ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తరాఖండ్‌లో నమామిగంగే పథకంలో భాగంగా 6 మెగా ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగపాఠం

Posted On: 29 SEP 2020 1:37PM by PIB Hyderabad

ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీమతి బేబీ రాణి మౌర్యాజీ, ముఖ్యమంత్రి శ్రీమాన్ త్రివేంద్ర సింగ్ రావత్ జీ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ నిశంక్ జీ, శ్రీ రతన్ లాల్ కటారియా జీ ఇతర నేతలు, ఉత్తరాఖండ్‌కు చెందిన మా సోదర, సోదరీ మణులారా.. పవిత్రమైన చార్‌ధామ్ కేంద్రాలను తనలో ఇమిడ్చుకున్న దేవభూమి ఉత్తరాఖండ్ గడ్డకు నా హృదయపూర్వక నమస్కారములు,
 

ఇవాళ, గంగానది పవిత్రనను నిర్దేశించే ఆరు ముఖ్యమైన ప్రాజెక్టులు జాతికి అంకితమయ్యాయి. ఇందులో హరిద్వార్, రుషికేష్, బద్రీనాథ్ తోపాటు మునీకీ రేతీలో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, మ్యూజియం ఏర్పాటు వంటి ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టులు జాతికి అంకితమవుతున్న సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

మిత్రులారా, కాసేపటి క్రితం జల్ జీవన్ మిషన్‌కు సంబంధించిన చక్కటి లోగోతోపాటు మిషన్ మార్గదర్శిక ఆవిష్కరణ జరిగింది. జల్ జీవన్ మిషన్ అనేది భారతదేశంలోని ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీటిని పైప్ లైన్ ద్వారా అందించేందుకు ఉద్దేశించిన ఓ పెద్ద పథకం. ఇలాంటి పథకం లోగో.. ప్రతిచుక్క నీటిని ఒడిసి పట్టుకునేందుకు అవసరమైన ప్రేరణను మనకు అందిస్తుంది. ‘మిషన్ మార్గదర్శిక’ గ్రామ ప్రజలకు, గ్రామ పంచాయతీలకు మార్గదర్శనం చేసేందుకు అత్యంత ఆవశ్యకమైనది. దీంతోపాటుగా ప్రభుత్వ యంత్రాగానికి కూడా ఇది అత్యంత కీలకం. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ మార్గదర్శిక చక్కటి మాధ్యమంగా ఉపయోగపడుతుంది.

 

మిత్రులారా, ఇవాళ ఆవిష్కరణ జరిగిన ఈ పుస్తకంలో.. మన జీవితాల్లో మన సాంస్కృతిక వైభవంలో మన విశ్వాసాల్లో గంగానది పోషిస్తున్న పాత్రను చాలా చక్కగా వివరించారు. ఉత్తరాఖండ్ లో జన్మించి.. సముద్రంలో కలిసేంతవరకు దాదాపు సగం జనాభాను సుసంపన్నం చేస్తోంది. అందుకే గంగానది పవిత్రతను కాపాడేలా పరిశుద్ధంగా ఉంచడం అత్యంత అవసరం. గత కొన్ని దశాబ్దాలుగా.. గంగానది స్వచ్ఛతపై భారీ పథకాలు ప్రారంభమయ్యాయి. కానీ ఆ పథకాల అమల్లో ప్రజల భాగస్వామ్యం లేదు. దూరదృష్టి అసలే లేదు. అందుకే గంగానది స్వచ్ఛతలో ఎలాంటి మార్పూ రాలేదు.


మిత్రులారా, ఒకవేళ గంగానది స్వచ్ఛతపై గతంలో చేపట్టినట్లుగానే పథకాలు తీసుకొస్తే మళ్లీ అదే పరిస్థితి కనిపించేది. కానీ మేము వినూత్నమైన ఆలోచన, వినూత్నమైన పద్ధతితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నమామి గంగే కార్యక్రమాన్ని కేవలం గంగానది స్వచ్ఛత గురించే కాకుండా.. దేశంలోనే అదిపెద్ద నదిని కాపాడుకునేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టిపెట్టాం. ప్రభుత్వం ఏకకాలంలో నాలుగు వ్యూహాలతో పనులు ప్రారంభించింది. మొదట గంగానదిలో మురికినీరు కలవకకుండా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటుచేయడం ప్రారంభించాం. రెండోది.. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను వచ్చే 10-15 ఏళ్లపాటు మన అవసరాలు తీర్చేలా రూపొందించాం. మూడోది.. గంగానది ఒడ్డున ఉన్న పెద్ద పెద్ద నగరాలు, ఐదు వేలకు పైగా గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన జరగకుండా చర్యలు చేపట్టాం. నాలుగోది.. గంగానది ఉపనదులనూ కాలుష్యాన్నుంచి కాపాడేందుకు సర్వశక్తులూ వినియోగించాం.

 

మిత్రులారా, నాలుగు వ్యూహాలతో చేపట్టిన ఈ కార్యక్రమం ఫలితాన్నీ మనమంతా గమనిస్తున్నాం. ఇవాళ నమామి గంగే కార్యక్రమం ద్వారా రూ.30వేల కోట్లకు పైగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చాలా మటుకు పూర్తయ్యాకి కూడా. ఇవాళ జాతికి అంకితమైన ప్రాజెక్టులతోపాటు ఉత్తరాఖండ్‌లోని చాలా పెద్ద ప్రాజెక్టులు పూర్తయ్యాయి. వేలకోట్ల విలువైన ఈ ప్రాజెక్టుల ద్వారా కేవలం ఆరేళ్లలోనే ఉత్తరాఖండ్‌లో సీవేజ్ ట్రీట్మెంట్ సామర్థ్యం దాదాపు నాలుగురెట్లు పెరిగింది.


మిత్రులారా, ఉత్తరాఖండ్ లో ఎలాంటి పరిస్థితి ఉండేదంటే.. గంగోత్రి, బద్రీనాథ్, కేదర్‌నాథ్ నుంచి హరిద్వార్ వరకు 130కి పైగా మురికి కాలువలు గంగానదిలో కలిసేవి. ఇప్పుడు వీటిలో దాదాపుగా అన్నీ గంగానదిలో కలవకుండా ఆపేశాం. ఇందులో రుషికేష్ నుంచి సటే మునీకి రేతీ లోని చంద్రేశ్వర్ నగర్ నాలా కూడా ఉంది. ఈ కారణంగా ఇక్కడికి గంగామాత దర్శనం కోసం, రాఫ్టింగ్ కోసం వచ్చేవారికి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నేటినుంచి ఇక్కడ దేశంలోనే తొలిసారిగా నాలుగు అంతస్తుల సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభమైంది. హరిద్వార్ లో కూడా ఇలాంటి 20కి పైగా మురికి కాలువలను మూసివేయించాం. మిత్రులారా, ప్రయాగ్ రాజ్ కుంభమేళా సందర్భంగా గంగానది స్వచ్ఛతను ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన భక్తులు ప్రత్యక్షంగా గమనించారు, అనుభవించు కూడా. ఇక హరిద్వార్ కుంభమేళా సందర్భంగా మరోసారి యావత్ ప్రపంచం నిర్మలమైన గంగా స్నానాన్ని చేసి పుణ్యాన్ని సంపాదించుకోనుంది. ఇందుకోసం మా ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయి.

 

మిత్రులారా, నమామి గంగే మిషన్ ద్వారా గంగానది పై ఉన్న వేల ఘాట్ల సుందరీకరణ జరుగుతోంది. గంగా విహారం కోసం ఆధునిక రివర్ ఫ్రంట్ల నిర్మాణం కూడా జరుగుతోంది. హరిద్వార్ లో రివర్ ఫ్రంట్ సిద్ధమైపోయింది కూడా. ఇప్పుడు గంగా మ్యూజియాన్ని నిర్మించడం ద్వారా ఈ క్షేత్ర పర్యాటక ఆకర్షణ మరింత పెరుగుతుంది. ఈ మ్యూజియం హరిద్వార్ వచ్చే భక్తులకు గంగానది ప్రాశస్త్యాన్ని, దీనితో అనుసంధానమై ఉన్న వ్యవస్థలను సవివరంగా వివరిస్తుంది.

 

మిత్రులారా, ఇకపై నమామి గంగే పథకాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్తున్నాం. గంగానది స్వచ్ఛతను పునరుద్ధరించడంతోపాటు.. గంగాతో అనుసంధానమైన అన్ని క్షేత్రాల ఆర్థిక వ్యవస్థ, పర్యావరణాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాం. ప్రభుత్వం ద్వారా ఉత్తరాఖండ్ తో పాటు అన్ని రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయం, ఆయుర్వేద మొక్కల పెంపకం ద్వారా లబ్ధి చేకూర్చే కార్యక్రమాలను ప్రారంభఇంచాం. గంగానదికి ఇరువైపులా ఇలాంటి ఆయుర్వేద మొక్కలను నాటించడంతోపాటు సేంద్రియ వ్యవసాయ కారిడార్ ను వృద్ధి చేస్తున్నాం. గంగా జలాలను మరింత పరిశుద్ధం చేసే ఈ కార్యక్రమాలకు.. మైదాన ప్రాంతాల్లో చేపట్టిన మిషన్ డాల్ఫిన్ నుంచి మరింత మద్దతు లభించనుంది. మొన్న ఆగస్టు 15న మిషన్ డాల్ఫిన్ ను ప్రకటించాం. ఇది గంగా నదిలో డాల్ఫిన్ల వృద్ధికి దోహద పడుతుంది.


మిత్రులారా, గతంలో డబ్బులు ఖర్చుపెట్టినా.. పనులు జరిగేవి కావు. ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. ఇప్పుడు డబ్బులు నీటిలా ఖర్చుపెట్టడం జరగడం లేదు. నీరు వంటి విలువైన, కీలకమైన అంశాన్ని వివిధ మంత్రిత్వ శాఖల్లో భాగం చేసిపెట్టారు. ఈ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం ఉండేది కాదు. పనులు సరిగ్గా చేసేద్దామన్న దృష్టి కూడా ఉండేది కాదు. దిశానిర్దేశమే ఉండేది కాదు. దీని కారణంగా దేశంలో తాగునీరు, పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్యలు ఎక్కడికక్కడే పడిఉండేవి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా 15కోట్లకు పైగా ఇళ్లకు పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదని మీరు ఊహించగలరా? ఉత్తరాఖండ్ లో కూడా వేల ఇళ్లలో ఇదే పరిస్థితి ఉంది. గ్రామాల్లో, కొండల్లో రాకపోకలకే కష్టమైన ఈ పరిస్థితుల్లో తాగునీటికోసం అమ్మలు, చెల్లెల్లకు ఎంతటి కష్టాన్ని, భారాన్ని అనుభవించాల్సి వస్తుందో ఆలోచించారా? చదువులు కూడా మానేయాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యల పరిష్కారానికి.. దేశంలోని ప్రతి ఇంటికీ తాగునీటిని అందించేందుకే జల్ శక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటుచేశాం.

 

చాలా తక్కువ సమయంలోనే జల్ శక్తి మంత్రిత్వ శాఖ చాలా వేగంగా పనులు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.  నీటికి సంబంధించిన సవాళ్లను స్వీకరిస్తూనే.. దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ నీరందించే మిషన్ ను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా దాదాపు లక్ష కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఏడాదిలోనే దేశంలోని రెండు కోట్లకు పైగా కుటుంబాలకు తాగునీరు అందింది. ఇక్కడ ఉత్తరాఖండ్ లో త్రివేదీజీ వారి మంత్రి మండలి ఒక అడుగు ముందుకేసి.. ఒక్క రూపాయికే మంచీనీటి కనెక్షన్ ఇచ్చే పథకాన్ని ప్రారంభించింది. 2022 వరకు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం పనిచేస్తోంది. కరోనా కాలంలో ఈ నాలుగైదు నెలల్లో ఉత్తరాఖండ్ లోని 50వేలకు పైగా కుటుంబాలకు మంచినీటి కనెక్షన్లు ఇవ్వబడ్డాయి. ఇది ఉత్తరాఖండ్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.

 

మిత్రులారా, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ మంచీనీరు అందించడంతోపాటు.. ఓ రకంగా గ్రామ స్వరాజ్యానికి, గ్రామ సాధికారతకు సరికొత్త శక్తిని, కొత్త విశ్వాసాన్ని ఇచ్చే కార్యక్రమం ఇది. ప్రభుత్వాలు పనిచేసే విషయంలోనూ చాలా మార్పులు వచ్చాయి. దీనికి ఇదో ఉదాహరణ కూడా. గతంలో ఢిల్లీలో కూర్చుని ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునేవారు. ఏ ఊళ్లో సోర్స్ ట్యాంక్ కట్టాలి. ఎక్కడ పైప్ లైన్ వేయాలి వంటి నిర్ణయాలన్నీ రాజధానిలోనే జరిగేవి. కానీ జల్ జీవన్ మిషన్ ఈ వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. గ్రామాలకు నీటిని అందించేందుకు ఏ పనిచేపట్టాలి, పని ఎక్కుడుంది. అందుకోసం ఏయే ఏర్పాట్లు చేయాలి? వంటి నిర్ణయాలన్నీ ఇప్పుడు గ్రామస్తులకే అప్పగించబడ్డాయి.  నీటికి సంబంధించి ప్రాజెక్టుల ప్లానింగ్ మొదలుకుని నిర్ణయాల అమలు వరకు ప్రతి అంశాన్నీ గ్రామ పంచాయతీ పర్యవేక్షిస్తుంది. నీటి సమితులు సమీక్షిస్తాయి. నీటి సమితుల్లోనూ గ్రామంలోని 50 శాతం మహిళలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించాము.

 

మిత్రులారా, ఇవాళ ఆవిష్కరించిన మార్గదర్శిక.. ఈ సోదరీమణులు, నీటి సమితుల సభ్యులు, పంచాయతీ సభ్యులకు చాలా పనికొస్తుంది. నీటి విలువేంటి? నీటి ఆవశ్యకతేంటి? అది ఎలాంటి సౌకర్యాలను, ఎలాంటి కొత్త  సమస్యలను తీసుకొస్తుంది? అనే విషయాన్ని మన తల్లులు, చెల్లెల్లకంటే బాగా ఎవరూ అర్థం చేసుకోలేరు. అందుకే ఈ అంశాన్ని మత తల్లులు చెల్లెల్ల చేతికి అప్పగిస్తే.. చాలా జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా పనులు చక్కబెడతారు. సత్ఫలితాలు కూడా సాధిస్తారనే విశ్వాసం నాకుంది.

 

ఇది గ్రామీణులకు  ఒక మార్గాన్ని చూపిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకొనేందుకు ఎంతగానో సహాయపడుతుంది. జల్ జీవన్ మిషన్ గ్రామీణులకు సరికొత్త అవకాశాలను ఇచ్చిందని నేను బలంగా నమ్ముతున్నాను. మీ గ్రామాన్ని నీటి సమస్యల నుంచి దూరం చేయడంతో పాటు, మీ గ్రామంలో జలకళ సంతరించుకొనేందుకు ఇది ఒక సరికొత్త అవకాశం. అక్టోబర్ 2న గాంధీ జయంతి నుంచి జల్ జీవన్ మిషన్‌‌‌‌ పథకం ప్రారంభంకానుంది. 100 రోజుల ప్రచారంలో భాగంగా  దేశంలోని ప్రతి పాఠశాల,  ప్రతి అంగన్వాడిలో సురక్షిత మంచినీరు అందుబాటులోకి రానుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని నేను మనస్ఫూర్థిగా కోరుకుంటున్నాను.

 

మిత్రులారా గత 6 సంవత్సరాల్లో కీలక సంస్కరణలలో భాగంగా నమామి గంగే అభియాన్, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి అనేక కార్యక్రమాలు భాగం అయ్యాయి. ఇలాంటి సంస్కరణలు సామాజిక వ్యవస్థలో, సామాన్య ప్రజల జీవితాల్లో అర్ధవంతమైన మార్పులను తీసుకురావటంలో ఈ సంస్కరణలు ఎంతగానో సహాయపడ్డాయి. గత ఒకటిన్నరేళ్ళలో ఈ మార్పు చాలా ఎక్కువగా ఉంది. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో రైతులు, కార్మికులు, ఆరోగ్య సంబంధ రంగాల్లో పెద్ద ఎత్తున సంస్కరణలు జరిగాయి. ఈ సంస్కరణలతో దేశంలోని  కార్మికులు మరింత బలోపేతం అవుతారు. దేశంలోని యువత, మహిళలకు సాధికారికత లభించనుంది. దేశంలోని రైతులు మరింత శక్తివంతమౌతారు. కానీ ఈ రోజు కొంతమంది కావాలని తన ఉనికిని కాపాడుకొనేందుకు ఎలా నిరసన తెలుపుతున్నారో దేశం మొత్తం గమనిస్తోంది.

 

మిత్రులారా, కొన్ని రోజుల క్రితం ఈ దేశం తన రైతులను దాస్యశృంఖలాల నుంచి విముక్తి చేసింది. ఇప్పుడు దేశంలోని రైతు తన ఉత్పత్తులను ఎవరికైనా, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతులకు వారి హక్కులను అందిస్తున్నప్పుడు సైతం కొందరు తమ ఉనికి కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనకారులు దేశంలోని రైతులు తమ ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో అమ్మకోకూడదని కోరుకుంటున్నారు. రైతుల వాహనాలు జప్తు కావాలని, వారి నుంచి వసూలు చేసుకోవాలని, వారి నుంచి తక్కువ ధరకే పంటను కొని, మధ్యవర్తుల ద్వారా ఎక్కువ లాభాలను ఆర్జించడం కొనసాగించాలని కోరుకుంటున్నారు. అందుకే రైతన్నల స్వాతంత్య్రాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిరసనకారులు ఇప్పుడు రైతు ఎంతో ఆరాధించే వస్తువులు, పరికరాలకు నిప్పంటించి దేశంలోని రైతాంగాన్ని అవమానిస్తున్నారు.

 

మిత్రులారా  కొన్నేళ్లుగా ఈ నిరసనకారులు పంటలకు కనీస మద్దతు ధరను అమలు చేస్తామని కాకమ్మ కథలు చెబుతూనే ఉన్నారు. స్వామినాథన్ కమిషన్ ఇష్టానుసారం ఎంఎస్‌పిని అమలు చేసే పని మన ప్రభుత్వం చేసింది. ఈ రోజు ఈ నిరసనకారులు ఎంఎస్పిపైనే రైతుల మధ్య గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దేశంలో పంటలపై ఎంఎస్‌పి కూడా ఉంటుంది.. రైతులకు తమ ఉత్పత్తులను ఎక్కడైనా విక్రయించే స్వేచ్ఛ సైతం ఉంటుంది. కానీ ఈ స్వేచ్ఛను కొంతమంది సహించలేరు. ఇన్నేళ్ళు ఇష్టానుసారంగా రైతులను మోసం చేస్తూ సంపాదించుకున్న వారి  నల్లధనానికి ఉన్న  మరొక సాధనం అంతమైంది. కాబట్టే వారికి ఈ విషయంలో అనేక సమస్యలు కనిపిస్తున్నాయి.

 

మిత్రులారా, కరోనా సంక్రమణ జరుగుతున్న ఈ కాలంలో... డిజిటల్ ఇండియా ప్రచారం, జన ధన్ బ్యాంక్ ఖాతాలు, రూపే కార్డులు ప్రజలకు ఎలా సహాయపడ్డాయో దేశం మొత్తం సాక్ష్యంగా నిలిచింది. కానీ మా ప్రభుత్వం ఈ పనిని ప్రారంభించినప్పుడు, ఈ నిరసనకారులు ఈ కార్యక్రమాలను ఎంతగా వ్యతిరేకించారో మీకు గుర్తుండే ఉంటుంది. వారి దృష్టిలో దేశంలోని పేదలు, గ్రామీణ ప్రాంత ప్రజలు నిరక్షరాస్యులు, అజ్ఞానులు. దేశంలోని పేదలు బ్యాంక్ ఖాతా తెరవడాన్ని, డిజిటల్ లావాదేవీలు చేయడాన్ని ఈ నిరసనకారులు ఎప్పుడూ వ్యతిరేకిస్తున్నారు.

 

మిత్రులారా జీఎస్టీ వన్ నేషన్ - వన్ టాక్స్ విషయానికి వస్తే, ఈ నిరసనకారులు తమ రాజకీయ అవసరాల కోసం, తమ ఉనికిని కాపాడుకొనేందుకు మళ్ళీ నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు. జీఎస్టీ కారణంగా దేశంలో గృహోపకరణాలపై పన్ను బాగా తగ్గింది. చాలా గృహోపకరణాలు, గృహోపకరణాలపై ఐదు శాతం కన్నా తక్కువ పన్ను ఉండదు. ఇంతకుముందు ఈ వస్తువులకు ఎక్కువ పన్ను విధించేవారు. దీంతో ప్రజలు తమ జేబు నుంచి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ వీరికి జీఎస్టీతోనూ సమస్యలు ఉన్నాయి. ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని ఈ నిరసనకారులు ఎంతగానో ఎగతాళి చేశారు.. వ్యతిరేంచారు.

 

మిత్రులారా, స్వప్రయోజనాల కోసం నిరసనలు చేసే ఈ ప్రజలు కనీసం రైతులకు అండగా లేరు… యువతకు తోడ్పాటు ఇచ్చే విధంగా ఉండరు  కనీసం జవాన్లకు మద్దతు ఇచ్చే పరిస్థితిలో లేరు. మన ప్రభుత్వం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ తీసుకువచ్చినప్పుడు, ఉత్తరాఖండ్’‌కు చెందిన వేలాది మంది మాజీ సైనికులకు కూడా వారి హక్కులు లభించినప్పుడు ఈ నిరసనకారులు అప్పుడు సైతం వ్యతిరేకించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ ప్రవేశపెట్టినప్పటి నుంచి మాజీ సైనికులకు బకాయిలుగా ప్రభుత్వం సుమారు 11 వేల కోట్లు చెల్లించింది.. ఉత్తరాఖండ్‌లో లక్ష మందికి పైగా మాజీ సైనికులు దీనివల్ల లబ్ధి పొందారు. కానీ ఈ నిత్య అసంతృప్తవాదులకు వన్ ర్యాంక్-వన్ పెన్షన్ అమలులో ఎప్పుడూ సమస్య ఉంది. వీరు వన్ ర్యాంక్-వన్ పెన్షన్‌ను సైతం వ్యతిరేకించారు.

 

మిత్రులారా, కొన్నేళ్లుగా ఈ దేశ పదాతిదళాన్ని, వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు బలమైన కార్యక్రమాలు ఏవీ చేయలేదు. మన దేశ భద్రతకు ఆధునిక యుద్ధ విమానాలు ఎంతో అవసరమని వైమానిక దళం ఎన్నో ఏళ్ళుగా చెబుతూనే ఉంది. కానీ వీరికి వైమానిక దళ వాదనను విస్మరిస్తూనే ఉన్నారు. మా ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రెంచ్ ప్రభుత్వంతో  నేరుగా సంతకం చేసిన వెంటనే వారికి మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. రాఫెల్ భారత వైమానిక దళంలో భాగమైంది. దీని కారణంగా భారత వైమానిక దళ బలం మరింత పెరిగింది. కానీ వారు దీనిని సైతం వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు రాఫెల్ భారత వైమానిక దళ బలాన్ని ద్విగుణీకృతం చేస్తున్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. అంబాలా నుంచి లేహ్ వరకు రాఫెల్ గర్జన భారత జవాన్లలో నూతనోత్సాహాన్ని నింపుతోంది.

 

మిత్రులారా, నాలుగేళ్ల క్రితం దేశంలోని వీర సైనికులు ఎంతో ధైర్యసాహసాలతో సర్జికల్ స్ట్రైక్స్ చేసి, ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశారు. కానీ అలాంటి ధీరుల తెగువను, ధైర్యాన్ని ప్రశంసించే బదులు వారి నుంచి సర్జికల్ స్ట్రైక్స్  ఆధారాలు అడుగుతూ మన జవాన్ల ఆత్మస్థైర్యాన్ని బలహీనపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.  సర్జికల్ స్ట్రైక్స్‌‌ను వ్యతిరేకించడం ద్వారా ఈ నిరసనకారులు దేశం ముందు వారి ఉద్దేశాన్ని, వారి ఆలోచనలను స్పష్టం చేశారు. దేశ అభ్యున్నతి కోసం జరుగుతున్న ప్రతీ విషయాన్ని వ్యతిరేకించడం వీరికి అలవాటుగా మారిపోయింది. ప్రజల్లో తమ ఉనికిని కోల్పుతున్నామనుకుంటున్న వారి ముందున్న ఏకైక రాజకీయ మార్గం కేవలం వ్యతిరేకతే. అందుకే భారతదేశం చొరవతో ప్రపంచం మొత్తం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో, భారత్‌లో ఉన్నందుకు గర్వపడాల్సిన వీరు యోగా దినోత్సవాన్ని సైతం వ్యతిరేకిస్తున్నారు. దేశంలోని వందలాది రాచరిక రాష్ట్రాలను అనుసంధానించే చారిత్రక పనిని చేసిన సర్దార్ పటేల్ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఆవిష్కరించినప్పుడు కూడా వీరు దీనిని వ్యతిరేకించారు. అంతేగాక ఈ నిరసనలు తెలుపుతున్నవారి ఏ ఒక్క పెద్ద నాయకుడు ఈ రోజు వరకు ఏకతా విగ్రహాన్ని ఎందుకు సందర్శించలేదు? ఎందుకు? ఎందుకంటే వారు ప్రతీ విషయాన్ని వ్యతిరేకించే పనిలో తలమునకలై ఉన్నారు.

 

మిత్రులారా, పేదలకు 10 శాతం రిజర్వేషన్ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా వారు దానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చినప్పుడు, వారు దానిని వ్యతిరేకిస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను వ్యతిరేకించారు. మిత్రులారా, గత నెలలోనే అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం కోసం భూమిపూజ జరిగింది. వీరు మొదట సుప్రీంకోర్టులో రామమందిరాన్ని వ్యతిరేకిస్తూ, తరువాత భూమిపుజను వ్యతిరేకించడం ప్రారంభించారు. రోజూ ఏదో ఒక విషయంలో అభివృద్ధిని అడ్డుకొనేలా నిరసన తెలుపుతున్న వీరు రానురాను దేశానికి, సమాజానికి అసాంఘిక శక్తులుగా మారుతున్నారు.  అందుకే వీరిలో ఎప్పుడూ నిరాశ, నిస్పృహ, ప్రతీ విషయంలో వ్యతిరేకించాలనే భావన నిండిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన నాలుగు తరాలు దేశాన్ని పాలించిన పార్టీ ఒకటి ఇప్పుడు జాతీయ ప్రయోజనానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని వ్యతిరేకిస్తూ, తన స్వార్థం కోసం ఇతరుల భుజాలపై స్వారీ చేస్తూ రాజకీయ భవిష్యత్తు కోసం వెంపర్లాడుతోంది.

 

మిత్రులారా, మన దేశంలో ఇలాంటి చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. అధికారంలోకి రావడానికి వారికి ఎప్పుడూ అవకాశం రాలేదు. పార్టీలు ప్రారంభించినప్పటి నుంచి వారు ఎక్కువ సమయం ప్రతిపక్షంలోనే  గడిపారు. ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నప్పటికీ, వారు ఎప్పుడూ దేశాన్ని వ్యతిరేకించలేదు.. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలాంటి పని చేయలేదు. కానీ కొందరు గత కొన్నేళ్లుగానే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వారి ఆలోచనలు ఎలా ఉన్నాయనేది దేశవాసులు గమనిస్తూనే ఉన్నారు. అర్థం చేసుకుంటున్నారు. ఇలాంటి వారి స్వార్థపూరిత రాజకీయాల ఆపేక్షల మధ్యలో ఇప్పుడు దేశం స్వావలంబన దిశగా పరుగుపెడుతోంది. ఇప్పుడు దేశంలో పెద్ద ఎత్తున సంస్కరణల పరంపర కొనసాగుతోంది. దేశంలోని వనరులను మరింత మెరుగుపరచడంతో పాటు పేదరిక విముక్తి ప్రచారం జోరందుకుంది. దేశాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియ కొనసాగనుంది.

 

అభివృద్ధి ప్రాజెక్టులు సాకారం అవుతున్న ఈ సమయంలో మీ అందరికీ మరోసారి అనేక అభినందనలు. ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నేను మరొకసారి మిమ్మల్ని కోరుతున్నాను. ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండండి... కేదారనాథుడి కృప మనందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

 

దేవదేవుడు మన కోరికలను సాకారం చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు! జై గంగే…

****



(Release ID: 1660213) Visitor Counter : 176