రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

భారత వ్యవసాయం వృద్ధికి అగ్రి టెక్నాలజీ మరియు ఆవిష్కరణలను ప్రసారం చేయడానికి మరియు ప్రోత్సహించడానికి ఇఫ్కో & ప్రసార భారతి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది

Posted On: 06 OCT 2020 5:38PM by PIB Hyderabad

ప్రపంచంలోనే అతిపెద్ద ఎరువుల సహకార సంస్థ అయిన ఇఫ్కో, భారత ప్రభుత్వరంగానికి చెందిన ప్రసార భారతిల మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదిరింది. రైతులకు ఉపయోగపడే విధంగా కొత్త వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆవిష్కరణలను దూరదర్శన్‌లో ప్రసారం చేయడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. న్యూఢిల్లీలోని పృథీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు ఇరు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం ప్రకారం రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ రంగంలో అనుసరిస్తున్న వివిధ వినూత్న పద్ధతులను డిడి కిసాన్‌లో ప్రసారం చేస్తారు. 30 నిమిషాల పాటు కొనసాగే ఈ దారావాహిక ద్వారా వ్యవసాయంలో వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఆవిష్కరణలను రైతులకు అర్ధమయ్యే విధంగా సరళమైన భాషలో వివరిస్తారు. వ్యవసాయంలో రైతులు స్వయం సంమృద్ధి సాధించడానికి ఈ కొత్త వ్యవసాయ పద్దతులు ఉపయోగపడతాయి. ఇఫ్కో చేసిన ఆవిష్కరణలు 25 ఎపిసోడ్లుగా డిడి కిసాన్‌లో ప్రసారమవుతాయి.

నానో టెక్నాలజీ ఆధారిత యూరియాకు ప్రత్యామ్నాయాన్ని ఇఫ్కో సిద్ధం చేసిందని..ఇది రైతులకు ఎంతగానో దోహద పడుతుందని ఈ సందర్భంగా ఇఫ్కో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ యు.ఎస్.అవస్తి చెప్పారు. రైతులకు ఎంతో మేలు చేసే ఆవిష్కరణలు ఇప్పుడు డిడి కిసాన్‌లో ప్రసారం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యాన్ని సాధించడానికి ఈ ఒప్పదం
సహాయపడుతుందని వెల్లడించారు. రైతుల శ్రేయస్సు కోసం దీన్ని ఓ చారిత్రక పరిణామంగా భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె.విజయ్ రాఘవన్ పేర్కొన్నారు.

రైతులకు అవసరమైన వినూత్న సాంకేతిక పరిజ్ఞానం ఇఫ్కో వద్ద ఉంది. దూరదర్శన్‌ దేశవ్యాప్తంగా విస్తారమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. వ్యవసాయ ఆవిష్కరణలను రైతులకు సులభమైన భాషలో వివరించడానికి డిడికి చెందిన విస్తారమైన నెట్‌వర్క్ సహాయపడుతుంది.

ఇఫ్కో, ప్రసారభారతిల మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని గర్వించదగ్గ విషయంగా పేర్కొన్నారు..ప్రసార భారతి సీఈఓ శశి శేఖర్ వెంపటి. ఈ
మాధ్యమం ద్వారా రైతులకు అవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని వారికి అర్ధమయ్యే భాషలో ప్రసారం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమం ద్వారా కూడా ప్రసారం చేస్తామని..తద్వారా యువ రైతులు కూడా ఈ ఆవిష్కరణలో ప్రయోజన పొందవచ్చని వెల్లడించారు.

దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ మయాంక్ అగర్వాల్ మాట్లాడుతూ.." ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు చేసిన ఆవిష్కరణలను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని..తద్వారా యువరైతులకు ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు.



(Release ID: 1662129) Visitor Counter : 230