భారత ఎన్నికల సంఘం
రాజకీయ పార్టీల నమోదు కోసం పబ్లిక్ నోటీసు కాల వ్యవధిని తగ్గించిన ఈసీఐ
Posted On:
09 OCT 2020 10:59AM by PIB Hyderabad
కొత్త రాజకీయ పార్టీల నమోదులో వెసులుబాటు కల్పిస్తూ, పబ్లిక్ నోటీసు కాల వ్యవధిని 30 రోజుల నుంచి 7 రోజులకు భారత ఎన్నికల సంఘం తగ్గించింది. ఈనెల 07.10.2020న లేదా అంతకుముందు పబ్లిక్ నోటీసును ప్రచురించిన పార్టీలకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. 07.10.2020కు ముందు 7 రోజుల్లోపు పబ్లిక్ నోటీసును ప్రచురించిన పార్టీలు సహా అన్ని పార్టీలు, ఏవైనా అభ్యంతరాలుంటే శనివారం సాయంత్రం 5.30 గం. లోపు, లేదా ఇచ్చిన అసలు గడువైన 30 రోజులలోపు, ఏది ముందుగా వస్తే దాని ప్రకారం సమర్పించాలి.
గత నెల 25న బిహార్‌లో శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీఐ ప్రకటించిన నాటి నుంచి, కొవిడ్ పరిస్థితుల కారణంగా ఏర్పడిన ఇబ్బందుల దృష్ట్యా, రాజకీయ పార్టీల నమోదు కోసం వచ్చిన దరఖాస్తుల తరలింపులో కొన్ని మారిపోవడం, ఆలస్యమవడం జరిగింది. దీనివల్ల రాజకీయ పార్టీల నమోదులోనూ ఆలస్యమైనట్లు ఎన్నికల సంఘం దృష్టికి వచ్చింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఈసీఐ, పబ్లిక్ నోటీసు వ్యవధిని సడలించింది. బిహార్ శాసనసభ మూడోదశ పోలింగ్‌కు నామినేషన్ గడువైన ఈనెల 20వ తేదీ వరకు ఈ సడలింపు అందుబాటులో ఉంటుంది.
ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29(ఎ) నిబంధనలను అనుసరించి రాజకీయ పార్టీల నమోదు ఉంటుంది. కొత్త పార్టీ నమోదు చేయాలనుకున్నవారు, పార్టీని స్థాపించిన నాటి నుంచి 30 రోజులలోపు ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోవాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29(ఎ) ద్వారా దఖలుపడిన అధికారాలను అమలు చేసే ప్రక్రియలో భాగంగా, ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల ప్రకారం ఈ దరఖాస్తు ఉండాలి. ప్రస్తుతమున్న మార్గదర్శకాల ప్రకారం; కొత్త పార్టీ నమోదు పట్ల ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలుసుకునేందుకు, ఆ పార్టీ పేరును రెండు రోజుల పాటు రెండు జాతీయ, రెండు స్థానిక దినపత్రికల్లో ప్రచురించాలి. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, దినపత్రికల్లో ప్రచురణ వచ్చిన నాటి నుంచి 30 రోజుల్లోపు ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. ఆ నోటీసును భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోనూ ప్రదర్శిస్తారు.
***
(Release ID: 1662998)
Visitor Counter : 949