ప్రధాన మంత్రి కార్యాలయం

హిమాచల్ లోని సోలాంగ్ లోయలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

Posted On: 03 OCT 2020 5:07PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి మండలిలో నా సహచరులు శ్రీమాన్ రాజ్‌నాథ్ సింగ్ జీ, హిమాచల్ ప్రదేశ్ లోకప్రియ ముఖ్యమంత్రి భాయీ జైరామ్ ఠాకూర్ జీ, హిమాచల్ ప్రదేశ్ ఎంపీ, కేంద్రంలో నా సహచరుడు, హిమాచల్ ప్రదేశ్ ముద్దుబిడ్డ శ్రీ అనురాగ్ ఠాకూర్ జీ, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, హిమాచల్ ప్రదేశ్ మంత్రిమండలి సభ్యులైన భాయీ గోవింద్ ఠాకూర్ జీ, ఇతర మంత్రులు, సభ్యులు, సోదర, సోదరీమణులరా..

మనందరి ప్రియతమ నాయకులు శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి గారి దూరదృష్టి చొరవ కారణంగా రూపుదిద్దుకున్న ఈ సొరంగం కారణంగా కుల్లూ, లాహూల్, లేహ్-లద్దాఖ్ ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే ఈ సొరంగం మీ అందరికీ కానుకగా లభించింది. ఈ సందర్భంగా మీ అందరికీ పేరుపేరునా అభినందనలు.

హిడంబా దేవి, ఎందరో రుషులు,మునుల తపోస్థలంతోపాటు 18కోట్ల గ్రామదేవతల గొప్ప సంప్రదాయాన్ని కలిగి ఉన్న పవిత్రమైన ఈ పావనగడ్డకు మన:పూర్వకంగా నమస్సులు తెలియజేస్తున్నాను. కాంచన గంగ స్థలమిది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి జైరామ్ జీ వర్ణించినట్లుగా.. నాకు పారాగ్లైడింగ్ అంటే చాలా ఇష్టం. కానీ మొత్తం కిట్ తీసుకుని పై వరకు వెళ్తామో.. చాలా అలసిపోయేవాళ్లం. బహుషా ఎవరికీ తెలియదనుకుంటా.. అటల్ జీ మనాలీ వచ్చారు. అప్పుడు నేను ఇక్కడ సంఘటనకు సంబంధించిన కార్యక్రమాలు చూసేవాడిని కాబట్టి కాస్త ముందొచ్చా. అప్పుడు మేం ఓ ప్రణాళిక రూపొదించాం. మనాలీలో వాజ్ పేయి గారు దిగగానే.. వారిపై 11 మంది పారాగ్లైడర్లు, పైలట్లతో సహా పుష్పవర్షం కురిపించాం. బహుషా ప్రపంచంలో పారాగ్లైడింగ్ ను ఈ విధంగా ఉపయోగించిన ఘటనలు లేవనే అనుకుంటా. ఆరోజు సాయంత్రం అటల్ జీని కలిసేందుకు వెళ్లినపుడు.. వారు.. భాయీ చాలా సాహసం చేస్తున్నావ్. ఇలా ఎందుకు చేస్తున్నావ్ అని అడిగారు. కానీ మనాలీలో ఆరోజు జరిగిన ఘటన నా జీవితంలోనే అత్యంత ఆనందరకరమైన జీవితాల్లో ఒకటి.
హిమాచల్ ప్రదేశ్లోని నా సోదర, సోదరీమణులారా.. అటల్ టన్నెల్ ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ముందుగా నేను చెప్పినట్లు ఈ స్థలంలో సభ జరుగుతోంది. ప్రజలంతా సురక్షిత దూరాన్ని పాటించేలా చక్కటి ఏర్పాట్లు చేశారు. వారందరినీ అభినందించే చక్కటి అవకాశం నాకు దక్కింది. ఈ ప్రాంతంతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. నేను సహజంగా ఒక ప్రాంతంలోనే ఎక్కువరోజులుడే వాడిని కాదు.. చాలా వేగంగా పరిగెట్టేవాడిని. కానీ అటల్ జీ వచ్చినపుడు.. వారు ఇక్కడ ఎన్నిరోజులుంటే నేను కూడా అన్ని రోజులుండేవాడిని. అందుకే తెలియకుండానే ఈ ప్రాంతంతో ఓ చక్కటి బంధం అలవడింది. వాజ్ పేయి గారితో ఉన్నపుడల్లా.. మనాలీ, హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధిపై చర్చ జరుగుతూనే ఉండేది. అటల్ జీ ఇక్కడి మౌలిక వసతులు, అనుసంధానత, పర్యాటక ఉపాధికల్పన వంటి వాటిపై ఎక్కువగా చర్చించేవారు.

వారెప్పుడూ ఓ కవిత వినిపించేవారు. మనాలీ వాసులు దీన్ని వినే ఉంటారు. వాజ్ పేయి గారికి పరిణి గ్రామంలో గడపడమంటే చాలా ఇష్టం. ఇక్కడి ప్రజలంటే ఎంతో మక్కువ. అలాంటి అటల్ వారి కవితలో..

మనాలీ మత్ జాయియో,
రాజాకే రాజ్ మే.
జాయియో తో జాయియో,
ఉడికే మత్ జాయియో,
అధర్ మే లటకీహౌ,
వాయుదూత్ కే జహాజ్ మే.
జాయియో తో జాయియో
,
సందేశా న పాయియో,
టెలిఫోన్ బిగడే హై,
మిర్ధా మహారాజ్ మే.

మిత్రులారా, మనాలీని అత్యంత ఇష్టపడే అటల్ జీ కి.. ఇక్కడి పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాలని బలమైన కోరిక ఉండేది. మిగిలిన ప్రపంచంతో అనుసంధానత బాగుండాలని భావించేవారు. అందుకే రోహ్‌తంగ్ లో సొరంగం నిర్మించాలని నిర్ణయించారు.
ఇవాళ అటల్ జీ సంకల్పం సాకరమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అటల్ టన్నెల్ తనపై ఎంతో భారాన్ని మోస్తున్నది (సొరంగంపై దాదాపు రెండు కిలోమీటర్ల ఎత్తయిన కొండ ఉంది). లాహౌల్-స్పీతీ, మనాలీ ప్రజలు ఎంతోకాలంగా ఇంతకన్నా ఎక్కువ భారాన్ని తమ భుజస్కంధాలపై మోస్తూనే ఉన్నారు. ఈ టన్నెల్ మోస్తున్న భారం ద్వారా.. ప్రజలపై ఎంతో కాలంగా ఉన్న బరువంతా తగ్గిపోయింది. సామాన్యులపై భారం తగ్గడం, లాహౌల్-స్పీతీ మధ్య రాకపోకలు మరింత సులభతరం కావడం వారికి సంతోషకరం, వారి గౌరవదాయకం.

పర్యాటకులు కుల్లూ-మనాలీలో సిడ్డూ నేతితో చేసిన అల్పాహారం తిని బయలు దేరితే.. లాహౌల్ కు చేరుకుని దూమార్, చిల్డే తో మధ్యాహ్న భోజనం చేసేరోజులు ఎంతో దూరంలో లేవు. అంతకుముందు ఇది సాధ్యమయ్యేది కాదు.
సరే, కరోనా కారణంగా పరిస్థితులు కాస్త మారినా.. మెల్లి మెల్లిగా దేశంలో అన్ లాక్ ప్రక్రియ మొదలవుతోంది. దేశంలోని వివిధ రంగాల్లాగే.. పర్యాటక రంగం కూడా మెల్లిగా వేగం పుంజుకుంటుందని నేను ఆశిస్తున్నాను. కుల్లూలో దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మిత్రులారా,
అటల్ టన్నెల్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ ప్రజలకోసం మరో గొప్ప నిర్ణయం తీసుకున్నాం. హమరీపూర్ లో 66 మెగావాట్ల ధౌలాసిద్ధ హైడ్రో ప్రాజెక్ట్ కు ఆమోదముద్ర వేశాం. ఈ ప్రాజెక్టు ద్వారా దేశానికి విద్యుత్ లభిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ఉపాధి కల్పన కూడా జరుగుతుంది.  

మిత్రులారా,
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆధునిక మౌలిక వసతుల కల్పన ఉద్యమంలో హిమాచల్ ప్రదేశ్ భాగస్వామ్యం కూడా కీలకంగానే ఉంది. హిమాచల్ ప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, హైవేలు, పవర్ ప్రాజెక్టులు, రైలు అనుసంధానత, విమానయాన అనుసంధానత వివిధ కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. కీరత్ పూర్ – కుల్లూ – మనాలీ రోడ్డు కావొచ్చు, జీరక్ పూర్ – పర్వానూ- సోలన్ – కైథ్లీ ఘాట్ కారిడార్ అయినా.. నాంగల్ డ్యామ్ -  తల్వాడా రైల్ మార్గమైనా, భానుపల్లి – బిలాస్ పూర్ రైలు మార్గమైనా ప్రతి పని కూడా చాలా వేగంగా జరుగుతోంది. ఈ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసి హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు సేవలు అందించాలన్నదే మా తాపత్రయం.

మిత్రులారా, హిమాచల్ ప్రదేశ్ ప్రజల జీవనాన్ని మరింత సరళతరం చేసేందుకు రోడ్లు, విద్యుత్ వంటి కనస అవసరాలతోపాటు మొబైల్, ఇంటర్నెట్ అనుసంధానత కూడా చాలా అవసరం. పర్యాటక కేంద్రాల వద్ద ఇలాంటివి అత్యంత అవసరంగా మారాయి. కొండలు, గుట్టల ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ లోని చాలాప్రాంతాల్లో నెట్ వర్క్ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్యలకు పరిష్కారం కోసం రాష్ట్రంలోని ఆరు లక్షల గ్రామాల్లో ఆప్టిక్ ఫైబర్ లైన్లను వేసే కార్యక్రమం మొదలైంది. వచ్చే వెయ్యి రోజుల్లో ఈ కార్యక్రమం మరింత శీఘ్రగతిన పూర్తిచేయాలని సంకల్పించాం. దీని ద్వారా గ్రామాల్లో వైఫై హాట్ స్పాట్ లతోపాటు ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ అందుతుంది. అంతేకాదు.. హిమాచల్ ప్రదేశ్ లోని పిల్లలకు విద్య, వ్యాధిగ్రస్తులకు మందులు, పర్యాటక రంగం ద్వారా ఆర్థిక సాధికారత పొందడం వంటి  ఎన్నో లాభాలు చేకూరుతాయి.

సామాన్య ప్రజల కష్టాలను తగ్గిస్తూ.. వారికి వీలైనంత ఎక్కువగా ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరేలా చేయడమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నం. ఇందుకోసం దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలను డిజిటలీకరణ చేశాం. ఇప్పుడు వేతనం, పింఛను మొదలైన సేవలు, ఇతర అవసరాల కోసం ప్రతిసారి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పనిలేదు. గతలో హిమాచల్ ప్రదేశ్ లోని మారుమూల ప్రాంతాల నుంచి తమ దస్తావేజులు చేతిలో పట్టుకుని యువకులు, రిటైర్డ్ ఉద్యోగులు అటెస్టేషన్ కోసం నేతల చుట్టూ చక్కర్లు కొట్టేవారు. అలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దస్తావేజుల అటెస్టేషన్ విధానాన్నే పూర్తిగా రద్దుచేశాం. గుర్తుచేసుకోండి, గతంలో  కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్లు కట్టేందుకు దినమంతా వ్యర్థమయ్యేది. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చునే ఒక్క క్లిక్ తో బిల్లులు చెల్లించే పరిస్థితి వచ్చింది. బ్యాంకుల వంటి సేవలు కూడా.. ఇప్పుడు బ్యాంకులకు వెళ్లకుండా.. ఇంట్లోనూ కూర్చుని పొందగలుగుతున్నారు.

 

మిత్రులరా, ఇలాంటి సౌకర్యాల కారణంగా చాలా సమయం కలిసివస్తుంది. డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి. అవినీతి తగ్గుతోంది. కరోనా సందర్భంగా.. హిమాచల్ ప్రదేశ్ లోని 5 లక్షలకు పైగా పింఛనర్లకు, 6 లక్షల మంది సోదరీమణులకు అకౌంట్లలో.. జన్ ధన్ ఖాతాల ద్వారా కోట్ల రూపాయలను జమచేయబడ్డాయి. లక్షన్నరకు పైగా పేద మహిళలకు ఉజ్వల పథకంలో భాగంగా ఉచిత సిలిండర్లు అందుకున్నారు.

మిత్రులారా, దేశవ్యాప్తంగా భారీ సంస్కరణలు అమల్లో ఉన్నాయి. ఈ సంస్కరణలు.. ఇన్నాళ్లుగా రాజకీయ అవసరాలకోసమే పనిచేసిన వారికి కంటగింపుగా మారాయి. శతాబ్దాలు మారుతున్నాయి కానీ వారి ఆలోచనలు మాత్రం మారడంలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశంలో మార్పులు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. గతంలో వారు సృష్టించిన దళారులు, మధ్యవర్తుల వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రయత్నం జరుగుతున్నపుడు సహజంగానే వారి ఆక్రోషం కట్టలు తెంచుకుంటోంది. మధ్యవర్తుల గురించి ఆలోచించే వారు.. దేశంలో రైతు పరిస్థితిని ఎంత నష్టపరిచారు. ఈ విషయం హిమాచల్ ప్రజలకు కూడా బాగా తెలుసు.

హిమాచల్ ప్రదేశ్ దేశంలో పళ్లను ఉత్పత్తిచేసే అతిపెద్ద రాష్ట్రమనే సంగతి మీకు తెలుసు. ఇక్కడి టమాటోలు, మష్రూమ్ (పుట్టగొడుగులు) వంటి  కూరగాయలు ఎన్నో రాష్ట్రాల్లో ప్రజల అవసరాలను తీరుస్తున్నాయి. కానీ మీ ఆర్థిక పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా. ఇక్కడ 40-50రూపాయలకు కిలో ఉండే యాపిల్ పళ్లు.. ఢిల్లీ వాసులకు 100-150 రూపాయలకు దొరుకుతాయి. మధ్యలోని వంద రూపాయలు ఎవరి జేబులోకి పోతున్నాయి. ఇది రైతుకు దొరకడం లేదు. కొనుగోలు దారునికీ దొరకడం లేదు. మరి ఎక్కడకు పోయింది. రైతుకు, పట్టణాల్లో ఉండే కొనుగోలుదారునికీ నష్టం జరుగుతోంది. ఇంతే కాదు.. ఇక్కడి బాగ్వాన్ మిత్రులకు.. ఎప్పుడైతే పంట ఉత్పత్తి పెరిగిపోతుందో.. హఠాత్తుగా ధరలను దారుణమైన స్థితికి తగ్గించేస్తారు. దీని ద్వారా ఎక్కువగా నష్టపోయేది రైతులే. మరీ ముఖ్యంగా చిన్న కమతాలున్న రైతులకు తీవ్ర నష్టం.

మిత్రులారా, వ్యవసాయాన్ని పరిపుష్టం చేసి రైతుకు మేలు చేసే చట్టాలను వ్యతిరేకిస్తున్న వారు యధాతథ స్థితిని కొనసాగించాలని రభస చేస్తున్నారు. అలాంటి వారికి నేను చెప్పేదొక్కటే మీరు గత శతాబ్దంలో ఆలోచనలల్లో విహరించాలంటే మీ ఇష్టం.. కానీ నేటి పరిస్థితుల ప్రకారం దేశంలో మార్పులు తీసుకురావాల్సిన అత్యంత ఆవశ్యకత ఉంది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు చరిత్రాత్మక చట్టాలు తీసుకొచ్చాం. వారు కూడా ఈ ఆలోచన చేశారు. వారికి కూడా ఈ చట్టాల అవసరం బాగా తెలుసు. కానీ వారిలో ఇవి తీసుకొచ్చే ధైర్యం లేకపోయింది.మాలో ఆ ధైర్యం మెండుగా ఉంది. వారి కళ్లముందు ఎన్నికలే కనబడేవి. మా ముందు దేశం మాత్రమే ఉంది. మా దేశ రైతులు మా కళ్లముందు కనిపిస్తున్నారు. వారి ఉజ్వల భవిష్యత్తు మాకు కనబడుతోంది. అందుకే మేం ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని మన అన్నదాతలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్లోని చిన్న చిన్న బాగ్వాన్ లు, రైతులు వారి యాపిల్ పళ్లను పక్క రాష్ట్రానికి వెళ్లి విక్రయించాలనుకుంటే అలా చేసేందుకు ఇప్పుడెలాంటి అడ్డంకుల్లేవు. ఇందుకు పూర్తి స్వతంత్రత ఉంది. స్థానిక మార్కెట్లో అనుకున్న ధర దొరికితే.. అమ్ముకోవచ్చు. అందుకెలాంటి ఇబ్బందుల్లేవు. అన్ని రకాల రైతులు, బాగ్వాన్ లకు మేలు చేసేలా ఈ చట్టాలను రూపొందించాం.

మిత్రులారా,
కేంద్ర ప్రభుత్వ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంతోపాటు వ్యవసాయ సంబంధిత చిన్న చిన్న సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ఉంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దేశంలోని దాదాపు 12.5కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి దాదాపుగా లక్షకోట్ల రూపాయలను జమ చేశాము. ఇందులో హిమాచల్ ప్రదేశ్ నుంచి 9.25 లక్షల మంది రైతుల ఖాతాల్లోనూ దాదాపుగా వెయ్యికోట్ల రూపాయలు జమయ్యాయి. గత ప్రభుత్వాల్లో వెయ్యి రూపాయల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తే.. ఆ మొత్తం ఎక్కడెక్కడకు పోయిందో, ఎవరెవరి జేబుల్లోకి పోయిందో తెలియదు. అయినా దానిపై రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఎంతో ప్రయత్నించేవారు. ఇప్పుడు రైతుల ఖాతాల్లో వేలకోట్లు జమ అవుతున్నా.. ఎలాంటి హంగామా లేదు.

మిత్రులారా, ఈ మధ్య మన కార్మికులు మరీ ముఖ్యంగా సోదరీమమమణులు, కూతుళ్లకు సాధికారత కల్పించే పెద్ద సంస్కరణను తీసుకొచ్చాం. హిమాచల్ సోదరీమణులు, కూతుళ్లకు క్లిష్ట పరిస్థితుల్లోనూ కఠినంగా శ్రమించడంలో ఏమాత్రం వెనుకాడరు. కానీ దేశంలో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులున్న సెక్టార్లు చాలానే ఉన్నాయి. వీటిలో మహిళలు పనిచేసేందుకు అడ్డంకులుండేవి. కార్మిక చట్టాల్లో తీసుకొచ్చిన మార్పుల కారణంగా మహిళల వేతనాల దగ్గర్నుంచి.. పని వరకు సాధికారత కల్పించడం జరిగింది. ఇవన్నీ ముందునుంచే పురుషులకు సంక్రమించి ఉన్నాయి.

మిత్రులారా, దేశంలోని ప్రతి రంగంలో, ప్రతి పౌరుడి ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఆత్మనిర్భర భారత్ నిర్మాణానికి దేశంలో సంస్కరణల వెల్లువ కొనసాగుతోంది. కొనసాగుతుంది కూడా. గత శతాబ్దపు నిబంధనలు, చట్టాలతో కొత్త శతాబ్దంలో ముందుకెళ్లడం కష్టం. సమాజంలో, అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చి సానుకూల మార్పులకోసం మేం చేస్తున్న ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఎన్న రాజకీయాలు చేసినా.. దేశం ఆగదు. ఈ సంస్కరణలు ఆగవు. హిమాచల్ ప్రదేశ్ తో పాటు దేశంలోని యువకులందరి కలలు, ఆకాంక్షలను సాకారం చేయడమే మా సమున్నత లక్ష్యం. ఈ సంకల్పంతో మేం దేశ ప్రగతిని మరింత ఉన్నతస్థితికి తీసుకెళ్లడంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.
మిత్రులారా, అటల్ టన్నెల్ ద్వారా ఎంతటి మార్పులు వస్తాయో, కొత్త అవకాశాలకు ఎలా దార్లు తెరుచుకుంటాయో మీరు ఊహించగలరు. ఇలాంటి అవకాశాలను వీలైనంత ఎక్కువగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు.

కరోనా సమయంలో హిమాచల్ ప్రదేశ్ లో పరిస్థితులను చాలా చక్కగా ఎదుర్కున్నారు. అయినప్పటికీ ఈ పరిస్థితులనుంచి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.
దేవభూమి, కంచన గంగ భూమి అయిన హిమాచల్ గడ్డకు మరొక్కసారి నమస్కరిస్తూ.. మీ అందరినీ మరొక్కసారి కలిసేందుకు మీ దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్గటాన్ని సంతోషంగా భావిస్తున్నాను. కరోనా మహమ్మారి లేకపోయినట్లయితే.. మీ అందరినీ నేరుగా కలవడం, పరిచయస్తులతో మాట్లాడటం జరిగేది. కానీ ఈ పరిస్థితుల కారణంగా మిమ్మల్ని కలవలేకపోతున్నాను. కానీమీ అందరినీ దర్శించుకునే అవకాశం దక్కింది. ఇందుకు హర్షిస్తున్నాను. మరొక్కసారి మీ అందరకీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.
ధన్యవాదములు.

****



(Release ID: 1661537) Visitor Counter : 126