ప్రధాన మంత్రి కార్యాలయం
ఎఫ్ఎఒ 75 వ వార్షికోత్సవ సూచకంగా 75 రూపాయల స్మారక నాణేన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి
ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత కు కృషి చేయడం లో ఎఫ్ఎఒ పోషిస్తున్న పాత్ర కు ప్రశంసలు
ఇటీవలే అభివృద్ధిపరచిన పంటల తాలూకు 17 బయోఫోర్టిఫైడ్ వెరైటీలను దేశ ప్రజలకు ఆయన అంకితం చేశారు
భారతదేశం లో అమలు చేస్తున్న సంస్కరణలు ప్రపంచ ఆహార భద్రత పట్ల భారతదేశ వచనబద్ధతను సూచిస్తున్నాయని స్పష్టంచేసిన ప్రధాన మంత్రి
Posted On:
16 OCT 2020 4:51PM by PIB Hyderabad
ఎఫ్ఎఒ 75వ వార్షికోత్సవానికి సూచకంగా 75 రూపాయల విలువ కలిగిన స్మారక నాణేన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఆవిష్కరించారు. పంటలకు సంబంధించి ఇటీవలే అభివృద్ధిపరచిన 17 బయోఫోర్టిఫైడ్ రకాలను దేశ ప్రజల కు ఆయన అంకితం చేశారు.
ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రసంగిస్తూ, పోషకాహార లోపం సమస్యను దూరం చేయడానికి నిరంతరం పాటుపడుతున్న ప్రపంచవ్యాప్త ప్రముఖులకు అభినందనలు తెలిపారు. పోషకాహార లోపంపై జరుగుతున్న ఉద్యమానికి మన రైతాంగం సహచరులు - మన అన్నదాతలు, మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, మన ఆంగన్‌వాడీ కార్యకర్తలు, మన ఆశా కార్యకర్తలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. కఠోర శ్రమ తో వారు భారతదేశ ధాన్యాగారాన్ని నింపుతూనే, పేదలలోకెల్లా నిరుపేదల చెంతకు ప్రభుత్వం చేరుకోవడంలో సైతం చేదోడుగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రయత్నాలన్నిటి కారణంగా భారతదేశం ప్రస్తుత కరోనా సంక్షోభంలో సైతం పోషకాహార లోపానికి ఎదురొడ్డి గట్టిగా పోరాడుతోందని ప్రధాన మంత్రి అన్నారు.
వ్యావసాయక ఉత్పత్తిని పెంచడంలో తోడ్పడడమేకాకుండా భారతదేశం తో సహా ప్రపంచం లో ఆకలి బాధలను నిర్మూలించడానికి కూడా ఎఫ్ఎఒ ఏళ్ల తరబడి సాయపడిందని ప్రధాన మంత్రి చెప్పారు. పోషణ జ్ఞానాన్ని పెంచడంలో పెద్ద ఎత్తున సహకరించిందని ఆయన అంటూ, భారతదేశం లోని 130 కోట్లకు పైగా పౌరులు ఆ సంస్థ సేవలను గౌరవిస్తున్నారన్నారు. ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి వరల్డ్ ఫూడ్ ప్రోగ్రామ్ కు దక్కడం ఎఫ్ఎఒ సాధించిన ఘన విజయాలలో ఒకటి అని ఆయన అన్నారు. ఎఫ్ఎఒ తో భాగస్వామ్యాన్ని చూసుకొని భారతదేశం సంతోషిస్తోందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
వరల్డ్ ఫూడ్ ప్రోగ్రామ్ ను డాక్టర్ బినయ్ రంజన్ సేన్ ఎఫ్ఎఒ డైరక్టర్ జనరల్ గా ఉన్న కాలం లో, ఆయన నేతృత్వం లో ఆరంభించడం జరిగిందని ప్రధాన మంత్రి గుర్తుకుతెచ్చారు. కరవులు, ఆకలి చావుల తాలూకు వేదన ను డాక్టర్ బినయ్ రంజన్ సేన్ అతి దగ్గర నుంచి గమనించారని, ఆయన మొదలుపెట్టిన కార్య భారం యావత్తు ప్రపంచానికి ఈనాటికీ ప్రయోజనకారిగా నిలుస్తోంది అని ప్రధాన మంత్రి చెప్పారు. గడచిన కొన్ని దశాబ్దాలలో పోషకాహార లోపం సమస్య పై భారతదేశం సాగిస్తున్న పోరు ను ఎఫ్ఎఒ నిశితంగా పరిశీలించిందని, అయితే దీని ఈ పోరాట క్రమంలో పలు అడ్డంకుల ను ఎదుర్కొందని ఆయన అన్నారు. చిన్న వయస్సు లోనే గర్భం దాల్చుతుండటం, విద్యాభ్యాసానికి దూరంగా ఉండటం, సమాచార లేమి, తాగునీరు తగినంతగా అందుబాటులో లేకపోవడం, స్వచ్ఛత లోపించడం మొదలైన కారణాలు మనం ఆశించిన ఫలితాలను పొందలేకపోవడానికి దారితీశాయి అని ప్రధాన మంత్రి అన్నారు.
ఏళ్ళ తరబడి సంపాదించిన అనుభవంతో 2014వ సంవత్సరం తరువాత దేశం లో సరిక్రొత్త ప్రయత్నాలు జరిగాయని ప్రధాన మంత్రి అన్నారు. ప్రభుత్వం ఒక ఏకీకృత దృక్పథం తో సమగ్ర వైఖరిని అవలంబించి, బహుళ పక్షీయ వ్యూహంతో కృషి చేసేందుకు గాను అన్ని అవరోధాలను ఛేదించిందని ఆయన చెప్పారు. పోషకాహార లోపంతో పోరాడటం కోసం జాతీయ పోషణ మిషన్ (పోషణ్ అభియాన్), స్వచ్ఛ్ భారత్ మిషన్ లో భాగంగా టాయిలెట్ ల నిర్మాణం, మిషన్ రెయిన్ బో, జల్ జీవన్ మిషన్, శానిటేషన్ ప్యాడ్స్ ను తక్కువ ధర కే పంపిణీ చేయడం తదితర కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన వివరించారు. ఆ ప్రయత్నాల వల్ల పాఠశాలల్లో బాలికల స్థూల నమోదు నిష్పత్తి బాలుర నిష్పత్తి ని మించింది అంటూ ఆయన ప్రముఖంగా ప్రకటించారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి ముతక ధాన్యాల వాడకాన్ని ప్రోత్సహించడంతో పాటు మాంసకృత్తులు, ఇనుము, జింకు మొదలైన బలవర్ధక ఆహార పంట ల సాగును పెంచడంపై దృష్టిని కేంద్రీకరించడం జరిగిందని ఆయన అన్నారు.
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023 వ సంవత్సరాన్ని ప్రకటించాలన్న భారతదేశం ప్రతిపాదన ను ఎఫ్ఎఒ పూర్తి స్థాయి లో సమర్ధించినందుకు ఎఫ్ఎఒ కు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఇది బలవర్ధక ఆహారాన్ని తీసుకోవడాన్ని, ఆ కోవ కు చెందిన ఆహారం మరింత ఎక్కువగా అందుబాటు లోకి రావడాన్ని ప్రోత్సహిస్తుందని, అంతేకాకుండా చిన్న రైతులకు ఎంతో మేలును కూడా చేస్తుందని ఆయన చెప్పారు. చిన్న రైతులు, సన్నకారు రైతులు వారి పొలాల్లో చాలావరకు ముతక ధాన్యాలను పండిస్తారని, ఆ భూమి లో నీటి సమస్య ఉంటుందని, నేల అంత సారవంతంగా ఉండదని ఆయన చెప్పారు. ఇది ఒక్క భారతదేశానికే కాకుండా యావత్తు ప్రపంచానికి కూడా ప్రయోజకారి కాగలదని ప్రధాన మంత్రి అన్నారు.
కొన్ని పంటలకు చెందిన ఉమ్మడి రకంలో కొన్ని సూక్ష్మ పోషక విలువలు లభ్యం కావని, ఈ కారణంగా ఈ లోపాలను అధిగమించడం కోసం బయోఫోర్టిఫైడ్ వెరైటీలను రూపొందించడమైందని ప్రధాన మంత్రి తెలిపారు. ఈ రోజున 17 బయోఫోర్టిఫైడ్ విత్తన రకాల ను రైతుల అందుబాటు లోకి తీసుకురావడం జరుగుతోంది, వీటిలో వరి, గోధుమ సహా అనేక స్థానిక పంటలతో పాటు సాంప్రదాయక పంటల రకాలు కూడా ఉన్నాయి, ఇది పోషణ ప్రచార ఉద్యమాన్ని బలపరచే దిశలో ఒక ముఖ్యమైన ముందంజ అని ప్రధాన మంత్రి వివరించారు.
కరోనా మహమ్మారి వల్ల భారతదేశంలో పోషకాహార లోపం, ఆకలిదప్పులు ప్రబలుతాయని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ఆందోళనల మధ్య గడచిన ఏడెనిమిది నెలల కాలం లో భారతదేశం 80 కోట్ల మంది పేద ప్రజల కు పోషకాహార లోపం, ఆకలిదప్పులతో పోరాడటానికి గాను దాదాపు 1.5 కోట్ల రూపాయల విలువైన ఆహార ధాన్యాలను పంచిపెట్టిందని ఆయన చెప్పారు. ఈ ఉచిత ఆహార పంపిణీ పథకం లో పప్పులతో పాటు బియ్యం లేదా గోధుమలను చేర్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించడమైందని, ఆహార భద్రత పై భారతదేశం వచనబద్ధత ను ఇది చాటిచెప్తోందని ప్రధాన మంత్రి అన్నారు.
ఆహార భద్రత చట్టం 2014వ సంవత్సరం వరకు కూడాను కేవలం 11 రాష్ట్రాల లోనే అమలయిందని, ఆ తరువాతి కాలం లో మాత్రమే ఆ చట్టాన్ని దేశమంతటా ప్రభావశీలమైన పద్ధతిలో అమలులోకి తీసుకురావడమైందని ప్రధాన మంత్రి అన్నారు. యావత్తు ప్రపంచం కరోనా తో సంఘర్షిస్తూ ఉన్న వేళ, భారతదేశ రైతాంగం ఆహారధాన్యాలను రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేసిందని, అలాగే ప్రభుత్వం కూడా గోధుమ, వరి, ఇంకా కాయధాన్యాల సేకరణ లో కొత్త రికార్డులను సృష్టించిందని ఆయన అన్నారు. భారతదేశంలో సంస్కరణల ను అదే పనిగా అమలులోకి తీసుకురావడం జరుగుతోందని, ప్రపంచ ఆహార భద్రత పట్ల భారతదేశానికి ఉన్న వచనబద్ధతను ఇది చాటుతోందని ఆయన అన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయ రంగంలో వివిధ సంస్కరణలను తీసుకు వస్తున్న సంగతిని ఆయన ఒక్కొటొక్కటి గా వివరించారు. ఎపిఎమ్‌సి చట్టానికి చేసిన సవరణల లక్ష్యమల్లా ఆ చట్టాన్ని మరింత స్పర్ధాత్మకంగా మార్చడమే అని ఆయన చెప్పారు. రైతులు వారు చేసిన ఖర్చుకు ఒకటిన్నర రెట్ల మొత్తాన్ని కనీస మద్ధతు ధర (ఎమ్ఎస్‌పి) రూపంలో పొందేలా చూసేందుకు అనేక చర్యలు తీసుకోవడమైందని ఆయన తెలిపారు. దేశ ఆహార భద్రత కు పూచీ పడటంలో ఎమ్ఎస్‌పి, ప్రభుత్వ సేకరణ లు ఒక ముఖ్య పాత్రను పోషిస్తాయి అని ఆయన చెప్పారు. ఈ కారణంగా వాటిని కొనసాగించడం స్వాభావికమని ప్రధాన మంత్రి అన్నారు.
చిన్న రైతులకు బలాన్ని ఇవ్వడానికి దేశం లో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ( ఎఫ్ పిఒ స్) తో ఒక పెద్ద వ్యవస్థ ను నిర్మించడం జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం లో ధాన్య వృధా ఒక పెద్ద సమస్య గా ఉంటూ వచ్చింది, నిత్యావసర వస్తువుల చట్టం లో చేసిన సవరణలు ఈ దు:స్థితి ని మార్చివేస్తాయి అని ఆయన స్పష్టం చేశారు. ఇక గ్రామాలలో మెరుగైన మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు మరిన్ని ఎక్కువ అవకాశాలను ప్రభుత్వం తో పాటు ప్రైవేటు రంగ పాత్రధారులు చేజిక్కించుకొంటాయని ఆయన అన్నారు.
ఎపిఎమ్‌సి చట్టానికి సవరణ ను గురించి ప్రధాన మంత్రి మరింత విపులంగా వివరిస్తూ, ఎప్పుడైతే రైతు ఏదైనా పరిశ్రమలో గాని, ప్రైవేటు కంపెనీతో గాని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరుగుతుందో, అటువంటప్పుడు పంట ను నాటే కంటే ముందే ఆ పంట తాలూకు ధర నిర్ణయం జరుగుతుంది అన్నారు. ఇది ధరల పరంగా ఏర్పడే ఒడుదొడుకుల బారి నుండి ఉపశమనాన్ని కూడా అందిస్తుందని, అంతేకాకుండా సాగు లో కొత్త సాంకేతికత ను ప్రోత్సహిస్తుందని చెప్పారు. రైతు కు మరిన్ని ఐచ్ఛికాలను ఇవ్వడంతో పాటు రైతు కు చట్టపరమైన రక్షణ ను కూడా అందించడమైంది అని ఆయన వివరించారు. ఏదైనా కారణం వల్ల ఒప్పందాన్ని మానుకోవాలని రైతు కోరుకుంటే, అతను జరిమానా చెల్లించవలసిన అవసరం లేదన్నారు. అయితే, రైతు తో ఒప్పందం కుదుర్చుకొనే సంస్థ ఒప్పందాన్ని మీరినప్పుడు, ఆ సంస్థ జరిమానా ను చెల్లించవలసి వస్తుందని తెలిపారు. ఒప్పందం దిగుబడి కి సంబంధించింది మాత్రమే అవుతుందని, రైతు కు చెందిన భూమి విషయంలో ఎలాంటి సంకటానికి తావు ఉండదని చెప్పారు. దీనికి అర్థం, ఈ సంస్కరణల ద్వారా రైతు కు అన్ని విధాలైన రక్షణను కల్పించడమైంది అనేనని ఆయన స్పష్టం చేశారు.
భారతదేశం రైతులు బలాన్ని పుంజుకొన్న పక్షంలో వారి ఆదాయం అధికం అవుతుందని, అదే విధంగా పోషకాహార లోపానికి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచార ఉద్యమం కూడా అంతే బలాన్ని సంతరించుకొంటుందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. భారతదేశానికి ఎఫ్ఎఒ కు మధ్య సహకారం, సమన్వయం పెరుగుతూ ఉండటమనేది ఈ ప్రచార ఉద్యమానికి మరింత గతి ని అందించగలదన్న ఆకాంక్ష ను ఆయన వ్యక్తం చేశారు.
***
(Release ID: 1665225)
Visitor Counter : 295
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam