రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

పుదుచ్చేరిలోని రోడ్-ఓవర్ బ్రిడ్జిని జాతికి అంకితం చేసిన మంత్రి గడ్కరీ

प्रविष्टि तिथि: 07 OCT 2020 2:14PM by PIB Hyderabad

స్థానిక ప్రజలు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పుదుచ్చేరిలోని 45‌‌–ఏ నేషనల్​ హైవే రైల్వే లెవెల్​ క్రాసింగ్​పైన కిలోమీటరు మేర నిర్మించిన రోడ్​ ఓవర్​ బ్రిడ్జిని కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి  నితిన్ గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు. 35 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన రోడ్-ఓవర్ బ్రిడ్జ్ పుదుచ్చేరితోపాటు విల్లియనూర్, అరియూర్, కండమంగళం, మానవేళి, గోరిమెడు, అరోవిల్, అరియాంకుప్పం ప్రాంతాల  దీర్ఘకాల ప్రయాణ అవసరాలను తీర్చుతుంది. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి యూటీ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ కిరణ్ బేడి, ముఖ్యమంత్రి  వి.నారాయణసామి,  కేంద్ర రోడ్డు, రవాణా, హైవేలశాఖ సహాయమంత్రి జనరల్ (రిటైర్డ్) డాక్టర్ వికె సింగ్, పుదుచ్చేరి కేంద్రపాలిత రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల  సీనియర్ అధికారులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  గడ్కరీ మాట్లాడుతూ,  ఈ ప్రాజెక్టు వల్ల ట్రాఫిక్ జామ్ నుండి ప్రజలకు ఉపశమనం కలగడంతోపాటు సమయం, ఇంధనం ఆదా అవుతాయన్నారు. ప్రయాణం సురక్షితంగా ఉండటమే గాక కాలుష్యం తగ్గుతుందని చెప్పారు. రైల్వే లెవల్ క్రాసింగ్ ఇబ్బందులు,  రైల్వే ట్రాఫిక్ వల్ల సమస్యలు ఉండవని ఆయన వివరించారు. ఎన్​హెచ్​-45  నాలుగు-లేన్ల రోడ్డు నుంచి కరైకల్ పోర్టుతో పాటు కన్యాకుమారి వరకు దారితీసే ఈసీఆర్​ రహదారికి వెళ్లవచ్చు. వ్యవసాయం, చేపల వేటకు వెళ్లే వారికి కూడా ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుంది.  పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్‌హెచ్‌ నిర్మాణానికి గత ఆరేళ్లలో  రూ .70 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. తమిళనాడు - పుదుచ్చేరి నుంచి మరింత వేగంగా చేరుకోవడానికి సుమారు రూ .11,000 కోట్ల  ఖర్చుతో 287 కిలోమీటర్ల పొడవున జరుగుతున్న పనుల గురించి ఆయన ఈ సందర్భంగా వివరించారు. వీటిలో నేషనల్​ హైవే-332 ఏ లోని మహాబలిపురం–ముగైయూర్ సెక్షన్​, నేషనల్​ హైవే -332 ఏ లోని ముగైయూర్–మరక్కనమ్ సెక్షన్​, నేషనల్​ హైవే -45ఏ లోని విల్లుప్పురం–పుదుచ్చేరి సెక్షన్​, నేషనల్​ హైవే -45ఏ లోని పుదుచ్చేరి–పూండియంకుప్పం సెక్షన్​, పూండియాంకప్పం– సత్తనాథపురం, సత్తనాథపురం–నేషనల్​ హైవే-45A లోని నాగపట్నం సెక్షన్​ ప్రాజెక్టులు భాగమని మంత్రి వివరించారు.

అనంతరం కేంద్ర రోడ్డు, రవాణా, హైవేలశాఖ సహాయమంత్రి  జనరల్​ (రిటైర్డ్) డాక్టర్ వి కె సింగ్ మాట్లాడుతూ, పుదుచ్చేరి నుంచి తమిళనాడు మీదుగా  దేశంలోని అన్ని ప్రాంతాలకు రోడ్డు మార్గాలను నిర్మించడానికి తమ శాఖ ప్రయత్నిస్తోందని వెల్లడించారు.  మడగాడిపేట రాష్ట్ర సరిహద్దు నుండి అరియూర్ గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల పొడవైన రహదారి బలోపేతం కోసం రూ .9 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు వచ్చే డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని మంత్రి  ప్రకటించారు. 1,354 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే ఎన్‌హెచ్ 332 ఎ & పుదుచ్చేరి బైపాస్‌లోని మరక్కానం - కూనిమెడు సెక్షన్, రాజీవ్ గాంధీ స్క్వేర్ వద్ద గ్రేడ్ సెపరేటర్ నిర్మాణం, ఇందిరా గాంధీ స్క్వేర్ వద్ద గ్రేడ్ సెపరేటర్ నిర్మాణం కోసం సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్​) త్వరలోనే పూర్తవుతుందని వెల్లడించారు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి సుమారు 47 కోట్ల రూపాయల విలువైన సిఆర్ఎఫ్ పనులు మంజూరు చేశామని మంత్రి ప్రకటించారు. పుదుచ్చేరి ప్రభుత్వం దరఖాస్తును సమర్పిస్తే మరో రూ.15 కోట్ల అదనపు నిధులను అందజేయవచ్చని సింగ్​ వివరించారు.

పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ కిరణ్ బేడీ ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందంటూ ప్రశంసించారు.   ప్రాజెక్టులు ఆలస్యమైతే ఖర్చులు పెరుగుతాయని ఆమె హెచ్చరించారు. ఆలస్యం ఇంకా పెరుగుతుందని స్పష్టం చేశారు.  పిడబ్ల్యుడి అధికారులతో సహా రోడ్డు నిర్మాణ ఇంజనీర్లకు వృత్తిపరమైన కోర్సులు నిర్వహించాలని ఆమె ప్రతిపాదించారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి  వి నారాయణసామి, ప్రజా పనుల శాఖ మంత్రి  ఎ. నమశ్శివాయం కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.

***


(रिलीज़ आईडी: 1662623) आगंतुक पटल : 204
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Tamil