చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

షాంఘాయ్ సహకార సంఘం సభ్య దేశాల న్యాయశాఖ మంత్రుల భేటీ

భారత్ ఆతిథ్యంలో వర్చువల్ సమావేశం నిర్వహణ

అభిప్రాయాలను, ఉత్తమ విధానాలను, అనుభవాలను పరస్పరం పంచుకోవాలని

ఎస్.సి.ఒ. సభ్యదేశాలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి విజ్ఞప్తి

Posted On: 16 OCT 2020 3:43PM by PIB Hyderabad

  షాంఘాయ్ సహకార సంఘం (ఎస్.సి.ఒ.) సభ్యదేశాల న్యాయశాఖా మంత్రుల 7వ సమావేశం 2020వ, సెప్టెంబరు 16న న్యూఢిల్లీలో జరిగింది. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర న్యాయ, కమ్యూనికేషన్, ఎలెక్ట్రానిక్స్, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆతిథ్యమిచ్చారు.

  కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కజకిస్తాన్ న్యాయశాఖ మంత్రి ఎం.బి. బెకెతయెవ్, చైనా న్యాయ శాఖ మంత్రి తాంగ్ యీజున్, కీర్గిజ్ రిపబ్లిక్ న్యాయశాఖ మంత్రి ఎం.టి. డిజామాంకులోవ్, పాకిస్తాన్ న్యాయశాఖ అధికార ప్రతినిధి అంబ్రీన్ అబ్బాసీ, రష్యన్ సమాఖ్య న్యాయశాఖ మంత్రి కె.ఎ. చ్యూచెంకో, తజకిస్తాన్ న్యాయశాఖ మంత్రి ఎం.కె. ఆశ్రియోన్, ఉజ్బెకిస్తాన్ న్యాయ శాఖ మంత్రి ఆర్.కె. దావ్లెతోవ్ ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ, న్యాయ వ్యవహారాల విభాగం కార్యదర్శి అనూప్ కుమార్ మెందీరత్తా ప్రధాన ప్రసంగంతో పాటు, ముగింపు ఉపన్యాసం ఇచ్చారు.   

  ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, అందరికీ సునాయాసంగా న్యాయ సహాయం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలోని ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.  సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి, వృద్ధులకు, మహిళలకు, పిల్లలకు ఉచితంగా న్యాయ ప్రయోజనాలను, న్యాయ సేవలను ప్రారంభించినట్టు చెప్పారు.  టెలీ-లా సేవలను 2017లోనే ప్రారంభించినప్పటికీ, ఇప్పటివరకూ 3.44లక్షల మంది పేద ప్రజలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా న్యాయ సలహా సేవలు అందించినట్టు చెప్పారు. సంప్రదాయ బద్ధంగా గదుల్లో జరిగే న్యాయ విచారణ ప్రక్రియలో విజయవంతమైన మార్పులు తీసుకువచ్చామని, వీడియో కాన్పరెన్సింగ్ సదుపాయంతో ఈ- కోర్టులు, వర్చువల్ కోర్డులు ప్రారంభించామని చెప్పారు. కోవిడ్ 19 వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని పలు కోర్టుల్లో 25లక్షల విచారణ ప్రక్రియలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించినట్టు, అందులో 9వేల వర్చువల్ విచారణలు ఒక్క సుప్రీంకోర్టులోనే జరిగినట్టు ఆయన చెప్పారు. పెట్టుబడులకు, వాణిజ్యానికి కేంద్రంగా భారతదేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో, వాణిజ్య కోర్టుల చట్టం, ఆర్బిట్రేషన్ చట్టాలతో పాటుగా, వాణిజ్య సానుకూలత కలిగిన చట్టాల, నిబంధనల రూపకల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు.

  న్యాయశాఖ మంత్రుల వేదిక కార్యకలాపాల్లో భాగంగా, ఎంపిక చేసిన కొన్ని రంగాల్లో అభిప్రాయాల మార్పిడికి, ఉత్తమ న్యాయ విధానాల, అనుభవాల పరస్పర పంపిణీకి ఎస్.సి.ఒ. సభ్యదేశాలు ప్రోత్సాహాన్ని అందించాలనిస ఈ వేదిక కార్యకలాపాల పరిధిని విస్తరింపజేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని రవిశంకర్ ప్రసాద్ కోరారు

   ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాగానికి ప్రోత్సాహం, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో న్యాయ రంగంతో సహా మిగతా అన్ని రంగాల్లో సహకారం తదితర అంశాల ప్రాధాన్యతపై  ఎస్.సి.ఒ. సభ్య దేశాల కార్యాచరణ బృందం నిపుణులు అంతకు ముందు విస్తృతంగా చర్చించారు.  పరస్పర సహకారం, కరోనా మహమ్మారి వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వంటి అంశాలపై ఎస్.సి.ఒ. సభ్యదేశాల మంత్రులు చర్చించారు. అలాగే, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగంపై సమాచారం పరస్పరం పంచుకోవలసిన ఆవశ్యకతపై కూడా విపులంగా చర్చించారు.  

  సమావేశం అనంతరం ఎస్.సి.ఒ. సభ్యదేశాల న్యాయ శాఖ మంత్రుల 7వ సమవేశం ఒక ఉమ్మడి ప్రకటనను ఆమోదించింది.

 ఉమ్మడి ప్రకటనలో ప్రధానమైన అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

  1. ఎస్.సి.ఒ. సభ్యదేశాల న్యాయ మంత్రిత్వ శాఖల మధ్య సహకార ఒప్పందం అమలు చేసే కృషిని మరింత బలోపేతం చేయడం.
  2. 2018-2020 కాలపు నేర పరిశోధన రంగంలో శాస్త్రీయ పద్ధతుల వినియోగానికి సంబంధించి నిపుణుల బృందాల కార్యాచరణ ప్రణాళికల, న్యాయసేవల అమలుకోసం కసరత్తును కొనసాగించడం. 2021-23 సంవత్సరాలకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం.
  3. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాల్లో ఉత్తమమైన పద్ధతుల అధ్యయనానికి ఎస్.సి.ఒ. సభ్యదేశాల న్యాయ మంత్రిత్వ శాఖల ప్రతినిధుల మధ్య అభిప్రాయ మార్పిడి కార్యక్రమాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించడం.
  4. పరస్పర న్యాయ సహాయ ప్రక్రియకు సంబంధించిన అంశాలు, జాతీయ చట్టాలకు అనుగుణంగా న్యాయ సేవల అభివృద్ధిపై చర్చలు కొనసాగించడం.
  5. ఎస్.సి.ఒ. సభ్యదేశాల న్యాయ మంత్రిత్వ శాఖల మధ్య సహకారాన్ని క్రియాశీలకంగా అభివృద్ధి చేసుకోవడం.
  6. న్యాయసంబంధమైన సమాచారాన్ని పరస్పరం పంపిణీ చేసుకునేందుకు ఒక ఆన్ లైన్ వేదిక రూపకప్లనకు కృషిని కొనసాగించడం. ఈ విషయంలో జాతీయ చట్టాలను పరిగణనలోకి తీసుకోవడం.

   మూడు రోజుల ఈ వర్చువల్ చర్చల్లో భారత్, కజకిస్తాన్, చైనా, కీర్గిజ్ రిపబ్లిక్, పాకిస్తాన్, రష్యన్ సమాఖ్య, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయ శాఖ మంత్రులు, సీనియర్ అధికారులు, న్యాయ రంగ కోవిదులు పాల్గొన్నారు. మంత్రుల స్థాయి సమావేశానికి ముందస్తుగా అధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. న్యాయ నిపుణుల కార్యాచరణ బృందం 2వ సమావేశాన్ని 2020, అక్టోబరు 13, 14 తేదీల్లో నిర్వహించారు. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ,. న్యాయ వ్యవహారాల విభాగం కార్యదర్శి అనూప్ కుమార్ మెందీరత్తా ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చారు. ఈ సమావేశాలన్నీ విడియో కాన్ఫరెన్సింగ్ పద్ధతిలోనే  జరిగాయి.

****



(Release ID: 1665322) Visitor Counter : 209