వ్యవసాయ మంత్రిత్వ శాఖ

‘భారతీయ వ్యవసాయ దృక్పథం, 4వ వేదిక-2020’ రెండు రోజుల వెబినార్ సదస్సు ప్రారంభం

2020-21 ప్రథమ త్రైమాసికంలో 3.4శాతం వ్యవసాయ వృద్ధి నేపథ్యంలో

రైతులకు, భాగస్వామ్య వర్గాలకు కేంద్రమంత్రి అభినందనలు

Posted On: 15 OCT 2020 5:14PM by PIB Hyderabad

   ‘భారతీయ వ్యవసాయ దృక్పథం 4వ వేదిక-2020’ పేరిట రెండు రోజుల వెబినార్ సదస్సు న్యూఢిల్లీలోని కృషీ భవన్ లో 2020 అక్టోబరు 15న మొదలైంది. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి పురుషోత్తం రుపాల ఈ సందర్భంగా మాట్లాడుతూ, కీలకమైన ఈ సమయంలో ‘భారతీయ వ్యవసాయ దృక్పథం 4వ వేదిక’ నిర్వహించడంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ  కృషిని అభినందించారు. మహమ్మారి వైరస్ ప్రభావితమైన భారతదేశపు ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం అగ్రశ్రేణి రంగంగా ఆవిర్భవించి, తన విశేషమైన పనితీరును కనబరిచిందన్నారు. 2020-21వ సంవత్సరపు తొలి త్రైమాసికంలో 3.4శాతం వృద్ధిని సాధించిందని, ఇందుకు ఎంతో చిత్తశుద్ధితో కృషి చేసిన ప్రతి రైతును, బాధ్యుడైన ప్రతి భాగస్వామిని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తాను అభినందిస్తున్నానని చెప్పారు.

   వ్యవసాయ రంగంపై ఇటీవల తీసుకువచ్చిన సంస్కరణలను, విధానపరమైన చర్యలను మంత్రి ప్రస్తావిస్తూ, వ్యవసాయం, ఉద్యానవన రంగం, తదితర అనుబంధ రంగాల్లో అన్ని కార్యకలాపాలను, సేవలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలు, సూక్ష్మ ఆహార సంస్థలు, మత్స్య, పశుసంవర్ధక శాఖల కోసం అభివృద్ధి చర్యలు, ఔషధ మొక్కలు, మూలికల సాగు, తేనెటీగల పెంపకం వంటి రంగాలకు ప్రోత్సాహం అందించడానికి వ్యవసాయ మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఈ వ్యవసాయ వేదికలో జరిగే చర్చలతో, ప్రపంచ స్థాయి అభివృద్ధి అంశాలు, పరిణామాలపై స్పష్టత లభిస్తుందన్నారు. ప్రకృతి వనరుల నాణ్యతను కాపాడుతూనే, రైతుల సంక్షేమం, సౌభాగ్యం అందించే రంగంగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దే అంశంపై కూడా ఈ వేదిక ద్వారానే స్పష్టత చేకూరుతుందన్నారు. 

   సవాళ్లతో కూడిన ఈ సమయంలో రైతుల సంక్షేమం కోసం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ చేసిన కృషిని  కేంద్ర వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ ప్రశంసించారు. గత కొన్ని నెలలుగా చేపట్టిన వ్యవసాయ సంస్కరణలను ఆయన క్లుప్తంగా వివరించారు. రైతులను ఔత్సాహిక వాణిజ్య వేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్నదన్నారు. ప్రస్తుత వ్యవసాయ సంవత్సరంలో ఇప్పటికే రికార్డు స్థాయిలో నాట్లు జరిగాయని, పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగుపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించిందని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, వ్యవసాయ సంబంధమైన మౌలిక సదుపాయాలు, ఆహార సరఫరా నిర్వహణ, రైతులకు తగిన ధర లభించేలా చేయడంలో వాటి ప్రభావం తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.  పంట దిగుబడి అనంతరం వ్యవసాయ ఉత్పత్తుల నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసే సానుకూల వ్యవస్థను గురించి ఆయన వివరించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ప్రోత్సాహం, చిన్న, సన్నకారు రైతులకు స్వల్పకాలిక రుణ సదుపాయం, ప్రత్యక్ష మార్కెటింగ్ కు ప్రోత్సాహం, కాంట్రాక్ట్ వ్యసాయం,  రైతులకు ధరల పూచీ, నష్టనివారణ చర్యలు వంటి వాటిపై వ్యవసాయ మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. ఈ సంస్కరణల అమలుకోసం రాష్ట్రాల చట్టాల్లో చేయవలసిన మార్పుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. భవిష్యత్తులో విధాన పరంగా వ్యవసాయ రంగంలో తీసుకు రావలసిన మార్పులకు ఈ వెబినార్ చర్చలు దోహదపడతాయని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.

  వ్యవసాయ దృక్పథ వేదికలో చర్చించిన ప్రధాన అంశాలు: వైరస్ మహమ్మారి సంక్షోభంతో ప్రభావితమైన ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక పరిస్థితి,.. ప్రతికూల పరిణామాల ప్రభావాన్ని తగ్గించుకుంటూ, తమతమ ఆర్థిక వ్యవస్థల ముందుకు సాగేలా చూసేందుకు భారత్, ప్రపంచ దేశాలు చేస్తున్న పోరాటం,; వ్యవసాయ రంగంలో మార్పులకోసం తీసుకోవలసిన చొరవ, సుస్థిరమైన, సమ్మిళితమైన వ్యవసాయ ప్రగతికోసం ప్రపంచ స్థాయి లక్ష్యాలను నెరవేర్చడం, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం, ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ పంటల సేకరణ సంస్థలను హేతుబద్ధం చేసేందుకు నూతన మార్గాల అన్వేషణ, ఉద్యోగాల కల్పనకు అవసరమైన సామర్థ్యాలను నిర్మించుకోవడం తదితర అంశాలపై వెబినార్ లో చర్చించారు.

   రెండు రోజుల ఈ వెబినార్ సదస్సులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, జాతీయ,. అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థల ప్రతినిధులు, అమెరికా వ్యవసాయ శాఖ ముఖ్య ఆర్థిక నిపుణుడు, విదేశీ రాయబార కార్యాలయాల ప్రతినిధి బృందం, అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఒ.), యూరోపియన్ యూనియన్ (ఇ.యు.), ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఒ.ఇ.సి.డి.)ల ప్రతినిధులు, భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐ.సి.ఎ.ఆర్.) శాస్త్రవేత్తలు, వ్యవసాయ సంబంధమైన పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, రైతు సంఘాల ప్రతినిధులు ఈ వెబినార్ సదస్సులో ఆన్ లైన్ ద్వారా పాల్గొంటున్నారు.

******



(Release ID: 1664876) Visitor Counter : 180