు పరిశోధనా కేంద్రానికి అనుబంధంగా ఉన్న పీడియాట్రిక్ హార్ట్ ఆసుపత్రితో పాటు అహ్మదాబాద్‌లోని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో టెలి-కార్డియాలజీ కోసం మొబైల్ యాప్ ను కూడా ఆయన ప్రారంభించారు.

గిర్నార్ ‌లో రోప్ ‌వే ను కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్యుల సంకల్పం మరియు అంకితభావానికి గుజరాత్ ఎప్పుడూ ఆదర్శప్రాయమైన నమూనాగా ఉంటోందని పేర్కొన్నారు.  సుజలాం-సుఫలాం మరియు సౌని పథకం తరువాత, కిసాన్ సూర్యోదయ యోజన గుజరాత్ రైతుల అవసరాలను తీర్చడంలో ఒక మైలురాయి వంటిదని ఆయన అన్నారు.  విద్యుత్తు రంగంలో గుజరాత్ ‌లో కొన్నేళ్లుగా చేసిన పనులే ఈ పథకానికి ఆధారమయ్యాయని ఆయన తెలిపారువిద్యుత్తు ఉత్పత్తి నుండి ప్రసారం వరకు రాష్ట్రంలో సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు యుద్ధ ప్రాతిపదికన అన్ని పనులు చేపట్టినట్లు ఆయన చెప్పారు.  2010 లో పఠాన్ ‌లో సౌర విద్యుత్తు ప్లాంటు ప్రారంభించినప్పుడు, "ఒకటే సూర్యుడు, ఒకటే ప్రపంచం, ఒకటే గ్రిడ్" కోసం భారతదేశం ప్రపంచానికి మార్గం చూపిస్తుందని ఎవరూ ఊహించలేదని, ఆయన పేర్కొన్నారు. సౌర విద్యుత్తు రంగంలో భారతదేశం గత కొన్నేళ్లుగా ప్రపంచంలో ఐదవ స్థానానికి చేరుకుందనీ, ఇది మరింత వేగంగా అభివృద్ధి చెందుతోందనీ, ప్రధానమంత్రి ప్రశంసించారు.   

కిసాన్ సూర్యోదయ యోజన గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, అంతకుముందు చాలా మంది రైతులు నీటి పారుదల కోసం రాత్రి మాత్రమే విద్యుత్తు పొండడం వల్ల, రాత్రంతా వారు మేల్కొనవలసి వచ్చేదని తెలిపారు.  గిర్నార్ మరియు జునాగఢ్ లలో రైతులు కూడా అడవి జంతువుల సమస్యలను ఎదుర్కొనేవారు.  కిసాన్ సూర్యోదయ యోజన  కింద రైతులకు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా లభిస్తుంది,  వారి జీవితంలో కొత్త కాంతిని తెస్తుందని ఆయన పేర్కొన్నారు. 

ప్రస్తుతమున్న ఇతర వ్యవస్థలను ప్రభావితం చేయకుండా, పూర్తిగా కొత్త ప్రసార సామర్థ్యాన్ని సిద్ధం చేయడం ద్వారా గుజరాత్ ప్రభుత్వం ఈ పని చేయడానికి చేసిన కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు.  ఈ పథకం కింద, రాబోయే 2-3 సంవత్సరాలలో సుమారు 3,500 సర్క్యూట్ కిలోమీటర్ల మేర కొత్త ప్రసార మార్గాలు వేయడం జరుగుతుంది.  అదేవిధంగా, రాబోయే రోజుల్లో వెయ్యికి పైగా గ్రామాలలో ఈ పధకాన్ని అమలు చేయనున్నారు, ఈ గ్రామాలలో ఎక్కువ భాగం గిరిజన ప్రాబల్య ప్రాంతాలలో ఉన్నాయి.  ఈ పథకం ద్వారా మొత్తం గుజరాత్‌కు విద్యుత్ సరఫరా విస్తరించినప్పుడు, లక్షలాది మంది రైతుల జీవితాలను ఇది మారుస్తుందని ఆయన అన్నారు.  

పెట్టుబడిని తగ్గించి, వారి ఇబ్బందులను అధిగమించడం ద్వారా రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో సహాయపడటానికి మారుతున్న కాలానికి అనుగుణంగా నిరంతరం పనిచేయాలని ప్రధానమంత్రి కోరారు.  వేలాది ఎఫ్.‌పి.ఓ. లు, వేప పూత యూరియా, భూమి ఆరోగ్య కార్డుల ఏర్పాటు, అనేక కొత్త కార్యక్రమాలను ప్రారంభించడం వంటి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఆయన వివరించారు.  కుసుం యోజన కింద, ఎఫ్‌.పి.ఓ. లు, పంచాయతీలు, ఇలాంటి సంస్థలన్నీ బంజరు భూముల్లో చిన్న, చిన్న సౌర ప్లాంట్లను ఏర్పాటు చేయడంలో సహకరిస్తున్నాయనీ, రైతుల నీటిపారుదల పంపులను కూడా సౌరశక్తితో అనుసంధానించడం జరిగిందని, ఆయన తెలియజేశారు.  దీని నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును రైతులు తమ నీటిపారుదల అవసరాల కోసం ఉపయోగించుకుని, మిగులు విద్యుత్తును వారు విక్రయించుకోవచ్చునని ఆయన చెప్పారు.   

విద్యుత్తు తో పాటు నీటిపారుదల, తాగునీటి రంగాల్లో కూడా, గుజరాత్ ప్రశంసనీయమైన కృషి చేసిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.  నీటి సరఫరా పొందడానికి గతంలో ప్రజలు చాలా కష్టాలు ఎదుర్కొనేవారనీ, ఈ రోజున ఇంతకు ముందు ఊహించని జిల్లాలకు సైతం నీరు చేరుకుందని ఆయన చెప్పారు.  గుజరాత్ ‌లోని కరువు పీడిత ప్రాంతాలకు నీటిని చేరుకోవడంలో సహాయపడే సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ మరియు వాటర్ గ్రిడ్ల వంటి ప్రాజెక్టుల గురించి ఆయన గర్వంగా భావించారు.  గుజరాత్‌లోని 80 శాతం కుటుంబాలు తాగునీటిని పైపుల ద్వారా పొందుతున్నారనీ, త్వరలోనే గుజరాత్, రాష్ట్రంలోని, ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేసే రాష్ట్రం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.  కిసాన్ సూర్యోదయ యోజన ప్రారంభోత్సవం అనంతరం, "ప్రతి చుక్కతో ఎక్కువ పంట" అనే మంత్రాన్ని పునరుద్ఘాటించాలని ఆయన రైతులను కోరారు.  పగటిపూట విద్యుత్తును అందించడం రైతులకు సూక్ష్మ సేద్యం ఏర్పాటుకు సహాయపడుతుందనీ, కిసాన్ సూర్యోదయ యోజన రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం విస్తరణకు సహాయపడుతుందనీ, ఆయన తెలిపారు.   

ఈ రోజు ప్రారంభించిన యు.ఎన్. మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ మరియు పరిశోధనా కేంద్రం గురించి ఆయన ప్రస్తావిస్తూ,  ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు ఆధునిక ఆరోగ్య సదుపాయాలను కలిగి ఉన్న దేశంలోని అతికొద్ది ఆసుపత్రులలో ఇది ఒకటి, అదేవిధంగా ఇది భారతదేశపు అతిపెద్ద గుండె ఆసుపత్రి అవుతుందని, ఆశాభావం వ్యక్తం చేశారు.  ఆధునిక ఆస్పత్రులు, వైద్య కళాశాలల నెట్ ‌వర్క్ ‌ను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రతి గ్రామాన్నీ మెరుగైన ఆరోగ్య సదుపాయాలతో అనుసంధానించడం ద్వారా గుజరాత్ ప్రశంసనీయమైన కృషి చేసిందని ఆయన అభినందించారు.  ఆయుష్మాన్ భారత్ పథకం కింద గుజరాత్ లోని 21 లక్షల మంది ప్రజలకు ఉచిత చికిత్స లభించిందని ఆయన చెప్పారు.  తక్కువ ఖర్చుతో మందులు అందిస్తున్న 525 కి పైగా జన్ ఔషధీ కేంద్రాలను గుజరాత్‌లో ప్రారంభించడం జరిగింది.  వీటి ద్వారా, గుజరాత్ లోని సామాన్య ప్రజలను రక్షించడానికి సుమారు 100 కోట్ల రూపాయలు ఉపయోగించబడ్డాయి.

గిర్నార్ పర్వతం మా అంబే నివాస ప్రాంతమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  దీనిపైన గోరఖ్ నాథ్ శిఖరం, గురు దత్తాత్రేయ శిఖరం, జైన దేవాలయం ఉన్నాయి.  ప్రపంచ స్థాయి రోప్ వే ప్రారంభోత్సవంతో ఎక్కువ మంది భక్తులు, పర్యాటకులు ఇక్కడికి వస్తారని ఆయన అన్నారు.  గుజరాత్ ‌లో బనస్కాంత, పావగఢ్, సత్పురాతో పాటు ఇది నాల్గవ రోప్ వే అని ఆయన అన్నారు.  ఈ రోప్‌వే ఇప్పుడు ప్రజలకు ఉద్యోగావకాశాలు, ఆర్థిక అవకాశాలను కల్పిస్తుందని ఆయన అన్నారు.  ప్రజలకు చాలా సౌలభ్యాన్ని అందించే ఇటువంటి వ్యవస్థలు ఇంతకాలం నిలిచిపోయినప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన ఎత్తిచూపారు.  పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు కలిగే ఆర్థిక ప్రయోజనాలను ఆయన వివరించారు.  శివరాజ్ ‌పూర్ బీచ్ వంటి ప్రాంతాలను ఆయన వివరించారు, ఇది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ మరియు ఐక్యతా విగ్రహం కలిగి ఉంది, ఇది స్థానికులకు చాలా ఉపాధి అవకాశాలను అందిస్తుంది.  ఎవ్వరూ ఎక్కువగా చూడని అహ్మదాబాద్ లోని కంకరియా సరస్సును ఆయన ఆయన ఉదహరించారు.  పునరుద్ధరణ తరువాత, సంవత్సరానికి, 75 లక్షల మంది ప్రజలు ఈ సరస్సును సందర్శిస్తున్నారు మరియు అనేక మందికి ఇది ఒక ఆదాయ వనరుగా మారింది.  పర్యాటక రంగంలో, తక్కువ పెట్టుబడితో అనేక ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు.  గుజరాత్ ప్రజలు మరియు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన వారు గుజరాత్ లోని వివిధ పర్యాటక ప్రదేశాలకు రాయబారులుగా మారాలనీ, మరియు దాని పురోగతికి సహాయం చేయాలని ఆయన కోరారు.

నేపధ్యం :

కిసాన్ సూర్యోదయ యోజన :

నీటిపారుదల కోసం పగటి పూట విద్యుత్తు సరఫరాను అందించడానికి, ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వం ఇటీవల ‘కిసాన్ సూర్యోదయ యోజన’ ప్రకటించింది.  ఈ పథకం కింద రైతులు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విద్యుత్తు సరఫరాను పొందగలుగుతారు.  ఈ పథకం కింద 2023 నాటికి విద్యుత్తు ప్రసార మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయల బడ్జెట్ ‌ను కేటాయించింది.  220 కె.వి. సబ్ ‌స్టేషన్‌ లతో పాటు మొత్తం 3,490 సర్క్యూట్ కిలోమీటర్ల (సి.కె.ఎం) మేర ‘66 -కిలోవాట్’ 234 ట్రాన్స్‌ మిషన్ లైన్లు ఈ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది.

దహోద్, పటాన్, మహిసాగర్, పంచమహల్, చోటా ఉదేపూర్, ఖేడా, తాపి, వల్సాద్, ఆనంద్, గిర్-సోమనాథ్ ఇప్పుడు 2020-21 సంవత్సరానికి ఈ పధకం కింద చేర్చడం జరిగింది. మిగిలిన జిల్లాలను 2022-23 నాటికి దశల వారీగా చేర్చడం జరుగుతుంది. 

యు.ఎన్. మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ మరియు పరిశోధనా కేంద్రానికి అనుబంధంగా ఉన్న పీడియాట్రిక్ హార్ట్ ఆసుపత్రి

యు.ఎన్. మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ మరియు పరిశోధనా కేంద్రం ‌తో జతచేయబడిన పీడియాట్రిక్ హార్ట్ ఆసుపత్రినీ, అహ్మదాబాద్‌లోని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో టెలి-కార్డియాలజీ కోసం మొబైల్ యాప్ ‌ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.

యు.ఎన్ మెహతా సంస్థ ఇప్పుడు కార్డియాలజీకి భారతదేశపు అతిపెద్ద ఆసుపత్రిగా మారుతుంది, అంతేకాకుండా ప్రపంచ స్థాయి వైద్య మౌలిక సదుపాయాలు మరియు వైద్య సదుపాయాలతో ప్రపంచంలోని కొన్ని ఎంపిక చేసిన ఆసుపత్రులలో ఇది ఒకటిగా నిలుస్తుంది. 

ఈ సంస్థ 470 కోట్ల రూపాయల వ్యయంతో విస్తరించనుంది.  విస్తరణ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పడకల సంఖ్య 450 నుండి 1,251 కు పెరుగుతుంది.  ఈ సంస్థ దేశంలో అతిపెద్ద సింగిల్ సూపర్ స్పెషాలిటీ కార్డియాక్ బోధనా సంస్థగా, ప్రపంచంలో అతిపెద్ద సింగిల్ సూపర్ స్పెషాలిటీ కార్డియాక్ ఆసుపత్రుల్లో ఒకటిగా రూపొందుతుంది.

ఈ భవనంలో భూకంపాలను తట్టుకునే నిర్మాణంతో పాటు, అగ్ని మాపక వ్యవస్థ, మరియు ఫైర్ మిస్ట్ సిస్టమ్ వంటి భద్రతా జాగ్రత్తలు ఉన్నాయి.  పరిశోధనా కేంద్రం భారతదేశపు మొట్టమొదటి అధునాతన మొబైల్ కార్డియాక్ ఐ.సి.యు. ‌తో పాటు ఓ.టి. ని కలిగి ఉంటుంది, ఇందులో వెంటిలేటర్లు,  ఐ.ఏ.బి.పి., హిమోడయాలసిస్, ఈ.సి.ఎం.ఓ. మొదలైనవి కూడా ఉంటాయి.   ఈ సంస్థలో 14 ఆపరేషన్ సెంటర్లతో పాటు 7 కార్డియాక్ కాథెటరైజేషన్ ప్రయోగశాలలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.

గిర్నార్ రోప్ వే

2020 అక్టోబర్, 24వ తేదీన గిర్నార్ ‌లో రోప్ ‌వే ప్రారంభోత్సవంతో గుజరాత్ మరోసారి ప్రపంచ పర్యాటక పటంలో ప్రముఖ స్థానం ఆక్రమించనుంది.  ప్రారంభంలో, 25-30 క్యాబిన్లు ఉంటాయి, ప్రతి క్యాబిన్ లో 8 మంది కూర్చునే సౌకర్యం ఉంటుంది.  ఈ రోప్ వే ద్వారా 2.3 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7.5 నిమిషాల్లో చేరుకోవచ్చు.   వీటితో పాటు, ఈ రోప్ వే లో ప్రయాణిస్తూ, గిర్నార్ పర్వతం చుట్టూ ఉన్న పచ్చని చెట్లతో కూడిన అందమైన దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. 

*****


(Release ID: 1667408) Visitor Counter : 302