పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ప్రజల సౌకర్యార్థం 42 సిఎన్‌జి స్టేషన్లు, 3 సిటీగేట్ స్టేషన్లను జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
60 బిలియన్ డాలర్ల పెట్టుబడులు గ్యాస్ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడి : శ్రీ ప్రధాన్
సిజిడి సంస్థలు సమగ్ర ఇంధన రిటైలర్లుగా అభివృద్ధి చెందాలని మంత్రి పిలుపు
Posted On:
06 OCT 2020 2:06PM by PIB Hyderabad
పర్యావరణ హితకరమైన కంప్రెస్‌డ్ సహజవాయు (సిఎన్‌జి)ను వివిధ ప్రాంతాలకు విస్తరించడంలో భాగంగా కేంద్ర పెట్రోలియం , సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు 42 సిఎన్‌జి స్టేషన్లను, టోరంట్ గ్యాస్ కు చెందిన 3 సిటీ గేట్ స్టేషన్లను ప్రజలకు అంకితం చేశౄరు. అన్ని సిఎన్‌జి స్టేషన్లు, సిటిగేట్ స్టేషన్లను మంత్రితో సమావేశం సమయంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా అనుసంధానం చేశారు.
టోరంట్ గ్యాస్ కు సిటి గ్యాస్ పంపిణీ నెట్ వర్కు 7 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో సిటీ గ్యాస్ పంపిణీ నెట్ వర్కుకు 32 జిల్లాలలో అనుమతి ఉంది. ఈ సిఎన్‌జి స్టేషన్లు వివిధ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. ఇందులో 14 ఉత్తర ప్రదేశ్‌లో 8 మహారాష్ట్రలో, 6 గుజరాత్‌లో, 5 పంజాబ్‌లో ,అలాగే తెలంగాణ, రాజస్థాన్‌లలో 5 వంతున ఉన్నాయి.సిటీ గేట్ స్టేషన్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్‌లలో ఒక్కొక్కటి ఉన్నాయి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, సిజిడి ఏజెన్సీలు సమగ్ర ఇంధన రిటైలర్లుగా ఎదగాలని పిలుపునిచ్చారు. వినియోగదారులు తమ కొనుగోలు సామర్ద్యాన్ని బట్టి అలాగే వారికి అవసరమైన ఇంధన వనరులను బట్టి రిటైల్ ఔట్ లెట్‌నుంచి అది పెట్రోలు, లేదా డీజిల్, సిఎన్‌జి, ఎల్ఎన్‌జి లేదా ఎలక్ట్రిక్ చార్జింగ్‌ను కొనుగోలు చేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నదని అన్నారు.
ప్రభుత్వం ఇంధనాన్ని మొబైల్ వాహనాలద్వారా సరఫరా చేయాలనుకుంటున్నదని, దీనివల్ల వినియోగదారులు తమ గుమ్మంవద్ద ఇంధనాన్నితమ సౌలభ్యం కొద్ది పొందగలుగుతారని అన్నారు. బ్యాటరీ స్వాపింగ్ సౌకర్యాలు కూడా విస్తరింపచేసే ఆలోచన ఉందని మంత్రి అన్నారు. ప్రతి లావాదేవిలోనూ పెద్ద ఎత్తున డిజిటల్ ప్లాట్‌ఫారంలను చేపట్టడాన్ని మంత్రి సమర్ధించారు.
రాగల సంవత్సరాలలో ఇండియా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇంధన వినియోగదారు కానున్నదని ఆయన అన్నారు.సిజిడి నెట్ వర్కు భారతదేశంలో మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఉందని ఆయన అన్నారు. 2030 నాటికి కాప్ 21 వాతావరణ మార్పుల లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఆకాంక్షకు అనుగుణంగా ఉన్నాయన్నారు.
ఇక సౌర ఇంధన రంగంలో , ఇండియా ఇప్పటికే ఒక రోల్ మోడల్ గా ఉందని అన్నారు. గ్యాస్ మౌలిక సదుపాయాల రంగంలో 60 బిలియన్ డాలర్ల పెట్టుబడి అంటే సుమారు 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడిని పెట్టనున్నామని, అందులో పైపులైన్లు వేయడం, టెర్మినళ్ల నిర్మాణం, గ్యాస్ క్షేత్రాలు ఉన్నాయన్నారు. దేశం గ్యాస్ ఆధారిత ఆర్ధిక వ్యవస్థ దిశగా కదులుతున్నదని, దీనివల్ల పరిశుభ్రమైన , సమర్ధమైన ఇంధనం అందుబాటులోకి రావడమే కాక, దేశం దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ పై ఆధారపడడం తగ్గుతుందని అన్నారు. సిజిడి కంపెనీలు వ్యవసాయ వ్యర్థాలు, అటవీ ఉత్పత్తులు, నగరాలలోని వ్యర్థాలు, గోబర్ ను ఉపయోగించి కంప్రెస్‌డ్ బయో గ్యాస్‌ను ఉత్పత్తి చేసేందుకు బయోమాస్ ఆధారిత ప్లాంట్లలో పెట్టుబడి పెట్టాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి 500 ప్లాంట్లు ఇప్పటికే ఏర్పాటయ్యాయని, ఈ దిశగా 5000 ప్లాంట్లు నెలకొల్పడం లక్ష్యమన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో మన కరోనా వారియర్లు, కరోనా ముప్పును సైతం లెక్కచేయకుండా వినియోగదారులకు వారి ఇళ్లవద్దకు సకాలంలో సరఫరాలు అందేట్టు చూశారన్నారు.
పెట్రోలియం , సహజవాయు కార్యదర్శిశ్రీ తరుణ్ కపూర్ మాట్లాడుతూ, కోవిడ్ సమస్య ఉన్నప్పటికీ లక్ష్యాలు సాధించేందుకు సిజిడి సంస్థలు చేసిన కృషిని ఆయన అభినందించారు. గ్యాస్ ఆధారిత ఆర్ధిక వ్వవస్థలోకి ఇండియా మారడానికి ఇండియా ప్రయత్నిస్తున్నదని, ఇందుకు పంపిణీ నెట్‌వర్కులు ఏర్పాటు వాటిని విస్తృతం చేయడం కీలకమని అన్నారు.మరింతగా పిఎన్‌జి, సిఎన్‌జి కి మారడానికి ఇవి ఎంతగానో అవసరమని అన్నారు.
దేశంలో సిఎన్‌జి స్టేషన్లు రెట్టింపు కన్నా ఎక్కువ అయ్యాయి. 2014లో 938 స్టేషన్లు ఉండగా 2020 నాటికి అవి 2300 స్టేషన్లు అయ్యాయని అన్నారు. ప్రస్తుతం ఉన్న సిఎన్‌జి స్టేషన్లతో పాటు, 9వ, 10 వ రౌండ్‌లలో రాగల సంవత్సరాలలో దేశంలో 10,000 సిఎన్‌జి స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
9వ సిజిడి బిడ్డింగ్ రౌండ్ 2018లో ముగిసింది. ఇది 174 జిల్లాలలో 86 జిఎలతో ఇండియాలోనే అతిపెద్ద బిడ్డింగ్. 10 వ సిజిడి బిడ్డింగ్‌రౌండ్ 54 జిఎలతో 124 జిల్లాలను కవర్ చేస్తున్నది. దీనిపై ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరచారు. 9, 10 రౌండ్లు మొత్తంగా 1,20,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది. ఈ రౌండ్ ల అనంతరం ఇండియా సిజిడి మౌలిక సదుపాయాలు దేశంలోని 407 జిల్లాలలో అందుబాటులోకి వచ్చాయి. అంటే దేశంలోని 50 శాతంపైగా ప్రాంతానికి అలాగే 70 శాతం ప్రజలకు ఇవి అందుబాటులోకి వచ్చాయి.
సిజిడి రంగంలో ఇంత పెద్ద ఎత్తున సామర్ధ్యం పెంపు వల్ల పిఎన్‌జి మీటర్లకు, పిఎన్‌జి రెగ్యులేటర్లకు, సిఎన్‌జి కంప్రెసర్లు, సిఎన్‌జి డిస్పెన్సర్లకు , సిఎన్‌జి కాస్కేడ్‌లకు రానున్న సంవత్సరాలలో భారీగా డిమాండ్ ఏర్పడనుంది. సిడిజి రంగం నుంచి ఇలాంటి కచ్చితమైన డిమాండ్ వల్ల దేశీయ తయారీదారులకు మంచి ప్రోత్సాహం లభించినట్టు అవుతుంది. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలలో పరిశుభ్రమైన ఇంధనం అందుబాటులోకి రావడానికి వీలు కలుగుతుంది.
***
(Release ID: 1662067)
Visitor Counter : 159