రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
'సమాచార పాలన నాణ్యత సూచి' సర్వే నివేదికలో; 16 ఆర్థిక మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో రెండో ర్యాంకులో, మొత్తం 65 మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో 3వ ర్యాంకులో నిలిచిన ఎరువుల విభాగం
Posted On:
02 OCT 2020 11:12AM by PIB Hyderabad
కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఎరువుల విభాగం.. 'సమాచార పాలన నాణ్యత సూచి' (డీజీక్యూఐ) సర్వే నివేదికలో; 16 ఆర్థిక మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో రెండో ర్యాంకులో, మొత్తం 65 మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో 3వ ర్యాంకులో నిలిచింది. మొత్తం 5 పాయింట్లకు గాను 4.11 పాయింట్లు దక్కించుకుంది.
కేంద్ర రంగ పథకాలు (సీఎస్), కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్) అమలుపై వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల పనితీరును మదించడానికి, నీతి ఆయోగ్‌కు చెందిన 'అభివృద్ధి పర్యవేక్షణ, మూల్యాంకన కార్యాలయం' (డీఎంఈవో) ఈ సర్వే చేసింది.
మంత్రిత్వ శాఖలు/విభాగాల్లోని సమాచార సంసిద్ధత స్థాయుల స్వీయ అంచనా ఆధారిత సమీక్ష ద్వారా డీజీక్యూఐ నివేదిక కసరత్తును డీఎంఈవో చేపట్టింది. తదనుగుణంగా సర్వే ప్రారంభించింది. ఒక ప్రామాణిక విధానం ద్వారా మంత్రిత్వ శాఖలు/విభాగాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడం, ఉత్తమ విధానాల నుంచి సహకార అభ్యాసాన్ని ప్రోత్సహించడం ఈ సర్వే నివేదిక ఉద్దేశం.
సర్వేలో భాగంగా, ఆరు ముఖ్యమైన అంశాల ఆధారంగా ఆన్‌లైన్ ప్రశ్నావళిని రూపొందించింది. అవి: సమాచార ఉత్పత్తి, సమాచార నాణ్యత, సాంకేతికత వినియోగం, సమాచార విశ్లేషణ, ఉపయోగం&పంపకం, సమాచార భద్రత&హెచ్‌ఆర్ సామర్థ్యం, కేస్ స్టడీలు. ప్రతి పథకానికి 0-5 పాయింట్లు వచ్చేలా, ప్రతి అంశానికి మార్కులు, ప్రతి ప్రశ్నకు ఉప మార్కులు కేటాయించింది. అసంబద్ధ పోలికలను నివారించడానికి మంత్రిత్వ శాఖలు/విభాగాలను ఆరు విభాగాలుగా విభజించింది. అవి: పరిపాలన, వ్యూహాత్మక, మౌలిక సదుపాయాలు, సామాజిక, ఆర్థిక, శాస్త్రీయ విభాగాలు.
కేంద్ర రంగ పథకాలు (సీఎస్), కేంద్ర ప్రాయోజిత పథకాలు (సీఎస్‌ఎస్)లను అమలు చేస్తున్న మంత్రిత్వ శాఖలు/విభాగాలకు ఈ ప్రశ్నావళిని డీఎంఈవో పంపింది. 250 సీఎస్, సీఎస్‌ఎస్‌లను అమలు చేస్తున్న 65 మంత్రిత్వ శాఖలు/విభాగాల నుంచి సమాచారం సేకరించి, పాయింట్లు కేటాయించింది. మొత్తం 5 పాయింట్లకు గాను 4.11 పాయింట్లు దక్కించుకున్న ఎరువుల విభాగం.. 16 ఆర్థిక మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో రెండో ర్యాంకులో; మొత్తం 65 మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో 3వ ర్యాంకులో నిలిచింది.
మంత్రిత్వ శాఖలు/విభాగాల పనితీరుపై ప్రగతి నివేదిక రూపకల్పనకు డీఎంఈవో చేసిన ప్రయత్నం అభినందనీయమని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ చెప్పారు. కోరుకున్న లక్ష్యాలను చేరుకునేలా; ప్రభుత్వ విధానాలు, పథకాలు, కార్యక్రమాల అమలు పద్ధతులను మెరుగుపరుచుకోవడానికి ఈ నివేదిక ఉపయోగవడుతుందని అభిప్రాయపడ్డారు.
***
(Release ID: 1660950)
Visitor Counter : 235