సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

చలన చిత్రాల ప్రదర్శనకు నియమావళిని విడుదల చేసిన కేంద్రమంత్రి జవదేకర్

50శాతం మంది ప్రేక్షలకులతో సినిమా హాళ్లకు అనుమతి

Posted On: 06 OCT 2020 11:59AM by PIB Hyderabad

  సినిమాహాళ్లు, థియేటర్లలో చలన చిత్రాల ప్రదర్శనకు తప్పనిసరిగా పాటించవలసిన ప్రమాణబద్ధమైన నియమావళిని (ఎస్.ఒ.పి.ని) కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ రోజు విడుదల చేశారు. చలన చిత్రాల ప్రదర్శనకు తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలతో ఈ ఎస్.ఒ.పి.కి రూపకల్పన చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదింపుల అనంతరం ఈ నియమావళిని రూపొందించారు. ఎస్.ఒ.పి. విడుదల సందర్భంగా కేంద్ర మంత్రి జవదేకర్ మాట్లాడుతూ,..కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు సినిమాహాళ్లు 2020వ సంవత్సరం అక్టోబరు 15న తిరిగి తెరుచుకోనున్నాయని, ఇందుకు సంబంధించి పాటించవలసిన నియమావళిని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తయారు చేసిందని చెప్పారు.

   కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన సాధారణ సూత్రాలతోపాటుగా,  మరిన్ని ఇతర మార్గదర్శక సూత్రాలకు ప్రాధాన్యం ఇస్తూ తాజా నియమావళిని తయారు చేశారు. సందర్శకులకు, ప్రేక్షకులకు, సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్, వ్యక్తికి, వ్యక్తికి మధ్య తగిన భౌతిక దూరం, మాస్కుల ధారణ, తరచూ చేతులు శుభ్రపరుచుకోవడం, హ్యాండ్ శానిడైజర్లు అందుబాటులో ఉంచడం తదితర సాధారణ సూత్రాలన్నింటినీ పాటించవలసి ఉంటుంది. దీనికి తోడు హాలులో శ్వాసక్రియకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సినిమా ప్రదర్శన రంగానికి సంబంధించి అమలులో ఉన్న అంతర్జాతీయ విధానాలను పరిగణనలోకి తీసుకుంటూ, మంత్రిత్వ శాఖ తాజాగా ఈ సాధారణ నియమావళిని రూపొందించింది. భౌతిక దూరం, ప్రవేశ ద్వారం, బయటకు వెళ్లే దారిలో క్యూ మార్కర్లు, శానిటైజేషన్, సిబ్బంది భద్రత, చేతితో స్పర్శించే అవసరాన్ని బాగా తగ్గించడం వంటివి ఇందులో ఉన్నాయి. థియేటర్, లేదా సినిమాహాలు సీట్ల సామర్థ్యంలో 50శాతం సీట్లకు సినిమా ప్రదర్శన ఏర్పాట్లను నియంత్రించారు. ఒక ప్రదర్శనకు, మరో ప్రదర్శనకు తగిన ఎడం ఉండేలా ప్రదర్శన సమయాలను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. హాలులో ఉష్ణోగ్రత 24నుంచి 30సెల్సియస్ డిగ్రీల మధ్య ఉండేలా చూసుకోవాలి.

  చలన చిత్రాల ప్రద్శనను తిరిగి ప్రారంభించేటపుడు మార్గదర్శక సూత్రాలను, ఎస్.ఒ.పి.ని వివిధ రాష్ట్రాలు, ఇతర భాగస్వామ్య వర్గాలు వినియోగించుకోవలసి ఉంటుంది.

  చలన చిత్రాల ప్రదర్శన మన ప్రధానమైన ఆర్థిక కార్యకలాపాల పరిధిలోకి వస్తుంది. మన దేశ స్థూల స్వదేశీ ఉత్పత్తికి ఇది ఎంతో విస్తృతంగా దోహదపడుతుంది. ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో,.. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకుగాను, చలన చిత్రాల ప్రదర్శనతో ప్రమేయం ఉన్న వ్యక్తులు, భాగస్వామ్య వర్గాలు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అదే సమయంలో తమ కార్యకలాపాలను సజావుగా నిర్వహించుకోవలసిన అవసరం ఉంది.

   దేశంలోని సినిమాహాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్ లు తమ సీట్ల సామర్థ్యంలో 50 శాతం ప్రేక్షకులతో 2020 అక్టోబరు 15నుంచి సినిమాల ప్రదర్శన చేపట్టడానికి కేంద్ర హోమ్ మంత్రి త్వ శాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఇందుకు తగిన మార్గదర్శ సూత్రాలను జారీ చేసింది. కంటెయిన్మెంట్ జోన్ల వెలుపలి ప్రాంతాల్లో మాత్రమే సినిమాల ప్రదర్శనకు అనుమతించారు.

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ప్రకటనన వివరాలను ఈ కింది లింక్ ద్వారా చూడవచ్చు :

https://mib.gov.in/sites/default/files/SOP%20for%20exhibition%20of%20films.pdf

***



(Release ID: 1662010) Visitor Counter : 172