రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

రైతులకు సకాలంలో తగిన ఎరువులు అందేలా చూడాలి ప్రభుత్వ రంగ ఎరువుల సంస్థల సి.ఎం.డి.లకు కేంద్ర మంత్రి గౌడ ఆదేశం

Posted On: 14 OCT 2020 2:40PM by PIB Hyderabad

    ప్రభుత్వ రంగంలోని ఎరువుల సంస్థల పనితీరు, భవిష్యత్తు అవసరాలకోసం సదరు సంస్థల సన్నద్ధత తదితర అంశాలపై ఆయా ఎరువుల సంస్థల చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్లతో (సి.ఎం.డి.లతో) కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి ఛబిలేంద్ర రౌల్, జాతీయ ఎరువుల సంస్థ సి.ఎం.డి వీరేంద్రనాథ్ దత్, రాష్ట్రీయ కెమికల్స్, ఫర్టిలైజర్స్ సంస్థ సి.ఎం.డి.,. ఎస్.సి. ముద్గేరీకర్, ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెంకోర్ లిమిటెడ్ సి.ఎం.డి.,  కిశోర్ రుంగ్తా, మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ సి.ఎం.డి.,. యు. శరవణన్, బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ సి.ఎం.డి., .కె. ఘోష్, ఎఫ్.సి.. అరావలి జిప్సమ్ అండ్ మినరల్స్ ఇండియా లిమిటెడ్  సి.ఎం.డి.,. అమర్ సింగ్ రాథోడ్ ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు

  సమీక్ష ప్రారంభంలో మంత్రి సదానంద గౌడ మాట్లాడుతూ,.. లాక్ డౌన్ కాలంలో అనేక అడ్డంకులు ఎదురైనప్పటికీ, రైతులకు తగిన పరిమాణంలో ఎరువులు అందుబాటులో ఉండేలా దేశవ్యాప్తంగా ఉన్న తమ పరిశ్రమలను నడిపించి చక్కని సేవలందించిన ప్రభుత్వ రంగ సంస్థలకు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా యూరియా, తదితర ఎరువుల పంపణీ సజావుగా జరిగేలా ఈ సంస్థలు సేవలందించడం ప్రశంసనీయమన అన్నారు. మెరుగైన వర్షపాతం కారణంగా ఈ ఖరీఫ్ సీజన్ లో పంటవిస్తీర్ణ గణనీయంగా పెరిగినప్పటికీ, దేశంలో యూరియాకు ఎలాంటి కొరత రాకుండా స్వదేశీ కంపెనీలు చర్యలు తీసుకోవడం, ఎరువుల శాఖ అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించడం అభినందనీయమన్నారు.

   రానున్న రబీ సీజన్ లో కూడా రైతులకు తగిన మోతాదులో ఎరువులు అందుబాటులో ఉండేలా చూసేందుకు సన్నద్ధంకావాలని ప్రభుత్వ రంగ ఎరువుల సంస్థల సి.ఎం.డి.లను కేంద్ర మంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా, ఎరువుల అమ్మకంలో నగదు రహితల లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించుకోవాలని సి.ఎం.డి.లను ఆదేశించారు. ఎరువుల సబ్సిడీ దారిమళ్లడం, దుర్వినియోగం కావడం వంటి పరిస్థితి నివారణకు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్నారు.  

  ప్రభుత్వ రంగ ఎరువుల సంస్థలన్నీ స్వావలంబన సాధించవలసిన అవసరం ఉందని, ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులపై ఆధారపడే స్థితి భవిష్యత్తులో వాటికి ఉండకూడదని అన్నారు. విభన్నమైన ఉత్పత్తులను రూపొందించడం, నానో ఎరువులు, కస్టమైజ్డ్ ఎరువులు వంటి కొత్త ఉత్పాదలను తయారు చేయడం వంటి అంశాలపై దృష్టిని కేంద్రీకరించడం ప్రస్తుతం అత్యంత ఆవశ్యకమన్నారు. ఎరువుల ప్లాంట్లు భవిష్యత్తులో మనుగడ సాగించాలంటే కొత్త అవసరాలకు తగినట్టుగా వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేటు రంగం ఉత్పత్తులతో, దిగుమతి అయ్యే ఉత్పత్తులతో పోటీ పడాలంటే ఇలాంటి చర్యలు తప్పవన్నారు. పర్యావరణపరమైన ఆందోళనలు, అంశాలపట్ల ప్రతిస్పందించే రీతిలో ఉండాలన్నారు.

  ఎరువుల శాఖ కార్యదర్శి ఛబిలేంద్ర రౌల్ మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాల్లో ఎదురయ్యే పరిస్థితుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ రంగ ఎరువుల సంస్థలన్నీ ఎప్పటికప్పుడు తమ ప్రణాళికలను బలోపేతం చేసుకుంటూ ఉండాలన్నారు.

   ప్రభుత్వ రంగ ఎరువుల సంస్థల సి.ఎం.డి.లు తమ పరిధిలోని సంస్థల పనితీరు గురించి ఈ సమీక్షా సమావేశంలో క్లుప్తంగా వివరించారు. సాంకేతిక పరిజ్ఞాన పరంగా తమ సంస్థలను నవీకరించుకునేందుకు, భవిష్యత్తులో తమ సంస్థల మనుగడ, అవసరాలకు తగినట్టుగా ప్రక్షాళన ప్రక్రియ చేపట్టేందుకు తాము పెట్టిన పెట్టుబడులను గురించి వారు ప్రధానంగా వివరించారు. సంస్థల పటిష్టతకోసం చేపట్టబోయే విస్తరణ ప్రణాళికలపై సమాచారాన్ని కూడా వారు అందజేశారు

******



(Release ID: 1664391) Visitor Counter : 106