ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ విజ‌న్ 2050 కోసం ‘మోత్తం ప్ర‌భుత్వ‌’ విధానాన్ని పెంపొందించేందుకు అంత‌ర్ మంత్రిత్వ‌శాఖ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించిన డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌

ఆహార భ‌ద్ర‌త నుంచి పోష‌కాహార‌భ‌ద్ర‌త కు పిలుపు

ఈట్ రైట్ ఇండియా, ఫిట్ ఇండియా ఉద్య‌మం వంటివి గేమ్‌ఛేంజ‌ర్స్ కానున్నాయి. ఇవి రాగ‌ల ప‌ది సంవ‌త్స‌రాల‌లో మంచి ఫ‌లితాలు ఇవ్వ‌నున్నాయి: డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌

ఆహార సంబంధిత అనారోగ్యాల కార‌ణంగా దేశంపై ప‌డే భారాన్ని “ఈట్ రైట్ ఇండియా ”కార్య‌క్ర‌మం తొల‌గిస్తుంది. ఇలాంటి అనారోగ్యాల వ్య‌యం ఏటా దేశంపై 15 బిలియ‌న్ డాల‌ర్లు గా ఉంటున్న‌ద‌ని అంచనా.

Posted On: 15 OCT 2020 2:48PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్, ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ, వివిధ మంత్రిత్వ‌శాఖ‌ల‌కు చెందిన ఇత‌ర సీనియ‌ర్ అధికారుల‌తో జ‌రిగిన అంత‌ర్ మంత్రిత్వ‌శాఖల స‌మావేశంలో పాల్గొన్నారు.ఈట్ రైట్ ఇండియా ఉద్య‌మానికి సంబంధించి విజ‌న్ 2050ని సాధించడానికి మొత్తం ప్ర‌భుత్వ విధానాన్ని అనుస‌రించి ముందుకు తీసుకువెళ్ల‌డం ఈ స‌మావేశం ల‌క్ష్యం.
ఆహార సంబంధిత అనారోగ్యాల వ‌ల్ల దేశంపై ప‌డుతున్న భారం సుమారు 15 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంటున్న‌ద‌ని డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అన్నారు.  బాగా బ‌రువు త‌గ్గిపోవ‌డం (21శాతం), త‌గిన బ‌రువు లేక‌పోవ‌డం (36 శాతం), స‌రైన ఎదుగుద‌ల లేక‌పోవ‌డం (36శాతం) వంటివి పిల్ల‌ల‌లో స‌ర్వ‌సాధార‌ణంగా క‌నిపించే ఆహార సంబంధిత లోపాలు. 50 శాతం మంది మ‌హిళ‌లు, పిల్ల‌లు ర‌క్త హీన‌త‌తో బాధ‌ప‌డుతున్నారు. 2005-2015 ద‌శాబ్దంలో  ఊబ‌కాయం స‌మ‌స్య రెట్టింపు అయింది. పురుషుల‌లో ఇది 9.3 శాతం నుంచి 18.6 శాతానికి , మ‌హిళ‌ల‌లో 12.6 శాతం నుంచి  20.7 శాతానికి పెరిగింది. అలాగే మ‌హిళ‌ల‌లో ఎన్‌సిడి వ‌ల్ల మ‌ర‌ణాలు పెరిగాయి. అందువ‌ల్ల ఆహార భ‌ద్ర‌త నుంచి పౌష్టికాహార భ‌ద్ర‌త దిశ‌గా ముందుకు వెళ్లేందుకు వివిధ మంత్రిత్వ‌శాఖ‌లు క‌ల‌సి క‌ట్టుగా ఒక ఉమ్మ‌డి వేదిక‌మీదికి వ‌చ్చి ఉమ్మ‌డి ల‌క్ష్యాలు, వ్యూహాల‌తో అందుకు అనుగుణంగా కార్య‌క్ర‌మాల‌ను  ప‌రస్ప‌రం స‌మ‌న్వ‌యం చేసుకోవాలని ఆయ‌న అన్నారు.
ఈట్ రైట్ ఇండియా, ఫిట్ ఇండియా ఉద్య‌మాలు దేశ ఆరోగ్య రంగంలో గేమ్ ఛేంజ‌ర్లుగా మార‌నున్నాయ‌ని డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అన్నారు. రాగ‌ల ప‌ది సంవ‌త్స‌రాల‌లో వీటి ఫ‌లితాల‌ను మనం స్ప‌ష్టంగా చూడ‌బోతున్నామ‌ని ఆయ‌న అన్నారు. వ్య‌వ‌స్థ ఆధారిత విధానం ఆహార భ‌ద్ర‌త‌ను స‌మ‌కూరుస్తుంద‌ని అలాగే ఆరోగ్య‌వంత‌మైన ఆహారం దానితో పాటు సుస్థిర విధానాల ద్వారా ప‌ర్యావ‌ర‌ణంప‌ట్ల శ్ర‌ద్ధ తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు.

1.3 బిలియ‌న్ల దేశ జ‌నాభాలో స‌గ‌భాగం మంది విష‌యంలో  సిఫార్సు చేసిన కీల‌క సూక్ష్మ పోష‌కాలు  అంద‌డం లేద‌ని ఆయ‌న అన్నారు.అందువ‌ల్ల ఆహార భ‌ద్ర‌త నుంచి పౌష్టికాహార భ‌ద్ర‌తా విధానానికి ఆయ‌న పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి వివిధ మంత్రిత్వ‌శాఖ‌‌లు ప్ర‌ధాన  ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్‌, వాటి నియంత్ర‌ణ‌, వ్య‌ర్ధ‌మైపోవ‌డానికి సంబంధించి,ప‌రిశుభ్ర‌త‌,చిట్ట‌చివ‌రి వినియోగం వంటి విష‌యాల‌లో కీల‌క చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అప్పుడు మాత్ర‌మే ఈట్ రైట్ ఇండియా ఉద్య‌మం నిజ‌మైన స్ఫూర్తి క‌లిగి ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. వివిధ మంత్రిత్వ‌శాఖ‌ల ప్ర‌తినిధులు త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేశారు. ఈ ఉద్య‌మానికి అనుగుణంగా వివిధ శాఖ‌ల మ‌ధ్య సమ‌న్వ‌యానికి సంబంధించిన కీల‌క అంశాల విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింది.
కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ రాజేష్ భూష‌న్‌, ఎఫ్ఎస్ఎస్ ఎ ఐ , సిఇఒ శ్రీ అరుణ్ సింఘాల్‌, మ‌హిళ‌,శిశు అభివృద్ధి శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ‌రామ్ మోహ‌న్ మిశ్రా, పశు సంవ‌ర్ధ‌క‌, పాడి ప‌రిశ్ర‌మ‌, పాల ఉత్ప‌త్తి విభాగం కార్య‌ద‌ర్శి శ్రీ అతుల్ చ‌తుర్వేది, వ్య‌వ‌సాయ‌శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి శ్రీ‌మ‌తి అల్కా భార్గ‌వ‌, వినియోగ దారుల వ్య‌వ‌హారాల అద‌న‌పు కార్య‌ద‌ర్శి నిధి ఖ‌రే .డిజిహెచ్‌.ఎస్ డాక్ట‌ర్ సునీల్ కుమార్‌, ఆహారం, మ‌త్స్య‌, ఎం.ఎస్‌.ఎం.ఇ శౄఖ‌ల సంయుక్త కార్య‌ద‌ర్శులు ఈ  కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

***
 


(Release ID: 1664814) Visitor Counter : 261