సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

భారతదేశంలో ఇప్పటివరకు 23 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉద్యోగాల ఇంటర్యూలను రద్దుచేయడం జరిగింది : డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 10 OCT 2020 5:28PM by PIB Hyderabad

భారతదేశంలో ఇప్పటివరకు 23 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉద్యోగాల ఇంటర్యూలను రద్దుచేయడం జరిగిందని, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డి.ఓ.ఎన్.ఈ.ఆర్) శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) పి.ఎమ్.ఓ., సిబ్బంది, ప్రజా పిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. 2016 నుండి కేంద్ర ప్రభుత్వంలో అమలులో ఉన్న గ్రూప్-బి (నాన్-గెజిటెడ్) మరియు గ్రూప్-సి పోస్టుల ఇంటర్యూల రద్దు కొనసాగింపుగా ఈ చర్య తీసుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు.

సిబ్బంది మరియు శిక్షణ విభాగం (డి.ఓ.పి.టి) చేపట్టిన కొన్ని సంస్కరణల గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరిస్తూ, 2015 ఆగష్టు, 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఎర్రకోట బురుజుల నుండి ప్రసంగిస్తూ, ఇంటర్యూ లను రద్దుచేసి, ఉద్యోగాల ఎంపికను పూర్తిగా వ్రాత పరీక్షల ఆధారంగానే చేయాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు.  ఎందుకంటే, ఒక అభ్యర్థికి ఎప్పుడైనా ఇంటర్యూ కోసం పిలుపు వచ్చినప్పుడు, అతని కుటుంబం మొత్తం భయాందోళనలకు గురవుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి సలహాను వెంటనే అనుసరించి, డి.ఓ.పి.టి. వేగవంతమైన చర్యలు చేపట్టిందనీ, మూడు నెలల్లోనే 2016 జనవరి, 1వ తేదీ నుంచి అమలయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వంలో నియామకాలకు ఇంటర్యూ లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించే మొత్తం ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. 

 

అయితే, మహారాష్ట్ర, గుజరాత్ వంటి కొన్ని రాష్ట్రాలు ఈ నియమాన్ని వెంటనే అమలు చేయడానికి ముందుకు రాగా, ఉద్యోగాల కోసం ఇంటర్యూ లను రద్దు చేయడానికి, ఇతర రాష్ట్రాలు చాలా అసమ్మతిని వ్యక్తం చేశాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పదేపదే గుర్తుచేసి, ఒప్పించిన అనంతరం, ఈ రోజున,  జమ్మూ, కశ్మీర్ మరియు లడఖ్ తో సహా భారతదేశంలోని మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు దేశంలోని 28 రాష్ట్రాలకు గాను 23 రాష్ట్రాలు, ఇంటర్యూలు నిర్వహించే పద్దతిని రద్దుచేసినందుకు, ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, కొంతమంది ఇష్టమైన అభ్యర్థులకు సహాయం చేయడానికి ఫలితాలను తారుమారు చేస్తున్నారని ఇంటర్యూలో మార్కుల విషయంలో గతంలో అనేక ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చేవనీ, పేర్కొన్నారు.  ఇంటర్యూలను రద్దు చేసి, రాత పరీక్ష మార్కులను మాత్రమే ఎంపికకు యోగ్యతగా పరిగణించడం ద్వారా, అభ్యర్థులందరికీ సమాన అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతుందని, ఆయన చెప్పారు.

నియామక ప్రక్రియలో పారదర్శకత మరియు నిష్పాక్షికతను తీసుకురావడంతో పాటు, ఈ విధానం వల్ల, రాష్ట్ర ఖజానాపై వ్యయభారం బాగా తగ్గినట్లు, అనేక రాష్ట్రాలు తెలియజేసినట్లు, డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.  ఎందుకంటే, ఇంటర్యూ చేయవలసిన అభ్యర్థుల సంఖ్య తరచుగా వేలల్లో ఉండడం, ఇంటర్యూ ప్రక్రియ చాలా రోజుల పాటు కొనసాగడం కారణంగా, అభ్యర్థుల ఇంటర్యూలు నిర్వహించడానికి గణనీయమైన స్థాయిలో వ్యయమయ్యేదని ఆయన వివరించారు. 

తమకు అనుకూలమైన కొంతమంది అభ్యర్థులకు సహాయపడటానికి, ఇతర అభ్యర్థుల ఇంటర్వ్యూ మార్కులను తగ్గించడం ద్వారా రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చినవారిని ఎంపిక చేయలేదనే ఫిర్యాదులు గతంలో ఎక్కువగా వచ్చేవి.   అదేవిధంగా, డబ్బు సంపాదించడం కోసం ఇంటర్యూ మార్కులను మార్చారనీ లేదా ఉద్యోగాలు పొందటానికి భారీ మొత్తాన్ని చెల్లించారనీ ఆరోపణలు కూడా ప్రచారంలో ఉండేవి.

<><><>



(Release ID: 1663456) Visitor Counter : 146