భారత ఎన్నికల సంఘం

ఉత్త‌ర ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ నుంచి ఎన్నికైన 11 మంది రాజ్య‌స‌భ స‌భ్యుల ప‌ద‌వీ కాలం ముగుస్తున్న క్ర‌మంలో ఆ స్థానాల‌ను భ‌ర్తీ చేసేందుకు ద్వైవార్షిక ఎన్నిక‌లు

Posted On: 13 OCT 2020 12:27PM by PIB Hyderabad

రెండు రాష్ట్రాల నుంచి రాజ్య‌స‌భకు ఎన్నికైన 11 మంది స‌భ్యుల ప‌ద‌వీకాలం న‌వంబ‌ర్‌, 2020లో ముగియ‌నున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆ ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు ఎన్నిక‌ల‌ షెడ్యూల్‌ను మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది.  ఈ నేప‌థ్యంలోనే ఉత్త‌ర ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల‌లో రాజ్య‌స‌భ‌కు  ద్వైవార్షిక ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని క‌మిష‌న్  నిర్ణ‌యించింది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌‌కు షెడ్యూల్ ను సిద్ధం చేసిన  క‌మిష‌న్, అందుకు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది.  బ్యాలెట్ పేప‌ర్‌లో అభ్య‌ర్ధిని ఎంచుకునే స‌మ‌యంలో రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ అందించే ముంద‌స్తుగా ఖ‌రారు చేసిన స‌మ‌గ్ర వ‌యొలెట్ రంగు స్కెచ్ పెన్‌ల‌ను మాత్ర‌మే స‌భ్యులు ఉప‌యోగించాల‌ని క‌మిష‌న్ ఆదేశించింది. ఈ ఎన్నిక‌ల‌లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వేరొక క‌లాన్ని ఉప‌యోగించ‌డానికి వీలులేద‌ని స్ప‌ష్టం చేసింది. 
ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేస్తున్న క్ర‌మంలో కోవిడ్ -19  నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌కు సంబంధించిన సూచ‌న‌ల‌ను అమ‌లు ఏ స్థాయిలో చేస్తున్నారో ప‌ర్య‌వేక్షించేందుకు ఆయా రాష్ట్రాల‌కు చెందిన సీనియ‌ర్ అధికారుల‌ను డిప్యూట్ చేయ‌వ‌ల‌సిందిగా క‌మిష‌న్  చీఫ్ సెక్రెట‌రీల‌ను ఆదేశించింది. 
 మొత్తం ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో అనుస‌రించ‌వ‌ల‌సిన స్ప‌ష్ట‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు : 
1. ఎన్నిక‌లకు సంబంధించిన కార్య‌క‌లాపాల స‌మ‌యంలో ప్ర‌తి వ్య‌క్తి త‌ప్ప‌నిస‌రిగా మాస్్క ధ‌రించాలి.
2. ఎన్నిక‌ల కోసం ఉప‌యోగించే హాలు / గ‌ది/ ఆవ‌ర‌ణ గుమ్మంలో -
ఎ) అంద‌రు వ్య‌క్తుల‌కు థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ చేయాలి.
బి) శానిటైజ‌ర్ అన్ని ప్రాంతాల‌లోనూ అందుబాటు ఉంచాలి. 
3.  రాష్ట్ర ప్ర‌భుత్వం, హోం మంత్రిత్వ‌శాఖ‌ జారీ చేసిన కోవిడ్ -19 మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా సోష‌ల్ డిస్టెన్సింగ్ పాటించాలి.
ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ స‌మ‌యంలో క‌ఠినంగా పాటించ‌వ‌ల‌సిన స్ప‌ష్ట‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల కోసం ఎన్నిక‌ల క‌మిష‌న్ వెబ్ సైట్‌లో: https://eci.gov.in/files/file/12167-broad-guidelines-for-conduct-of-general-electionbye-election-during-covid-19/  లింక్‌ను క్లిక్ చేసి చూడ‌వ‌చ్చు. 
ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న రాష్ట్రాల‌లోని ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ల‌ను అబ్జ‌ర్వ‌ర్లుగా ఎన్నిక‌ల క‌మిష‌న్ నియ‌మించింది. 


(Release ID: 1663985) Visitor Counter : 134