ప్రధాన మంత్రి కార్యాలయం
ఇన్వెస్ట్ ఇండియా సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని కీలక ఉపన్యాసం
Posted On:
08 OCT 2020 8:00PM by PIB Hyderabad
ప్రియమైన స్నేహితులారా, మీకు నా నమస్కారాలు
ఈ వేదికను ఏర్పాటు చేసినందుకుగాను మొదట శ్రీ ప్రేమ్ వాస్తవకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలో కెనడాకు చెందిన పలువురు పెట్టుబడిదారులను, వ్యాపారవేత్తలను చూస్తున్నందుకు ఆనందంగా వుంది. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాలు చేయడానికిగాను అద్భుతమైన అవకాశాలున్నాయనే విషయాన్ని మీరు తెలుసుకుంటున్నందుకు నాకు సంతోషంగా వుంది.
స్నేహితులారా,
ప్రేక్షకుల్లో వున్నవారిలో అత్యధికులకు సంబంధించి ఒక ఉమ్మడి అంశం వుంది. పెట్టుబడులు పెట్టాలనే నిర్ణయాన్ని మనుషులే తీసుకుంటారు. ప్రమాదకరమైన అంశాలను మదించిన తర్వాతనే నిర్ణయాలుంటాయి. పెట్టుబడులు పెట్టే సమయంలో ఎంత లాభం వస్తుందోననే విషయాన్ని తెలుసుకున్న తర్వాతనే నిర్ణయాలుంటాయి.
నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను. ఒక దేశంలో పెట్టుబడులు పెట్టడానికంటే ముందు మీరు ఏం ఆలోచిస్తారు? దేశంలో ప్రజాస్వామ్యం ఆరోగ్యకరంగా వుందా? దేశంలో రాజకీయపరమైన స్థిరత్వం వుందా? దేశంలో పెట్టుబడిదారులకు, వ్యాపారులకు అనుకూల విధానాలున్నాయా? దేశ పాలనలో పారదర్శకత వుందా? దేశంలో నైపుణ్యంగల ప్రతిభావంతులున్నారా? దేశంలో భారీ మార్కెట్లున్నాయా? ఇలాంటి అనేక ప్రశ్నలను మీరు అడుగుతారు.
ఈ ప్రశ్నలన్నిటికీ ఎలాంటి వివాదాలకు తావు లేని సమాధానం ఒకటే. ఆ సమాధానం పెట్టుబడులకు గమ్యస్థానం ఇండియా.
భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాలు చేయడానికిగాను అందరికీ అవకాశముంది. సంస్థాగత పెట్టుబడిదారులు, తయారీ పరిశ్రమలదారులు, వినూత్న ఆవిష్కరణ వాతావరణాన్ని ప్రోత్సహించేవారు, మౌలిక సదుపాయాల కల్పన వ్యాపారస్తులు..ఇలా అందరికీ భారతదేశంలో అవకాశాలున్నాయి. దేశంలో ఇటు ప్రభుత్వాలతోను, అటు ప్రైవేటు రంగంతోను భాగస్వామ్యం పొందడానికి అవకాశముంది. సంపాదనకు, అధ్యయనానికి అవకాశముంది. అంతే కాదు ముందుండి నడిపించడానికి, వృద్ధి చెందడానికి భారతదేశంలో అవకాశముంది.
స్నేహితులారా, కోవిడ్ తర్వాతి ప్రపంచంలో మీకు పలురకాల సమస్యలు ఎదురవుతాయి. తయారీ రంగంలోను, సరఫరా రంగంలోను, పిపిఇలు మొదలైనవాటికి సంబంధించి సమస్యలు వస్తాయి. సమస్యలు సహజమే.
ఏది ఏమైనప్పటికీ భారతదేశం ఆ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. మేం పట్టుదలతో, పరిష్కారాలందించే దేశంగా అవతరించాం.
800 మిలియన్ ప్రజలకు మేం ఆహార ధాన్యాలను ఉచితంగా అందించాం. 80 మిలియన్ కుటుంబాలకు ఉచిత వంట గ్యాస్ అందించాం. అది కూడా చాలా కాలం వరకు. అడ్డంకులు ఎదురైనప్పటికీ 400 మిలియన్ మంది రైతులు, మహిళలు,పేదలకు నేరుగా వారి అకౌంట్లలోనే నగదును జమ చేశాం. ఈ పనిని కొన్ని రోజుల్లోనే పూర్తి చేశాం.
గత కొన్ని రోజులుగా దేశంలో నిర్మించిన పాలనాపరమైన నిర్మాణాలు, వ్యవస్థల గొప్పదనాన్ని ఇది సూచిస్తోంది.
స్నేహితులారా, నేడు భారతదేశం ప్రపంచానికే ఫార్మసీ కేంద్ర పాత్రను పోషిస్తోంది. ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఇంతవరకూ 150 దేశాలకు మందులను పంపించిన ఘనత భారత్ స్వంతం.
ఈ ఏడాది మార్చి- జూన్ నెలల్లో మా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 23 శాతంపెరిగాయి. దేశం మొత్తం పూర్తిస్థాయిలో లాక్ డౌన్ లో వున్న సమయంలో ఇది జరిగింది.
ఇప్పుడు దేశంలో తయారీ రంగం పూర్తిస్థాయిలో పని చేస్తోంది. కరోనా మహమ్మారి రాకముందు దేశంలో పిపిఇ కిట్ల తయారీ చాలా చాలా స్వల్పం. నేడు దేశంలో ప్రతి నెలా మిలియన్లకొద్దీ పిపిఇ కిట్లు తయారవ్వడమే కాకుండా వాటిని ఎగుమతి కూడా చేస్తున్నాం.
ఉత్పత్తిని అధికం చేయాలనే లక్ష్యానికి కట్టుబడి వున్నాం. కోవిడ్ -19 టీకా ఉత్పత్తికి సంబంధించి పని ప్రారంభం కాగానే మేం మొత్తం ప్రపంచానికి సాయం చేయాలని అనుకుంటున్నాం.
స్నేహితులారా, భారతదేశ కథనం ఇప్పుడు బలంగా వుంది. భవిష్యత్తులో కూడా బలంగా వుంటుంది. అది ఎలాగో అనేది ఇప్పుడు వివరిస్తాను.
ఈ రోజున దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం చాలా సరళీకరణ చెంది వుంది. దేశంలో అనుకూలమైన పన్నుల వ్యవస్థను తయారు చేసుకున్నాం.
బలమైన బాండ్ మార్కెట్ అభివృద్ధి చెయడానికిగాను గణనీయమైన స్థాయిలో సంస్కరణలు చేపట్టాం. బాగా పని చేస్తూ ముందు వరసలోవున్న రంగాలకు ప్రోత్సాహకాలిచ్చే పథకాలను అమలులోకి తెచ్చాం.
మందుల తయారీ, వైద్య పరికరాల తయారీ, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో పథకాలు ఇప్పటికే అమల్లో వున్నాయి. పెట్టుబడిదారులకు ఉన్నత స్థాయి ప్రాధాన్యత ఇచ్చి, సమర్థవంతమైన చేయూత ఇవ్వాలనేది మా విధానం. ఇందుకోసంమాత్రమే పని చేయడానికిగాను సాధికారత కలిగిన కార్యదర్శుల బృందం పని చేస్తోంది.
విమానయానం, రైల్వేలు, ప్రధాన రహదారులు, విద్యుత్ సరఫరా లైన్లు మొదలైన రంగాల్లోని ఆస్తుల ద్వారా ముందస్తు కార్యాచరణతో లబ్ధి పొందుతున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఆస్తుల్ని చట్టబద్దం చేయడానికిగాను రియల్ ఎస్టేట్ రంగ పెట్టుబడి సంస్థలను, మౌలిక సదాపాయాల కల్పన పెట్టబుడుల సంస్థలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది.
స్నేహితులారా, ఈ రోజున ఆలోచనావిధానంలోగానీ, మార్కెట్ల విషయంలోగానీ భారతదేశం చాలా వేగంగా మారిపోతోంది. నేడు భారతదేశం కంపెనీ చట్టంలోని పనికిరాని నిబంధనల్ని సవరించే పనిలో పడింది. వాటి కారణంగా సంబంధిత వ్యక్తులు నేరగాళ్లు కాకుండా వుండడానికిగాను ఈ పని చేస్తోంది.
గత ఐదేళ్లలో జరిగింది చూస్తే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకులలో భారతదేశ ర్యాంక్ 81నుంచి 48కి చేరుకుంది. గత ఐదేళ్లలోని ర్యాంకులను చూస్తే సులభతర వాణిజ్య విషయంలో భారతదేశ ర్యాంకు 142నుంచి 63కు చేరుకుంది. దీనికి సంబంధించి అభివృద్దిని ఎవరైనా చూడవచ్చు. గత ఏడాది జనవరినుంచి ఈ ఏడాది జులైవరకూ అంటే ఒకటిన్నర ఏడాది సమయాన్ని చూస్తే సంస్థాగత పెట్టుబడిదారులనుంచి 70 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులు భారత దేశానికి వచ్చాయి. ఇది 2013నుంచి 2017వరకూ అంటే నాలుగేళ్లలో వచ్చిన పెట్టుబడులకు దాదాపుగా సమానం. భారతదేశంపట్ల ప్రపంచ పెట్టుబడిదారుల నమ్మకం పెరుగుతూ వస్తోంది. దీనికి నిదర్శనం 2019లో ఇండియాలోకి వచ్చిన ఎఫ్ డిఐ 20 శాతం పెరగడమే. అదే సమయంలో అంంతర్జాతీయంగా ఎఫ్ డిఐ వెల్లువలు 1శాతం తగ్గాయి.
ఈ ఏడాది మొదటి ఆరు నెలల సమాయానికిగాను బైటనుంచి భారతదేశంలోకి 20 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులు వచ్చేశాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 ఉధృతంగా వున్న సమయంలోనే ఇంత మొత్తం పెట్టుబడులు వచ్చాయి.
గిప్ట్ సిటీలో గల అంతర్జాతీయ ఆర్ధిక సేవల కేంద్రం ( ఐఎఫ్ ఎస్ సి) ఏర్పాటు అనేది భారతదేశ ప్రధానమైన కృషి. పెట్టుబడిదారులు ఈ సేవలను ఉపయోగించుకొని ప్రపంచవ్యాప్తంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. దీనికోసం ఈ మధ్యనే పూర్తిస్థాయిలో శక్తివంతమైన ఏకీకృత రెగ్యులేటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
స్నేహితులారా, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి భారతదేశం వినూత్నమైన విధానంతో ముందుకు వెలుతోంది.
దేశంలోని పేద ప్రజలకు, చిన్న వ్యాపారులకు ఉద్దీపన ప్యాకేజీ ద్వారా ఉపశమనం కలిగించడం జరిగింది. అయితే అదే సమయంలో ఈ పరిస్థితిని ఉపయోగించుకొని సంస్థాగత సంస్కరణలు తీసుకొస్తున్నాం. ఈ సంస్కరణలనేవి మరింత ఉత్పాదకతను, సౌభాగ్యాన్ని తీసుకొస్తాయి.
విద్య, కార్మికశక్తి, వ్యవసాయం..ఈ మూడు రంగాల్లో భారతదేశం సంస్కరణలు చేపట్టింది. ఇవి భారతదేశంలోని దాదాపుగా ప్రతి పౌరున్ని ప్రభావితం చేసేవే.
కార్మిక రంగంలోను, వ్యవసాయరంగంలోను గల పురాతన చట్టాలను సంస్కరించాం. తద్వారా ప్రైవేటు రంగ భారీ భాగస్వామ్యం సాధ్యమవుతోంది. అదే సమయంలో ప్రభుత్వ భద్రతా వ్యవస్థలు బలోపేతమవుతున్నాయి.
ఈ సంస్కరణలనేవి అటు పరిశ్రమల యజమానులకు ఇటు కార్మికులకు ఇరు వర్గాలకు మేలు చేసేవే. ఇక విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు మన యువతలోని ప్రతిభను మరింతగా వెలికి తీసుకొస్తాయి. ఈ సంస్కరణల కారణంగా మరిన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు భారతదేశంలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయి.
కార్మికరంగంలో చేపట్టిన సంస్కరణల కారణంగా ఈ రంగానికి చెందిన చట్టాల సంఖ్య తగ్గింది. ఈ సంస్కరణలద్వారా వచ్చిన చట్టాలు అటు యజమానులకు, ఇటు ఉద్యోగులకు స్నేహపూర్వకమైనవి. వ్యాపార కార్యకలాపాలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగడానికి ఇవి దోహదం చేస్తున్నాయి.
వ్యవసాయరంగంలో చేపట్టిన సంస్కరణలు ఈ రంగానికి అత్యధిక మేలు చేస్తాయి. ఇవి రైతులకు అనేక అవకాశాలివ్వడమే కాకుండా వారి ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవడానికి దోహదం చేస్తున్నాయి.
ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వయం సమృద్ధ భారతదేశాన్ని నిర్మించడానికిగాను ఈ సంస్కరణలు మనకు ఉపయోగపడుతున్నాయి. స్వయం సమృద్ధ భారతదేశాన్నిసాధించడమంటే ప్రపంచశాంతికి, సౌభాగ్యానికి కృషి చేయడమే.
స్నేహితులారా,
మీరు విద్యారంగంలో భాగస్వాములు కావాలనుకుంటే అందుకు తగిన దేశం భారతదేశం. మీరు తయారీ రంగం లేదా సేవల రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే అందుకు అనువైన దేశం భారతదేశం. మీరు వ్యవసాయరంగంలో భాగస్వాములు కావాలనుకుంటే మీకు అనుకూలమైన దేశం భారతదేశం.
స్నేహితులారా,
భారతదేశం, కెనడా మధ్యన గల ద్వైపాక్షిక సంబంధాలనేవాటికి... ఇరు దేశాలు పంచుకుంటున్న ప్రజాస్వామ్య విలువలు, అనేక ఉమ్మడి ప్రాధాన్యతలే కారణం. ఇరు దేశాల మధ్యన వాణిజ్యం, పెట్టుబడుల బంధాలనేవి ఇరు దేశాల బహుముఖ సంబంధబాంధవ్యాల్లో భాగంగా వున్నాయి.
భారతదేశంలో పెట్టుబడులు పెట్టిన దేశాల్లో కెనడా 20వ అతిపెద్ద దేశం. భారతదేశంలో 6వందలకు పైగా కెనడా కంపెనీలు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇంతవరకూ ఇండియాలో కెనడా పెన్షన్ ఫండ్స్ అనేవి 50 బిలియన్ అమెరికా డాలర్లను పెట్టుబడిగా పెట్టాయి.
ఈ గణాంకాలు చెప్పేదానికంటే ఎక్కువ బలోపేతమైనది రెండు దేశాల మధ్యనగల సంబంధం. అయితే రెండు దేశాలు కలిసి పని చేస్తే మనం మరెంతో సాధించగలమని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ప్రపంచంలోనే అతి పెద్దవైన, ఎక్కువ అనుభవమున్న మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడిదారి సంస్థలు కెనడాలో వున్నాయి. ఇండియాలో నేరుగా పెట్టుబడులు పెట్టిన కెనడా కంపెనీల్లో మొదటివి కెనడా పెన్షన్ ఫండ్స్. వాటికి సంబంధించిన పలు కంపెనీలు పలు రంగాల్లో భారీ అవకాశాలను పొందాయి. ప్రధాన రహదారులు, విమానయాన కేంద్రాలు, లాజిస్టిక్స్, టెలికమ్యూనికేషన్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వాటికి మంచి అవకాశాలు దొరికాయి. అవి ఇప్పుడు విస్తరించడానికి కొత్త కొత్త రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి కృషి చేస్తున్నాయి. చాలా సంవత్సరాలుగా భారతదేశంలో వ్యాపారం చేస్తున్న అనుభవజ్ఞులైన కెనడా పెట్టుబడిదారుల ఇప్పుడు మా దేశానికి ఉత్తమ బ్రాండ్ అంబాసిడర్లు.
వారి స్వంత అనుభవాలు, విస్తరించడానికిగాను వారు వేసుకుంటున్న ప్రణాళికలనేవి మీరు భారతదేశానికి రావడానికిగాను మీ అందరికీ నమ్మకమైన సాక్ష్యంగా ఉపకరిస్తున్నాయి కూడా. దీనికి తోడు భారతదేశాన్ని చక్కగా తెలుసుకొనే అవకాశం కూడా మీకు లభించింది. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఎక్కువ మంది ప్రవాస భారతీయులను, భారతసంతతివారిని కలిగిన దేశాల్లో కెనడా కూడా ఒకటి.. మీకు ఇక్కడ ఎలాంటి హద్దులు లేవు. భారతదేశంలో జీవించడమంటే మీ దేశంలో మీరు జీవించినట్టుగానే వుంటుంది.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాలని ఆహ్వానించినందుకు నా కృతజ్ఞతలు. మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ..ముగిస్తున్నాను.
***
(Release ID: 1662931)
Visitor Counter : 280
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam