పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

ప్రాంతీయ, జిల్లాల అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన విధివిధానాన్ని ఆవిష్కరించిన గ్రామీణాభివృద్ధి&పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌

స్థానిక వనరులు, ఆకాంక్షలు, ప్రాధాన్యతలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రాంతం, జిల్లా స్థాయుల్లో సమగ్రాభివృద్ధికి దోహదం చేయనున్న విధివిధానం

Posted On: 20 OCT 2020 3:54PM by PIB Hyderabad

ప్రాంతీయ, జిల్లాల వారీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన విధివిధానాన్ని, కేంద్ర గ్రామీణాభివృద్ధి&పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆవిష్కరించారు. ప్రణాళికల తయారీకి ఈ విధివిధానం దశలవారీ మార్గదర్శినిగా నిలుస్తుంది. ప్రణాళిక రూపకర్తలు, సంబంధిత వర్గాలకు సరైన సమయంలో సాయం చేస్తుంది.
    
    స్థానిక వనరులు, స్థానిక ప్రజల ఆకాంక్షలు, ప్రాధాన్యతాంశాలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రాంతం, జిల్లా స్థాయుల్లో సమగ్రాభివృద్ధికి ఈ విధివిధానం దోహదం చేస్తుందని శ్రీ తోమర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాంతం, జిల్లా పంచాయతీల్లో వికేంద్రీకృత ప్రణాళికతో సంబంధమున్న రిసోర్స్‌ పర్సన్లు, సంబంధింత వర్గాలకు ముఖ్య సాధనంగా ఈ విధివిధానం ఉపయోగపడుతుందని; వేగవంతమైన, సమగ్ర వృద్ధిని అందించడం ద్వారా గ్రామీణ భారత్‌ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పారు.

    అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు, ఎస్‌ఐఆర్‌డీ డైరెక్టర్లు, ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

    భారత రాజ్యాంగ 73వ సవరణ, మూడు దశల పంచాయతీరాజ్‌ వ్యవస్థను సృష్టించింది. అవి (i) గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ (ii) మండలం/తాలూకా స్థాయిలో మధ్యంతర పంచాయతీ (iii) జిల్లా స్థాయిలో జిల్లా పంచాయతీ. 15వ ఆర్థిక సంఘం నిధులు 2020-21 నుంచి మధ్యంతర, జిల్లా పంచాయతీలకు కూడా అందుతున్నాయి. 2020-21లో అన్ని పంచాయతీలకు రూ.60750 కోట్లు పంపిణీ చేయాల్సివుంది. ఇందులో రూ.45774.20 కోట్లు గ్రామ పంచాతీలకు, రూ.8750.95 కోట్లు మధ్యంతర పంచాయతీలకు, రూ.6224.85 కోట్లు జిల్లా పంచాయతీలకు పంపిణీ జరగాలి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికల రూపకల్పనలో ఈ సంస్థలకు సాయం అందాల్సిన అవసరం ఉంది.

    దీనిని దృష్టిలో ఉంచుకుని; ప్రాంతీయ, జిల్లా పంచాయతీల ప్రణాళిక కోసం ఒక సవివర విధివిధానాన్ని డా.బల ప్రసాద్‌ కమిటీ రూపొందించింది. ఈ కమిటీని మంత్రిత్వ శాఖ నియమించింది. డా.బల ప్రసాద్‌, పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌, ఎస్‌ఐఆర్‌డీ, కేఐఎల్‌ఏ ప్రతినిధులు, నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, జిల్లా, ప్రాంతీయ పంచాయతీల నుంచి ఎంపిక చేసినవారు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

    విధివిధానం తయారీ సమయంలో; ఈ పథకానికి సంబంధించిన వివిధ అంశాలను కమిటీ సమగ్రంగా చర్చించింది. ఈ ప్రక్రియలో పాల్గొన్న వర్గాలతో విస్తృతంగా మాట్లాడింది. ప్రణాళికల తయారీ ప్రక్రియ సవివర విశ్లేషణ; రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థల పాత్ర; వివిధ స్థాయిల్లో కలయిక; ఉమ్మడి చర్యల పరిధి.. సంస్థల మధ్య అవగాహనకు సాయపడటమేగాక, ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కూడా దోహదం చేస్తాయి.

***


(Release ID: 1666160) Visitor Counter : 169