ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

సండే సంవాద్ లో శరన్నవారాత్రి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ హర్ష వర్ధన్


“ఈ పండుగ సీజన్ లో వేడుకల కంటే దానధర్మాలదే పైచేయి కావాలి”

“ ఓనం వేడుకలలో నిర్లక్ష్యానికి కేరళ తగిన మూల్యం చెల్లించుకుంది”

“ యావత్ ప్రపంచంలో తొలి కరోనా కేసు చైనాలోని వూహాన్ నుంచేనని గుర్తించారు “

“ కరోనావైరస్ కొత్త రూపమేదీ భారత్ లో గుర్తించలేదు”

“ కరోనా వైరస్ వ్యాప్తికి పత్రికలు కారణం కాదు, అవి సురక్షితం “

“ కోవిడ్ మరణాల నమోదుకు రాష్ట్రాలకు విధివిధానాలు అందించాం”

“ దేశంలో వైద్యపరమైన ఆక్సిజెన్ కు కొరత లేదు”

“ కోవిడ్ రెండో దశ పాకేజ్ కింద అరోగ్య మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు రూ. 1352 కోట్ల విడుదల”

“ ప్రస్తుతం ముక్కుద్వారా ఇచ్చే కరోనా వాక్సిన్ ఏదీ భారత్ లో ప్రయోగ దశలో లేదు”

“ మహిళాశాస్త్రవేత్తలను ప్రోత్సహించటానికి ఎస్ టి ఐ పి -2020 లో ప్రాధాన్యం “

Posted On: 18 OCT 2020 2:15PM by PIB Hyderabad

సండే సంవాద్ ఆరవ ఎపిసోడ్ లో భాగంగా సోషల్ మీడియాలో సంభాష్ఇస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ అనేక మంది అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.నవరాత్రి సందర్భంగా అందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో ప్రధాని ఇచ్చిన ప్రజా ఉద్యమం పిలుపుకు అండగా నిలబడి కోవిడ్ కి తగిన విధంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. అందరూ ఇళ్లలోనే సంప్రదాయబద్ధంగా కుటుంబంతో కలిసి పడుగలు జరుపుకోవాలన్నారు.

ఈ సీజన్ లో వేడుకలకంటే ఎక్కువగా దానధర్మాలదే పైచేయి కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మనకోసం పోరాడుతున్న కోవిడ్ యోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ తాను కూడా పండుగ వేడుకలు నిరాడంబరంగా జరుపుకుంటానని ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ వెల్లడించారు.  

 

ఇటీవల కేరళలో మళ్లీ కోవిడ్ కేసులు పెరగటం మీద కూడా డాక్టర్ హర్ష వర్ధన్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. జనవరి 30 నుంచి మే 3 వరకు కేరళలో కేవలం 499 లేసులు నమోదు కాగా కోవిడ్ మరణాలు 2 మాత్రమేనన్నారు. అయితే,. ఓనం పడుగ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కేరళ ఇప్పుడు తగిన మూల్యం చెల్లించు కుంటున్నదని వ్యాఖ్యానించారు. రాష్ట్రమంతటా అన్ లాక్ అమలు చేయటం, రాష్టంలోపలా, బయటా ప్రయాణాలకు అనుమతించటం వలన అన్ని జిల్లాలలోనూ కరోనా వ్యాపించిందన్నారు. రోజువారీ కొత్త కేసులు దాదాపుగా రెట్టింపు అయ్యాయని, ఇది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ కనువిప్పులాంటిదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు పండుగల సీజన్ ప్రణాళికలో ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని రాష్టాలకు సూచించారు.  

నిరుడు ఏకకాలంలో అనేకదేశాలలో కరోనా వైరస్ ఒక్కసారిగా విజృంభించినట్టు చైనా చెప్పటాన్ని డాక్టర్ హర్ష వర్ధన్ తప్పుబట్టారు. అలా ఒకేసారి వేరు వేరు చోట్ల కరోనా వచ్చిందనటానికి ఎలాంటి ఆధారాలూ లేవన్నారు.చైనా లోని వూహాన్ నగరంలోనే మొట్టమొదటి కరోనా కేసు నమోదైందని ఆయన స్పష్టం చేశారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, చైనాలో తయారైన ఆక్సీమీటర్లు మార్కెట్ ను ముంచెత్తాయని, అందువల్ల కొనే ముందు వినియోగదారులు ఆన్ లైన్ లో కొనటానికి కచ్చితంగా ఎఫ్ డి ఎ./ సిఇ ఆమోదం ఉన్నదీ లేనిదీ ధృవపరచు కోవాలన్నారు.  ఆక్సిజెన్ స్థాయి తగ్గినంత మాత్రాన దాన్ని కోవిడ్ గా భావించకూడదని, ఇతర వైద్య పరమైన కారణాల వలన  కూడా అలా జరిగే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటివరకూ కోవిడ్ కొత్తరూపమేదీ భారత్ లో ఉన్నట్టు తేలలేదని, నిజానికి అలాంటిది ఉంటే మరింత సమర్థంగా వ్యాధిని వ్యాప్తి చేసి ఉండేదని అభిప్రాయపడ్దారు.   

గత ఎపిసోడ్ లో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం కొనసాగింపుగా రాష్టాలకు రెండో దశ కోవిడ్  నిధుల పంపిణీ గురించి కొంతమంది ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ, తమ మంత్రిత్వశాఖ ఇప్పటికే రెండో దశ కోవిడ్ పాకేజ్ ని 33 రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిందన్నారు. మొత్తం ఈ పాకేజ్ కింద రూ. 1352 కోట్ల మేరకు నిధులను ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పంపిణీ చేసినట్టు చెప్పారు. తమ మంత్రిత్వశాఖ కరోనా సంక్షోభ సమయంలో ఏ మాత్రమూ వెనకబడకుండా ఆన్ లైన్ చదువులు ప్రారంభించటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య విద్యా సంస్థలు నేషనల్ మెడికల్ మిషన్ ఆమోదించిన మేరకు ఎంబిబిఎస్ విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయన్నారు. మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు అనుసరించాల్సిన ప్రామాణిక ఆచరణ విధానాలను తమ మంత్రిత్వశాఖ జారీచేసిందన్నారు.

ఉదయాన్నే టీ తాగుతూ పేపర్ చదవటమనే అనుభూతి గురించి ఒకరు ప్రస్తావించటం మీద స్పందిస్తూ, పత్రికల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందనటానికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలూ లేవని స్పష్టం చేశారు. కోవిడ్ సంక్షోభంలోనూ పత్రికలు చదవటం పూర్తి సురక్షితమని కూడా ఆయన చెప్పారు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న కోవిడ్ పరీక్షల సంఖ్యలో తేడాలుండటం గురించి మాట్లాడుతూ తమ మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలనూ ఈ విషయంలో కచ్చితంగా వ్యవహరించాల్సిందిగా పలుమార్లు తెలియజెప్పిందన్నారు.  విధి విధానాలను కూడా పంచుకున్నదన్నారు.

వైద్య చికిత్సలో వాడే ఆక్సిజెన్ కు ఎలాంటి కొరతా లేదని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుత  దేశంలో రోజుకు 6400 మెట్రిక్ టన్నుల ఆక్సిజెన్ ఉత్పత్తి అవుతున్నదని కరోన అకారణంగా అదనంగా అవసరమైనా, తగినంత సరఫరా చేయటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రుల బృందం ఆక్సిజెన్ అందుబాటును ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల నోడల్ అధికారులతో, ప్రిన్సిపల్ కార్యదర్శులతో  సమీక్షిస్తున్నదన్నారు.  రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 1,02,400 ఆక్సిజెన్ సిలిండర్లు పంపిణీ చేశామని, జాతీయ ఔషధ ధరల నియంత్రణసంస్థ ఆక్సిజెన్ ధర నిర్ణయించిందని, హేతుబద్ధంగా వాదకం మీద మార్గదర్శకాలు జారీచేశామని చెప్పారు.  

ముక్కు ద్వారా ఇచ్చే కోవిడ్ వాక్సిన్ల మీద భారత్ లో  ప్రస్తుతం ఎలాంటి క్లినిక్ల ట్రయల్స్ జరటం లేదని, అయితే త్వరలోనే సీరమ్ ఇండియా, భారత్ బయోటెక్ అలాంటి వాక్సిన్లకోసం ఆమోదం పొందాక ప్రయోగాలు జరిపే అవకాశం ఉందన్నారు. మూడో దశ కోవిడ్ వాక్సిన్ ప్రయోగాలు సాధారణంగా వేలమంది మీద జరుగుతాయని, ఒక్కోసారి 30 నుంచి 40 వేల వరకు ఉండవచ్చునని అన్నారు. అందువల్ల ఏదైనా నగరం నుంచి కొన్ని వందలమందిని ఆహ్వానించే అవకాశం ఉందని చెప్పారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రి కూడా అయిన డాక్టర్ హర్ష వర్ధన్ ముంబయ్, చెన్నై నగరాలకోసం రూపొందించిన వరద హెచ్చరిక వ్యవస్థల గురించి చెబుతూ, తీరప్రాంత నగరాలకు ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. త్వరలో కోల్ కతా నగరానికి కూడా విస్తరిస్తామన్నారు. నదుల వరదల్లో చిక్కుకునే అస్సాం, బీహార్ లాంటి రాష్టాలకు కేంద్ర జలసంఘం భారత వాతావరణశాఖ అందించే వర్షపాత అంచనాకు అనుగుణంగా వరద హెచ్చరికలు జారీచేస్తుందన్నారు.

గడిచిన ఆరేళ్ల కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం వివిధ పథకాల ద్వారా ముఖ్యంగా మహిళాశాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకొని లింగ నిష్పత్తిని మెరుగుపరచటానికి కృషి చేసిందన్నారు. శాస్త్ర సాంకేతిక సంస్థలలో ప్రస్తుతం దిగువ స్థాయిలో ఆ మార్పు స్పష్టంగా కనబడుతోందన్నారు. పాఠశాల స్థాయిలో సైన్స్ బోధించే మహిళల శాతంతోబాటే  ,ప్రభుత్వ లాబ్ లలో కూడా వారి శాతం పెరిగిందన్నారు.

పరిస్థితిని మరింత మెరుగుపరచటానికి శాస్త్ర, సాంకేతిక విభాగం అనేక దశలలో, స్థాయిలలో మహిళల ప్రవేశం కోసం మరిన్ని చర్యలు తీసుకుంటోందని, పరిస్థితిని మరింత మెరుగు పరచటానికి ప్రయత్నిస్తోందని వెల్లడించారు.

 సండే సంవాద్ ఆరవ ఎపిసోడ్  చూడటానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి:

Twitter: https://twitter.com/drharshvardhan/status/1317730112872226817?s=20

Facebook: https://www.facebook.com/watch/?v=1114364852316144

Youtube: https://www.youtube.com/watch?v=OYQw5Q8ISPk

DHV App: http://app.drharshvardhan.com/download

 

 

 

 

 

 

 

 

 

 

****

 



(Release ID: 1665666) Visitor Counter : 208